(గత సంచిక తరువాయి)
సీతమ్మకు కలిగిన విస్మయం
హనుమంతుడి మాట విని సీతాదేవికి ఆనందమూ, ఆశ్చర్యమూ కూడా కలిగాయి.
"హనుమంతుడా! నీ మాట విస్మయం కలిగిస్తున్నది. అంతదూరం నన్ను ఎట్లా తీసుకుని పోగలుగుతావు? నీ వానరలక్షణం బయట పెట్టుకుంటున్నావు చూడబోతే" అని ఆమె చకితురాలు అయింది. ’నీ రూపం చాలా చిన్నది. నీవెట్లా నన్ను తీసుకొని వెళ్తావయ్యా నా స్వామి దగ్గరకు?’ అని విభ్రమం ప్రకటించింది సీతాదేవి.
ఆమె మాటలు తనకు పరాభవంలా భావించాడు హనుమంతుడు. కొంచెం దూరంగా అక్కడనుంచి వెళ్ళి హనుమంతుడు తన మహాకాయాన్ని ఆమెకు చూపాడు. మేరువూ, మందరపర్వతమూ లాగా ఆయన పెరిగాడు. అగ్నిజ్వాలలా వెలుగొందాడు. ‘అమ్మా జానకీ! ఈ లంకానగరాన్ని పెకలించుకొని తీసుకొని పోయే శక్తి నాకుంది. కాబట్టి నీకు సందేహం ఎంత మాత్రం వద్దు. నా వీపుపై ఆసీనురాలివైతే నిన్ను స్వామి దగ్గరకు తీసుకొని వెళ్ళగలను." అని చెప్పాడు హనుమంతుడు.
అప్పుడామె హనుమంతుడి అద్భుత తేజో బలపరాక్రమాలు చూసింది కనుక తన సందేహం తొలగిపోగా ఇలా అన్నది - "నాయనా! నన్ను నా పతివద్దకు చేర్చేందుకు నీవు అన్నివిధాల సమర్థుడవని నేను నమ్ముతాను. అయితే నీ వాయువేగ గమనానికి నేను భయపడి కిందపడిపోతే ప్రమాదం కదా! ఆ జలజంతువులు ఊరుకుంటాయా? అంతేకాక ఆ రాక్షసులు రావణుడి ఆజ్ఞతో నిన్ను ముప్పతిప్పలు పెట్టటానికి వెంటపడతారు. వాళ్ళతో నీవు యుద్ధం చేస్తుంటే నేను భయకంపితురాలనై సముద్రంలో పడిపోవటం తథ్యం. మళ్ళీ వాళ్ళు నన్ను బంధించి లంకకు తీసుకొని పోతారు. లేదా హతమారుస్తారు. అంతేకాదు; నీవే సర్వరాక్షసులను సంహరించి నన్ను తీసుకుని పోతే
శ్రీరాముడికి చిన్నతనం కాదా? ఆయన కీర్తికది ఒక మచ్చ కాదా! కాబట్టి శ్రీరాముణ్ణి నీవు ఇక్కడకు తీసుకునిరావటమే మంచిది. నాయనా! శ్రీరాముడి సోదరుల జీవితాలు, సుగ్రీవుడి కుటుంబం, వారి క్షేమం నీ మీదనే ఆధారపడి ఉన్నాయి కదా! అంతేకాదు; పతివ్రతనైన నేను మరొక పురుషుడిని ముట్టుకోను కదా! అయితే రావణుడు నిన్ను తీసుకొని వచ్చాడు. ఆ రావణుణ్ణి నేనెట్లా ఎదుర్కోగలను? నన్ను రక్షించే నా నాథుడే తెలిసికొని ఉంటే వాడి అంతం అప్పుడే చూసి ఉండేవాడు. కాబట్టి దశకంఠుణ్ణి సపరివారంగా పరిమార్చి శ్రీరాముడు నన్ను తీసుకొని వెళ్ళటం యుక్తం. ఈ విషయమే శ్రీరాముడికీ చెప్పి ఆ స్వామిని త్వరపెట్టు" అని హనుమంతుడికి సీతాదేవి చెప్పింది. సీతాదేవి చెప్పిన అర్ధవంతమైన ఈ మాటలు హనుమంతుణ్ణి చాలా సంతోషపెట్టాయి. ‘అమ్మా నీవు చెప్పిన మాటలన్నీ హేతుబద్ధంగా ఉన్నాయి. ‘నేను ఇతరులను స్పృశించను’ అని చెప్పటం నీ కొక్కదానికే చెల్లుతుంది. ఇక్కడ నీవు చెప్పిన ప్రతి విషయం నేను శ్రీరాముడికి చెబుతాను. మీ ఇద్దరికీ ఎంత త్వరాగా ప్రియం చేకూర్చగలనా అనే తహతహతో నిన్ను నా వీపు మీద ఎక్కించుకొని పోతాను అన్నాను కాను అంతకన్నా మరేమీ కాదు. అదీకాక ఆ సామర్ధ్యం నాకుంది. సరే! ఇప్పుడు నేను తిరుగు ప్రయాణమై పోతున్నాను. ఇక స్వామికి విన్నవించే నీ సందేశం నాకు అనుగ్రహించు. నిన్ను చూసి సఫలీకృతమనోరధుణ్ణైనాను. నిన్ను కలసుకొన్నందుకు ‘ఆనవాలు’ ఏదైనా ఇవ్వు’ అని సీతాదేవిని ప్రార్ధించాడు హనుమంతుడు. అప్పుడామె చెప్పింది -
(సశేషం)