“ఎలా అయింది నీ సెమినార్?”కాఫీ కప్పు అందిస్తూ ప్రశ్నించాను నా ఫ్రెండ్ గీతిక ని. తనీ మధ్యే ఏదో మేనేజ్ మెంట్ సెమినార్ కని ఇండియా నించి వచ్చింది.. ఒక నెల రోజులుండి బల్గేరియా, టర్కీ లోని ప్రముఖమైన ప్రదేశాలు చూసి వెళ్దామని ప్లాన్. నేనిక్కడి సోఫియా విశ్వవిద్యాలయం లో విజిటింగ్ ప్రొఫసర్ గా వచ్చి ఏడాది పైనే అయింది. మా వారు, పిల్లలు రెండుసార్లు వచ్చి వెళ్ళారు. నా మొట్టమొదటి ఇండియన్ గెస్టు గీతికే.
“ఆ బాగానే అయింది.ఇండియా నించి పాల్గొన్నది నేనొక్కదాన్నే.! అయినా ఏంటమ్మో మీ దేశస్థులు? పబ్లిక్ ప్లేసుల్లోనూ, వెహికిల్స్ లోనూ అంత బాహాటంగా ముద్దులు?చూడలేక చచ్చాననుకో!మరీ పదహారేళ్ళ పిల్లలు! .. నలుగురు గుంపుగా మాట్లాడుకుంటూ సడన్ గా ఒక కుర్రాడు ఇంకో పిల్లని ముద్దు పెట్టేస్కుంటుంటే మిగిలిన వాళ్ళు అసలేం జరగనట్టు వాళ్ళ మానాన వాళ్ళు కబుర్లు. ఆ పిల్లేమో పెద్ద ఘనకార్యం జరిగినట్టు నవ్వులు.కనీసం చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు కూడా ఏమీ పట్టించుకోకపోవడం, మందలించక పోవడం ఎంత పిదప కాలం?ఆడపిల్లలకీ బొత్తిగా సిగ్గు ఎగ్గూ లేదు.వొళ్ళు కన్పించే బట్టలూ వాళ్ళూ, దరిద్రం గానూ!”అంది చిరాగ్గా మొహం పెట్టి.
నాకు నవ్వొచ్చింది ..వాళ్ళని నా దేశస్థులు అన్నందుకు. “ఇక్కడిది మామూలేనే గీతా!నీకు కొత్త కాబట్టి అంతలా రియాక్ట్ అవుతున్నావు”అన్నా టేబిల్ మీద బుక్స్ సర్దుతూ. “ మామూలా? ఇదెక్కడి సంస్కృతే?ఇవన్నీ ఎలా భరిస్తున్నావే నా తల్లీ?” అంది అయోమయం గా. “ అవునే.ఇక్కడ ఈ భాగోతాలన్నీ పధ్నాలుగేళ్ల నించే మొదలౌతాయి.వీళ్ళు తాము చిన్నపిల్లలం కామని, యౌవ్వనం లో అడుగు పెట్టామని, ఏదైనా ధైర్యం గా, బహిరంగంగా చేస్తామని, ఎవరికీ భయపడమని నిరూపించుకోవడం కోసం ఇలాటి చేష్టలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అందరూ తమని గుర్తించాలన్న ఆరాటం ఈ కుర్రకారులో హెచ్చుగా ఉంటుంది.”
నా మాటల్ని అడ్డుకుంటూ “ అంతే కాదే! ఆడపిల్లలు సిగరెట్లు ఎలా ఊదేస్తున్నారో తెల్సా? రామరామ.ఈ పది రోజుల్లో నేను గమనించిన దాని బట్టి అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా కాలుస్తున్నారు. వీళ్ళకి మంచి చెడు చెప్పేవాళ్ళెవరూ లేరా? నీ సంగతి చెప్పు..ప్రొఫసర్ వి కదా ..స్టూడెంట్స్ కి చెప్పవా?ఇది తప్పని.” అడిగింది గీతిక బాధ, ఆశ్చర్యం మేళవించిన స్వరం తో.
“ఎంత చదువుకున్నా,పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా మన తీరే వేరు, మన సంస్కృతి, కట్టుబాట్లు వేరు గీతా! యూనివర్సిటీ లో మొదటి రోజే చెప్పారు. ఇక్కడ అమ్మాయిలు స్మోక్ చేస్తారని , నేను అది తప్పు పట్టకూడదని, అంతే కాదు వాళ్ళు క్లాసులకి రాకపోయినా అడక్కూడదని, ఎవరి పర్సనల్ విషయాల్లో జోక్యం కూడదని....” “అదేంటి రచనా! ఒక టీచర్ గా ఇది నీ బాధ్యత కాదా? అలా చెప్పడమెంటి?” సింక్ దగ్గర చేతులూ మొహం కడుక్కుని టవల్ తో వొత్తుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది గీతిక.
“ అయ్యో గీతా! ఆచార్యదేవో భవ అన్నది మన సంస్కృతి. ఏ దేశ సంస్కృతి వాళ్ళకి గొప్పగా ఉంటుంది. ఇక్కడ వ్యక్తి ప్రధానం. మనకి కుటుంబం, సమాజం ప్రధానం.ఏమైనా మంచి విషయాలు చెప్తే అభినందిస్తారు గాని అమలు పరచరు. ఇక స్మోకింగ్ అన్నది వాతావరణ ప్రభావం.వంశ పారంపర్యం గా వచ్చిన అలవాటు... ఎలా వదులుకుంటారు చెప్పు?” కంచం లో వేడన్నం తో దొండకాయ వేపుడు,కొబ్బరి పచ్చడి వేసి అందించాను.
“మన దేశం ఎంత గొప్పదే రచనా? పోయిపోయి ఇలాటి దేశం లో ఎలా పడ్డావే బాబూ?రియల్లీ ఐ పిటీ యూ” అంది కూరన్నం కలుపుకుంటూ.
“ బట్, ఐ లవ్ దిస్ కంట్రీ” అన్న నా మాటలకి ఉలిక్కిపడి చూసింది గీతిక.
“యస్ ..నాకీ దేశం నచ్చింది. నీకీ దేశం లో ప్రేమికుల బహిరంగ చుంబనాలు, అమ్మాయిల ధూమపానాలు ఆక్షేపణగా అన్పించాయి. అవునా? కానీ ఇక్కడ మన దేశం లో లేనివి, మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో మంచి విషయాలున్నాయి. ఒకటి చెప్పు గీతా!ఎంతో రద్దీ గా ఉన్న బస్సు, ట్రాము, మెట్రోల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవ్వడైనా నిన్ను తాకడం గాని తన శరీరాన్ని నీకు తాకించే ప్రయత్నం గానీ చేశాడా?ఈ మధ్య కాలం లో నువ్వు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించారా?
ఒక్కసారి కళ్ళు మూసుకొని మన దేశం లోకి తొంగి చూడు. ఎక్కడైనా, ఏ టైమ్ లో అయినా ఏ వయసు మహిళకయినా ఎన్ని అగచాట్లో?మాల్స్, మార్కెట్స్, సిన్మా హాల్స్ లోనే కాదు, ఉద్యోగం చేసే చోట, రోడ్ల మీద, షేర్ ఆటోల్లో, బస్సుల్లో చాలా మంది పురుష పుంగవులు ఆడవాళ్ళని లైంగికంగా వేధించాలని చూసే వాళ్లే. దేవుడి దయ వల్ల ఇక్కడ ఆ దౌర్భాగ్యం లేదు. విదేశీయులమనే కాదు, తమ దేశ స్త్రీలని కూడా వీళ్ళు అల్లరి పెట్టరు. ఇంక మన దేశానికి వచ్చిన విదేశీ మహిళల్ని ఎంత అల్లరి పాలు చేస్తున్నారో టీవి ల్లో పేపర్లల్లో చూస్తూనే ఉన్నాం కదా. నిజంగా సిగ్గు పడాలి మనం.
ఇక్కడ తాము ప్రేమిస్తున్న అమ్మాయిల్ని బాహాటంగా చుంబిస్తారు అదీ ఆ అమ్మాయి ఇష్టం తోనే తప్ప అంతకు మించి విశృంఖలంగా ప్రవర్తించరు.! పరాయి ఆడవాళ్ళని ఆబగా చూడ్డం, తాకడం చేయరు గాక చేయరు.అదే మన దగ్గర? పబ్లిక్ ప్లేసుల్లో, బస్సుల్లో, సిన్మా హాళ్ళల్లో ఆడవాళ్ళ శరీర భాగాలని తాకుతూ. నొక్కుతూ ఎంత రాక్షసానందాన్ని పొందుతారో?చెప్పుకోలేక వారు ఎంత కుమిలిపోతూ ఉంటారో?మన దేశం లో “యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతా!” అన్నది కేవలం పుస్తకాల్లో చదువుకోవడానికే... కానీ ఇక్కడ అనుసరిస్తున్నారు గీతికా. ఎవరూ ఎవరినీ డిస్ట్రబ్ చేయరు. సహాయం కోరితే వీలయితే చేస్తారు, కుదరక పోతే సారీ చెప్తారు. లేకపోతే ఏడాది నించి పరాయి దేశం లో భాష కూడా రాని నేను ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నానో ఆలోచించు.? ఇలా మన దేశం లో ఒంటరిగా ఉండమంటే బహుశా ఉండలేనే!!చుట్టూ భాష తెలిసిన మనుషులున్నా అక్కడ లేని రక్షణ ఇక్కడ తెలియని వాళ్ళ మధ్య ఖచ్చితంగానూరు శాతం ఉందని చెప్పగలను గీతా!” చెప్పాను ఆవేదన మేళవించిన కంఠం తో.
నా మాటలకి స్పందిస్తూ “యథార్థాన్నిఎంత బాగా చెప్పావే రచనా! నేనింత లోతుగా ఆలోచించనే లేదు. ఈ సంస్కృతి మన కంటే విభిన్నమైనదైనా సున్నిత మైన విషయాల్లో ఎంతో స్పష్టతతో, పక్వత తో ఉందని అర్ధమౌతోంది. మన సమాజ పరంగా ఆమోదయోగ్యం కాని ఎన్నో అంశాలు ఇక్కడ ఎవరినీ ఇబ్బందికి గురిచేయడం లేదు. కానీ మన సంస్కృతి లో ఆమోదించబడ్డ ఆరోగ్యకరమైన విషయాలని మన వాళ్ళు ఎంత మంది ఆచరిస్తున్నారు? చాలా రంగాల్లో మనం ఎంతో మందికంటే ముందున్నాం..ఎందరికో ఆదర్శం గా ఉన్నాం. కానీ స్త్రీల పట్ల మగ వాళ్ళ ప్రవర్తన విషయం లో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇది ఒప్పుకొని తీరాల్సిన సత్యం. మన మగవాళ్ళంతా ఆడవాళ్ళ స్వేచ్చని హరించకుండా, వారి పట్ల సంస్కారవంతంగా ప్రవర్తించగల్గితే ఎంత బాగుంటుందో కదా ? మనదేశం ఈ కోణం లో కూడా అందరితో సెహభాష్ అన్పించుకునే ఆ రోజు కోసం ఆశగా ఎదురు చూద్దాం” అంది గీతిక.