''లచ్చీ! లచ్చీ!!''
దొరగారింట ఉదయం నుంచీ వంచిన తల ఎత్తకుండా పనిచేసి అలిసిపోయి వచ్చిన గంగడు వంగుని గుడిసెలోకి అడుగు వేస్తూ పిలిచాడు.
తన గుడిసెను చూసి ఎంత బాధ పడతాడో, తన లచ్చిని చూస్తే అంత ఆనందిస్తాడు గంగడు.
''వచ్చేసే, మావా! అంటూ సమాధానం ఇచ్చింది లచ్చి.
''ఏటి, మావాఁ? ఏటోలా ఆలోచిత్తుండావు?''
'ఎదవ బతుకు?' తనలో బాధగా అనుకొన్నాడు గంగడు.
''ఏంటి జరిగినాదేంటి, మావాఁ? దొర కూకలెట్టినాడా? ఏటి జరిగినాదేంటి?''
''నే నేమో ఆ దొరనే కాకుండా ఆ దొర పెంచే కుక్కల్ని కూడా పెంచి నీళ్లు పోసి సాకాల. ఆ బంగళాలో సెట్టు సెట్టునా సెమట పోసుకుని సెరగాల. ఎటోలే సెమ పడదాం, దాకలో మరో గుప్పెడు నూకలు ఎక్కువ ఉడకేసుకో వచ్చనుకున్నా. కాని, ఛీ! ఎదవజన్మ! నీవు ఈ జానెడు గుడిసెలో ఇంత సెమ పడుతుండావని తెలిసి చావలేదే, లచ్చీ! చీ! ఏం బతుకులో!'' లచ్చి పొగలో పొయ్యి వద్ద ఊదుతూ పడుతూన్న బాధని చూసి బాధపడ్డాడు.
''ఏటి, మావాఁ! వచ్చేది ఉగాది గందా? ఈ మాటలేంది! సంతోసంగా ఉండాలిగందా? ఏం లోటు జరిపినా వేంటి? కొత్త కడవ కొందామంటే ఊఁ అన్నావు. కొత్త సాన కొనాలంటే ఓ అన్నావు. ఈ కొత్త ఉగాదికి సెట్టపట్టా లేసుకొని సినిమా కెల్దావన్నావు. ఇంకేంటి లోటు, మావాఁ? తెములు. సందెకాడ గంజినీళ్లు తాగినోడవి. సూడు, సెమట ఎలా మెరుత్తూందో!'' అంటూ ముంత చేత్తో తీసుకుని స్నానానికి ఉడుకునీళ్లు సిద్ధం చేయడానికి గుడిసెలోంచి బయటికి నడిచింది లచ్చి. వంగుని బయటికి వెడుతూన్న లచ్చిని చూసి 'ఈ యాలే సినిమా సూత్తే ఎంత బాగుంటుందో'' అనుకొన్నాడు, తనలో గంగడు.
డబ్బు ఎక్కడిది? అని తలుచుకోగానే 'ఏటి జన్మమో' అని చేదుగా ఆ మాటను మింగేశాడు.
కూడు వండిన కడవ, చేపలు వేయించిన మూకుడు, ఉల్లి వేసి మరగపెట్టిన పులుసుముంత. ముందు కాళ్లు మడతేసుకు కూర్చుని తనకూ, గంగడికీ వడ్డించింది లచ్చి.
లచ్చిని ఓరగా పరికిస్తూన్నాడు గంగడు. తనకు తెలియకుండానే కింది పెదవిని పై పెదవితో నొక్కుకున్నాడు.
- - -
''ఒరేయ్, గంగన్నా!'' దొర పిలుపుకి చేస్తూన్న పనిని గిరవాటేసి, తలపాగా సవరించుకొంటూ ఎదురుగా వచ్చి నించున్నాడు.
దొర పేరు పెట్టి పిలిచాడంటే ఏదో పెద్ద పనుందనేది గంగన్న సర్వీసులో బాగా తెలుసుకున్న విషయం.
కానీ, సాధారణంగా తనను ఏ పనికీ వెంట పెట్టుకెళ్లడు దొర. ఒక సమయంలో అనిపించిందికూడాను- 'కారులో రాజుగాడినే ఎంటేసుకుపోతాడు ఎప్పుడూ, తన నెప్పుడూ వస్తావురా అని అయినా అనలే'దని.
వెధవ మనసు- చెప్పద్దూ- దొర తాగుతూంటే ఒక్కోసారి తానూ ఓ చుక్క పొట్టలో పోసుకోకూడదా అనీ, జంతువుకు జంతువునే కాల్చుకు పళ్లతో కసకస పీక్కుని తింటూంటే తనకూ ఓ ముక్క నంజెయ్యాలనీ, అప్పుడప్పుడు జయ్‌మని వెళ్లే దొర కారులో దూరంగా నన్నా కూర్చు వెళ్లాలనీ అనిపించిన రోజులు ఉన్నాయి.
''నీకు బుద్ధి ఎప్పొడొస్తుందిరా?'' దొర అన్న ఈ మాటకు గతుక్కుమన్నాడు గంగడు. విసిరికొట్టిన ఈగల్లా అప్పటిదాకా మనసుతో ఆడుతున్న ఆలోచనలు ఎగిరిపోయాయి.
''ఏంటి, బాబుగోరూ!'' వినయంగా చేతులు కట్టుకుని అడిగాడు గంగడు.
''ఆ రాజుగాడు చూడు, ఎంత హుషారుగా ఉంటాడో!''
దొర మాటలు అర్థం కాలేదు గంగడికి. తల గోక్కుంటూ ఉండిపోయాడు. అంతలోనే ఏదో గ్రహించినట్లు కళ్లు పెద్దవి చేసుకున్నాడు.
''ఆ ఉషారంతా ఆడిది కాదు, దొరా! మీరు మిగిల్చేసిన అడుగు బుడుగు సీసాల మహిమట!''
ఈ మాటకు నవ్వొచ్చింది దొరకు. నవ్వుకొన్నాడు.
''తప్పు మాటాడానా దొరా?''
''కాదురా! నిజం పలికావు. అసలు హుషారంతా అందులోనే ఉందిరా.''
''ఏంటో, దొరా! అదంటే మా పెద్ద సిరాకేత్తది. ఓ నాడేమో ఆట సూసినప్పుడు నాకూ రుసి సూడాలనిపించింది.''
''చూశావా?''
''నా కేడది దొరా!''
''ఇక్కడుందిగా?''
''అది సరగం కావాలనుకొనే వోళ్లేసుకోవాలని రాజుగాడు సెప్పిండు దొరా. నే నొక్కడినే సరగాని కెడితే ఎట్లా దొరా? ఎడితే నా లచ్చీ, నేనూ కలిసే ఎల్లాలన్నా దొరా. 'పిచ్చోడా!' అంటూ ఎకసక్కెం చేసి పారేసిండు దొరా.''
ఈ మాటలు విన్న దొరకు గంగడు పనికొస్తాడనిపించింది.
''రాజుగాడు పనిమీద ఊరు వెళ్లాడు. పోనీ, ఈ రోజు నాతో కారుమీద వస్తావా?''
దొర నోటంట ఈ మాట రాగానే, మూత తెరవగానే బుస్ మనే బ్రాందీ సీసాలా గంగన్నలో ఆనందం మొగ్గలు వేసింది.
'దొర నిజంగా తనను కారులో ఏసుకుపోతానంటున్నాడా?' అనుకున్నాడు.
ఆశ్చర్యం నుంచి తేరుకుని, తలకు వాసినలా చుట్టిన తలగుడ్డను తీసి ముఖం తుడుచుకుంటూ- ''ఎప్పుడేంటి, దొరా?'' అని అడిగాడు.
''నీ మొహం. ఎప్పుడో ఏమిటిరా- ఇప్పుడే. ముఖం కడుక్కుని బంగళాలోకి రా.''
దొర వెళ్లిన వైపే చూస్తున్న గంగన్నకి ఆ దారి ఎంతో ఆనందంగా, హాయిగా కనిపిస్తూంది.
''ఈ చొక్కా వేసుకో.''
''ఏటి, దొరా, ఇది? నా కేంటి, దొర గుడ్డలేంటి! ఏరైనా పరికించినారంటే, అరే, గంగన్నా, దొర దుస్తులు దొంగిలించు కొచ్చినావుట్రా' అని అడుగుతారు. అనుమానిస్తారు. మరిగంతే గంద, బాబయ్యా? లేనోడు దొర చొక్కా తగిలించుకొంటే మధ్యాన్నేళ సుక్క పొడిసినట్లు సూత్తారు గందా పెజలు!''
''నేను ఇస్తున్నాగా? మార్చుకో చొక్కా.''
తెల్లటి గూడకట్టు పంచ, దానిమీద దొర ఒంటిమీద నలిగి అనేక శరీరాల రాపిడితో పాతబడిన తెల్లగా ఉన్న గ్లాస్కో లాల్చీ- చూసుకుంటే తనకే ఎంతో ఇదిగా ఉండి- ''ఓ సారి గాజుకాడ ముఖం సూసుకుంటే' అనిపించింది.
అద్దంలో తన ముఖం తనకే ఓహ్ అనిపించింది.
'ఈ సమయంలో లచ్చి ఒత్తే ఎంత బాగుంటుందో గందా!'
'ఓలె, మావాఁ! కొత్తగా సూసిన సినిమా ఆటలో ఈరోలా ఉండావు గందా అని వాటేసుకోదూ? పోనీ, దొరతో చెప్పి ఒక్క అంగలో గుడిసెకాడ వాలితే, అసలు మావఁను గురుతు పడతాదా అంట!'
గంగన్న ఈ లోకంలో లేడు. ఆనందపుటంచుల్లో, అచ్చి చీరకొంగు పట్టుకొని ఎక్కడికో ఎగిరిపోతున్నాడు.
తిన్నగా దొర గదిలోకి వెళ్లాడు. దొర లేడు. టేబులు మీద హేరాయిలు, పౌడరు, అత్తరు కంటపడ్డాయి.
ఆ సమయంలో రాజుగాడు గుర్తు వచ్చాడు. 'ఈడు అందంగా ఉండడానికి ఇదా కారణం' అనుకొన్నాడు గంగన్న.
తలకు హేరాయిలు పూసుకుని, పౌడరు అద్దుకుని, తల దువ్వుకుని, సెంటు రాసుకుని నిలువుటద్దంలో చూసుకున్నాడు. జుట్టును చేత్తో సవరించుకొని, 'సినిమా ఈరో నాకంటే అందంలో పొడిచేసినాడా ఏంటి?' అనుకొన్నాడు. అనుకొంటూండగానే బయట కారు హారన్ వీపు మీద చరిచినట్లయింది. ఒక్క ఊపున కారులో ఎగిరి కూర్చున్నాడు దొర పక్కన గంగన్న.
కారు వేగంగా, గంగన్నకు తెలియని చోటుకు, దొరకు తెలిసిన చోటుకి వెడుతూంది.
''లచ్చీ! లచ్చీ!''
నిద్రలో ఉన్న లచ్చికి మామ పిలుపు వినిపించి గుడిసెలోంచి బయటికి వచ్చింది.
'నా మతిమరుపుకాని, మావఁ ఏడోస్తాడు- ఇంత రాత్రేళ?' అనుకొంది.
''లచ్చీ!ల. . . చ్చీ. . .! రాయే! వచ్చియ్యే. . .'' మాటలు తడబడుతున్నాయి. కాళ్లు వంకరలు తిరుగుతున్నాయి.
'యారబ్బా! మావఁ కనుపించడు. యారిదంట ఈ కూత?' అనుకొంటూ అటూ ఇటూ పరికించిన లచ్చికి తూలుతూ తన వైపే వస్తూన్న వ్యక్తి కనిపించాడు.
'మావఁకూడా ఈడ లేడు.' ఏదో గుబులుగా ఉంది గుండెలో.
''రాయే, లచ్చీ!'' ఇంకా దగ్గరిగా వచ్చాడు.
సూటిగా చూసింది లచ్చి.
''మరాజుబిడ్డలా గుండాడు. తెల్ల బట్టలు, ఓలకం సూత్తూంటే...''
భయం వేసింది లచ్చికి.
'ఎదవలోకం! యారినీ నమ్మకూడదు' అనుకొంది. పాకలోకి వెళ్లి తడిక గట్టిగా ముడి వేసి, 'అమ్మయ్య' అని గట్టిగా శ్వాస తీసుకుంది.
ఒక్క నిమిషం భయంగా, బలవంతంగా జరిగింది.
తడికమీద ఎవరో దభాలున పడినట్లు అయింది. ఎవరో పిలుస్తున్నారు.
ఒణికిపోయింది లచ్చి.
భయంతో లేచి నించుంది!
మామ కోసం ఆశగా కళ్లు విప్పి నలు మూలలా వెతికింది లచ్చి!
'ఈడి కేంటి ఈయాల? గుడిసెకే రాలేదు. ఈడ యాడో తూలుతూండాడు. ఈడుంటే ఇక నాబంలేదు. ఎల్లిపోయి దొర బంగళాకు లగెత్తి మావఁ కాడ వాలాల.'
ఎలాగో తప్పించుకొని బయటికి వచ్చింది లచ్చి.
''లచ్చీ!'' తిరిగి పిలుపు.
'మావఁ పిలుత్తున్నట్టే ఉండాదేంటి?' అనుకొంది లచ్చి. మావఁ కాదు గందా అని అనుమానం వచ్చి ఓ క్షణం ఆలోచించింది.
'మావఁ ఇలాగుంటాడేంటి- దొరబాబులాంటి గుడ్డ లేసుకొని? ఈడెవడో?' గుర్తించని లచ్చి పరుగెత్తింది దొర బంగళాకు.
ఒళ్లంతా చెమటలు కారుతున్నాయి. గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. ఆయాసం, నీరసం, భయం ముందుకు తోస్తూన్నాయి.
'మావాఁ!' బంగళా గేటు భళ్లున తోసుకుని లోపల పడిపోయింది లచ్చి.
లచ్చి కళ్లు మామ కోసం వెతుకుతున్నాయి. నీళ్ల కోసం పెదిమలు కదులుతున్నాయి.
''ఏయే! రాజుగా! గంగన్నా!'' బంగళా లోంచి మత్తుగా పిలుస్తున్నాడు దొర.
గట్టిగా పిలవాలని దొర తాపత్రయం. లేవాలని ప్రయత్నం. బ్రాంది కళ్లలో కెరటాలు తన్నుతూ మత్తుగా జలకాలాడుకొంటూంది. ఒళ్లంతా బరువుగా ఉంది.
'వెధవలు అవసరానికి ఒక్కడూ ఉండి చావడు!' మైకంలో హుందాతనం హుంకరించింది.
పక్కమీంచి లేవాలని దొర తాపత్రయం. బద్దకంగా మైకం పడుకోమంటూంది.
''మావాఁ!'' తిరిగి వీధివైపు పిలుపు!
దొర లేచాడు. కాళ్లు అడ్డంగా పడుతున్నాయి. ఒళ్లు తూలిపోతూంది. పెదాలు బరువుగా ఉన్నాయి. ఆ మూలకూ, ఈ మూలకూ ఊగుతూ వరండాలోకి వచ్చాడు దొర. లైటు స్విచ్ ఎలాగే మొత్తం మీద నొక్కాడు.
వెలుతురు గేటు వరకూ అలముకుంది.
అయితే ఏమి! దొరకు ఏమీ కనిపించడం లేదు. కనిపిస్తున్నది బ్రాందీ గుర్తులు, వినిపిస్తున్నవి ప్రియురాలి కొంటె పిలుపులు.
''మావాఁ. . .''
ఎవరో నడిచి వస్తూన్నట్లుగా అనిపిస్తూంది దొరకు. ఆ అనిపించడం ఎంతో సేపు నిలవడం లేదు. అంతలోనే కెరటాలలా అలుముకుపోయే కళ్లు.
తన కాళ్లమీద ఎవరో పడినట్లయింది.
''ఎవరు?'' దొర కంఠంలోంచి బలవంతంగా బ్రాందీ వాసన నింపుకొని వచ్చిన ప్రశ్న.
సమాధానం లేదు!
ఆయాసంగా గుండెలు ఎగరేస్తూన్న మనిషి తన ముందు ఉంది.
'ఇంకెవరు? నా కోసం, దొర కోసం వచ్చిన నా అందాల భరిణ' అనుకొంటూ వంగుని చేయి అందించి, నడిపించుకొని, తనతో తడబడే అడుగులు సరిగా వేసుకొంటూ గదిలో పక్కమీదికి వెళ్లాడు దొర.
లచ్చి బరువుగా ఆ పక్కమీద కొట్టేసిన చెట్టులా పడిపోయింది.
దొర పిలిచాడు. కదిపాడు. పలకలేదు, ఉలకలేదు.
పక్కన ఉన్న గాజు గ్లాసులో నిండుగా పోసిన బ్రాందీని తీసుకొని తిరిగి నోటి వద్ద పెట్టుకున్నాడు. ఇదే సమయంలో లచ్చి 'దాగం' అంటూ మూలిగింది.
''నీకూ కావాల? అడది అడిగి, తాగితే మగవాడి పంట పండినట్లే'' అంటూ ఆ గ్లాసుని లచ్చి పెదాలకు అందించాడు దొర.
గడగడ నాలుగు గుక్కలు తాగేసింది లచ్చి. 'అంతలోనే- ''ఏంటిది, మావాఁ! సేదు యిసం లాగుండాది'' అంటూ చేతులతో విసిరికొట్టింది.
కాస్త ప్రాణం లేచి వచ్చింది లచ్చికి. ఆయాసం తగ్గింది.
పిచ్చిగా నలుమూలలా చూసింది- ఎదురుగా దొర! పరుపుమీద తాను!
వణికిపోయింది. ''మావాఁ'' అంటూ గట్టిగా అరిచింది.
చిన్నగా, గర్వంగా నవ్వుతున్నాడు దొర.
ఆ నవ్వు లచ్చి గుండెల్లో సమ్మెట దెబ్బలా తగిలింది.
'ఏటబ్బా! పెదాలు ఏదోలా ఉండాయి. కళ్లు తిరుగుతుండాయి. ఒళ్లు ఏదోలా అయిపోతుండాది' అనుకొనేలోగా లచ్చి తాగిన బ్రాంది లచ్చిని మత్తులో ముంచేసింది.
మత్తునుంచి కాస్త తేరుకున్న దొర కళ్లు పెద్దవి చేసి, పెద్దలైటు గదిలో వేసి చూశాడు.
లచ్చి!
తన పనివాడు గంగన్న భార్య! తనతో తను అనుకొన్నాడు.
'రాజుగాడు లచ్చి అందాన్ని గురించి చెబితే ఏమిటో అనుకొన్నాను. అబ్బ! ఎంత అందంగా మెరిసిసోతూంది! అందుకే గంగన్న లచ్చిని తలుచుకు తలుచుకు మురిసిపోవడం.' దొర స్వగతంలో గతం తళుక్కుమంది.
దొర చేతులు లచ్చి మీద పడ్డాయి.
లచ్చి కదలలేదు!
లచ్చి ముఖం దొర చేతుల్లో ఇమిడి పోయింది.
లచ్చికి ఏం తెలియడం లేదు.
దొర స్వర్గంలో తేలుతున్నాడు.
లచ్చి నరకంలో చిక్కుకుని గిలగిల తన్నుకొంటూంది.
- - -
రాత్రి మూడు గంటలు దాటింది.
గుడిసెకాడ పడి ఉన్న గంగడికి మైకం పోయి తెలివి వచ్చింది.
లచ్చి కోసం వెతికాడు- లేదు.
బయటికి పరుగెత్తాడు. అలా పరుగెడుతూనే ఉన్నాడు- ''లచ్చీ! లచ్చీ!!'' అని అరుస్తూ.
దూరంగా లచ్చి పడి ఉంది. లచ్చిని గుర్తించాడు గంగడు.
''లచ్చీ!'' అంటూ అరిచి మీద వాలిపోయాడు గంగన్న.
పలకడం లేదు, ఉలకడం లేదు లచ్చి. ఇక పలకదనీ, ఉలకదనీ తెలియని గంగప్ప లచ్చిని పిలుస్తున్నాడు.
''లచ్చీ'' అంటూ పిచ్చిగా అరిచాడు; అరుస్తున్నాడు!
గంగన్న భుజంమీద ఎవరిదో చెయ్యి బరువుగా పడగా కళ్లెత్తి చూశాడు గంగన్న.
''దొరా! నా లచ్చి నన్నాన్నాయం చేసెల్లిపోయింది, దొరా!'' అంటూ బావురుమన్నాడు.
''లే! లచ్చి అదృష్టవంతురాలు. ఆనందంగా వెళ్లిపోయింది'' అని దొర ఓదార్చి, దహనానికి ఖర్చుల కోసం డబ్బు గంగన్న చేతిలో పడేసి కారులో వెళ్లిపోయాడు.
ఆ డబ్బులో మోసం, ఆ దానంలో అక్రమం ఉన్నాయని తెలియని గంగన్న నిర్వికారంగా ఇంకా లచ్చి కోసం చూస్తున్నాడు.
'కొత్త ఉగాదికి సినిమా కెళ్లాలని సెప్పి, సెప్పకుండా నన్నిడిచి ఎల్లిపోయావా, నా లచ్చీ' అనుకొంటూ ముందుకు ఎక్కడికో వెళ్లిపోయాడు గంగన్న.
'మన కొంపల్లో ఉగాదులు ఇలాంటివేలే, లచ్చీ! దొరకు ఉగాది కాని, నీకూ, నాకూ ఉగాది ఏమిటి!'- ఏదో అనుకొంటూ నడుస్తున్నాడు.
పిచ్చివాడైపోయాడు గంగడు. పిచ్చిగా తిరుగుతాడు.
లచ్చిని పిలుస్తాడు!
లచ్చిని వెతుకుతాడు!
- - -
దొర ఉగాది బాగా జరుపుకున్నాడు.
గంగడు ఉగాదినాడూ పిచ్చివాడుగా లచ్చి కోసం వెతుకుతూనే ఉన్నాడు.
- - -