మన భాషకు సాహిత్యం ఒక అమూల్యమైన పండుగ అనుకుంటే , ఆ పండుగకు నిండుతనాన్నిచ్చే ఆమెతలు (విందులు) సామెతలు - అని మనం అనుకోవచ్చు. అనాదినుండీ మానవ జీవితాల్ని పట్టి కుదుపే పరస్పర విరుద్ధాలైన మంచి చెడ్డలు, సుఖ దు:ఖాలు, కలిమిలేములు లాంటి ద్వంద్వాల మధ్య చిక్కుకుని నిరంతరం కొట్టుమిట్టాడే జనజీవన విధానంలోని ఒడిదుడుకుల ఉరవడిలో పుట్టి, తరువాతి తరాలకు నోటిమాటగా వ్యాప్తిపొంది, క్రమంగా భాషకు వన్నెతెచ్చే నుడికారపు సొగసులుగా గుర్తింపు పొందాయి సామెతలు! జనుల జీవితానుభవసారం నుండి పుట్టినవే కావడం వల్ల, ఇవి వారికి సమయానికి కావలసిన స్ఫూర్తినిచ్చేవిగా , ఒక్కొక్కప్పుడు మార్గ నిర్దేశికాలుగా ఉంటూ జనుల మనసులకు చేరువై, హృదయాలకి హత్తుకుని జనుల మనసుల్లో చోటు సంపాదించుకున్నాయి సామెతలు!
ఒక తరంనుండి మరోతరం వారు, వారసత్వపుటాస్తిగా అందుకునే జానపద సాహిత్యసంపద ఈ సామెతలు. చాలా వరకు సామెతలు యతి, ప్రాసలతో, గమకాలతో కూడి అక్షరరమ్యత కలవై ఉంటాయి. సాధారణంగా సామెతల్లో ఒక ఉపమాన భాగమూ, ఒక ఉపమేయభాగమూ ఉంటాయి. సాధారణంగా ఇవి, సరసమైన భాషలో సరళంగా, క్లుప్తంగా ఉండి, జనబాహుళ్యానికి తేలికగా నోటపట్టేవిగా, సులువుగా మనసుకు హత్తుకునేవిగా ఉంటూ, అన్యాపదేశంగా వారికి తప్పొప్పుల వివరం తెలిసీలా చేసి , సరైన కర్తవ్యాన్ని బోధిస్తూ ఉంటాయి. అన్నింటికీ మించి, ఒకే ఒక్క పంక్తిలో గుత్తంగా ఇమిడివున్న అపారమైన జీవితానుభవసారం, చూడగానే మనల్ని వివశుల్ని చేస్తుంది.
మచ్చుకి కొన్ని తెలుగుసామేతల్ని చూడండి ......
1.నీరు పల్లమెరుగు, నిజాము దేవుడెరుగు. ..
2. కందకులేని దురద కత్తిపీటకెందుకు ...
3. తాటాకుల చప్పుడుకు కుందేళ్ళు బెదరవు......
4. కీలెరిగి వాతపెట్టాలి ...
5. అడుసు తొక్కనేల, కాలు కడగనేల ...
6. ఆవు దూడ ఉండగా గుంజ అరిచినట్లు. ......
7. పెదవిదాటిన మాట పృధివి దాటుతుంది....
ఇలా మన జానపద సాహిత్యంలో జనజీవనాన్ని అల్లుకుని అమూల్యమైన సామెతలు వేలకొలదీ ఉన్నాయి. (నాదగ్గరే నాలుగువేలకు పైగా సామెతలు ఉన్నాయి.)
వీటిని జీవనవేదం అనీ, ప్రజా సంహితనీ అంటారు. అంతేకాదు "నుడులు - నానుడులు" అని కూడా ఉటంకిస్తారు. అనవుడు - నావుడు "అంటూ ఉరిపెంగా వీటికి వ్యక్తిత్వాన్ని సమకూర్సినవారూ ఉన్నారు.!
ఒకే భాష అయినా, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్లి చూస్తే, అక్కడ మనకు ప్రాంతీయమైన యాసతో, మాండలికాల హొయలతో ఎన్నెన్నో కొత్త కొత్త సామెతలు కనిపిస్తూంటాయి. వీటన్నిటిలోనూ కూడా మనకు క్లుప్తత, అర్థగాంభీర్యమే కాదు; శబ్దచమత్కారము, యతి నియతి, ప్రాసల విన్యాసాలు మొదలైన చమక్కులన్నీ కూడా చక్కగా కనిపిస్తాయి.
కొన్ని సామెతలు సూటిగా ఉంటే, కొన్ని వ్యంగ్యంగా ఉంటాయి ఒక్కొక్కప్పుడు ఒకే విషయాన్ని చెప్పేవి లెక్కకు మిక్కిలి సామెతలు కూడా ఉంటాయి. కొన్నికొన్ని సామెతలు పరస్పర వ్యతిరేకాలుగా కూడా ఉంటూంటాయి.కాని ఇవి చాలా తక్కువ.
( ఉదాహరణకు - " ఆలస్యం అమృతం విషం " అన్నసామెతతోపాటు మనకు "నిదానం ప్రధానం" అన్న సామెతకూడా గుర్తువచ్చినప్పుడు మనం మన తెలివితేటల్ని ఉపయోగించి, ఆ సమయానికి తగిన దానిని ఆచరించవలసి ఉంటుంది. సామెతలు ఎంత శిరోధార్యమనిపించినా దానికీ ఒక హద్దు ఉంటుంది కదా!)
సామెతలు ఏ భాషలో ఉన్నా ఆ భాషకు అవి అందాన్నితెచ్చే చక్కనైన అలంకారాలు అనడం అతిశయోక్తి కాదు. కొద్దిపాటి అక్షరాల పొందికలో అంతులేని అర్థసంపద నిక్షేపించబడివున్న సామెతలు, అది ఏ భాష అయివున్నా, తమ సొగసులతో ఆ భాషకే అందాన్ని తెస్తాయి. అలాగని అవేమీ మహాపండితుల అఖండ కృషితో తయారైన కృతు లేమీకావు. కేవలం ఇవి సామాన్యప్రజల జీవితానుభవాల సారం నుండి పుట్టినవి మాత్రమే! అందుకే మనకు ప్రకృతిలోని సహజత్వం, పూదోటల నేవళీకం కనిపిస్తుంది సామెతల్లో!
ప్రాచీన కవులైన అల్లసాని పెద్దన, చామకూర వేంకటకవి మొదలైనవారెందరో తమతమ కవిత్వాలలో సామెతలను విరివిగా వాడారు. వేమన శతకం, సుమతీ శతకం లాంటి వాటిలో కూడా మనకు సామెతలు మెండుగా కనిపిస్తాయి. సామెతలు ఆయా శతకాల్లోని పద్యాల్లో చక్కగా కవనభాగాలై భాసించాయి.
సామెతలను గురించి ప్రత్యేకంగా వ్యాసాలురాయడం, తమ ఉపన్యాసాల్లో వాటిని ఉటంకించడం; తమ రచనల్లో వాటిని చేర్చి రాయడం లాంటివి ఎప్పటినుండో మొదలై, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. సామెతల్ని ఏ సాహిత్య ప్రక్రియతో చేర్చినప్పటికీ అవి దాని అందాన్ని ఇనుమడింపజేస్తాయి. క్రమంగా సామెతలు జనజీవనంలోనే కాకుండా సాహిత్యంలో కూడా ఒక ప్రత్యేక స్థానం అందుకున్నాయి. కథలు, నవలలు, నాటకాలు మొదలైన సాహిత్యప్రక్రియలలో సందర్భానుసారంగా తగిన సామెతలను వాడడం వల్ల భాషకు కొత్త అందం వస్తుంది. రచనల హొయలు పెరుగుతాయి. మనం ప్రస్ఫుటపరచిన భావానికీ దిట్టతనం వస్తుంది. సామాతలు సరైన మోతాదులో వాడడంవల్ల మన రచనకు తావి అబ్బినట్లు ఉంటుంది.
నేడు కనిపిస్తున్న అధునాతన రచనల్లో చాలామంది రచయితలు అక్కడక్కడా, సందర్భానుసారంగా సామెతలను చేర్చి రాయడం జరుగుతూనే ఉంది. ఉదాహరణకు - నార్ల వారు రాసిన "కొత్తగడ్డ" అన్న నాటికల సంపుటిని చెప్పవచ్చు. దానిలో ఆయన అవకాశం దొరికినచోటనల్లా విరివిగా సామెతలను గుప్పించడం జరిగింది. మరికొందరు, సామెతలనే తమ కథలకు మకుటంగా చేసుకుని , ఆ సామెతనే ఆధారంగా చేసుకుని చక్కని కథనల్లినవారూ ఉన్నారు. ఆ విషయంలో డా॥ తెన్నేటి సుధాదేవి రామరాజు గారి పేరు ముందుగా చెప్పాలి. వీరు తెలుగు సామెతలను తన రచనకు మకుటంగా చేసుకుని, వాటికి వివరణనిస్తూ, సులభ శైలిలో, తెలుగులో చిరునాటికలెన్నో (500 కు పైగా ) రాశారు. మధ్యతరగతి జీవితాలకు ప్రతీకలైన ఈ చిరునాటికలు "రేడియో వెరిటాస్ - మనీలా" నుండి రేడియో నాటికలుగా చాలాకాలం ప్రసారం చెయ్యబడ్డాయి. తరవాత ఇవి పుస్తకాల రూపంలో కూడా వెలువడ్డాయి. దీనివల్ల రచయిత్రికి మంచి పేరు ప్రతిష్టలు, తెలుగుసామెతలకు గొప్ప గుర్తింపు వచ్చాయి. ధన్యవాదాలు!
భాష కేవలం మన మనోభావాలను శబ్దరూపంలో వ్యక్తపరచేందుకు ఉపకరించే ఒక మాధ్యమంగా మాత్రమే చూడకూడదు. అది మనం, మన సంస్కృతీ సంప్రదాయాల్ని దాచుకునేందుకు ఉపకరించే ఒక రత్నమంజూష కూడా!
మొత్తం ప్రపంచ వ్యాప్తంగావున్న భాషలందున్న పరిపూర్ణతగల భాషల్లో ఒకటి తెలుగుభాష! ఎన్నెన్నో అమూల్యమైన భావాలను, శబ్దాలను ప్రస్ఫుటంగా, అనాయాసంగా ప్రకటించే శక్తివున్న గొప్పభాష ఈ తెలుగుభాష ! అటువంటి తెలుగు భాషలో వేలాది సామెతలు ఉన్నాయి. కొన్ని ఇతర భాషల్లో కూడా, ఇన్నో, అన్నో సామెతలు ఉంటే ఉండవచ్చు, కాని తెలుగువారు సామెతలను ప్రేమించినంత బాగా మరెవరూ వాటిని ప్రేమించలేదు - అన్నది నిర్వివాదాంశం .
నిత్యం మనం మాటాడే మాటలలో విరివిగా సామెతలు గుప్పించడం అన్నది తెలుగువారికున్న ప్రత్యేకమైన అలవాటు. మనవాళ్ళు వ్యక్తం చెయ్యదలచిన భావానికి ఉదాహరణగానో, మద్దతుగానో సందర్భానికి అనువైన ఒక సామెతని చేర్చిమరీ మాటాడడం సాధారణంగా జరుగుతూంటుంది. అలా చెయ్యడం వల్ల వారి అభిప్రాయానికి పటిష్టత చేకూరుతుందని వారి నమ్మకం. ఒకవేళ సమయానికి తగిన సామెత స్ఫురించకపోయినా, సామెత అశ్లీలమైనది అయినా కూడా ఊరుకోకుండా, "అదేదో సామెత చెప్పినట్లు" అని, ఆ సామెతను నీ మనసుకి స్ఫురించేలా చెయ్యడం జరుగుతుంది. తరచూ ఈ సామెతలను వాడీ విషయంలో గ్రామీణులను ముందుగా చెప్పుకోవలసి ఉంది. వారు పది వాక్యాలు మాటాడితే, అందులో కనీసం రెండు - మూడు సామెతలైనా తొంగి చూడక మానవు!
పట్టణాలలో ఇంగ్లీష్ భాష మీద పెరిగిపోయిన మోజు వల్ల జనంలో క్రమంగా మాతృభాషపై ఉండవలసిన మమత చాలావరకు తగ్గిపోయింది. ఇక వారికి సామెతలలో ఇమిడివున్న నుడికారపు సొగసులు గమనించే మక్కువ ఎక్కడ మిగిలి ఉంటుంది? "ఇంట్లో వండిన ఇగురు కూరకంటే పొరుగింట వండిన పుల్లకూరకు రుచి ఎక్కువ!"
అయాచితంగా మనకు లభించిన ఈ సామెతలను నశించిపోనీకుండా ఎలాగైనా కాపాడాలన్న కోరికతో, వాటి విలువ తెలిసిన వారు కొందరు, వీటిని సంకలనపరిచి, పుస్తకాల రూపంలో అచ్చొత్తించారు. అటువంటి పుస్తకాలలో, శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు సంకలనపరచి ప్రకటించినది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు వెబ్ మీద మనవాళ్ళు ఎన్నో సామెతలను పొందుపరచారు. ఆసక్తి కలవారికి అవి, అరచేతిలో ఉన్న అరటిపండులా, తక్షణం ఆస్వాదించడానికి అనువుగా అందుబాటులో ఉన్నాయి.
సామెతలు ఎవరికీ స్వంత ఆస్థి కావు. ఇవి తరతరాల జనజీవితానుభవసారం నుండి పుట్టిన అక్షర సత్యాలు!. అనాదిగా, ఒక తరం నుండి మరొక తరానికి చేరుతూ, అందరి నోళ్ళలోనూ నానినాని నిగ్గుతేలిన ఈ సామెతలు మన అందరివీను! మన పూర్వులు మనందరికోసం అమర్చి ఉంచిన అమూల్య లౌకికజ్ఞానసంపద ఇది. అందుకే వీటిని సు+ఉక్తులు "సూక్తులు" అంటారు. పరోక్షంగా మన పూర్వులు మనకు ఇచ్చిన సలహా సహకారాలుగా వీటిని భావించవచ్చు. ఇవి సర్వ కాలాలకు, సకలజనులకూ సంబంధించినవి. అందుకే సామెతలకు "లోకోక్తులు" - అనే అన్వర్ధనామం కూడా ఉంది.
ఇంగ్లీషు వాడైనా తెలుగు భాషను అభిమానించి, ఆ భాషాభివృద్ధికై కృషి చేసిన మహనీయుడు c.p. బ్రౌన్ మహాశయుడు, ఆయన తెలుగు సామెతల సోయగాన్నీ, తీయదనాన్నీ గుర్తించి; ఆ మధురిమను బయటి ప్రపంచానికి కూడా అందజేయాలన్న సంకల్పంతో, వాటిని ఇంగ్లీషులోకి అనువదింపజేయడం జరిగింది. వాటిని ఆంగ్లేయులు కూడా ఇష్టంగా చదువుకుని అర్థం చేసుకుని మురిశారుట! చాలా సామెతలు దేశ కాల పాత్రలకు అతీతమైనవిగా ఉంటూ అన్ని దేశాలవారికీ సంబంధించినవై ఉండి , అందరి హృదయాలను ఆకట్టుకుంటాయి అన్నది నిజం.
ఎవరైనా సరే పరాయిభాషలు ఎన్నైనా నేర్చుకోవచ్చు, వారివారి అభిరుచినిబట్టి ఆ యా భాషల్ని అభిమానించనూవచ్చు, కాని తనదైన "తల్లిభాష"ను తృణీకరించడం ధర్మం కాదు . మన మాతృభాష మట్టిలో కలిసిపోకముందే దాన్ని కాపాడుకోవడం మనకు విధాయకం - అన్నది మనం విస్మరించకూడదు. మన పూర్వులు మనకోసం సంఘటితపరచిన అమూల్య నిధి ఈ సామెతలు. లోకజ్ఞానానికివి ప్రతీకలు! ఇవి మనకు అయాచితంగా సంక్రమించిన తరతరాల అమూల్య సంపద - అన్నది మనం ఎన్నటికీ మరచిపోకూడదు. వీటిని పోగొట్టుకుంటే మనకంటే నిర్భాగ్యులు మరొకరు ఉండబోరు !