సారస్వతం
సాహిత్యంలో చాటువులు 20
-‘విద్వాన్’ తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు

ఈ నెల సుభాషితాల వంటి కొన్ని చాటువులను తెలుసుకొందాం. లోక వ్యవహారంలో తరచూ వాడబడుతూ,వినబడుతూ ఉండే ప్రసిద్దిచెందిన కొన్ని ( తెలుగు సామెతల వంటి) ప్రత్యేక సంస్కృత శ్లోక పాదాలని, వాటికి మూలమైన సంపూర్ణ శ్లోకాలను మీకు వివరిస్తాను. చదివి ఆనందించండి. ఇవి అందరు తప్పక తెలుసుకోతగ్గవి.

సంస్కృత శ్లోక పాదాలు.-వాటి అర్థాలు.

౧. “ నానృషి: కురుతే కావ్యం” = ఋషి కానివాడు కావ్యం వ్రాయలేడు.
౨. “ ఋణాను బంధ రూపేణ” = ఋణం వల్లే బంధాలు యేర్పడతాయి.
౩. “ ధన మూల మిదం జగత్”= ఈ జగత్తు అంతా ధనంమీదే ఆధారపడి ఉంది.

౪. “ భార్యా రూపవతీ శత్రు:” = అందమైన భార్య శత్రువు ( క్షమించాలి)
౫. “ ఆలస్యాదమృతం విషం”= ఆలస్యం వల్ల అమృతం కూడా విషంఅవుతుంది
౬. “ యధారజా తథాప్రజా” = రాజు ఎలాగో ప్రజలు అలాగే.
౭. “ అతి సర్వత్ర వర్జయేత్” = ఏది అతిగా చేయకూడదు.
౮. “ ఉద్యోగం పురుష లక్షణం” ( పూర్వ కాలం)= ఉద్యోగం పురుషులకే
౯. “ కర్మానుగో గచ్చతి జీవ ఏకః” మరణించినపుడు కర్మ ఒక్కటే జీవుని వెంటవస్తుంది.

౧౦. “ న భూతో న భవిష్యతి” = గతంలో, భావికాలం లో కూడా ఉండదు.
పై శ్లోక పాదాలు ఏ సందర్భంలో చెప్పబడ్డాయో ఆ శ్లోకాలని ఇప్పుడు వరుస క్రమంలో తెలుసు కొందాం.
౧. “ నానృషి: కురుతే కావ్యం, నా గంధర్వః సురూపభ్రుత్/
నా దేవాంశో దదాత్యన్నం నా విష్ణు: పృథివీ పతి:”//

( వివరణ)
ఋషి కానివాడు కావ్యం వ్రాయలేడు, గంధర్వాంశ లేనివాడు అందంగా ఉండడు, దేవతాంశ లేనివాడు అన్నదానం చేయలేడు, విష్ణ్వంశ లేనివాడు రాజు కాలేడు. పై విశేషాలు తెలిపే సందర్భంలో “నానృషి: కురుతే కావ్యం” అని చెప్పబడింది. కనుకనే వాల్మీకి, వ్యాసాది వంటి ఋషులు వ్రాసిన మహా కావ్యాలు నేటికీ నిలిచి ఉన్నాయి.

౨. “ ఋణాను బంధ రూపేణ పశు పత్ని సుతాలయః/
ఋణ క్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదనా?”//

(భావం)
రుణానుబంధం ఉన్నంత వరకే పశువులు,( పూర్వం అందరి ఇళ్ళలోనూ పశు సంపద తప్పక ఉండేది.) భార్య, పిల్లలు, ఇళ్ళు ఉంటాయి. ఋణం తీరిపోతే ఇవి యేవి ఉండవు. మరి వాటికై బాధ పడటం ఎందుకు? అనే సందర్భంలో పై శ్లోకపాదం వాడబడింది. ఇట్టివే మరికొన్ని చక్కని ఉదాహరణలు చూడండి—

“పండిన ఆకులు చెట్టునుంచి రాలి పడినట్లు ఆయువు తీరిన వారు మరణిస్తారు. వారికై బాధ పడనేల, రాత్రి పూట చెట్టుని ఆశ్రయించుకొని ఉన్న కొన్ని పక్షులు తెల్లవారగానే వాటిదారిన అవి వెళ్ళిపోతాయి,అంతమాత్రాన అవి దు:ఖ పడవుకదా!? అలాగే ఒక నదిలో రెండు కర్ర పుల్లలు కలసి కొంత దూరం పయనించి విడి పోయి, చెరోప్రక్కకి, వెళ్లి పోతాయి అట్లే మనంకూడా కొన్ని రోజులు కలసి ఉండి, విడి పోతాము. దానికి బాధపడుట ఎందులకు?” అనే ఉదాహరణలు గంభీరమైన, వేదాంత పరమైనవి,అందరు తెలుసుకొని, ఆచరించ తగ్గవి.

౩. “ వేదమూల మిదం జ్ఞానం, భార్యామూల మిదం గృహం/
కృషి మూలమిదం ధాన్యం, ‘ధనమూలమిదం జగత్’”//

జ్ఞానానికి మూలం వేదం, ( విద్=జ్ఞానే అని అర్థం.) ఇల్లు బాగుండటానికి మూలం భార్య. అందుకే భార్యని ‘ గృహ లక్ష్మీ’ అన్నారు. ధాన్యం అధికదిగుబడి రావాలంటే వ్యవసాయం బాగా చేయాలి, ( కృషి అంటే వ్యవసాయం)అలాగే ఈ జగత్తులో అన్నింటికి మూలం ‘ధనమే’. కనుక ధనం తప్పక ఉండాలి అని పై శ్లోక పాదం తెలుపు తుంది. ఇట్టివే మరికొన్ని.

రామాయణంలో విశ్వామిత్రుడు రాముడికి కొన్ని రాజ ధర్మాలు చెపుతూ, ఇలా అంటాడు- “ధన మార్జయ కాకుత్స్థ ‘ధనమూలమిదం జగత్’/

అంతరం నాభిజానామి, నిర్ధనస్య మృతస్యచ”//


అనగా---
కకుస్థుడు అనేరాజు పేరుతో రాముని వంశం ప్రసిద్ధిపొందింది. కనుక రాముని ‘కాకుత్స్థ’ అని విశ్వామిత్రుడు సంబోధించేడు. “ఓ రామా! ధనాన్ని బాగా సంపాదించు. ఎందుకనగా ఈ జగత్తు ధనంపై ఆధార పడి ఉంది. ధనం లేని వాడు చనిపోయిన వాడితో సమానం, వారిమధ్య వ్యత్యాసం నాకు ఏమీ కనబడుట లేదు. మరియు కులం, గోత్రం, బలం, అందం ఇవియేవి లేకపోయినా ధనం ఉంటే చాలు అందరూ గౌరవిస్తారు. కష్టాలు, ఆపదలు కూడ ధనం ఉంటే దరిచేరవు, ప్రాణం లేని మద్దెల,లేక మృదంగం కూడా’ధనం,ధనం,ధనం,అని శబ్దం చేస్తుంది.(ధన్ ,ధన్ శబ్దాన్నికవి ఇలా అన్నాడు.) కనుకనే ‘ ధనమూల మిదం జగత్’ అన్నారు. అందుకే ధర్మ మార్గంలో అందరూ ధనాన్ని ఆర్జించాలి” అనే గొప్ప సత్యాన్ని పై శ్లోకం తెలుపుతుంది.

“ భార్యా రూపవతీ శత్రు:” ఈ వాక్యానికి ‘అందమైన భార్య శత్రువు, లేదా ఈపదాన్ని భార్య+ అరూపవతీ’ అని విడదీసి చదివితే ‘అందం లేని భార్య కూడా శత్రువే’ అని అర్థం చెప్పుకోవచ్చు. ( ఆడపడుచులు క్షమించాలి. ఇది పూర్వం చెప్పిన మాట. ఎందుకు అలా అన్నారో వివరణ చదవండి,తెలుస్తుంది.)

౪. “ పితాచ ఋణవాన్ శత్రు:, మాతాచ వ్యభిచారిణీ./
భార్యా రూపవతీ శత్రు: పుత్రః శత్రు: అపండితః”//

వివరణ-----
ఆస్తి లేకుండా అప్పులు మాత్రమే ఉన్న తండ్రి పిల్లలకి శత్రువు, వ్యభిచరించే (చెడ్డగా తిరిగే) తల్లి కూడా పిల్లలకి శత్రువే!, అందమైన (లేక కురూపి ఐన) భార్య భర్తకి శత్రువు, ఎందుకంటే తనకంటే అందమైన భార్య తనప్రక్కన ఉంటే, యితరులు తనభార్యని వ్యోమోహంతో చూసే వారంతా తనకి శత్రువులే కదా? అలాగే భార్య అరూపవతి ( అందం లేనిది) ఐతే, తను అందమైన స్త్రీల వైపు పొరపాటున చూస్తే, తనభార్యే తనని శత్రువుగా చూస్తుంది. అనే అర్థాలలో పై శ్లోక పాదం వాడేరు అనుకోవచ్చు. అట్లే పాండిత్యం (చదువు.) లేని, మూర్ఖుడైన పుత్రుడు తలిదండ్రులకి శత్రువు. అందుకే తెలుగులో ‘ పండిత పుత్రః పరమ శుంట:’ అన్న నానుడి పుట్టింది.

( మిగిలినవి వచ్చే సంచికలో)

 

( సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)