‘నారాయణ, నారాయణ’ అంటూ నారదుడు వచ్చే సమయానికి, బ్రహ్మదేవుడు రోజూలాగానే పద్మంలో పద్మాసనం వేసుకు కూర్చుని, నాలుగు తలల్లోనూ ముందు వేపు వున్న తలని కొద్దిగా వంచి, భారతదేశంలో త్వరలో హిందూమతంలో పుట్టబోయే పిల్లల భవిష్యత్తుని చిన్న చిన్న కాగితాల మీద వ్రాస్తున్నాడు. పక్కనే వున్న ఋషులు, ఆ కాగితాలు ఒక్కొక్కటే తీసుకుని, పుట్టబోయే పసికందుల నొసటి మీద ఆ రాతలను ముద్రిస్తున్నారు.
ఇవేమీ పట్టించుకోకుండా సరస్వతీదేవి తన వీణ మీద ‘బ్రహ్మ కడిగిన పాదము’ అనే అన్నమాచార్య కీర్తన శ్రావ్యంగా వాయిస్తున్నది. నారదుడిని చూసి పలకరింపుగా చిరునవ్వి, రెండవ చరణంలోకి వచ్చింది.
బ్రహ్మ మాత్రం తాపీగా తన పని తను చేసుకుంటున్నాడు.
అలాగే ఎంతోసేపు నుంచుని.. నుంచుని, కాళ్ళు నొప్పి పుడుతుంటే, నెమ్మదిగా ఎడం చేత్తో కుడికాలు వత్తుకుంటూ, “తండ్రీ! నేను వచ్చాను!” అన్నాడు నారదుడు.
బ్రహ్మ మాట్లాడలేదు.
కొంచెంసేపు జవాబు కోసం చూసి, “మీకు నేను వచ్చానని చెప్పినా, మీ ఎనిమిది చెవులకీ ఏమాత్రం ఎక్కటంలేదు. కనీసం ఒక తలనైనా వూగించి, నన్ను గుర్తించలేదు. ఎందుకు మీలో మునుపటి పుత్రోత్సాహం కనపడటం లేదు?” అని సూటిగా అడిగాడు.
బ్రహ్మ వ్రాసుకోవటం కొనసాగిస్తూనే, ఎడమ పక్క తలని ఆడించి, ఆ నోటితోనే అన్నాడు. “కుమారా! నాలో పుత్రోత్సాహం లేక కాదు. ఏ తండ్రి అయినా తన పుత్రుడు తనని మించిపోవాలనే అనుకుంటాడు. నువ్వు రావటం గమనించాను. అయినా భారతదేశంలో కుటుంబ నియంత్రణ ఇంకా సరిగ్గా నడవకపోవటం వల్ల అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. ప్రతి నెలా ఎంతోమంది భారతీయులు విదేశాలకు వలస వెడుతున్నా, ఇంకొక ఇరవై ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా వున్న దేశంగా తయారవ బోతున్నది. ఎంత బ్రహ్మ దేవుడిని అయినా, మరి వారందరికీ నొసటి వ్రాత నేనొక్కడినే వ్రాయటం సాధ్యం కాని పని. అందుకే నీ తల్లి భారతి అలా చక్కటి సంగీతం అందిస్తుంటే, అది వింటూ మనసు ఉల్లాస పరుచుకుని, రాత్రింబగళ్ళూ ఇలా వ్రాస్తూనే వున్నాను” అన్నాడు.
“పుత్రుల సంక్షేమం చూడటం తండ్రుల బాధ్యత కదా తండ్రీ!” అన్నాడు నారదుడు.
వీణాపాణి అన్నమయ్య కీర్తన పూర్తవటంతో, ఈసారి త్యాగరాజుగారి ‘నగుమోము గనలేని..” కీర్తన మొదలుపెట్టింది.
బ్రహ్మ నవ్వి, “అవును. అందుకే నేను నీ విషయంలో చూపిస్తున్న అశ్రద్ధ మిగతా తండ్రులెవరూ చూపించకూడదని, నేను వ్రాస్తున్న నొసటి వ్రాతల్లో పుత్రులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను. దేనికీ పనికిరాని దద్దమ్మలకి కూడా, ఎంతో గొప్ప ఉపాధిని, జీవితాన్ని వాళ్ళ తండ్రులు ఇచ్చే విధంగా వారి నొసటి వ్రాత వ్రాస్తున్నాను” అన్నాడు, నారదుడిని ఆప్యాయంగా చూస్తూ.
నారదుడు ఒక్కసారిగా నోరు తెరిచి, “ఇది మీరు చేసిన పనా, తండ్రీ!” అన్నాడు.
అతని గొంతు ఎక్కడో నూతిలోనించీ వచ్చినట్టు వుంది.
“ఏమయింది నారదా... నేనేం చేశాను?” అన్నాడు బ్రహ్మ కలవరపడుతూ.
“ఇంకా ఏం చేయాలి? జరగరాని పనులే జరిగిపోతున్నాయి. పండిత పుత్రః శుంఠః అన్న నానుడి మీరు సృష్టించినదే కదా! తండ్రులు వారి వారి రంగాలలో ఎంత గొప్పవారయినా, వారి పుత్రులు శుంఠలు అయినప్పుడు, మీ రాతల ద్వారా వారిని ఆయా రంగాల్లో ప్రవేశం లేకపోయినా, వారి తండ్రుల కన్నా గొప్ప వారిగా చేద్దామనుకుంటున్నారు కదా!” అన్నాడు నారదుడు, తంబుర పక్కన పెట్టి రెండు చేతులతోనూ నోరు నొక్కుకుంటూ.
వారి వాగ్వివాదాలు చూస్తున్న వాగ్దేవి, చిరునవ్వుతో ‘మరుగేలరా రాఘవా’ అనే కీర్తన వీణ మీద వాయించటం మొదలుపెట్టింది.
ఆ పాటలో తనకి ఏదో దారి దొరికినట్టు అనిపించి, బ్రహ్మ అన్నాడు. “పుత్రా! అలా భారతదేశం వేపు ఒకసారి చూడు. గుంటూరు అనే ఊరిలో ఒక వైద్యుని కొడుకు, కష్టపడి వైద్యశాస్త్రం చదువుకొని, తన తండ్రి పెద్దవాడవగానే, ఆయనకి విశ్రాంతి ఇచ్చి, తనే వారి ఆసుపత్రిని ఇంకా సమర్ధవంతంగా నడుపుతున్నాడు. అలా చూడు! విజయవాడ అనే నగరంలో ఒక న్యాయవాది సుపుత్రుడు, లావొక్కింతయు వదలకుండా చదువుకొని, తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచి, ఈనాడు తండ్రిని మించిపోయాడు. అలాటి గొప్ప సంఘటనలే కదా, ఏ తండ్రికి అయినా ఎంతో పుత్రోత్సాహం ఇచ్చేవి!”
“మీరు ఇచ్చిన ఉదాహరణలు చాల బాగున్నాయి కానీ, అవెలా వున్నాయో చెబుతాను తండ్రీ! భూలోకంలో కొత్త చలనచిత్రాలు విడుదల చేసే ముందర ఒక చిన్న లఘు చిత్రాన్ని చూపించి, ప్రేక్షకులని ఆకట్టుకుంటారు. అలాగే అమెరికా అనే దేశంలో, ఈనాటి సాంకేతిక వస్తువులు విడుదల చేసే ముందు ఎంతో ఘనంగా ఒక చిన్న అమ్మక ప్రదర్శన ఇస్తారు. అది చూసిన వారు, వరుసల్లో నుంచుని ఆ సాంకేతిక రంగం అందించేవి అన్నీ, ఎగబడి మరీ కొంటారు. తర్వాత అవి పని చేస్తాయో లేదో అంతా దైవాధీనం” అని ఒకసారి నాలిక కొరుక్కుని, “అనకూడదు కానీ, మీరు చెప్పిన ఉదాహరణలు అలాగే వున్నాయి” అన్నాడు నారద మహాముని, ఏమీ ముఖమాట పడకుండా.
బ్రహ్మదేవుడికి ఆయన మాటలకి చాల కోపం వచ్చింది. తమాయించుకుంటున్నాడు
సరస్వతీదేవి, ఆ సన్నివేశాన్ని కొంచెం ఆహ్లాదంగా చేయాలని, ఒక లలిత గీతం అందుకుంది. ‘మనసే అందాల బృందావనం’ అని వీణ మీద వాయిస్తూ, చిరునవ్వుతో పతిదేవుడిని చూస్తూ, సన్నగా కన్ను గీటింది. తమాయించుకుని చిరునవ్వు నవ్వాడు సృష్టికర్త.
“సరే! నువ్వు చెప్పదలుచుకున్నదేదో చెప్పరాదా, సుపుత్రా!” అన్నాడు.
“చెబుతాను తండ్రీ! కొంచెం పరుషంగా మాట్లాడి వుంటాను. క్షమించండి. సత్యం పలుకుతున్నప్పుడు, ఆ మాటలు కొంచెం అగౌరవంగా బయటపడ్డట్టున్నాయి” అని, ఆయనకి ఒకసారి పాదాభివందనం చేసి, ఇలా అన్నాడు.
“వైద్యరంగం, న్యాయవాదం, గణితశాస్త్రం, రసాయనిక శాస్త్రంలాటి శాస్త్రీయ రంగాల్లో, సాంకేతిక రంగాల్లో మీరు చెప్పినది అక్షరాలా నిజం. సరుకు లేనిదే తండ్రులని చూసి ఆయా రంగాల్లో అడుగుపెట్టటం కొడుకులకి కష్టం. చదువుకోకుండా లక్షలు పెట్టి చదువు కొనుక్కునేవాళ్ళ సంగతి నేను చెప్పటం లేదు..” చదువుల వాణి తనని చురుగ్గా చూడటం చూసి, చెప్పటం ఆపాడు నారదుడు.
“రానీ.. నీ భూలోక వాహ్యాళిలో నువ్వేం చూశావో, నీ కోపానికి కారణమేమిటో బయటకు రానీ!” అన్నాడు పరబ్రహ్మ.
“వస్తున్నా.. వస్తున్నా..” అంటూ చెప్పటం మొదలు పెట్టాడు నారదుడు.
“తండ్రులకి ఎంత ధనం వున్నా, వారి తదనంతరం అవి చేతిలో పడగానే, కొడుకులు సురపానానికీ, మత్తుమందులకీ, వనితా వినోదాలకీ డబ్బంతా హారతి కర్పూరంలా ఖర్చుపెడుతూ, రోడ్డు మీద అమాయకుల మీదనించీ వాళ్ళ వాహనాలు పోనిచ్చి చంపేస్తూ, మధ్యే మధ్యే మానభంగాలు చేస్తూ, జైలుకి పోకుండా న్యాయస్థానాలని కొనేస్తూ, చేతిలో చమురు అయిపోగానే రోడ్డెక్కుతున్నారు. మీరు వ్రాసిన నొసటి వ్రాత నేను పైన చెప్పిన అన్ని రంగాలలోనూ పనిచేయటం లేదు”
“అలా జరగటానికి వీలు లేదే!”
“అవును. బ్రహ్మరాత మరి. ఎందుకు జరగదూ! కొడుకుల్లో ఏమాత్రం సరుకు లేకపోయినా, మీరు వ్రాసినట్టుగా రెండు రంగాల్లో మాత్రమే అలా జరుగుతున్నది” అన్నాడు నారద మహర్షి.
“మరి..” అన్నాడు బ్రహ్మ.
వీణాపాణి అదేమిటో వినాలనే కుతూహలంతో వీణ వాయించటం ఆపి, నారదుడు ఏం చెబుతాడా అని ఎదురు చూస్తున్నది.
“రెండు రంగాల్లో మాత్రం, ఏమాత్రం చదువూ, చట్టుబండలూ అఖ్కర్లేదు. యోగ్యతలూ, సభ్యతలూ అఖ్కర్లేదు. వాళ్ళ తల్లిదండ్రుల పదవులూ, అభిమాన సంఘాలూ, కులాలు, బస్తాల్లో ధనమూ, గూండా బలమూ వారికి ఆ దేవుడు ఇచ్చిన వరాలు.. “ మళ్ళీ నాలిక కొరుక్కుని, చెప్పటం కొనసాగించాడు నారదుడు.
“ఒకటి. రాజకీయ రంగం. భారతదేశంలో చాల చోట్ల, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి, కొడుకులకి పట్టం కడుతున్నారు. వాళ్ళకి చేతనయినదల్లా ఒక్కటే, పదవి ఉపయోగించి డబ్బులు దండుకోవటం. దోచుకోవటం”
“అదేమిటి? అక్కడ రాజరికాలు పోయి, ప్రజాస్వామ్యం వచ్చింది కదూ”
“ప్రజాస్వామ్యం అంటే ప్రజలు, పరిపాలించే వారిని ఎన్నుకోవటం. రోడ్ల మీద ‘దేశం పాడయిపోతున్నది గురూ!’ అని కబుర్లు చెప్పే శిష్యులే తప్ప, ఓట్లు వేసే ప్రజలు చాల తక్కువ. ‘నోట్లకి ఓట్లు’ అనే నానుడి కూడా వున్నది అక్కడ. కొంతమంది అక్కడ ‘ప్రజాస్వామ్యం కోయిల చాల ముందే కూసింది’ అంటారు కూడాను. ఏది ఏమయితేనేం కొడుకులు, కూతుళ్ళు, కొడుకుల కొడుకులు, కూతుళ్ళ కొడుకులు, అల్లుళ్ళు, మధ్యే మధ్యే ఇంకా దగ్గరగా చుట్టలు చుట్టుకుని చుట్టలు తాగుతూ కూర్చున్న దగ్గర చుట్టాలు. ప్రజలు ఆ విషవలయాన్నే కోరుకుంటున్నారు. వాళ్ళకే కులం పేరిట, మతం పేరిట, అభిమానం పేరిట, అద్దాన్నం పేరిట అరవై ఎనిమిది ఏళ్లుగా ఓట్లు వేస్తున్నారు. డబ్బులు తీసుకుని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తున్నారు. వాళ్లకి ప్రజలని దోచుకోవటం తప్ప ఇంకేమీ తెలీదు కనుక, పాపం వాళ్లకి తెలిసిన ఆ ఒక్క పని కూడా చేయనీయక పొతే ఎలా అని ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు. అప్పుడప్పుడూ కొంచెం మార్పు కోసం, వేరే పార్టీలని ఎన్నుకున్నా మళ్ళీ ఇదే కథ. వాళ్ళ కొడుకుల కథ. అలా కొడుకుల, కూతుళ్ళ వంశ పరంపర బ్రహ్మాండంగా కొనసాగుతున్నది” నారదుడు చెప్పటం ఆపాడు.
“మరి, ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్రాన్ని అలా ఎందుకు వృధా చేస్తున్నారు? అలా అని నేను ఎవరి నొసటా వ్రాయలేదే!” అన్నాడు బ్రహ్మ.
“మీరు ఏం వ్రాసినా వ్రాయకపోయినా, వారి కర్మలకు వారే బాధ్యులు కదా! ఇంకొక రంగంలో కూడా ఏమాత్రం అర్హత లేని కొడుకులు, తండ్రుల సహాయంతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రజల ప్రాణం తీస్తున్నారు. ఆ విషయం కూడా చెబుతాను” అన్నాడు నారదుడు, కాళ్ళు నొప్పి పెడుతుంటే పక్కనే వున్న ఆసనం మీద కూర్చుంటూ.
బ్రహ్మ తన ఎనిమిది చెవులూ అప్పగించి దీక్షగా వింటున్నాడు.
“భారతదేశంలో చలన చిత్రరంగం అని ఒకటి వున్నది. వారు ప్రజల ఆనందంకోసమే కాకుండా, చక్కటి కథాంశం వున్న చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, చారిత్రాత్మక కథా చిత్రాలు, విజ్ఞానం అందించే చిత్రాలూ తీసి, తెలుగునాట ఒక స్వర్ణయుగాన్ని నిర్మించారు. సాహిత్యం, సంగీతం, నాట్యం, నటన, నిర్మాణం, దర్శకత్వంలలో ఎంతో సమర్దులయిన కళాకారులతో, పరాకాష్ట అందుకున్న స్వర్ణయుగం అది. యుగం అని ఎందుకు అన్నానంటే, దాదాపు మూడు నాలుగు తరాల ప్రజలని అలరించిన స్వర్ణయుగం అది. దరిమిలా అక్కడా కొడుకుల తరం ప్రారంభమయింది. నట శూన్యులయినా, తండ్రుల ధనబలంతో, వారి నిర్మాతల అభిమానంతో, వీరు కూడా నటులవాలని రంగంలో దిగారు.. నేను చెప్పటం ఎందుకు? మీరే అలా మీ దివ్య దృష్టితో.. వర్తమాన కాలానికి ఇటు ముందూ, అటు వెనకా.. ఒకసారి చూడండి..”
బ్రహ్మదేవుడు, ముందు తలలో వున్న కళ్ళు తను వ్రాస్తున్న నొసటి రాతల మీదే వుంచి, ఎడమ తలలో వున్న కళ్ళతో కీర్తన ఆపి తనే వేపే ఆసక్తితో చూస్తున్న భారతీదేవిని చూస్తూ, కుడి తలలోని కళ్ళు నారదుడి మీద వుంచి, వెనక తలలోని కళ్ళు విశాలంగా తెరిచి దూరదృష్టితో భూమి వేపు చూశాడు. గత పన్నెండేళ్ళ తెలుగు చలనచిత్ర రంగంలో ఆరేళ్లు భూతకాలంలోకి, ఆరేళ్ళు భవిష్యత్తులోకి వెళ్లి చూస్తున్నాడు. ఒక చలన చిత్ర తారడు, ఎలా చలనచిత్రరంగంలో హీరోగా వెలుగుతున్నాడా అని.
“మనవాడికి చదువూ లేదు, ఇంకేమీ లేదు. ఇరవై ఏళ్ల వయసు వచ్చింది. దేనికీ పనికిరాని పరమ దద్దమ్మలా తయారయాడు. మీరే వాడిని సినిమాల్లో చేర్చి, వాడినీ ఒక హీరో చేయరాదూ. ఇప్పుడు ఎంతోమంది పాత హీరోలు, నిర్మాతలు చేస్తున్న పని అదేగదా. వాళ్ళకన్నా తీసిపోయాయాడా?” అంటున్నది ఒక తల్లి, వాళ్ళింటి ముందర చెట్టు కన్నా ఇంకా ఎత్తుగా ఎదిగిన కొడుకుని చూపిస్తూ.
ఆయన క్రింద పడితే దెబ్బ తగులుతుందని, సోఫాలోనే పడీ పడీ నవ్వాడు, “వాడికా.. వాడికి తెలుగు ఒత్తులే పలకటం రాదు. అరదం, దురదుషటం అంటాడు, మాయాబజారు సినిమాలో దుషటచతుషటయం లాగా. ఒత్తులేమిటిలే, తెలుగు అక్షరాలే పలకలేడు. కళ్ళు అనమంటే కల్లు అంటాడు. పెళ్లి అనమంటే పెల్లి అంటాడు. శివ అనమంటే షివ అంటాడు. సశేషం అనమంటే షషేషం అంటాడు. జడ్డి వెధవ. బీజాక్షరం ‘శ’ని కూడా సరిగ్గా పలకలేని శనిగాడు. అన్నిటికీ ‘ష’లే, వాడేదో పాదుషా అనుకుంటాడు”
తల్లి కూడా నవ్వి, “పోనీలెండి. మీరు వెంకట్రావుగా, అప్పారావుగా చక్కటి డైలాగులు చెప్పేవారుగా. అది చాలు. అయినా ఈ ఇంగ్లీషు మీడియం చదువుల రోజుల్లో, మీ తెలుగు ఎవరికీ కావాలి” అంది భార్యగారు.
“సరేలే.. వాడికా ఇంగ్లీషు కూడా రాదుగా.. నేను సంపాదించినదంతా ఖర్చు పెడుతూ బలాదూర్ తిరుగుళ్ళు తిరుగుతున్నాడు..”
“అందుకేగా నేనింతగా మొత్తుకునేది” అంది తల్లిగారు.
“మరి నటన గురించి చదువుకున్నాడా చిత్రాల్లో నటించటానికి, లేదే! ముఖం కవళికలు పాత్రోచితంగా చూపించగలడా? అదీ తెలీదు” కసురుకున్నాడు ఆనాటి నట, నిర్మాత, దర్శకుడు.
“మీ కాలంనాటి మిగతా నటులు వాళ్ళ పిల్లలని ఏ గుడ్డూ లేకపోయినా హీరోలుగా చేయలేదూ.. అలాగే వీడూనూ, కనీసం వీడు చూడటానికి వాళ్ళ కన్నా అందంగా వుంటాడు. అనకూడదు కానీ, వాళ్లల్లో కొంతమంది ముఖాల్ని చూడలేం కూడాను” అని చెంపలు వేసుకుంది, ‘అపచారం దేవుడిచ్చిన ముఖాన్ని అలా అనకూడదు’ అంటూ.
“కాకి పిల్ల కాకికి ముద్దు. చూద్దాంలే” అన్నాడు.
“ఏమిటి చూసేది? ముహూర్తమా. మనవాడికి సినిమాల్లో చేరటానికి కులమూ, గోత్రమూ వున్నాయి, కొంచెం లావుగా వున్నా, పొడుగ్గా అందంగా వుంటాడు. మాటలదేముంది, ఎవరో ఒకళ్ళు చెబుతారు. మీరు హీరోలకి పాటలు పాడించటంలా, అలానే. ఏ సుబ్బారావునో, సుబ్బరమన్యాన్నో పెట్టుకోండి. డైలాగ్స్ చెబుతారు. ముఖంలో ఫీలింగులా.. ఫీలింగులు అఖ్కర్లేని కథలే తీసుకోండి. ఫైటింగులు చేసేవాళ్ళున్నారు. డాన్సులు చేసేవాళ్ళున్నారు. అన్నీ వాళ్ళే చేస్తారు.. మధ్యే మధ్యే వీడి ముఖం చూపించండి చాలు” అంది భార్యగారు.
ఆయన పెద్దగా నవ్వి అన్నాడు, “భలే చెప్పావే! నువ్వే దర్శకత్వం చేసేయరాదూ!” అన్నాడు.
భార్యగారు నవ్వి అంది, “అవకాశం ఇవ్వాలే కానీ అదొక విద్యా? ముందు మనవాడి సంగతి చూడండి”
“తీయవచ్చు కానీ, ఆ సినిమా ఆడకపోతే.. మనకెందుకు ఆ డబ్బు నష్టం. ఫలానా నిర్మాత నాకు ఒక పెద్ద చెంచాగాడు. అతని చేత డబ్బులు పెట్టిద్దాం. పొతే వాడే పోతాడు. పొరపాటున డబ్బులు వస్తే, ఇద్దరం పంచుకోవచ్చు...” అన్నాడు ఆనాటి నట, నిర్మాత, దర్శకుడు.
తర్వాత కథ.. భవిష్యత్తులో ఆరేళ్ళ తర్వాత...
మన కుర్రగాడు పెద్ద హీరో అయిపోయాడు. పెద్దాయన అభిమానులు, వారి కొడుకులు, కూతుళ్ళూ కూడా మన పెద్ద హీరోకి అభిమానులయారు. కొన్ని కుల సంఘాలు కూడా మద్దతు ఇచ్చి, అతనికి హీరో హారతి పట్టాయి. నిర్మాతలు డబ్బులు నష్టపోతున్నా, సినిమా హాళ్ళు అద్దెకి తీసుకుని, ఇంకేమీ మంచి చిత్రాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
బ్రహ్మ “అదేమిటి. వాళ్ళు ఇంకే మంచి చిత్రాలు రాకుండా ఎలా జాగ్రత్త పడతారు?” అన్నాడు.
నారదుడు నవ్వి, “అదే బ్రహ్మ రాతని వాళ్ళు ప్రజానుగుణంగా తిరగ వ్రాసిన విధానం. ఇక చిన్న గీతని పెద్దదిగా చూపించాలంటే, దాని పక్కన ఇక ఏ పెద్ద గీతా రాకుండా చేయటం. అది ఆనాటి నట, నిర్మాత, దర్శకుల ఐదు కుటుంబాల మాఫియా చేస్తున్న పని. మంచి సినిమాలు, మంచి నటులతో ఎవరైనా తీస్తే, అది విడుదల అవకుండా, దేశం మొత్తం మీద సినిమాహాళ్ళను అద్దెకు తీసుకుని వాళ్లకి అందుబాటులో లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే వాళ్ళు చేస్తున్న పని!” అన్నాడు.
బ్రహ్మ మాట్లాడలేదు. తను వ్రాసిన నొసటి రాతలు, మళ్ళీ ఒకసారి తిరగ రాస్తే మంచిదేమోనని మౌనంగా ఆలోచిస్తున్నాడు.
సరస్వతీదేవి, నారదుడిని చూసి, పుత్రోత్సాహంతో ఇంకొక కీర్తన మొదలుపెట్టింది.