ధారావాహికలు
మరీచికలు
- వెంపటి హేమ

(గత సంచిక తరువాయి)

విజయం మనిషికి తృప్తి నిస్తుందనుకోడం కూడా భ్రమే! ఒకొక్కప్పుడు ఆ విజయమే మనిషిలోని ఆకాంక్షను ఉత్తేజపరచి, ఉజ్వల భవిష్యత్తుని చేరుకునేందుకై కొత్త పుంతలు వెతికేందుకు దోహదం ఔతుంది.

సరిగ్గా అదే జరిగింది అమరేంద్ర విషయంలో. అతని మేధ; తమ బిజినెస్ కి అనుబంధంగా కొనసాగే, మరో ఉభయతారకమైన కొత్త ప్రోజెక్టు ఏదైనా ఉందా - అని ఆలోచించసాగింది. నిజంగా అలాంటిదేదైనా కనిపించాలేగాని, దానికి సత్యదేవ్ మిత్రాగారి ఆమోదముద్ర తప్పకుండా దొరుకుతుంది - అన్న నమ్మకం అతనికి ఉంది. "న్యూ ప్రోజెక్టు" కోసం కొత్తపుంతలను గాలిస్తున్న అతని మేధ ఇప్పుడు ఒకచోట ఆగింది.

పూర్వం రాజులు రాజ్యాలు ఏలిన రోజుల్లో, వాళ్ళు కళాపోషకులుగా ఉండి, లలిత కళలను నమ్ముకుని బ్రతికే కళాకారులకు గౌరవ మర్యాదలనిచ్చి, వాళ్ళ పోషణ భారాన్ని తమపై వేసుకునీవారు. ఆ రోజుల్లో రాజులు ఒకరితో ఒకరు పోటీలుపడి మరీ, లలితకళల అభివృద్ధికి దోహదం చేసీవారు. ఆ రాజుల హయాంలో భారతీయ కళలు, తద్వారా భారతీయ సంస్కృతి కూడా ఉఛ్ఛస్థితిలో ఉండేవి.

అలనాటి మైసూరు సంస్థానంలో ఇతర కళాకారులతోపాటుగా చందనపు చెక్కలతో అందమైన ఆకృతులు చెక్కే దారుశిల్పులు కూడా ఉండేవారు. చందనతైల సౌరభంతోపాటుగా, ఈ సువాసనలు వెదజల్లే దారు శిల్పాలుకూడా ప్రపంచ ప్రసిద్ది గాంచాయి. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల కూడలి ప్రాంతంలో ఉన్న మలయపర్వతసానువుల్లో దొరికే శ్రేష్టమైన చందనపు కట్టె మీద అతి సున్నితమైన నగిషీ పని చెయ్యగల నేర్పున్న శిల్పుల కుటుంబాలు ఎన్నో ఉండేవి అక్కడ.

అటువంటి దారుశిల్పుల కుటుంబాల్లో ఒకటి విమలాచార్యది. ఆతను, అతని తమ్ముళ్ళు చక్కగా కళాసేవ చేస్తూ, రాజాశ్రయంలో హాయిగా బ్రతికేవారు. దారుశిల్ప కళ వాళ్ళకు ఆస్తిని పట్టి ఉన్న కులవిద్య. ఆ అన్నదమ్ములు నలుగురూ అత్యంత నేర్పరులైన దారు శిల్పులు. కాని ఆ కుటుంబాన్నికాటేసింది కాలం ! మన దేశానికి స్వతంత్రం వచ్చాక, సంస్థానాధిపతులంతా చూస్తూండగా కేవలం మనోవర్తిదారులుగా మారిపోయారు. వారిని ఆశ్రయించి బ్రతుకుతున్న కళాకారులు బికారులయ్యారు. కనతికాలంలో కళాపోషణ అన్నదే కనుమరు గయ్యింది. ఎందరో కళాకారులు, కుటుంబాల్ని వెంటతీసుకుని, బతుకుతెరువును వెతుక్కుంటూ దేశదిమ్మరులయ్యారు.

పూవులమ్మిన తావున కట్టెలు అమ్ముకుని బ్రతకలేక వాళ్ళు దేశం నలుమూలలకూ వలసపోయారు. నిర్వాసితులైన ఆ కళాకారులు, అడ్డమైన పనులూ చేస్తూ బతుకుతెరువును వెతుక్కుంటూ, బడుగులై తిరుగుతున్నారు. అలాంటి కుటుంబాల్లో విమలాచార్య కుటుంబం కూడా ఒకటి అయ్యింది. కూటికికూడా కరువైన దు:స్థితిలో వాళ్ళు, ఉన్న ఊరును వదలి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానీ నగరమైన హైదరాబాదుకి చేరుకున్నారు. కర్రను మలచి దాన్నొక కళా ఖండంగా మార్చగల సున్నితమైన చేతులతో వాళ్ళు ఇప్పుడు, ఘటకేసర్లో ఉన్న మైత్రీ వారి కార్ఖానాలో సామాన్య వడ్రంగు లందరిలాగే చెక్కలను చెక్కుతూ, చిత్రికపని చేస్తూ బ్రతుకు బండిని లాగుతూ ఉన్నారు. వారి పరిస్థితి గురించి విన్న అమరేంద్ర వాళ్ళకి ఎలాగైనా సాయం చెయ్యాలి అనుకున్నాడు.

విమలాచార్య కుటుంబపు దీనగాధ విని అమరేంద్ర చాలా బాధపడ్డాడు. ఎంతో నేర్పరులైన దారుశిల్పుల కుటుంబం అలా పొట్టకూటి కోసం అగచాట్లు పడుతూ, సాధారణ వడ్రంగుల్లా బ్రతకడం అన్నది అతనికి నచ్చలేదు. తనకు చేరువగా వచ్చిన ఈ ఒక్క కుటుంబానికైనా తాను సాయం చెయ్యగల్గితే ఎంతో బాగుంటుంది - అనుకున్నాడు. వెంటనే అతని మెదడులో ఒక స్పార్కు తళుక్కున మెరిసింది. తాను అనుకున్నకొత్త ప్రోజెక్టును విమలాచార్యకు శిల్పకళలో ఉన్న ప్రజ్ఞ ద్వారా సాధించడం ఉభయ తారకంగా ఉంటుంది - అన్న భావం కలిగింది అతనికి.

సుందరభారతదేశాన్ని చూసిపోవాలని వచ్చే విదేశీ యాత్రీకుల సంఖ్య నా నాటికీ పెరుగుతోంది అన్న దినపత్రికలోని వార్త అమరేంద్రకి సమయానికి గుర్తువచ్చింది. కాశీయాత్రకు పోయినవాళ్ళు విధిగా కాశీ తోరాల్ని, గంగాజలాన్ని వెంటతీసుకు వచ్చినట్లే, ఆ విదేశీ యాత్రికులు కూడా ఇక్కడినుండి ఏదో ఒక వస్తువుని జ్ఞాపికగా తమ వెంట పట్టుకుపోవాలనుకోడం సహజం. గంధపు చెక్కలతో చేసిన చిన్నచిన్న కళాకృతులు జ్ఞాపికలుగా చక్కగా పనికివస్తాయి అనిపించింది అతనికి. వాటి తయారీనే మైత్రీ సంస్థకు అనుబంధంగా, తనొక ప్రోజెక్టుగా తీసుకున్ననాడు , విమలాచార్యకు తమ్ముళ్ళకు తగినపని దొరికి, వాళ్ళు సంతోషంగా బ్రతకడానికి దోహదం ఔతుంది. అంతేకాదు, తనను కష్టసమయంలో ఆదుకుని, తన అభివృద్ధికి సహాయపడిన మైత్రీ సంస్థ పేరు కూడా జగత్ప్రసిద్ధమౌతుంది. పరిమళాలు వెదజల్లే ఆ జ్ఞాపికల ద్వారా ఒక భారతీయకళా సౌరభం కూడా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. "వెరీ గుడ్ ఐడియా" అనుకున్నాడు అమరేంద్ర.

ఒక అందమైన ఊహ మనసులోకి రాగానే సరిపోదు, ఆ అందం బైటపడాలంటే దాన్ని ఆచరణలోకి తేవలసి ఉంటుంది! చందనపు చెక్కతో జ్ఞాపికలుగా పనికివచ్చే చిరుశిల్పాలు తయారు చెయ్యాలన్నా దానికోసం చాలా కృషి, డబ్బు కూడా అవసరం ఉంటుంది. అంతేకాదు, ఈ ప్రోజెక్టు మైత్రీ సంస్థకు అనుబంధంగా మొదలుపెట్టాలంటే, ముందు ముఖ్యంగా సత్యదేవ్ మిత్రా గారి అనుమతి తీసుకోవాలి. త్వరలో ఆరంభించబోయే కొత్త ప్రాజెక్టుకి నాందిగా ముందా పని చెయ్యడం మంచిది - అనుకున్నాడు అమర్. ఇక ఆలస్యం చెయ్యకుండా ఈ రాత్రికే ఆయనతో ఫోనులో సంప్రదించడం బాగుంటుందని నిశ్చయించుకున్నాడు అమర్ .

* * *

చందనపు చెట్లు ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఉన్నాయిగాని, అవేమీ భారతదేశంలోని మలయపర్వత సానువుల్లో ఉన్న చందనమంత శ్రేష్ఠ మైనవి కావు. సువాసనలో, ఎక్కువ చందన తైలం ఇవ్వడంలో మరేవీ వీటికి దీటు కావు. దారుశిల్పుల చేతిలో మెత్తగా, వెన్నలా కరిగిపోయి, చక్కని శిల్పాకృతులు దాల్చడంలో కూడా వీటికి ఇవే సాటి అని చెప్పవచ్చు. గంధపు చెట్లు ఇన్ని సుగుణాలు కలిగి ఉండడంవల్లనే వీటిని దైవాంశ గల చెట్లుగా భావిస్తారు భారతీయులు.

ఈ చెట్లు దట్టంగా ఉన్న ఆకుపచ్చని ఆకులతో, చిన్నచిన్న ఎర్రని పూలతో ఉండి, పెద్దపెద్ద చెట్లుగా, మానుకట్టి పెరుగుతాయి. పదహారేళ్ళ వయసు వచ్చేవరకు వీటి చెక్కకు తగినంత చందనపు పరిమళం రాదు. మాను మధ్యనుండే చేవ (core) సరిగా ఏర్పడకపోడంవల్ల వీటికి ఇంకా చందన తైలాన్నిఇవ్వగల శక్తి కూడా ఉండదు. పదహారునుండి, అరవై ఏళ్ళవరకు వీటి మాను మధ్యలో ఉన్న చేవ నుండి చందనతైలం ఊరుతుంది. పరువంలో ఉన్న చెట్టును పడగొట్టి, దుంగలుగా కోసి, వాటి "కోర్" నుండి ప్రత్యేక పద్దతిలో ఈ చందన తైలాన్ని తీస్తారు. చెట్టు వయసు 16 - 60 ఏళ్ళ మధ్య వయసులో ఉండగా గంధపుచెక్కకూడా మంచి వాసనతో ఉంటుంది.

చందనపు వృక్షాలలో సువాసనలు వెదజల్లేవే కాకుండా, అసలు ఏ సుగంధమూ లేని జాతులుకూడా ఉన్నాయి. వీటికి సువాసన లేకపోయినా చెక్క మృదువుగా ఉండి, చెక్కడపు పనులకు అనువుగా ఉంటుంది.

మనదేశంలో చందనపు చెక్కను అరగదీసి ఆ గంధాన్ని దేవతార్చనకు వాడతారు. పూర్వకాలం నుండీ చందనాన్ని సౌందర్య సాధనంగా, ఓషధిగా, భక్తునికి భగవంతునితో అనుసంధాన పరచే ఉపకరణంగా, ఇంకా ఎన్నో విధాలుగా కూడా వాడతారు. మన పురాణాలలో , కావ్యాలలో కూడా చందనపు ప్రసక్తి కనిపిస్తుంది. చందనపు పేస్టులో కస్తూరి రంగరించి, రసికులైన సంపన్నులు, దానితో శరీరమంతా, ఈ రోజుల్లో పచ్చబొట్లు (టాటూలు ) వేయించుకున్నట్లు, రకరకాల చిత్రాలు ఓపిగ్గా వేయించుకునీవారుట! వాటి పేరే "మకరికా పత్రాలు!" చందనపు చెట్టు మొత్తం తన అవసరాలకు వాడుకుంటున్నాడు మానవుడు. చందనానికి వ్యర్ధాలు అన్నవి లేవు. కొందరు, రంపం క్రింద పొట్టుగా రాలినది కూడా, అగరవత్తులు తయారు చెయ్యడంలో ఉపయోగించడానికి కొనుక్కుని మహద్భాగ్యంగా పట్టుకుపోతారు.

చందనం ఇంత విలువైనది కావడంవల్లనే దాని అమ్మకాన్ని ప్రభుత్వం తనచేతుల్లోకి తీసుకుంది. బంగారం మాదిరిగానే చందనాన్ని కూడా, ఆఖరు గ్రాం వరకూ లెక్కకట్టి మరీ అమ్ముతూంటారు. అంత విలువైనది చందన వృక్షం! ఎప్పుడైతే చందనపు చెక్కలని వ్యాపారసాధనంగా వాడుకోవాలనుకున్నాడో , ఆ వెంటనే లైబ్రరీకి వెళ్ళి చందనపు చెట్లను గురించి ఎన్సైక్లోపీడియాలో, ఇంకా ఇతర పుస్తకాల్లో రాసివున్న సమాచారాన్ని చదివి అర్ధంచేసుకుని వచ్చాడు అమరేంద్ర. ఆ తరవాత దాని విలువని గురించి మిత్రాగారికి చెప్పి, తన మనసులోకి వచ్చిన ప్రోజెక్టు ఐడియాని వివరించాడు. పనిలోపనిగా విమలాచార్యను గురించి కూడా ఆయనకు చెప్పాడు. ఆపైన కొత్తప్రోజెక్టు విషయంలో ఆయన అభిప్రాయాన్ని అడిగాడు.

సత్యదేవ్ మిత్రాగారికి అమర్ని గురించి బాగా తెలుసు. అతనిని తన దగ్గరే ఉంచుకుని, మూడేళ్ళపాటు తనే అతన్ని ట్రైన్ చేసారేమో, అతని గుణగణాలూ, మంచి చెడ్డలూ ఆయనకు బాగా తెలుసు. అతని తెలివితేటల మీద ఆయనకు గొప్ప నమ్మకం ఉంది. అమరేంద్ర ఏమైనా చెప్పాలనుకుంటే, దాని పూర్వాపరాలన్నీ బాగా తరచి చూశాకే తనకు చెపుతాడన్నది ఆయన విశ్వాసం. తనకు అతడి పైన ఉన్న నమ్మకాన్ని అమరేంద్ర ఎట్టి పరిస్థితిలోనూ పోగొట్టుకోడన్నది కూడా ఆయనకు తెలుసు. ఆ అభిప్రాయంతోనే ఆయన అమర్ తలపెట్టిన ప్రోజెక్టుకి తను పరిపూర్ణమైన ఆమోదముద్ర వేసెయ్యడమే కాకుండా, అది విజయవంతమవ్వడానికి తనవంతు సహకారాన్ని తాను అందిస్తానని కూడా వాగ్దానం చేసేశారు.

తక్షణం విమలాచార్యకు పిలుపు వెళ్ళింది. వెంటనే వచ్చేడు అతడు. అతన్ని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని కుర్చీ చూపించాడు అమరేంద్ర. కాని అతడు కూర్చోలేదు. బాస్ ఎదుట నిలబడ్డానికే భయంగా ఉండి అతనికి.

"వణ్ణక్కం సారూ! ఎదుక్కు పిల్సి పూడ్చినారు, సొల్లూంగా" అన్నాడు విమలాచార్య చేతులు జోడించి, నమస్కారపూర్వకంగా, తనకు చేతైన తెలుగులో తమిళం జోడించి.

"ఆచార్యా! మీరు కళా మూర్తులు, మాకు పూజనీయులు. మేము మిమ్మల్ని గౌరవించాలి. మీరు కూర్చోకపోతే మేమూ నిలబడాల్సి ఉంటుంది" అన్నాడు అమర్ ఎంతో వినయంగా.

చాలా బీదగా మురికిగా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎడల బాసు అంత వినయం చూపిస్తున్నాడంటే ..... అక్కడే ఉన్న యామిని వాళ్ళని ఆశ్చర్యంగా చూసింది.

"ఈ వేళ గురుడి వ్యక్తిత్వంలోని మరో కోణం దర్శనమిస్తుంది కాబోలు" అనుకుంది.

విమలాచార్య తన ఒంటిమీదున్న మాసిన ధోవతి, చిరిగిన జుబ్బా చూసుకుని, తను కూర్చోవడం వల్ల మెరిసే ఆ కుషన్ కవర్లు ఎక్కడ మాసిపోతాయోనని భయపడ్డ వాడిలా వాటివైపు భయం భయంగా చూశాడు. అమరేంద్ర మళ్ళీ హెచ్చరించదంతో, తప్పనిసరిగా ముళ్ళమీద కూర్చున్నట్లు, ఇబ్బంది పడుతూ కుర్చీ చివరిభాగాన్ని ఆనుకుని,గోడకుర్చీ వేసినట్లుగా కూర్చున్నాడు.

"విమలాచారి గారూ! మీరొక దారుశిల్పి అని తెలిశాక, మీరలా ఒక సామాన్య వడ్రంగిలా పనిచెయ్యడం నాకు నచ్చలేదు. మీరు మళ్ళీ చందనపు చెక్కతో బొమ్మలు చెక్కాలని నా కోరిక. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ మేము చేస్తాము. మీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటాము. మీరు మళ్ళీ ఆ పని మొదలుపెట్టాలి" అన్నాడు అమరేంద్ర.
విమలాచార్య ముఖం వికసించింది. "నిండా సంతోషం సారువాడూ! ఖండిప్పా నమ్మ సగకారం ఉంగళుక్కు నిండా ఉంటాది" అన్నాడు.

అతడు ఏం చెప్పాడో తెలియక వెఱ్ఱి మొహం పెట్టింది యామిని. అది కనిపెట్టిన విమలాచార్య బాగా నొచ్చుకున్నాడు. .

"అడడడా అమ్మణ్ణీ! నమ్మ పైత్తెకారి తెలుంగు ఉంగళుక్కు పుడిక్క ఇల్లెయా?" అని అడిగాడు మరింత ఇబ్బందిగా మొహం పెట్టి.

అమరేంద్ర చిన్నగా నవ్వి, "మీమాట నాకు తెలుస్తోంది. నేను ఆమెకు చెపుతా. మా మాట మీకు అర్థమౌతోంది కదా - అదిచాలు" అన్నాడు.

"ఆమ అప్పా! తెలుంగు ఎనక్కు నల్ల పురియుం. నాన్ తెలుంగు మగన్ దా ! నరియ నాళ్ మున్నాల నమ్మ తాత్తాకు అప్ప, తమిళ్నాడుక్కు పొయి పూడ్సిండు. "

"మీరీ పనికి ఒప్పుకున్నట్లేనా ఆచారిగారూ? నేను ఏర్పాట్లు చెయ్యడం మొదలుపెట్టనా?" అని అడిగాడు అమరేంద్ర.
"ఆమ సార్వాడూ! నాందా రెడీ! రొంబ నన్రి అప్పా, రొంబ నన్న్రి!"

"సర్! ఇలామీలో మీరు మాటాడేసుకుంటే నేను ఔట్ ! ఈ ప్రోజెక్టుతో నాకేం సంబంధం ఉండదా" అని అడిగింది యామిని.

అమర్ నవ్వాడు. " ఇంకానయం! మనం కొంతవరకూ అదృష్ట వంతులం. కొంచెం రౌండెబవుట్ ఐనా కమ్యూనికేషన్ కి ఒక దారి ఉంది. అచారిగారి మాటలు నాకు అర్థమౌతాయి. నా చిన్నప్పుడు మా నాన్న మద్రాసు లో పనిచేశారు. నేను తమిళ్ బడి కి వెళ్ళి చడువుకున్నా. ఇక ఆచారిగారు ఆంధ్రావర్. సో, ఆయనకూ తెలుగు అర్థమౌతుంది. ఇక నీకంటావా, అవసరమైనంతవరకూ నేను చెపుతాను సరా?"

"ఆమ సర్! రొంబ నన్రి" అంది యామిని సీరియస్ గా మొహంపెట్టి. . అమర్కి ఆ కొంటెతనం నవ్వుతెప్పించింది, కాని బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు.

అమరేంద్ర ఆచారి వైపుకి తిరిగి, "ఆచారిగారూ! ఇది ప్రారంభం మాత్రమే, చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. ముందుగా మనం చందనపు చెక్క కొనడానికి గవర్నమెంట్ దగ్గర పర్మిట్ తీసుకోవాలి. మంచి చందనం ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది వగైరాలు మీరు చూసుకోవాలి. ముందు మనం కర్ర కొనాలి, ఆ తరవాత మీరు, మీ ప్రతిభనంతా ఉపయోగించి దానిని బొమ్మలుగా చెక్కాలి. "

విమలాచారి మొహంలో సంతోషం కనిపించింది." నిండా సంతోషందా! నమ్మ బొమ్మై ఉంగళుక్కు రొంబ పుడిక్కుం. నమ్మ కుడుంబత్తిల్ ఎల్లోరు కళైవర్గళ్. " అన్నాడు విమలాచార్య పొంగిపోతూ.

" మీకు నచ్చితే ఈ రోజే మీరు పనిలో చేరిపోయినట్లు రాసుకుందాము. మీకొక వెయ్యి రూపాయిలు అడ్వాన్సుగా ఇస్తాము. మీకు జీతం నెలకి ఐదు వందలు. ఆ తరవాత మీ పనినిబట్టి కమీషన్ వస్తుంది. ఈ పనికి తలైవర్ మీరే. మీరే నడిపించాలి దీన్ని. అవసరాన్నిబట్టి పనివాళ్ళను పెట్టుకోవచ్చుమీరు. వాళ్ళ జీతం కంపెనీ ఇస్తుంది. " అంటూ జేబులోంచి వేలెట్ తీసి వెయ్యిరూపాయిలు లెక్కించి, వాటిని విమలాచార్యకు ఇచ్చాదు అమరేంద్ర ఈ మధ్యకాలంలో అంతడబ్బు చూసి ఉండని విమలాచార్య తనకు పట్టిన అదృష్టానికి ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు. రెండు చేతులూ తలపైకంతా ఎత్తి అమర్ కి నమస్కరిస్తూ, "రొబ నన్రి! అప్పా, రొంబ నన్రి" అంటూ కృతజ్ఞత తలమునకలు కాగా గగ్గోలుపడిపోయాడు.

ఆ డబ్బు అతనికి ఇచ్చి, " మీరు ఈమెతో వెళ్ళండి. కొన్ని ఆఫీసు ఫార్మాలిటీలు ఉన్నాయి, అవి మీరు పూర్తిచెయ్యాలి" అన్నాడు అమర్.

యామిని ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసింది. అతని పేరు, తండ్రిపేరు, స్వగ్రామం వగైరా వివరాలన్నీ నోట్ చేసుకుని, ఆతనికి ఎంప్లోయిమెంటు ఆర్డర్ కూడా టైప్ చేసి బాస్ చేత సంతకం చేయించి, అఫీస్ స్టాంపువేసి ఒకకాపీ అతనికి ఇచ్చి,.మరొక కాపీ ఫైల్ చేసింది.

"వణ్ణక్కం అమ్మణ్ణీ! పోయి పూడుస్తును" అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు విమలాచార్య.

* * *

ఆ వీకెండ్ ఇంటికి వెళుతూ యామిని చెక్కుబుక్కు వెంట తీసుకువెళ్ళింది. ఉద్యోగంలో చేరినలగాయితూ కూడబెట్టిన కొంచెం కాకుండా, ప్రమోషన్ తరవాత డిపాజిట్ చేసిన శాలరీహైక్ - అంతా కలిపి సుమారు ఏడెనిమిది వేలు పోగయ్యాయి బ్యాంకులో! యామిని వెంటనే సుదర్శనం బాకీ సగమైనా తీర్చెయ్యాలి - అనుకుంది.
రాత్రి భోజనాలు అయ్యాక, తండ్రిదగ్గర కూర్చుని కబుర్లు చెపుతూ ఆ విషయం తండ్రి చెవిని వేసింది యామిని. కూతురి ప్రయోజకత్వానికి విశ్వనాధం చాలా సంతోషించాడు.

వెంటనే, "ఆలస్యం చెయ్యొద్దు, రేపే నారాయణచేత కబురుపంపుదాం" అన్నాడు విశ్వనాధం, కూతురు తలపై చెయ్యివేసి ఆప్యాయంగా నిమురుతూ.

విశ్వనాధానికి పడుకునే వేళవ్వడంతో, యామిని ఆయన్ని పడుకోమని, ఆయన కళ్ళు మూసుకున్నాక, దుప్పటీ కప్పి అక్కడనుండి తన గదికి నడిచింది.

అక్కడ మంచం మీద పడుకుని దొల్లుతూ, యామిని రాకకోసం ఎదురు చూస్తోంది వకుళ. యామినిని చూడగానే అంది, "చెప్పాల్సిన విశేషాలు ఈవేళ చాలా ఉన్నాయి, గమ్మునరా యామినీ" అంది, యామిని కోసం చోటుచేసి పక్కకి జరుగుతూ.

" ఏమిటా విశేషాలు? అంతా బాగున్నారు కదా" అని అడుగుతూ వచ్చి వకుళ పక్కన చేరింది యామిని.

" సుధాకర్ ఇంటర్వ్యూలో నెగ్గాడుట ...... "

"ఏమిటేమిటీ! చూస్తూండగా ఇట్టే సుధ కలెక్టరైపోయాడా" ఆశ్చర్యంగా కేకపెట్టింది యామిని.

"అబ్బా! ముందు నన్ను చెప్పనియ్యి ! IAS కి కాదు IPSకి సెలెక్టు అయ్యాడు. హైదరబాదు పోలీస్ అకాడమీలో ట్రయినింగుకి పంపించారుట. ప్రొబేషనరీ ఆఫీసరుగా త్వరలోనే మనూరుకి వచ్చినా రావచ్చు! ఆగు, మాటాడకు, ఇంకొక ముక్క ఉంది - అది కూడా చెప్పనియ్యి! గురూ అంకుల్ అమెరికా కూతురు దగ్గరకు వెడుతున్నారుట. తల్లి సంవత్సరీకాలకని వచ్చిన చిన్నకూతురు తండ్రిని తన వెంట తిరిగి రావడానికి ఐదారు నెలలు పట్టవచ్చుట! ఇదీ సంగతి."

"మరి బిజినెస్సు?"

" అది పెద్దల్లుడు చూసుకుంటాడుట! కొడుక్కి తండ్రి బిజినెస్ మీద మక్కువ లేదన్నది తెలుస్తూనే ఉందిగా ......" అంది వకుళ.

"కాని, సుధాకర్ ని మెచ్చుకోవాలి. మొత్తానికి పట్టుపట్టి సాధించాడు, అసాధ్యుడే! హేట్సాఫ్ టు హిం!" క్షణమాగి, "ఇంక, మాధవీ వాళ్ళూ ఎలా ఉన్నారు" అని అడిగింది యామిని.

"అంతా బాగా ఉన్నారు. సుచరిత అత్తవారు ఆమెను పుట్టింటికి తరిమేశారు, తెలుసా! కూతుర్ని చూసి అన్నపూర్ణమ్మ గారు ఫిట్టొచ్చి పడిపోయారు. మళ్ళీ ఆవిడ మంచమెక్కారు!"

"ఇదేమి ఘోరకలి! సుచి కేమయ్యింది? ఎందుకు పంపాల్సొచ్చిందిట పుట్టింటికి! మొన్న మొన్నలా ఉంది - మాధవి వచ్చి, సుచి గర్భవతి అయ్యిందంటూ మనందరికీ స్వీట్లు ఇచ్చి వెళ్ళింది కదా , అంతలో వాళ్ళకు ఏమొచ్చి పడిందిట?"

" ఇది వచ్చిపడ్డ కష్టం కాదు యామినీ! తెచ్చిపెట్టుకున్న కష్టం.సోమయాజులుగారు ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారుట. భాగ్యవంతుల సంబంధం - అంటూ, కట్నకానుకలు దండిగా ముట్టజెప్పి, సుచరితనిచ్చి పెళ్ళిచేశారు కదా! సరదా సరదా అంటూ పెళ్ళిలో వాళ్ళు పెళ్ళికొడుకుని అలకపానుపు ఎక్కించారు. అంతా ఉట్టుట్టినే అడుగుతున్నాడంటూ అతనిచేత రాయల్ ఎన్ ఫీల్డు - మోటారు సైకిల్ అడిగించారు. అంతవరకూ బాగానే ఉంది. ఫరవాలేదు. అంతా సరదాకే అంటూ సోమయాజులుగారిని బేలుపుచ్చి, "అలాగే ఇస్తాను" అని ఆయనచేత అనిపించారు కదా! ఈ వెర్రి బ్రాహ్మడు వాళ్ళ మాటల మాయలోపడి సరదాకి "సరే, ఇస్తాను" అనేశారుగా ..... ఇప్పుడదే పీకకి గట్టిగా చుట్టుకుంది ........ "

"ఏమిటీ, ఇంత జరిగిందా! నాకు తెలియనే తెలియదు, ఎందుకని?"

"బాగానే ఉంది నీ వరస! పనుందంటూ నువ్వు పెళ్లి అయిపోగానే హైదరాబాదుకి వెళ్ళిపోయావు కదా! అందుకని ఈ ఫార్సు నువ్వు మిస్సయ్యావు!ఇంతవరకూ సుచరిత కాపురం బాగానే గడిచిందిట! మరి ఇప్పుడు ఏమయ్యిందో ఏమో గాని ఈ మడతపేచీ లేవదీసి, సుచిని ఇక్కడకు పంపేశారు! ఈ వారంలో జరిగిందిది!"

"ఔనుకదూ!"

" ఔను! పెళ్ళిలో అందరం ఇదంతా వేడుకే అనుకున్నాము. కాని, ఇప్పుడు వాళ్ళంటున్నారుటా - "మీ నాన్న ఇస్తానని ఒప్పుకున్నాడు కదా, ఇవ్వాల్సిందే, అది తెస్తేనే నిన్ను మళ్ళీ ఇంట్లోకి రానిచ్చేది"అని! అంతా ఆలగోల, బాలగోల! ఇదేమో, "నాన్నా బైక్ ఎప్పుడు కొంటావు, ఎప్పుడు నన్ను మా అత్తారింటికి పంపిస్తావు" అంటూ ఒకే నసట! మురళీ మీ నాన్నతో చెపుతూంటే విన్నా."

"ఆడపిల్లల్లోని వీక్ నెస్ ఇదే! ఒకసారి అత్తారింటికి వెళ్ళారా... ఇక పుట్టిల్లుని పట్టించుకోరు. ఉండు మనం రేపు వెడతాము కదా, సుచరిత కింత గడ్డి పెట్టి వద్దామ్ .... ! డబ్బున్నవాళ్ళకే డబ్బాశ ఎక్కువ! ఏం, వాళ్ళ అబ్బాయికి కావాలంటే వాళ్ళు కొనలేరా ఏమిటి ఒక మోటారు సైకిలు? పిల్లనిచ్చినవాడినే బైక్ కూడా ఇమ్మనడం ఏమిటి చెప్పు ?" "

"ఆవేశపడకు యామినీ! ఇలాంటివన్నీ చాలా సున్నితమైన విషయాలు. మనం కల్పించుకుంటే, సుచి మనసుని నొప్పించి, దానితో విరోధం తెచ్చుకోగలమేమో గాని, ఏమీ సానుకూలపరచలేము. "

"అంతేనంటావా వకుళా! గొప్ప సంబంధ మని ఆశపడితే, గొప్పవాళ్ళుకోరే గొంతెమ్మ కోరికలు మరీ గొప్పగా ఉంటాయి మరి! సుచి అత్తవారు కూడా మనలా మధ్యతరగతి వాళ్ళే అయ్యివుంటే, అలకపానుపుమీద ఆ పెళ్ళికొడుకు రాయల్ ఎన్ఫీల్డు కాకుండా ర్యాలీ సైకిల్ అడిగి ఉండేవాడు కదా!"

"ఇలాంటి తికమకలు రాకూడదనే పెద్దవాళ్ళు, "కయ్యానికీ వియ్యానికీ కూడా ఉజ్జీ సరిగా ఉండాలి " అన్నారు." అంది వకుళ.

"అంతా ఐపోయింది. ఇప్పుడింక అలాంటి మాటలు మాటాడీ ప్రయోజనం ఏమీ లేదు. అదిప్పుడు ఉత్తిమనిషి కూడా కాదు! ఇక సోల్యూషన్ ఒక్కటే, ఇల్లు తాకట్టుపెట్టి డబ్బుతెచ్చి బైక్ కొనడమే" అంది యామిని. .

"నీకొచ్చిన ఈ ఆలోచన సోమయాజులుగారికీ వచ్చింది. కాని, పెళ్ళి కని ఇల్లు ఎప్పుడో సుదర్శనం దగ్గర తాకట్టుపెట్టారుట! ఆ ఇంటిమీదే ఇంకొంచెం డబ్బు ఇమ్మంటే, "ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చా, ఇక కుదరదు" అన్నాట్ట సుదర్శనం. "

"ఐతే సుచి బ్రతుకు ఇరకాటంలో పడిందన్నమాట! దాని అత్తవారు బొత్తిగా బుద్ధిహీనులనుకోవాలి! అంత భాగ్యం ఉన్నందుకు అవసరంలో ఉన్న నలుగురికి ఎంతో కొంత సాయపడడానికి బదులుగా, ఇలా ఐనవాళ్ళని ఏడిపించి డబ్బు పిండాలని చూస్తున్నారు! ఈ ధనదాహానికి అంతెక్కడ! ఛీ! ఏం మనుష్యులో! ఇక వాళ్ళకంత డబ్బు ఉండి ప్రయోజనం ఏమిటిట!"

"అబ్బ! ఇక చాలు, పడుకుందాం . సమస్యలెప్పుడూ సమస్యలుగానే ఉండిపోవు. ఏదో ఒక పరిష్కార మార్గం దొరక్కపోదులే. రేపా సంగతి చూద్దాంగాని, పడుకో యామినీ."

* * *

శనివారం మధ్యాహ్నం యామిని, వకుళ కలిసి సుచిని చూడడానికి సోమయాజులుగారి ఇంటికి వెళ్ళారు. మాధవి వాళ్ళని ప్రేమగా అహ్వానించి కూర్చో పెట్టింది. సుచరిత యామినిని కౌగిలించుకుని భోరున ఏడ్చింది. ఇంక వాళ్ళకు కుశలప్రశ్నలకి సందు దొరకనేలేదు. రేగిన జుట్టుతో, మాసిన చీరతో, ఏడ్చేడ్చి వాచిపోయిన కళ్ళతో అచ్చంగా మూర్తీభవించిన శోకంలా ఉంది సుచి! ఆరోనెల రావడంతో కడుపు కొంచెం ఎత్తుగా కనిపిస్తూ, ఆమె గర్భవతి అన్న విషయం చెప్పకుండానే తెలుస్తోంది.

ఏడుస్తూనే తనకు జరిగిన అన్యాయాన్ని స్నేహితురాలిముందు ఏకరువు పెడుతోంది సుచరిత. "యామినీ! నువ్వుచెప్పు, ఈ సంబంధం కావాలని నేనేమైనా కోరానా? పెద్దవాళ్ళు సంబంధం కుదిరిస్తే నేను పీటలమీద కూచుని, తలవంచి తాళి కట్టించుకున్నాను. వాళ్ళూ, వీళ్ళూ బాగానే ఉన్నారు, మధ్యలో నా బతుకు ఇలా ఇరకాటంలో పడింది. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం! మోటారు సైకిలు కొనడం వల్ల వీళ్ళకి పోయేది డబ్బు మాత్రమే! కొనకపోతే నాకు, నా బ్రతుకే నాశనమైపోతుంది. ఉట్టి మనిషిని కూడా కాను కదా! రేపు నాకు బిడ్డ పుట్టి బాగా పెరగాలి అంటే, దానికి తండ్రి కూడా ఉండాలి కదా! మా నాన్న మాట నిలబెట్టుకోకపోతే ఏదో ఓ నిందమోపి, నాకు విడాకులు ఇచ్చేస్తారుట, ఎంత గొప్పగా ఉందో చూడు! నీలా నేను కూడా పెద్ద చదువులు చదివి, ఉద్యోగం చేసుకుంటూ ఉంటే నాకీ తిప్పలు తప్పేవి కదా! ఎక్కడో ఒకచోట నేనో నా బిడ్డా సుఖంగా బ్రతికేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు గెంటేస్తే నేనో నాబిడ్డా తిరిగి ఇక్కడికే కదా చేరాలి! అంతకంటే మోటారు బైక్ కొనడమే నయం అంటే వీళ్ళెవరికీ అర్థం కావడంలేదు, చూడు" అంటూ ఇక మాటాడలేక వెక్కివెక్కి ఏద్చింది సుచి.

యామినికి మతిపోయింది. పచ్చి వెలక్కాయ గొంతుకలో అడ్డు పడ్డట్లయ్యింది . సుచిని దగ్గరగా తీసుకుని తనూ కంట తడిపెట్టింది. "పెళ్ళి అయ్యింది అన్నా సుఖంలేదు, పెళ్ళి అవ్వలేదన్నా సుఖంలేదు. ఏం ఆడబ్రతుకులోగానీ అడకత్తెరలో పోకచెక్కలాంటి బ్రరుకన్నమాట ! ఆడదానికి ఎన్నాళ్ళు ఈ దుర్దశ ! ఆడ, మగ అన్న వ్యత్యాసాలు పోయి "సంసారం" అంటే సమ సారం అనుకునే మంచిరోజు ఎప్పటికో" అనుకుంది బాధతో యామిని, తన మనసులో.
మాటాడడానికి ఏమీ తోచక, అసలు మాటాడకుండా ఒక ప్రేక్షకురాలిగా ఉండిపోయింది వకుళ. కొంతసేపు అక్కడ గడిపి, తను తెచ్చిన పంచతంత్రం బొమ్మల పుస్తకం మినీ కి ఇచ్చి, వెళ్ళడానికి లేచింది యామిని. వకుళ కూడా లేచింది ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేశారు.

ఇంటికి తిరిగివచ్చిన యామినిని పలకరించాడు విశ్వనాధం. "అమ్మలూ! సుచిని చూసి వచ్చావా, ఎలా ఉంది? చెంగుచెంగున గంతులేస్తూ లేడి కూనల్లా మీరిద్దరూ పరుగులు పెడుతూ, నట్టింట ఆడుకున్న రోజులు గుర్తొస్తున్నాయి నాకు! అప్పుడే సుచికి ఇన్ని తిప్పలా ... "అన్నాడు ఆయన విచారంగా.

"తిప్పలు, తిప్పలంటూ మనం ఏమీ చెయ్యకుండా చేతులు ముడుచుకుని కూచుంటే, ఆ తిప్పలేవో తెగ బలిసి, మనల్ని ఇంకా ఇంకా తిప్పలు పెట్టకుండా వదులుతాయా ఏమిటి ? ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి గాని" ఉక్రోషంగా.

"మురళీ ఏమీ ఊరికే కూచోలేదు. మాధవి కూడా తన నగలు తీసి ఇచ్చింది, అమ్మి డబ్బు వాడుకోమని. దొరికినంత అప్పూచేశారు. ఇంకా కొంచెం డబ్బు తక్కువయ్యిందిట."

"నాన్నా! నాకో ఆలోచన వచ్చింది, నీకూ నచ్చితే అలా చేద్దాం, ఏమంటావు?"

"అంత ఉపోద్ఘాతం ఎందుకురా! నువ్వు చెపితే నేను ఎప్పుడైనా కాదనగలనా? నువ్వు బాగా ఆలోచించే చెపుతావు ఏమాటైనా - అన్న నమ్మకం నాకు ఉంది. చెప్పమ్మా ..... "

"ప్రస్తుతానికి అంత డబ్బు సిద్ధంగా లేకపోవచ్చుగాని, వాళ్ళకాపాటి సమర్ధత లేకపోలేదు కదా! మురళీకి ఉద్యోగం ఉంది. త్వరలోనే అంతా సద్దుబాటు ఔతుంది. ప్రస్థుతానికి మనం సద్దుదాం ఆ డబ్బు! ఇప్పుడు సుదర్శనమేమీ కావాలని అడగడం లేదుకదా" అంది యామిని.

"నీ ఆలోచన చాలా గొప్పగా ఉందమ్మా! అలాచేద్దాం. సుచరిత కూడా మనపిల్లే కదమ్మా. అవసరం తీరి, నీవల్ల ఆమె జీవితం ఒక దారికి వచ్చిందంటే అంతకన్నా నాకు ఆనంద మేముంటుంది" అన్నాడు విశ్వనాధం సంతోషంతో.

"వాళ్ళు ఇక్కడితోనైనా ఆపితే బాగుంటుంది. మనలోకువ కనిపెట్టి ఇలాగే బెదిరించి, మళ్ళీ మళ్ళీ డబ్బు గుంజాలని చూస్తారేమో! మనిషి మాంసం తినమరిగిన పులిలా, ఇంకా ఇంకా కావాలనకుండా ఉంటే బాగుండును!" అప్పుడే అటుగా వచ్చిన వకుళ అంది, వాళ్ళ మాటలు విని.

* * *

పెండింగులో ఉన్న లెటర్సు టైపుచేసి తెచ్చింది యామిని, బాస్ సంతకాలకోసం. అర్జంటు లెటర్సు కాకపోయినా, చెయ్యాల్సిన పని ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిదని ఆమె ఉద్దేశం. పని పూర్తయ్యిపోతే ఆపై అంతా నిశ్చింత! అంతవరకూ అక్కడ ఎవరూ లేరుకదా - అని, కుర్చీలో వెనక్కివాలి కూచుని విశ్రాంతి తీసుకుంటున్న అమర్ యామిని రాక చూసి, సద్దుకుని తిన్నగా కూర్చున్నాడు. యామిని అందించిన లెటర్సు చూసి, వాటి మీద సంతకాలు చేసి, తిరిగి ఇచ్చేసి, "కూర్చోయామినీ! నీతో మాటాడాలి" అన్నాడు. యామిని మాటాడకుండా అక్కడున్న కుర్చీలో కుదురుగా కూర్చుంది.

"మన ప్రపోజల్ కి గవర్నమెంట్ ఆమోదం దొరికిందిట, హెడ్డాఫీసు నుండి ఫోను వచ్చింది. చందనపు చెక్క కొనుగోలుకి పర్మిట్ కూడా వచ్చేసిందిట. అవన్నీ మిత్రా గారే ఏర్పాటు చేశారు. ఇక మనదే ఆలశ్యం. మనమింక సన్నాహాలు ప్రారంభించడం మంచిది.ఎంతమందిమి వెడుతున్నాము, ఏమేమి కావాలి వగైరా ముందుగానే ప్లాన్ చేసుకుని బయలుదేరడం బాగుంటుందని నా అభిప్రాయం. లిష్టు రాసుకోడం మేలేమో! నాకు ఈ ఒక చిన్ని ఎస్కర్షన్ లా ప్లాన్ చెయ్యాలనిఉంది" అన్నాడు ఉత్సాహంగా అమరేంద్ర .

" లిస్టు చెప్పండి సర్! రాస్తాను" అంటూ కాగితం కలం చేతిలొకి తీసుకుంది యామిని.

" నువ్వెప్పుడైనా చందనపు అడవుల్ని చూశావా?"

"చందనపు అడవులా! అంతదాకా ఎందుకు, ఉట్టి అడవుల్ని కూడా చూసిందిలేదు" అంటూ చిన్నగా నవ్వింది యామిని. "జంగిల్ బుక్సు, షికారీ బుక్సు మాత్రం చాలా చదివాను. మన దేశంలో మేనీటింగ్ టైగర్సుని, లెపర్డ్సుని చంపి ప్రజలకు మేలుచేసిన జిం కార్బెట్, కెన్నెత్ యాండర్సన్ ..... ఇంకా దేశీయ షికారీలు - ఎంతమందో వాళ్ల వాళ్ళ అనుభవాల్ని పుస్తకాలుగా రాశారు కదా! అలాంటివి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మా హోం లైబ్రరీలో. మా నాన్నకి అవంటే చాలా మక్కువ. నేనూ చదివాను వాటిని. బాగా చిన్నప్పుడు అవి చదివి, ఆ మేనీటర్ హంట్లో నేను కూడా పాల్గొనాలని కలలు కనేదాన్ని. కాని, నిజానికి ఇంతవ రకూ నేను ఒక అడవిని కూడా చూడలేదు" అంది యామిని. అంతలోనే, అలా చనువుగా అతనితో మాటాడేసినందుకు అమరేంద్ర ఏమైనా అనుకుంటా డేమోనని కంగారుపడింది.

కాని అమరేంద్ర అలా ఏమీ అనుకోలేదు. ఆమె మాటల్లో, అడవుల్ని చూడాలన్న కుతూహలం ఆమె మనసులో ఏ లెవెల్లో పేరుకుని ఉందో అతనికి అర్థమయ్యింది. ఎలాగైనా ఆమెను కూడా చందనపు అడవులకు ప్రయాణమై వచ్చేలా చెయ్యాలి - అనుకున్నాడు అమరేంద్ర. నెమ్మదిగా, ఏమీ తెలియకుండా - చాపకింది నీరులా వ్యాపిస్తోంది వాళ్ళ మధ్య అనుబంధం.

"నేను చిన్నప్పటినుండి పెద్ద పెద్ద సిటీస్ లో పెరగడం వల్ల, నాకున్న పరిచయమంతా "కాంక్రీట్ జంగిల్సు" తోనే! ఇంతవరకూ నేనూ చూసింది లేదు, రియల్ జంగిల్ని! అందుకనే ఇప్పుడు గంధపు చెక్కల కోసం వెళ్ళేటప్పుడు దాన్నొక బిజినెస్ ట్రిప్ లా కాకుండా, ఒక ఎస్కర్షన్లా ప్లాన్ చెయ్యాలని ఉంది. ఇక్కడే ఒక వేన్ బుక్ చేసుకుని వెళ్ళిరావచ్చు నని నా అభిప్రాయం. అలాగైతే ప్రయాణం సౌకర్యంగా ఉండడమే కాకుండా, అవసరానికి మనకు, ఎల్లవేళలా ఒక వెహికిల్ చేతిలో ఉంటుంది. అది మంచి ఐడియా కదూ ... !"

" ఎస్ బాస్! ఐతే శ్రీకారం చుట్టి ప్రప్రధమంగా ఇదే రాస్తా, సరా సర్!"

" ఆగు! ఘాట్ రోడ్డు మీద స్లిప్ అవ్వకుండా బండి నడవాలంటే అది ఫోర్ వ్వీల్ డ్రైవ్ చెయ్య గలిగిన వెన్ అవ్వాల్సి వుంటుంది. అటువంటి వేన్ కావాలి మనకు."

"ఎస్ బాస్! అదే రాస్తా. ఫోర్ వ్వీల్ డ్రైవింగ్ కెపాసిటీ ఉన్న వేన్ ఒకటి - రాశా సర్!"

"ఇక రెండవది, దాని ఛోదకుడు ....... అతడు మళయాళీ అయ్యి ఉండాలి. సాధ్యమైనంత వరకు ఆ ప్రాంతంతో పరిచయమున్నవాడైతే మంచిది. మనం వెళ్ళేచోటు మూడు రాష్ట్రాల కూడలి. అక్కడ వాళ్ళు ఏ భాష మాటాడినా మనకు అర్ధం చెప్పేవాళ్ళు ఉండాలి. బయ్ ది బయ్; నీకు ఏ ఏ భాషలు వచ్చు?"

" నాకు ఎక్కువ భాషలేం రావు. మాతృభాష కాక ఇంగ్లీషు, హిందీ వచ్చు. ఇంకే భాషా రాదు. సారీ సర్ !"

"విమలాచార్యకు తమిళం, కన్నడం వచ్చు, తెలుగు కూడా కొంచెం వచ్చు. మళయాళం ఎంతవచ్చో నాకు తెలియదు. నాకూ తమిళం కూడా కొద్దిగా తెలుసు. ఇంక తెలుగు మలయాళం తెలిసిన డ్రైవర్ దొరికితే, అక్కడి వాళ్ళు ఏ భాష మాటాడినా, దుబాసీ ఒకడైనా రెడీగా ఉంటాడు కనక భాష ప్రోబ్లం కాదు మనకి."

యామిని ఆశ్చర్యపోయింది. " ప్రతి చిన్న విషయం ఇంత నిశితంగా ఆలోచిస్తున్నాడు కనుకనే, వయసు తక్కువైనా, ఇంత పెద్ద పోస్టులోకి రాగలిగాడు. మిత్రాగారు ఇతన్ని ఇంతగా నమ్ముతున్నారు - అంటే ఇతడు ఆ నమ్మకానికి అర్హుడే అయ్యి ఉండాలి కదా! బిగ్ బాస్ మిత్రాగారి అంచనాలో తప్పు ఎందుకు ఉంటుంది" అనుకుంది మెప్పుగా.

"విమలాచార్య భార్య, వళ్ళీయమ్మ కూడా మనతో వస్తుంది. మనం అక్కడున్నన్నినాళ్ళూ వంటా వార్పూ చేసిపెట్టి, తిరుగుప్రయాణ మయ్యాక ఆమె అటునుండి అటే పుట్టింటికి వెడుతుందిట. వాళ్ళ ఊరు ఆ ప్రాంతంలోనే ఉంది. అది ముదుమలై ప్రాంతం. ఎంతో అందమైన అడవులు ఉంటాయిట అక్కడ. నీకు చూడాలని ఉంటే నువ్వు కూడా రావచ్చు. చిన్నచిన్న ఎర్రని పూలతో ముచ్చటగా ఉంటాయిట చందనం చెట్లు! " బెల్లింపుగా అన్నాడు అమర్. ఆమెకూడా వస్తే బాగుంటుందని అతని ఉద్దేశం. కాని ఆ మాట అతడు పైకి అనలేదు.

" నేనూనా! అమ్మో " అంటూ ఆశ్చర్య పోయి కళ్ళు విశాలంగా చేసుకుని అతనివైపు వింతగా చూసింది యామిని.

"ఔను, నువ్వే! నలుగురమూ కలిసి ఎస్కర్షన్ కి వెళ్ళుతూంటే రావడానికి భయమేమిటి? నీతో కూడా ఉండే వాళ్ళంతా అన్నం తినే మనుష్యులే గాని మేనీటర్సు కారు. విమలాచార్య భార్య ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. అదీకాక, శశిధర్, అతనిభార్య - పిల్లల్ని వాళ్ళ అమ్మగారి దగ్గర వదలి, వస్తానన్నారు. వెంకట్రావుగారిని రమ్మంటే, కీళ్ళనొప్పులు - రాలేను అన్నారు. రిసెప్షనిష్టుకి పసిపిల్ల ఉందిట. ఐనా మనం తీసుకునే వేన్లో డ్రైవర్తో కలిపి ఏడు సీట్లే ఉంటాయి. నీకు చందనపుచెట్లని వాటి స్వస్థలంలో చూడాలని ఉంటే, ఇది మంచి అవకాశం. నీ కొచ్చిన భయమేమీ లేదు. నీ క్షేమానికి నేను పూచీ పడతా" అన్నాడు అమర్, ఆమెవైపు కొంటెగా చూస్తూ.

యామినికి అభిమానం పొడుచుకొచ్చింది. అతనివైపు సూటిగా చూస్తూ, "భయమా! నాకా? ప్రతిదానికీ ఒణికిపోయేటంత పిరికిది కాదు ఈ యామిని! కాని ఒకే ఒక్క ఇబ్బంది, నేను రావాలంటే మా నాన్న ఒప్పుకోవాలి. సరదా కోసమని, అసలే అనారోగ్యంతో ఉన్న ఆయన్ని కష్టపెట్టలేను" అంది.

"ఈ వీకెండ్ ఇంటికి వెడతావుకదా, అడిగిచూడు. వస్తానంటే, "మై హార్టీ వెల్కం టు యు!" బాస్ వెంట సెక్రెటరీ ఉండడం లో వింతేం లేదు, ఉండకపోడమే వింత. నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు, నీకు ఏ ఆపదారాదు" అన్నాడు అమరేంద్ర.

"అతని వైపు తీక్షణంగా చూసింది యామిని. "నేను చెప్పాను కదా, సర్! మానాన్న ఒప్పుకోవాలి - అని!. ఎస్కర్షన్ అంటే మానాన్న "సరే" అంటాడనే నా నమ్మకం. అయినా నా డ్యూటీ నేను చెయ్యాలి కదా. నేను కనుక్కుని వచ్చి మీకు ఏమాటా సోమవారం చెపుతా. మీ కంత టైం ఉంటుందా మరి?"

"టైమా ? అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నది మనమే కనుక, ప్రయాణం టైం కొంచెం అటూ ఇటూ జరపడమన్నది మన చేతిలో పనే! దాని గురించి ఆలోచించక వచ్చే ప్రయత్నం చెయ్యి. ఇది ఒక అపురూపమైన అవకాశం. అడవి లోపలికంతా వెళ్ళి చూచే అదృష్టం అన్నప్పుడూ రాదు. సేఫ్టీ విషయంలో భయం వద్దు. నీకే ఇబ్బందీ రానీను. ఒక్కమాటలో చెప్పాలంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, సరా ..... "

యామిని జవాబేమీ చెప్పలేదు. కాని మనసులో అనుకుంది, " భయమా! అనవసరంగా, పనిగట్టుకుని పిరికిమందు పొయ్యాలని చూడకు మహానుభావా" అని తనలో.

"నువ్వు వస్తావు. అది ఎంత సుందరమైన ప్రదేశమైనా, నువ్వు నా పక్కన లేకపోతే అది నాకు అందంగా ఎలా కనిపిస్తుంది? ఒంటరితనం నన్ను నిలువునా వేధిస్తుందేతప్ప! యామినీ! వస్తావు, నువ్వు తప్పక నాతో వస్తావు" అని తనలో అనుకుంటూ ఆమె మనసుకు తన మనసు ద్వారా ఒక వినతిపత్రం పంపించాడు అమర్, అది ఆమెకు తప్పక అందగలదన్న విశ్వాసంతో.

" మనం లిస్టు ఈ రోజు పూర్తిచేస్తే రేపటినుండి ఒకటొకటీ కొనడం మొదలు పెట్టవచ్చు" అంది యామిని.

"కారు లోపల ఎక్కికూచునీ వాళ్ళ పేర్లు ఏమైనా, వేన్లో సీట్లు, ఏడు మాత్రమే ఉంటాయి. కాస్త అటూ ఇటూ తిరిగి చూడాలంటే అక్కడ ఏడు రోజులు ఉండవలసి వస్తుందన్నది నా అంచనా. అక్కడ మనకు కావలసినవి చాలావరకూ ఇక్కడనుండే తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఆన్ ది సేఫ్ సైడ్, ఏడుగురికి, పదిరోజులకు సరిపడే గ్రాసం సమకూర్చుకోవాలి. ఆ లెక్కలన్నీ నువ్వే, ఎవరినైనా అడిగి రాసుకో. ఇక ఎవరికి కావలసిన వస్తువులు - బట్టలు, దుప్పట్లు, సబ్బు, పేస్టు, తలనూనె వగైరాలన్నీ ఎవరికివారే తెచ్చుకోవాలి. ముందుగానే చెప్పేస్తే సరి."

" ఈ రాత్రికి కూచుని చాలావరకూ లిస్టు రాసి, రేపు మీకు చూపిస్తా. బియ్యం పప్పులు లాంటివి ఎన్నికావాల్సిఉంటుందో, మా ఊళ్ళో నాకు తెలిసిన వంటవాళ్ళు ఉన్నారు, వాళ్ళను అడిగి రాసుకుని మీకు ఆ లిస్టు సోమవారానికల్లా అందజేస్తా."

"కొన్ని సింపుల్ మెడిసిన్సు కూడా ఉంటే మంచిది.ముఖ్యంగా మస్కెటో రిపెలెంట్సు మర్చిపోకూడదు."

"రాశా సర్! ఇంకా ఏమైనా ...... "

"ఒక్కొక్కటీ గుర్తువచ్చినప్పుడల్లా నోట్ చేసుకుంటూ ఉండాలి. ఈ పూటకి ఈ ప్రిపరేషన్ చాలు" అంటూ లేచాడు అమర్.

అప్రయత్నంగా యామిని వాచీ చూసుకుంది. టైం సరిగా ఐదు అయ్యింది. అది ఆఫీసు మూసే సమయం!

* * *

వారాంతంలో ఇంటికి వెళ్ళిన యామిని ఆ రాత్రి భోజనాలయ్యాక, అందరూ విశ్రాంతిగా హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో చెప్పింది, తమకంపెనీ కొద్దినెలలలోనే మరో కొత్త ప్రోజక్టుని ప్రారంభించబోతోందన్న విషయం. .

" మీ బాస్ ఎవరోగాని, ఘటికుడే! ఒక్క సంవత్సరమైనా కాకముందే కంపెనీకి ఇంత అభివృద్ధి సాధించాడంటే, ముందుముందు ఇంకా ఎన్నివిజయాలు కొట్టేస్తాడో! ఒకసారి చూడాలనుకున్నా, కాని కుదరలేదు. మళ్ళీ ఎప్పుడో రావాలి, అదే పనిమీద" అన్నాడు రామేశం.

యామిని అందరి మొహాలూ పరికించి చూసింది. అందరూ కొత్త ప్రాజెక్టు విషయం విని ఆనందిస్తున్న వాళ్ళలాగే కనిపించారు. అప్పుడు బయటపెట్టింది అసలువిషయం , " క్వాలిటీ గంధపు చెక్కను కొనడానికి మా వాళ్ళు ఫారెస్ట్ కేంపుకి వెళుతున్నారు. ఆ ట్రిప్పుని ఒక ఎస్కర్షన్లా ఉండేల ప్లాన్ చేశారు మా బాస్! నన్నుకూడా రమ్మన్నారు. వాళ్ళతో వెళ్ళమంటావా నాన్నా? నాకూ అడవులు చూడాలన్న కోరిక ఉంది . ఇప్పుడు వెళ్ళీది చందనపుటడవులకి! ఏమంటావు నాన్నా" అంటూ గారాబంగా అడిగింది.

"నువ్వు నీకు నచ్చినచోటికి ఎస్కర్షన్ వెళ్ళాలనుకుంటే నేను వద్దని ఎలా అనగలనమ్మా! ఎవరెవరు వెళుతున్నారేమిటి? అంతా మగవాళ్ళే ఐతే , నువ్వొక్కదానివీ వాళ్ళలో చేరడం ఎంతమాత్రం
బాగుండదమ్మా. మరొక్క ఆడమనిషైనా ఉండాలి నీతోపాటుగా " అన్నాడు విశ్వనాధం, కూతురివైపు ప్రేమగా చూస్తూ.

"ఒకరుకాదు నాన్నా! ఇద్దరుంటారు. నాతో ముగ్గురు. మరో ముగ్గురు మగవాళ్ళూ, ఒక డ్రైవరు. కారులో ఉండేవి మొత్తం ఏడు సీట్లేట!" దారుశిల్పి విమలాచార్య, అతని భార్య, మా అక్కౌంటేంట్ శశిధర్, అతని భార్య, నేను, మా బాసు, డ్రైవరు - అది మా ట్రూప్. ఆపైన సామానుంటుంది."

"సరేనమ్మా! సంతోషంగా వెళ్లిరా. కాని జాగ్రత్తగా ఉండు. ఈ ముసలి తండ్రి ప్రాణాలన్నీ నీ మీదే ఉంటాయి - అన్నది మాత్రం మర్చిపోకు. అక్కడ ఏసాహసాలూ చెయ్యకు."

తండ్రి ఒప్పుకోగానే యామిని మనసంతా ఆనందంతో నిండిపోయింది. "ఏన్నాళ్ళకెన్నాళ్ళకు నా కోరిక తీరబోతోంది" అనుకుంటూ లోలోన మురిసిపోయింది. "చిన్నప్పటినుండి, జంగిల్ బుక్సు చదివి చదివి, అడవిని చూడాలని కలలు కనేదాన్ని. . కాని ఈ జన్మలో ఆ కోరిక తీరుతుందన్న ఆశ మాత్రం ఉండేదికాదు. అది ఇప్పుడు తీరబోతోంది. భగవంతుడా, నీకు కృతజ్ఞతలు" అనుకుంది యామిని.

"అమ్మా యామినీ! మీ ట్రిప్పు ఎన్నాళ్ళేమిటి?" అడిగాడు రామేశం.

" ఒక వారం పడుతుందని అంచనా. కాని మేము పది దినాలకు చాలిన సరుకులు పట్టికెళ్ళడం మంచిది అనుకుంటున్నాము.

ఎక్కువా కాకుండా తక్కువా కాకుండా సరుకులు సరిపడా ఉండాలంటే ఎవరైనా వంట బాగా తెలిసినవాళ్ళని అడగాలి - అన్నాడు మా బాసు. రేపు నే నెళ్ళి మన అవధాని బాబాయ్ ని అడిగి రావాలనుకుంటున్నాను. పెళ్ళిళ్ళ సీజన్ కాదు కదా, ఇంట్ళోనే ఉంటాడని ఆశ!"

"ఇంతకీ అది ఏప్రాంతంట?" అడిగాడు రామేశం.

" మలయ పర్వతప్రాంతం - అంటే అది మలయాళ దేశం ఉన్న ప్రాంతం అనుకుంటా అంకుల్"

"ప్రకృతి అందానికి ఆ చోటు పెట్టిందిపేరు - అంటారు. చూచిరామ్మా! కాని అక్కడున్నది అంతా అందమే అనుకోకూడదు, అడవుల్లో అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలు కూడా ఉంటాయి. రకరకాల అడవి జంతువులు, పాములు లాంటివేకావు, కౄరమృగాల్లాంటి మనుష్యులు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండి, తెలివిగా మసలి, చక్కగా గడిపి, క్షేమంగా తిరిగి రామ్మా. మేగాడ్ బ్లెస్ యు" అంటూ హెచ్చరికలు చెప్పి, ఆశీర్వదించాడు రామేశం.

"తిరిగివచ్చేటప్పుడు ఓ నాలుగు గంధపుచెక్కలు తేవడం మర్చిపోకు సుమీ! మన దేవర పెట్టి దగ్గరి గంధపుచెక్క సాంతం అరిగిపోయింది" అంది రమణమ్మ.

"యామినీ! నాకూ ఒకటి కావాలి, గుర్తుంచుకోవేం" అంది రాజేశ్వరి.

"మరైతే మీరు మాకో సహాయం చెయ్యడం బాగుంటుంది, చేస్తారా?"

" చెప్పు మరి! తప్పకుండా చేస్తాం, పాల కోసం రాయి మొయ్యాలి మ!రి తప్పుతుందా" అంది రమణమ్మ నవ్వుతూ.
"మీరు మాకోసం కొన్ని చిరుతిళ్ళు చేసి ఇవ్వాలి మరి. అప్పుడే మీరు కోరిన గంధపు చెక్కలు మీకు వస్తాయి" అంది యామిని కూడా నవ్వుతూ .

"ఓ! అదెంత భాగ్యం తప్పకుండా చేస్తాం" అంది రాజేశ్వరి.

"ఆంటీ! దసరాలకు మీరు చేసి ఇచ్చిన కోవా కజ్జికాయలు, ఒకటి తీసుకోమని బాక్సుతెరిచి ముందుపెడితే మా బాసు, "నా చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇస్టమని తరచూ ఇవి చేసిపెట్టేది" అంటూ, బాక్సు మొత్తం తీసేసుకున్నాడు. ఇప్పటికి ఇంకా ఆ బాక్సుకూడా తిరిగి ఇవ్వలేదు, తెలుసా" అంది.

ఆ మాటలకు రాజేశ్వరి హృదయం స్పందించింది. కొడుకు తాలూకు జ్ఞాపకాలతో మనసు గుబగుబలాడింది. తన తడికన్నులు ఎవరికళ్ళా పడకూడదని ఆమె మంచినీళ్ళు తాగాలన్న నెపంతో అక్కడనుండి వెళ్ళిపోయింది.

"అదేమిటి యామినీ! అలా చేశావు" అని అడిగింది వకుళ మొహాన గంటుపెట్టుకుని. నువ్వు తినాలని ఇచ్చింది అమ్మ. నువ్వు తినకుండా ఎవరికో ఇచ్చేశావా?"

"అన్నీ ఎందుకిచ్చేస్తాను వకుళా, నేనూ తిన్నాను. "తన్నుమాలిన ధర్మం మొదలుచెడిన బేరం" అన్నది నాకూ తెలుసు. చాలానే ఉన్నయి కదా, మా వాళ్ళకి తలొకటీ రుచి చూపిద్దామని, కొన్ని బాక్సులో వేసుకుని పట్టుకెళ్ళా. ఆ రోజే నాకు P.A. గా ప్రమోషన్ వచ్చింది. సెలెబ్రేషన్లా ఉంటుందని, ఒకటి తీసుకుంటాడనుకుని బాక్సు తెరిచి ముందుపెడితే, బాక్సు మొత్తం కాజేశాడు. ఇవ్వలేనన లేకపోయా " అంటూ నవ్వింది యామిని.

"ఈమాటు ఒక డబ్బా ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఇయ్యి, మనసుతీరా తింటాడు, పాపం!" అంది వకుళ. ఆమెకు నిర్వాసితుడైన అన్నగారు గుర్తుకురావడంతో మన్సులో అలజడి మొదలయ్యింది. అది యామినికి తెలియకూడదని మాటమార్ఛేసింది వకుళ . .

"ఫదయ్యింది, ఇంక మనం పడుకోడం మంచిది" అంటూ లేచింది.

ఇద్దరూ మంచమెక్కి దుప్పట్లు ముఖం పైకంతా కప్పుకుని పడుకున్నారు. కొంచెం సేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. ముందుగా వకుళ ముసుకులోంచి బయటకొచ్చింది. యామిని ముఖమ్మీదికంతా కప్పుకున్న దుప్పటిని లాగేసి, మొహంలో మొహం పెట్టి, సూటిగా అడిగింది, "ఏమిటి పిల్లా! ఏమిటి విశేషం? ఎప్పుడూ లేనిది ఈ మాటు బాసుని గురించి అన్ని కథలు చెపుతున్నావు? ఏమిటా ఉషారు? ఏమా కథ" అని అడిగింది.
బాస్ విషయంలో తనమనసు ఆర్ద్రమైనది నిజమే. ఇప్పుడిప్పుడే తమమధ్య ఒకరకమైన స్నేహంలాంటిదేదో మొదలౌతున్న విషయం తనకీ తెలుస్తోంది. కాని ఇంతిలా తను వకుళకు దొరికిపోతుందని యామిని అనుకోలేదు.

"కథా వకుళా! ఉంది, చాలా పెద్ద కథే ఉంది. బాస్ చాలా మారిపోయాడు. ఆ మహాతల్లి ఎవరో, ఆమెచేతిలో ఏ మేజిక్ వేండు ఉండోగాని, ఆమె పుణ్యమా - అని, మంచి వాడైపోయాడు. ఇదివరకటి కష్టాలేమీ లేవు ఇప్పుడు నాకు. "

"ఇదేమిటిబాబోయ్! ఇదేదో కొత్త కథలాఉందే!" ఆశ్చర్యపోయింది వకుళ.

"ఔను, కొత్త కథే! ఇదివిను, గురుడు ఎంగేజ్డుట!"

యామిని "ఎంగేజ్డు" అన్నప్పుడు ఆమె కంఠస్వరంలో వచ్చిన అతిచిన్న ప్రకంపనం వకుళ పసికట్టేసింది!......
అది తన భ్రమ అయ్యివుంటుందనుకుని, "విష్ ఫుల్ థింకింగ్ ఇడియట్" అని లోలోన తనని తనే తిట్టుకుంది వకుళ . కాని ఆ తిట్టుని ఆమె మనసు స్వీకరించలేదు.

"ఎవరో ఆ మహాతల్లి! చిన్నప్పుడు గొబ్బమ్మలకు ప్రదక్షిణలు చేస్తూ "మొగలిపువ్వంటి మొగుణ్ణివ్వవే" అని కోరుకుంటూ, గొప్పగా పూజలు చేసి ఉంటుంది" అంది వకుళ.

వకుళ మాటలకు యామిని నవ్వడం మొదలుపెట్టింది. అలానవ్వగా నవ్వగా యామిని కళ్ళ వెంట కన్నీళ్ళు ఝల్లున రాలాయి. వకుళ విస్తుబోయింది. ఆమె మనసులోకి ఏవేవో ఆలోచనలు ఉరుక్కుంటూ వచ్చాయి గాని, యామినిని అలయించడం ఇష్టంలేక వాటిని అలాగే దిగమింగేసింది వకుళ.

"ఏమిటిది యామినీ! ఆనందభాష్పాలా ఏమిటి? ఇకచాలు, అలిసిపోయావు, పడుకుని నిద్రపో" అంటూ తను గట్టిగా కళ్ళు మూసుకుని నిద్ర నటించింది వకుళ.

యామిని కూడా వెనక్కి తిరిగి పడుకుని కళ్ళు మూసుకుందన్నమాటేగాని, మనసు లో వస్తున్న ఆలోచనలు ఆపలేకపోతోంది.

"హుం! ఆనంద భాష్పాలుట" అనుకుంది బాధగా.

'డేమిట్! కథ ఇలా అడ్డం తిరిగిందేమిటీ? ఏమేమో ఊహించుకుని మురిసిపోయా కదా. బాస్ తో అతని లేడీ సెక్రెటరీ ప్రణయం, పరిణయం కథావస్తువుగా ఎన్నెన్నో కథలు వచ్చి పాఠకులను ఉఱ్ఱూతలూగించాయి! కాని, వాస్తవానికి వచ్చేసరికి అంతా ఇలా తలక్రిందు లయ్యిందేమిటి? పాపం యామిని! నాకేమీ తెలియదనుకుంటోందిగాని, బాస్ ఎంగేజ్డు అన్న విషయం యామిని మనసును ముల్లులా కుట్టి, వేధిస్తోందన్నది నాకు తెలిసిపోయింది. కాని, ఆమెకు న.

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)