ధారావాహికలు
మరీచికలు (సాంఘిక నవల - 16 వ భాగం)
- వెంపటి హేమ
అదేరోజు సాయంకాలం బేగంపేట విమానాశ్రయంలో, ప్రయాణానికి సిద్ధంగా ఉన్న "ఏవ్రో" విమానం ఎక్కి బొంబాయి వెళ్ళిపోయాడు అమరేంద్ర. మరునాడు ఉదయమే, తనపై మోపబడిన బాధ్యతలను గుర్తు చేసుకుని మరింత తొందరగా నిద్ర లేచింది యామిని. తొందరగా ఇంటి పనులన్నీ ముగించుకుని శీఘ్రంగా ఆఫీసుకి వెళ్ళే ప్రయత్నంలో ఉంది. టైం తొమ్మిది కావస్తోంది . .
" సర్ప్రైజ్! వచ్చేశా " అంటూ, తనకు అత్యంత పరిచయమైన కంఠ స్వరం ఎంతో
తీయగా వినిపించే సరికి తలెత్తి చూసిన యామిని, ఎదురుగా కనిపించిన వకుళను చూసి నిజంగానే ఆశ్చర్యపోయింది. పట్టరాని సంతోషంతో, "వకుళా" అని పెద్ద కేకపెట్టి, వెళ్లి ఆమెను కౌగిలించుకుంది యామిని. అంతలో ఆమె వెనకాలే లోనికి వచ్చాడు రామేశం కూడా.
యామిని ఇంకా సర్ప్రైజ్ నుండి తేరుకోకముందే, రామేశం, "బాగున్నవామ్మా యామినీ" అంటూ పలుకరించాడు. అటూ ఇటూ కలయజూసి, "వీళ్లద్దరూ ఏరీ? ఏమైపోయారు, ఎక్కడా సందడి లేదు" అని చిన్నగా నవ్వుతో అడిగాడు.
" ఔను! ఇప్పుడామె ఇక్కడ లేదుకనక గాని, శారదాంబగారు ఉన్నచోటు పెళ్ళివారిల్లులా సందడిగా ఉండాల్సిందే కదా ! సరస్వతీ ఆలయానికని ఉదయమే బయలుదేరి వాళ్ళు బాసర వెళ్ళారు, రాత్రికిగాని తిరిగి రాలేరు! ఇంకా నయం, నేనుకూడా వెళ్ళాలనుకున్నా గాని ఆఫీసులో పని ఎక్కువగా ఉండడంతో ఈమాటుకి వాయిదా వేశాను. అదే మంచిదయ్యింది, మిమ్మల్ని రిసీవ్ చేసుకో గాలిగా!"
"మీరిలా కుర్చీలో కూర్చోండి అంకుల్! నేను క్షణంలో కాఫీ కలిపి ఇస్తాను" అంటూ, యామిని. ఆయనకి కుర్చీ చూపించి, తను కాఫీ కలిపే ప్రయత్నంలో పడింది. వకుళ అటూ ఇటూ తిరుగుతూ, ఇల్లూ దొడ్డీ పరిశీలనగా చూస్తోంది.
"నేను మాహెడ్డాఫీసులో పనుండి వస్తూంటే, తానూ వస్తానంటూ వకుళ కూడా వెంటపడింది. తొందరగా పనైపోతే లాస్టుబస్సుకి వెళ్ళిపోతాం , లేదంటే రేపు ఫస్టు బస్సుకి! ఈ రోజు మీరిద్దరూ మీ ఇష్టం వచ్చినట్లు అన్నీ తిరిగి చూడండి. సాయంకాలం ఐదయ్యీసరికి ఇక్కడ ఉంటే చాలు. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఏమాత్రం వీలుగా ఉన్నా ఈ రాత్రికే వెళ్ళిపోతాం" అన్నాడు రామేశం.
అంతలో వకుళ అక్కడకు వచ్చింది. ఆమెను చూసి, "చాలా మంచిపని చేశావు వకుళా! నీ రాకతో నే నెంత సంతోషంగా ఉన్నానో మాటలతో చెప్పలేను."అంది యామిని సంబరపడిపోతూ.
"నేనిప్పుడు కాఫీ తాగ్గానే వెళ్ళిపోతా.మళ్ళీ వచ్చేది సాయంకాలం ఐదుగంటలకే! వీలైతే రాత్రికే ఇంటికి వెళ్ళిపోడం మంచిది. లేకపోతే ఇంట్లో మీ నాన్న రాత్రికి ఒక్కడే ఉండాల్సి వస్తుంది" అన్నాడు రామేశం, యామిని అందించిన బ్రూ అందుకుంటూ.
"ఫరవాలేదు అంకుల్! మా నాన్న ఇదివరకులా కాదు కదా, బాగా కోలుకున్నారు. పైగా, ఆంటీ, అత్తయ్య తోడు ఉన్నారు, ఇంకేం కావాలి! వకుళను నాదగ్గర కొన్నాళ్ళు అట్టేపెట్టుకుంటా, సరేనా అంకుల్!"
వకుళ ఆశగా చూసింది తండ్రివైపు. రామేశం వకుళవైపు ఇబ్బందిగా చూసి, గొంతు సవరించుకున్నాడు. "నువ్విక్కడుండడంలో నాకేమీ అభ్యంతరం లేదు. కాని, రేపటెల్లుండిల్లో ఆ కాకినాడ సంబంధం వాళ్ళు పెళ్ళిచూపులకు వస్తామని రాశారుకదా! సమయానికి నువ్వు అక్కడ లేకపోతే ఎలాగమ్మా? ఈ మాటు కొన్నాళ్ళు ఉండేలా వద్దువుగానిలే." కాఫీ తాగడం ముగించి, స్నానానికి లేచాడు రామేశం.
"యామినీ! ఈ వేళ నువ్వు సెలవుపెట్టు, మనకున్నది ఈ ఒక్కపూటే కదా!" అంది వకుళ దిగులుగా.
"సారీ, వకుళా! ఆఫీసులో చాలా ముఖ్యమైన పనులున్నాయి, ఈవేళ బొత్తిగా మానడానికి వీలుకాని పరిస్థితి! పొనీ, ఓపని చేద్దామా? మనిద్దరం ఒకేచోట ఉన్నట్ల ఔతుంది, నువ్వుకూడా నాతో ఆఫీసుకి వచ్చెయ్యి. "
" నేను రెడీ! నువ్వు పని ఎలాచేస్తావో చూడాలని ఉంది, వస్తా ... మరి మీ బాస్ ఏమంటాడో ?"
"ఫరవాలేదు. బాస్ బొంబాయ్ వెళ్ళారు. మిగిలినవాళ్ళంతా మనవాళ్ళే" అంది యామిని జాలీగా.
రామేశం స్నానం ముగించి వచ్చేసరికి యామిని రవ్వదోశలు వేసి ఉంచింది. బ్రేక్ఫాస్టు ముగించి వెళ్ళిపోయాడు రామేశం. యామిని మరి వంట తలపెట్టలేదు. బ్రేక్ఫాస్టు చేశాక, స్నేహితురాళ్ళిద్దరూ తొందరగా తయారయ్యి ఆటో ఎక్కారు. తొమ్మిదిన్నర అయ్యేసరికి వాళ్ళు ఆఫీసుకు చేరారు.
ఆటోలో ఉండగా అంది వకుళ, "ఈ వేళ ఎలాగైనా ఆ "నస్మరంతి" గాడిని చూడగలననుకున్నా, కాని దొరక్కుండా తప్పించుకు పారిపోయాడు" అంది.
తెల్లబోయింది యామిని. ఆ మాట ఇంకా వకుళ తన హృదయంలో పదిలంగా దాచి ఉంచుకుంటుందని యామిని ఎంత మాత్రం అనుకోలేదు. పరిస్థితులు మారాయి కాని, మాట మిగిలేవుంది. ఏదైనా ఒక విషయం సగం సగంగా చెప్పి వదిలేస్తే, ఎదుటివారి మనసులో, అదేమిటో సాంతం తెలుసుకోవాలన్న కుతూహలం పుట్టి పెరుగుతూ ఉండడం మానవ నైజం. ఆ విషయంలో వకుళ ఒక్కదానికీ మినహాయింపు ఎందుకుంటుంది - అనుకుంది యామిని.
" అయ్యో! చూడాలని ఎంతో ఆశతో వచ్చాను. అంతకంతా అయ్యింది కదా" అంది వకుళ మళ్ళీ
" బాధ పడకు వకుళా! మరోసారి వద్దువుగాని! అప్పుడు తప్పకుండా నీ కోరిక తీరుతుందిలే. ఈ మాటు ఇలా కాదు, కనీసం చక్కగా ఒక వారమైనా ఉండేలా రావాలి."
"హ్హు! ఈ మాటు - అంటే మళ్ళీ ఎప్పుడో! క్రితం మాటు నే నొచ్చి సంవత్సరమ్పైగా అయ్యి ఉంటుంది. అప్పుడు గోపాల్రావుగారే ఉన్నారు."
" మరేం చెయ్యాలి చెప్పు ఇప్పుడు! ఏదో ఒక రోజు నువ్వతన్ని తప్పక చూస్తావు. ప్రస్థుతానికి కొంచెం ఓపిక పట్టాలి మరి, తప్పదు " అంది యామిని నవ్వుతూ.
"సరేగాని, ఆ దుర్మార్గుడు నిన్నింకా అలాగే టీజ్ చేస్తున్నాడా? ఏ కొంచెమైనా బాగుపడ్డాడా? నువ్వెలా పడుతున్నావోగాని, నాకైతే వింటూండగానే అతన్ని చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది, తెలుసా? నువ్వెల్లా పడుతున్నావోగాని!"
" మొదట్లో నాకూ అలాగే అనిపించేది. ఇప్పు డంత బాధ లేదు. తనే మారేడో, లేకపోతే నాకే అలవాటైపోయిందో కనిపెట్ట లేక సతమతమయ్యాను కొన్నాళ్ళు. ఇప్పుడు రెండూ జరిగి ఉంటాయని -పిస్తోంది నాకు! పోనీ ఏదైతేనేంలే, మొత్తానికి ఇప్పుడు రోజులు బాగానే గడిచి పోతున్నాయి, ఫరవాలేదు - అన్న భరోసా చిక్కింది ఇన్నాళ్ళకి."
"నీ మాటలు విన్నప్పుడు నా కనిపించిందీ , ఈయన్ని ఏ అమ్మాయో చాలా పెద్ద దెబ్బే కొట్టి ఉంటుంది. అందుకే గురుడు స్త్రీ జాతి మీదే కసి పెంచుకుని ఉంటాడు. ఆ కసి ఇప్పుడు ఎదురుగా కనిపించిన నీ మీద చూపిస్తున్నాడేమో - అనిపించింది! ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరి కెరుక!" గాఢంగా నిట్టూర్చింది వకుళ.
యామిని వకుళవైపు ఆశ్చర్యంగా చూసింది. కాని ఏమీ మాటాడలేదు.
"ఏమో, యామినీ! నా గెస్ నిజం ఎందుకు కాకూడదూ? మనం, మనలాగే ఆడవాళ్ళందరూ అమాయకులు - అనే భ్రాంతిలో ఉంటాము. కాని ఎంతటి జగజ్జంత్రీలైనా ఉన్నారు లోకంలో! వాళ్ళు అబద్ధాలతో ఆకాశానికి నిచ్చనలు వెయ్యాలని చూస్తారు. వాళ్ళవల్ల స్త్రీజాతి మొత్తానికే తలవంపులు వస్తున్నాయి" అంది వకుళ ఉద్వేగంతో.
ఎప్పుడూ నోరువిప్పి ఒక్క పరుషవాక్యమైనా మాటాడి ఎరుగని వకుళ అంతలా కంఠశోషపడడం యామినికి వింతగాతోచింది. వకుళకు అంత ఆవేశం రావడా నికి కారణం ఏమై ఉంటుందా - అని ఆశ్చర్యపోయింది యామిని. అంతలో ఆఫీసు ముందు ఆగింది ఆటో. మాటల సందడిలో కాలమూ దూరమూ కూడా ఇట్టే కదలిపోయాయి. ఇద్దరూ ఆటో దిగి, చెయ్యీ చెయ్యీ పట్టుకుని మెట్లేక్కి లోపలకు వెళ్ళారు జంటకవుల్లా.
అప్పటికే వచ్చిఉన్న ఆఫీస్ స్టాఫ్ వాళ్ళిద్దర్నీ వింతగా చూశారు, వాళ్ళు ఆమెను చూడడం అదే మొదటిసారి కావడంతో. వకుళ ఇదివరకు, ఒకటి రెండు సార్లు స్నేహితురాలి దగ్గరకు వచ్చి ఉన్నా, ఆఫ్ఫీసుకి రావడం ఇదే తొలిసారి. వాళ్ళ చూపుల్లోని ప్రశ్నకు జవాబుగా యామిని, వకుళను తన ప్రాణాధికమైన స్నేహితురాలిగా, తన సంగీత సాధనకు గురువుగా పరిచయం చేసి, ఈ ఒక్కపూటా తనతో ఆఫీసులో గడపాలని వచ్చిందని చెప్పింది.
వాళ్ళందరూ ఆమెను మనస్పూర్తిగా ఆహ్వానించారు. తిరిగి వాళ్ళను కూడా ఆమెకు పేరుపేరునా పరిచయం చేసి, ఆ తరవాత ఆమెను తీసుకుని తన రూంకి వెళ్ళిపోయింది యామిని.
ఆరోజు రెండు పెండింగ్ లో ఉన్న లెటర్సు ఉంటే, వాటిని వకుళే టైపు చేసింది. అది ఆమెకు ఎంతో సరదాగా అనిపించింది.
"వకుళా! మా కంపెనీ త్వరలోనే ఎక్స్పాండ్ అవ్వబోతోంది, తెలుసా! ఇంతవరకూ మా వాళ్ళు ఫర్నిచర్ మాత్రమే తయారు చేస్తున్నారు, ఇక నుండీ బిల్దింగ్సుకి కావలసిన వుడ్ ఫర్నిషింగ్స్ కూడా తయారుచేసి అమ్ముతారుట - ముఖ్యంగా ఇక్కడ, అంటే ఈ హైదరాబాదులో! ఇక్కడి రియల్ ఎస్టేట్ బిగినెస్తోపాటుగా మైత్రీ వాళ్ళ "ఫర్నిషింగ్స"బిజినెస్ కూడా మూడు పూలు - ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని మా బాస్కి గట్టి నమ్మకం! ఈ ప్రోజెక్టు మా బాస్ బ్రైన్ చైల్డు! దీని గురించి పెద్ద మిత్రాగారికి రాసినప్పుడు నాకు P.A.గా ప్రమోషన్ ఇస్తే బాగుంటుందని రికమెండ్ కూడా చేశాడు. ఆ లెటర్ నేనే పోస్టు చేశా. మొత్తానికి రెండూ గ్రాంట్ అయ్యయి. ఇప్పుడా విషయం ఫైనలైజ్ చెయ్యడానికే, మిత్రాగారు పిలిస్తే బాస్ వెళ్ళారు. "
"మై హార్టీ కంగ్రాట్యులేషన్సు, యామినీ! చెప్పావుకావేమి?" అంది వకుళ సంతోషంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న మొహంతో. అంతలోనే "డిం" ఔతున్న బల్బుకిలా, క్షణంలో మళ్ళీ ఆమె మొహంలో కాంతి తగ్గిపోయింది. "ఏమో బాబూ, ఆ దుర్మార్గుడితో ఎలా వేగుతావో ఏమో మరి! P.A., బాస్ కి మరీ కూడా కూడా ఉండాలంటారు, ఎలా వేగగలవో, ఏమో .... " అంది బిక్కమొహం పెట్టి.
"వకుళా! బాధపడకు. బాస్ తొలిరోజులంత ఘోరంగా ఏం లేడులే! చాలా మార్పు వచ్చింది. చూస్తున్నాకదా .... ! అప్పుడు కూడా వట్టి మాటల ఝాంకారమేగాని, క్రియాత్మకంగా ఎప్పుడూ నాకే అపకారం తలపెట్టలేదు. పైగా , ఇప్పుడు ఈ రికమెండేషన్ కూడా తనే చేశాడు కదా! బాస్ చాలా మారాడు, ఇప్పుడు టీజింగ్ కూడా మానేశాడు! కాని రేపు ఏమిటో ఎవరికీ తెలియదు కదా, వేచి చూడాల్సిందే! నచ్చకపోతే ఇంటికి వచ్చేస్తా,"
"సరా!"
"అలా ఎందుకు నిరాశపడతావు యామినీ! మంచివాళ్ళకు ఆ భగవంతుడు ఎఫ్ఫుడూ మంచే చేస్తాడు. ఏదో ఒకరోజు తెలియకపోదులే మీ బాసుకి కూడా, నీ విలువ ఏమిటో " అంది వకుళ.
"ఏమో వకుళా! నాకు భయంగానే ఉంది. కొత్త పోష్టింగు, పని ఎలావుంటుందో తెలియదు. ఎప్పటిలా వారం వారం ఇంటికి రాగలనో లేనో! నాన్న నా కోసం బెంగ పడి ఏమౌతాడో - అని భయంగా
ఉంది ........" అని దిగులుపడింది యామిని.
" ఆయన్ని గురించి నీ కలాంటి బెంగలేం వద్దు. అంకుల్ కి మేమంతా ఉన్నాము. పైగా నీ కని కొన్ని సెలవులు వుంటాయి కదా! చూడాలనిపించినప్పుడల్లా ఒక ఆదివారం తోడు చూసుకుని, ముందో వెనకో మరో సెలవు పెట్టి వచ్చెయ్, అంతే!"
"ఔనుకదూ! బాగుంది, ఆపనే చేస్తా. ఇప్పుడిక నా బెంగ తీరింది, ఇంక మనం పని మొదలెడదామా " అంది యామిని, ఉత్సాహంగా..
"పనా! ఏమిటది?"
"బాస్ వెడుతూ నాకో పని అప్పగించాడు, తను తిరిగి వచ్చేసరికి ఈ ఆఫీసు మొత్తం రినొవేట్ చేయించి ఉంచాలిట! నిన్న సాయంకాలం ఈ సంగతి సదాశివం బాబాయ్ గారికి చెపితే ఆయన తనకు తెలిసిన ఇంటీరియర్ డెకరేషన్ చేసే ఒక కంపెనీ ఓనర్ ఫోన్ నంబర్ ఇచ్చారు. వెంటనే ఫోన్ చేసి మాటాడాను. ఆయన చెప్పిన కొటేషంకీ మా బాస్ ఖర్చులకని నా చేతికిచ్చిన డబ్బుకీ ఎక్కడా పొంతన కుదరలేదు. ఇప్పుడు నేనేంచెయ్యాలి? రాత్రంతా ఈ ధ్యాసతో నాకు సరిగా నిద్రకూడా పట్టలేదు."
"యామినీ, మన లైబ్రరీలో ఇంటిరియర్ డెకరేషన్ మీద పది పుస్తకాలైనా ఉన్నాయి, అవి ఎవరు చదివారు?"
" అవి నావే! ఒకసారి, నేను నాన్నకి చెప్పి తెప్పించుకున్నా, సరదాపుట్టి. అవన్నీ బాగా స్టడీ కూడా చేశా!"
" మరి ఇకనేం" అంటూ యామిని మాటకు అడ్డొచ్చింది వకుళ. " స్టడీ అయ్యింది కదా, ఇది ప్రాక్టికల్ అనుకుని, ఈ వర్కు నువ్వే ఎందుకు చెయ్యకూడదు? అలా చేస్తే ఖర్చు సగానికి సగం కలిసివస్తుంది."
"అసలే గురుడు టీజింగ్ మాష్టర్ కదా, నేను చేసి, ఒప్పించగలనంటావా వకుళా!"
"ఉష్! మరీ అలా నీళ్ళుకారిపోకు యామినీ! బి బ్రేవ్! ధైర్యే సాహసే లక్షిమి: అన్నారు పెద్దలు! బొంబాయిలో ఉన్నప్పుడు నేను కొన్నాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ మీద కోర్సు చేశాను. సరిగా పూర్తయ్యీవేళలో నాన్నకి ట్రాన్సుఫర్ రావడంతో వదిలేసి రావాల్సి వచ్చింది."
"వకుళా ! యు ఆర్ గ్రేట్ ! నాకు నువ్వు సాయం చెయ్యి, మనమిద్దరం కలిసి పని పూర్తిచేద్దాం " అంది యామిని ఉషారుగా.
"నాన్న కొన్నాళ్ళు నన్ను నీతో ఉండనిస్తే ఎంత బాగుండేదో కదా" అంది వకుళ నిరాశగా. కాని తండ్రి ఉండనిస్తాడన్ననమ్మకం కుదరలేదు ఆమెకు. " నేనున్నా, లేకపోయినా కూడా నువ్వీ పని చెయ్యాలి, చియరప్! యు కెన్ డు ఇట్ సక్సేస్ఫుల్లీ!ఇన్నాళ్ళూ ధియరీ చదివావు కదా, ఇప్పుడిది ప్రాక్టికల్ అనుకో. పనివాళ్ళను పిలిపించి రేపే పని మొదలు పెట్టండి. ప్రతి పనీ చెప్పి చేయించు. మీ వాళ్ళ సాయం తీసుకో! పనివాళ్ళను ఎక్కువమందిని పెట్టు, చెకచెకా పని జరిగిపోతుంది. రేపు నేను ఉండకపోవచ్చు, ఈవేళే మనం వర్కుకి ప్లాన్ తయారుచేద్దాం. చిన్న బిల్డింగు; పెద్దగా టైమేమీ పట్టదు. నాకూ సరదాగానే
ఉంది" అంది వకుళ ఉత్సాహంతో.
"డన్! ఈ వేళ మనిద్దరం కలిసి, ఎక్కడెక్కడ ఏమేం చేస్తే బాగుంటుందో, వేటికి ఏ రంగులు నప్పుతాయో - అన్నీ ప్లాన్ చేసుకుని నోట్సు రాసుకుందాం . అలా చేస్తే నువ్వు నాతోనే ఉన్నావన్న సంతోషమూ ఉంటుంది, నా పని సులువౌతుంది . బాగుంది నీ ఆలోచన, అలా చేద్దా " అంది యామిని నడు,నడు ! "శుభస్య శీఘ్రం!" పని ప్రారంభిద్దాం ఇప్పుడే " అంటూ యామినిని తొందరచేసింది వకుళ.
" ఉండు,ఒక్క క్షణం ! విషయం చెప్పి, ఆఫీసు పని మొత్తం చూసుకోమని వెంకట్రావుగారికి అప్పచెప్పి వస్తా , అప్పుడింక మనం ఫ్రీ !" అంది యామిని నవ్వుతో.
ఇక ఆ పూటంతా ఇద్దరూ కలిసి ఆఫీసు ప్రతి అంగుళం చూసి, ఎక్కడ ఏ రకమైన డెకరేషన్ బాగుంటుందన్న విషయం మీద చర్చించుకుని, ఏకాభిప్రాయానికి వచ్చి, నోట్సు రాసుకుంటూ కాలం గడిపారు. మధ్యలో లంచ్ అవర్లో వెళ్లి దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం చేసి వచ్చి మళ్ళీ పని మొదలుపెట్టారు ఇద్దరూ కలిసి.
వకుళ తను చదివిన దానికి తోడు, బొంబాయి మహానగరంలో తను చూసిన డెకరేషన్లను కూడా మనసులో ఉంచుకుని స్నేహితురాలికి సలహాలు చెప్పింది. వకుళ చెప్పినదెల్లా రాసుకుంటూ, ఇంటీరియర్ డెకరేషన్ మీద, సాయంత్రానికల్లా ఒక పెద్ద నోట్సు తయారు చేసింది యామిని. . అక్కడితో ఆమెకు తానాపని అవలీలగా చెయ్యగలదన్న ధైర్యం వచ్చింది. వెంటనే వెళ్లి పనివాళ్ళకోసం హెడ్గుమాస్తా వెంకట్రావుగారినీ, అక్కౌంటెంటు శశిధర్ నీ సంప్రదించి, వాళ్ళ సహాయం అడిగింది . అందరూ చాలా ఉత్సాహాన్ని చూపించారు ఆ విషయంలో.
నాలుగున్నర కల్లా తను వచ్చిన పని పూర్తవ్వడంతో, రామేశం మైత్రీ ఫర్నిచర్సు ఆఫీసుకి వచ్చాడు, యామినీ వాళ్ళ కొత్త బాసుని ఒకసారి చూసి, పలకరించి వెళ్ళాలని ఆయన ఉద్దేశ్యం. కాని, ఆయనకా ఆలోచన ఉందని తెలియక, బాసు ఊళ్ళో లేడన్న విషయం, పని తొందరలో ఉన్న యామిని ఆయనకు చెప్పడం జరగలేదు. యామిని, వకుళ అక్కడ కనిపించడంతో ఆయన సంతోషించాడు.
"చూడమ్మా యామినీ! గోపాల్రావుగారి స్థానంలో వచ్చినాయన్ని నే నింకా చూడలేదు కదా! ఒకసారి పలకరిద్దామని ఇటువచ్చా" అన్నాడు.
"సారీ, అంకుల్! బాస్ హెడ్డాఫీసుకి వెళ్ళారు. మా ఆఫీసు త్వరలో ఎక్స్పాండ్ చేస్తారుట, ఆ పని మీదే వెళ్ళారు. ఇప్పు డిక్కడ లేరు."
" అంటే?"
"ఈ ఊళ్ళో రియల్ ఎస్టేట్ బిజినెస్ అభివృద్ధి దిశలో ఉండడం చూసి, ఆయనకి ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. బిల్డింగ్ కనష్ట్రక్షన్లో కావలసిన వుడ్వర్కు ముందుగానే, మైత్రీ బేనర్ క్రింద తయారుచేయించి అమ్మితే - అది బాగా లాభసాటి వ్యాపారం ఔతుందనిపించింది ఆయనకు. దానికి బిగ్ బాస్ ఆమోదించారు కూడా! త్వరలోనే ఆ పని మొదలౌతుంది. వర్కు మూడు విధాలుగా ఉంటుందిట! ఒకటి, డిలక్సు - కస్టమ్సు డిజైనింగ్ ! తలుపులూ, ద్వారబంధాలూ మొదలైన వాటిని అందమైన కార్వింగ్సుతో, ప్రత్యేకంగా తయారు చేస్తారుట! వీటిని బాగా భాగ్యవంతుల కోసం చేయిస్తారు, ఖరీదు ఎక్కువ! రెండవది , డొమెస్టిక్! ఇది సింపుల్ డిజైన్లతో బాగా అందంగా, నీట్ గా ఉంటాయిట. ఇవి మిడిల్ క్లాస్ వాళ్ళకోసమట! ఇక మూడోది కామన్! ఇవి దిసగా సాదాగా ఉండి, ఖరీదు బాగా తక్కువలో, కొనేవాడికి లాభసాటిగా ఉంటాయిట. ఇవి సామాన్యులకోసం. నాణ్యత విషయంలో మాత్రం అన్నీ సమానమేనుట! ఇదీ మా బాస్ ప్లాను!"
"గొప్పగా ఉంది ఈ ఆలోచన. ఇంతకీ ఆయన వయసు ఏపాటి ఉంటుం దేమిటి ?"
యామిని నోరువిప్పి మాటాడక ముందే రాజు వచ్చాడు, "మేడం! వెంకట్రావు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. కష్టమర్సు వచ్చారు, బేరం అడుగుతున్నారుట. ఒకసారి రండి మేడం "
యామిని వెళ్లి, వాళ్ళకి బేరం కావాలంటే బాస్ ఊరినుండి వచ్చాక రావలసి ఉంటుందనీ, ఆయన మళ్ళీ సోమవారానికల్లా వచ్చేస్తారనీ చెప్పి పంపించేసి వచ్చింది.
రామేశం ఆ రోజు కారోజే, ఆఖరు బస్సుకి వెళ్ళాలి తప్పదు, అనడంతో, వెంటనే బయలుదేరక తప్పలేదు యామినికి. ముగ్గురూ కలిసి ఆటోలో ఇంటికి వెళ్ళారు. బేగ్ తీసుకుని, అదే ఆటోలో బస్సు స్టాండుకి వెళ్ళాలని ప్లాను.
ఆటోలో ఉండగా రామేశం "మీ నాన్నకి ఏమైనా చెప్పాలా" అని యామిన్ని అడిగాడు.
" విశేషాలని పెద్దగా ఏమీ లేవు అంకుల్! బాస్ వచ్చాక కన్ఫర్ము ఔతుంది, బాస్ కి P.A.గా నా ప్రమోషన్ సంగతి" అంది యామిని.
"నిజమా యామినీ! చాలా సంతోషమమ్మా! మీ నాన్నకి చెపుతా వెళ్ళగానే ఈ సంగతి" అన్నాడు రామేశం.
"మీ కందరికీ కన్ఫర్ము అయ్యాక చెప్పాలనుకున్నా అంకుల్!, కాని మిమ్మల్ని చూశాక ఇక ఆగలేకపోయా. డ్యూటీ ఎలా ఉంటుందో ఏమో, ఏమీ తెలియదు. ఇదివరకులా వారం వారం రాగలనో లేనో అసలు తెలియదు.!"
వకుళ నొచ్చుకుంది. "అలా అన్నింటికీ అధైర్యపడకు యామినీ! సంగీత సాధన చేసుకో, మనసు కుదుట పడుతుంది. ఇంక అంకుల్ విషయంలో నువ్వస్సలు బెంగపడవలసింది లేదు. నే నున్నానుకదా, నాకేం పనుందని! అంతా తీరుబడే కదా ...
నాకూ డిగ్రీ ఉందన్నపేరేగాని, ప్రయోజనం సూన్యం.నా చదువుగాని, సంగీతంగాని మేరేజి మార్కెట్లో గుడ్డిగవ్వ పాటి విలువ కూడా చెయ్యడం లేదు. పెళ్ళిచూపులు పేరుతో ఒకరొకరూ రావడం, పీకలదాకా మెక్కి, తరవాత ఏ మాటా చెపుతామంటూ వెళ్ళిపోయి, కట్నాలనీ, కానుకలనీ ఏవేవో గొంతెమ్మ కోరికలు కోరి, అది తక్కువనో, ఇది తక్కువనో, ఏదో ఒక కుంటిసాకు చెప్పి తోసిరాజనడం! ఇదంతా బొత్తిగా మామూలైపోయింది. దాంతో నాన్న నానాటికీ కట్నం అలా అలా పెంచుకుంటూ పోతున్నారు. వాళ్ళూ ఇంకా ఇంకా కోరికల జాబితాని కూడా పెంచేస్తున్నారు. దీనికి లిమిట్ ఎక్కడో మరి! మొత్తం మీద నాకు పెళ్ళంటేనే అసహ్యం పుడుతోంది. నాకూ నీలా ఉద్యోగం చెయ్యాలని ఉంది. ఈ పీడ పడలేక పోతున్నానంటే నమ్ము!"
"ఉద్యోగం చెయ్యి, కాని నాలా - అని మాత్రం అనకు. తప్పనిసరై ఒప్పుకున్నాడుగాని మా నాన్న, ఉద్యోగం పేరెత్తితే, తక్కువ హడావిడి చేసే వాడా ఏమిటి? ఇదేదో మహా పాతకమైనట్లు బాధపడీ వాడు కాదా" అంది యామిని
వాళ్ళ సంభాషణ విని విని, "కాలం మారకపోదు. ఏదో ఒకరోజున మగవాళ్ళలాగే ఆడవాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసే రోజు రాకపోదులే! అప్పుడు "ఉద్యోగం పురుష లక్షణం" అనడానికి బదులుగా "ఉద్యోగం మానవ లక్షణం" అంటారు. ఆ మంచిరోజు వచ్చేవరకూ, జనం కొంత కాలం ఇలా హడావిడి పడక తప్పదు. " అన్నాడు రామేశం.
"అంకుల్ని తప్పు పట్టకు యామినీ! ఆయన బాధంతా నువ్వు ఒకళ్ళ చేతికింద పనిచెయ్యడం అన్నది ఇష్టం లేక పోడం వల్ల వచ్చినది. పగలంతా, బాస్ అదుపాజ్ఞలలో పనిచేస్తూ, సాయంకాలానికి ఇంటికి అలసి సొలసి రావడం నచ్చక పోదాం వాళ్ళ .. ..."
తన తండ్రిని తనకంటే వకుళే సరిగా అర్థం చేసుకుంది కదా! - అనుకుంది యామిని.
" ఒకళ్ళ చేతికింద పనిచెయ్యడం ఎంత కష్టమో, అది అనుభవించిన వాళ్ళకే తెలియాలి. అది ఆడపిల్లల విషయంలో మరీ కష్టం కావచ్చు. నీ కలాంటి ఇబ్బందులేమీ లేవుకదా" అన్నాడు రామేశం.
వకుళ యామినీ మొహమొహాలు చూసుకున్నారు. "ఇబ్బందులేమీ లేవు అంకుల్. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చి, భరించలేననిపిస్తే, ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే నేను ఇంటికి వచ్చేస్తా! మీరేం దిగులు పడకండి. అంతా బాగుంది కనకనే నేనీ ఉద్యోగం చేయగలుగుతున్నా" అంది యామిని
నమ్మకంగా. ఈ మాటలు తన తండ్రికి చేరుతాయనీ, ఆయనకూడా సంతృప్తి పడతాడనీ ఆశించింది యామిని. ఇంతలో ఇల్లు సమీపించింది.
" యామినీ! మళ్ళీ చెపుతున్నా, అంకుల్ గురించి నువ్వేం ఇదవ్వకు. ఆయనకు నేను కంపెనీ ఇస్తున్నా. ప్రస్థుతానికి ఆయన నాకు సంస్కృతం నేర్పుతున్నారు. చెయ్యి, ఇంకొంచెం స్వాధీనంలోకి వచ్చాక షార్టుహాండ్ కూడా నేర్పుతానన్నారు. రోజూ ఉదయం సాయంత్రం నేను వీణ వాయిస్తూంటే ఆయన పక్కనే కుర్చీలో కూర్చుని, ఎడమచేత్తో తాళం వేస్తూ విని ఆనందిస్తూంటారు. ఇంకేం కావాలి నీకు చెప్పు" అంది వకుళ.
యామినిని ఇంటిదగ్గర దిగ విడిచి, వకుళను తీసుకుని రామేశం అదే ఆటోలో బస్సు స్టేషన్ కి వెళ్ళిపోయాడు. అప్పటి కింకా సదాశివం దంపతులు బాసరనుండి రాలేదు.
* * *
హెడ్డాఫీసునుండి, మిత్రాగారు బహూకరించిన కారు స్వంతంగా హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ బొంబాయి నుండి హైదరాబాదు వచ్చాడు అమరేంద్ర.. ఆనందంతో క్లౌడ్ నైన్ మీద తేలిపోతోంది అతని మనసు. హైదరాబాదు చేరి, ఆఫీసుముందు కారు నొక వారగా పార్కుచేసి, అమరేంద్ర అలవాటైన దారిలో ఆఫీసులోకి వెళ్ళబోయి ఆగిపోయాడు. ఒక్కక్షణం తాను దారితప్పానేమో అని భ్రాంతి పడ్డాడు. తలెత్తి చూసిన అతనిని, "మైత్రీ ఫర్నిషింగ్సు" అన్న, డార్కు చాకొలెట్ బ్రవున్ బోర్డు మీద, ముత్యపురంగు అక్షరాలతో ఉన్న సైన్ బోర్డు ఆకర్షించింది. గుమ్మానికి ఇరువైపులా అందమైన పింగాలీ తొట్టెల్లో ఉన్న"పాం ట్రీ"లు, మెల్లగా వీస్తున్న గాలికి నిడుపైన ఆకులు అల్లనల్లన కదుపుతూ, ఆత్మీయంగా అతనిని ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నాయి. అది చూడగానే అతనికి గుర్తు వచ్చింది, తాను హెడ్డాఫీసుకి వెడుతూ, ఆఫీసు రినోవేట్ చేసీ పని యామినికి అప్పగించి వెళ్ళిన విషయం. ఇంత తొందరగా అంత పని ఎలా ముగిసిందా - అనుకుని ఆశ్చర్యపోయాడు అమరేంద్ర.
లోపల కాలు పెట్టగానే హాలంతా నీట్ గా, ఖాళీగా, విశాలంగా కనిపించింది. పాలమీగడరంగు పెయింటు గోడలకు వేయబడి ఉంది. నేల దగ్గరనుండి అర్ధగజం ఎత్తు వరకూ, డార్కు చేకొలెట్ బ్రవున్ బోర్డర్ ఉండి, దాని మీద గోడ పొడుగునా స్టెన్సిల్డు లతల బోర్డరు అందంగా వేయబడి ఉంది. గఅక్కడక్కడ, ప్రముఖ చిత్రకారులు చిత్రించిన చిత్రపటాల తాలూకు నకళ్ళు , అందమైన ఫ్రేముల్లో బిగించబడినవి, గోడలకు తగల్చబడి ఉన్నాయి. అక్కడ ఫర్నిచర్ ఏమీ లేదు. ఒక వారగా ఒక్క టేబుల్ మాత్రం ఉంది. దానిమీద "రిసెప్షనిస్టు" అని రాయబడిన ప్లేటు, చాకొలెట్ బ్రవున్ మీద ముత్యపురంగు అక్షరాలతో ఉన్నది, పెట్టబడి ఉంది.
" ఓహో! ఇది రిసెప్షన్ హాల్ కాబోలు! గొడౌన్ నుండి తగిన ఫర్నిచర్ తెప్పించి దీన్ని నింపాలసి ఉంది కాబోలు. " అనుకున్నాడు అమర్.
గదిలో కూడా రెండు ఇండోర్ ప్లాంట్సు, పింగాళీ తొట్టెల్లో వేయబడినవి, ఒకవారగా పెట్టబడి ఉన్నాయి. తలుపులన్నింటికీ కూడా చాకొలెట్ కలర్ వేయబడి , ముత్యపు రంగుతో వంచలు తీర్చబడి ఉన్నాయి. తనకు ఎంతో ఇష్టమైన కలర్ స్కీం ఇది, తన అభిరుచిని గురించి బాగా తెలిసినవాళ్ళు ఎవరో ప్లాన్ చేసినట్లుగా ఉంది అంతా! అది చూసి అశ్చర్యపోయాడు అమరేంద్ర .
అతని రాకను గమనించి, పరుగునవచ్చాడు రాజు. తన చేతిలోఉన్న బ్రీఫ్ కేస్ రాజుకి ఇచ్చి, అతడు చుట్టుపక్కల పరిలించసాగాడు. ఆ ప్రదేశమంతా అతనికి ఎంతో కొత్తగా కనిపిస్తోంది. ఇదివరకు మూసివున్న గదుల తలుపులు ఇప్పుడు తెరిచి ఉన్నాయి. చాకొలెట్ బ్రౌన్ తలుపులమీద, అక్కౌంటెంట్, హెడ్ క్లర్కు, సెక్రెటరీ, డైనింగ్ రూం, స్టొర్ రూం ... ఇలా నేమ్ ప్లేట్సు తగిలించబడి ఉన్నాయి. ఆ పేర్లు ముత్యపు రంగులో రాయబడి ఉన్నాయి. ఫర్నిచర్ అంతా పోలిష్ చెయ్యబడి కొత్తదానిలా మెరుస్తోంది. అన్ని గదుల్లోనూ అందమైన సీనరీల తాలూకు పటాలు గోడకు అక్కడక్కడ తగిలించబడ్డాయి. ప్రతి టేబుల్ దగ్గరా పేముతో అల్లిన తగుమాత్రపు పరిమాణం గల బుట్ట ఒకటి పెట్టబడి ఉంది, చెత్త వెయ్యడం కోసం. డైనింగ్ హాల్లో ఒక వారగా స్టూలుమీద, తాగు నీటి సరఫరా కోసం ఒక కుళాయితో ఉన్న స్టీల్ డ్రమ్ము ఒకపక్కగా ఉంచబడింది. పక్కనే మరో స్టూలు మీద స్టీల్ ట్రే లో మూడు స్టీలు గ్లాసులు ఉన్నాయి. కడిగిన నీళ్ళు, కలెక్టు చేసుకునేందుకు, ఒక ప్లాస్టిక్ టబ్బు కుళాయి కింద పెట్టబడింది.
అదంతా చూసి, "ఎవరు చేసేరోగాని ఈ పని, ఎంతో చక్కగా ఉంది ఈ అమరిక! ఆఫీసు చాలా బాగుంది ఇప్పుడు" అని, అనుకోకుండా ఉండలేకపోయాడు అమరేంద్ర.
హెడ్డాఫీసుకు వెళ్ళే ముందు, ఏదో ఉద్వేగం ప్రోత్సహించగా యామినికి చెప్పి వెళ్ళేడేగాని, అదింత తక్కువ వ్యవధిలో, ఇంత పకడ్బందీగా జరుగుతుందని అతడు అనుకో లేదు. అసలు ఆ తరువాత, ఆ సంగతే మర్చిపోయాడు. "అద్భుతం! అంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ పని అంత తక్కువ వ్యవధిలో ఎలా చేయగలిగారు! డెకరేటర్సు ఎవరోగాని చాలా చురుకైనా వాళ్ళూ ! సింపుల్ అండ్ ఎఫిషియంట్ గా చేశారు పనంతా! వర్కు చూస్తే అద్భుతం"అనుకున్నాడు మెచ్చుకోలుగా.
యామిని ఆఫీసులోనే ఉంది - అన్నదానికి గుర్తుగా టైపుమిషన్ చప్పుడు వినిపిస్తోంది. ఈ వారం రోజులుగా నిర్లక్ష్యం చేసిన పని, బాస్ వచ్చేసరికి పూర్తి చేసి రెడీగా ఉంచాలని ఆమె చాలా పట్టుదలగా పనిచేస్తోంది. పని చాలా వరకు పూర్తైపోయింది. మిగిలిన కొంచెమూ కూడా ఐపోతే, వాటిమీద బాస్ చేత సంతకాలు చేయించి, ఆమె వాటిని పోష్టు చేయించవలసి ఉంది. ఏకాగ్రతతో టైపు చేస్తున్న యామిని బాసు వచ్చిన సంగతి గుర్తించనే లేదు.
కక్ష్యాంతరాలన్నీ గడిచి, తన రూంకి చేరుకున్న అమర్ ని, గుమ్మం దగ్గర, గుమ్మానికున్న స్ప్రింగ్ డోర్ పట్టి నిలబెట్టింది. అతడు దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ కొంచెం సేపు అక్కడే నిలబడ్డాడు. ఆ తరవాత దాన్ని తెరుచుకుని లోపలకు కాలు పెట్టిన అతనికి ఆ డెకరేషన్ చూస్తూంటే థ్రిల్లింగ్ గా ఉంది. గదిలో అడుగు పెట్టగానే రూం ఫ్రెషెనర్ నుండి వచ్చిన మల్లీజాజుల పరిమళం, రాత్రంతా నిద్రమానుకుని డ్రైవ్ చేసిన బడలికని తీర్చేదిగా ఉంది. టేబుల్ మీద ఉన్న చాకొలేట్ బ్రవున్ సిరామిక్ ఫ్లవర్ వాజ్ లో ఉన్న క్రీమ్ కలర్ తాజా గులాబీలు, నవ్వుతూ తనను పలకరిస్తున్నా యనిపించింది అమర్ కి ఒక్కక్షణం! గ్లాస్ టాప్ తో ఉంది టేబుల్! గదిలోని ఫర్నిచర్ అంతా నీటుగా పోలిష్ చేసి, కొత్తగా వార్నీష్ వెయ్యబడి, సరికొత్తవాటిలా మెరిస్తూ ఉంది. కుర్చీలకున్న కొత్త కవర్లు తొడిగిన కుషన్లు వాటి అందాన్ని ఇనుమడింప జేస్తున్నాయి. అందమైన డిజైన్ లో పేముతో అల్లిన చిత్తుకాగితాలబుట్ట ఒకటి టేబుల్ కింద ఉంది. ఇలా ఒకటేమిటి - ప్రతివస్తువు, ఏదో ఒక ప్రత్యేకతతో ఉండి,అవక్కడ అమర్చినవారి టేస్టుకు, ప్రతిభకు ప్రతీకలై, చూపరులకు వారి ప్రజ్ఞను, చెప్పకనే చెపుతున్నాయి! అమరేంద్రకు ఆ కలర్ స్కీం, ఆ అమరికలోని అందం ఎంతో బాగా నచ్చాయి. లెదర్ కుషన్ ఉన్న సీట్ తో, ప్రత్యేకంగా ఉన్న తన కుర్చీలో కూర్చోగానే అతనికి ఒకవిధమైన గగుర్పాటు కలిగింది. . బ్రీఫ్ కేస్ తెచ్చి, కుర్చీ పక్కన ఉంచి, ఏదైనా పని ఉందేమో కనుక్కోడానికని, చేతులు కట్టుకుని ఒక పక్కగా నిలబడిన రాజుని అడిగాడు అమర్.....
" రాజూ! మన ఆఫీసును ఇంత అందంగా చక్కదిద్దినవాళ్ళు ఎవరు? ఈ ఊరివాళ్ళేనా లేక బొంబాయి నుండిగాని, మద్రాసునుండిగాని వచ్చారా? " వాజ్ పక్కనే ఉంచబడిన, ఒకే ఆకుతో ఉన్న విరిసీ విరియని క్రీంకలర్ గులాబీ రెమ్మని చేతిలోకి తీసుకుని గాఢంగా వాసన పీలుస్తూ. సున్నితమైన గులాబీ పరిమళం అతని ని సేదదీర్చేదిగా ఉంది.
" పై వాళ్ళు ఎవరూ రాలేదుసార్, పనివాళ్ళుమాత్రమే వచ్చారు. యామినీ మేడం దగ్గరుండి అందరికీ చెప్పి మరీ చేయించారండి పని మొత్తం!."
" నిజమా!" ఆశ్చర్యపోయాడు అమరేంద్ర. ఒక పల్లెటూరి అమ్మాయికి ఇంత టేస్టు ఉందన్నది అతనికి ఒకపట్టాన నమ్మశక్యం కాలేదు. రాజుకి శలవిచ్చి పంపేసి బజ్జర్ నొక్కాడు అమర్. కొద్ది వ్యవధిలో యామిని వచ్చి విష్ చేసింది. ఆమె చేతిలో కొన్ని బిల్లులు జమాఖర్చుల తాలూకు పద్దులూ ఉన్నాయి.
చేతిలోని గులాబీనే చూస్తున్నవాడల్లా, అమరేంద్ర తలపైకెత్తి, యామిని మొహంలోకి చూస్తూ ఆమెను తిరిగి విష్ చేశాడు. అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, "మై థాంక్సు అండ్ హార్టీ కంగ్రాట్యులేషన్సు టూ యు!" అన్నాడు.
"నాకెందుకు బాబూ ఈ థాంక్సు, మెచ్చుకోళ్ళూ! వంకలు వెతికి నా చెవులకు చెప్పులు కట్టకుండా ఉంటే అదే పదివేలు" అనుకుంది యామిని లోలోన.
ఆమె మౌనాన్ని అతడు పట్టించుకోలేదు. " డెకరేషన్ సుబర్బు! అంతా నువ్వే చేశావా, లేక ఎవరైనా నీకు సాయం చేశారా" అని అడిగాడు.
యామినికి వకుళ గుర్తొచ్చింది. ఆమెను గురించి చెపుదామనుకుంది. కాని గురుడు ఎప్పుడు ఏ మూడ్ లో ఉండి ఏమంటాడో ఏమో నన్న భయం ఆమెకు ఇంకా పోలేదు. వకుళను గురించి అతనికి చెప్పడం అంత మంచి పని కాదేమో" అనిపించి నోటి చివరకంతా వచ్చిన మాటను దిగ మింగేసింది ఆమె.
అతనింకా మాట పూర్తి చెయ్యలేదు. " అంతా నువ్వే ప్లాన్ చేశావా? చాలా మంచి టేస్టు ఉంది నీకు. అంతే కాదు, నాకు ఏ కలర్ కాంబినేషన్సు ఇష్టమో వాటినే నువ్వు వాడావ్! అంతా, అచ్చం నా టేస్టు తెలిసి చేసినట్లు ఉంది. ఐ యాం థాంకింగ్ యు అగైన్! కూర్చో యామినీ, ఈ వారమంతా నువ్వు ఎడతెగని పరిశ్రమ చేసి బాగా అలసిపోయి ఉంటావు. కేవలం వారం రోజుల్లో ఇంతపనా!"
" ఏమిటి ఈ వేళ గురుడు నన్నిలా పొగిడేస్తున్నాడు! ఆహా! ఏమినా భాగ్యం" అనుకుంది యామిని తనలో. కాని, పైకి మాత్రం, " దానిలో పెద్ద విశేషమేముంది సర్! చిన్నప్పుడు చదువుకున్న విలోమానుపాతం లెక్కలు గుర్తు చేసుకున్నా. ఒక పనిని పదిమంది కలిసి పదిరోజుల్లో చేస్తే , అదే పనిని ఐదురోజుల్లోనే పూర్తి చెయ్యాలి అంటే ఏంచెయ్యాలి - అని ఆలోచించా. అంతే, నా ప్రోబ్లం సాల్వైపోయింది!
ఎక్కువమంది పనివాళ్ళు పనిచేసి, తక్కువ వ్యవధిలో పనిని ముగించారు. ఐనా, పనిలోని క్రెడిట్ అంతా నాది కాదు, మన స్టాఫ్ అందరూ కష్ట నిష్టూరాలను ఓర్చుకుంటూ నాకు అడుగడుగునా సాయ పడ్డారు. నిజం చెప్పాలంటే ఇదంతా ఒక సమిష్టి కృషి ఫలం!" అలా అన్నప్పుడు ఆమె మనసంతా వకుళ చేసిన సాయానికి కృతజ్ఞతతో నిండిపోయింది.
తనుతెచ్సిన బిల్లుల్ని అతని ముందు ఉంచుతూ, "మీ రిచ్చిన డబ్బు మొత్తం ఖర్చయ్యింది. ఆఖరు పైసా వరకూ ఉపయోగించా. ఇవిగో బిల్లులు, జమాఖర్చుల తాలూకు లెక్కలు" అంది యామిని.
అంతలో రాజు ఆరోజు వచ్చిన పోస్టు తెచ్చాడు. యామిని వాటిని అందుకుని, సార్టు చెయ్యడం మొదలుపెట్టింది.
"ఏమో అనుకున్నానుగాని, ఈ పల్లెటూరిపిల్ల సామాన్యురాలు కాదు. రెండుపక్కలా పదునున్న చాకు! చురియ! ఎంత వద్దనుకున్నా కూడా, ఎవరూ ఈమెను మెచ్చుకోకుండా ఉండలేరు. హేట్సాఫ్ టుయు, యామినీ ప్రియదర్శినీ! హేట్సాఫ్ టు యు" అని మనసారా, మనసులోనే అనుకుంటూ ఆమె వైపు మెప్పుగా చూశాడు అమరేంద్ర.
కాని, తలవంచుకుని, లెటర్సు సార్టు చేస్తున్న యామిని అది గమనించలేదు.
** *
అసుర సంధ్యవే వేళయ్యింది. వంట ముగించి వచ్చి, భర్తతో తీరుబడిగా కబుర్లు చెపుతూ హాల్లో కూర్చుంది శారదాంబ. భార్య చెప్పే కబుర్లతో పాటుగా రేడియోలో వస్తున్న పాటలు కూడా వింటున్నాడు సదాశివం. ఏదో మాటల సందర్భంలో యామిని ప్రసక్తి వచ్చింది. ఏ కారణం చేతనోగాని అప్పటి కింకా ఆఫీసునుండి ఇంటికి రాలేదు యామిని. సదాశివం దంపతులు ఆమె రాకకోసం ఎదురు చూస్తున్నారు.
"అన్నీ ఉన్నాయిగాని, అంచుకు తొగరే లేదన్నాట్ట వెనకటి కొకడు! అలా ఉంది ఈ యామిని తీరు! అందం - చందం, మంచిబుద్ది, చదువు - సంధ్య ... ఇలా అన్నీ ఇచ్చిన ఆ భగవంతుడు ఆమెకు రవంత అదృష్టం ఇవ్వడం మాత్రం మర్చిపోయినట్లున్నాడు, అదేమి పాపమో! సుఖాన ఉండ వలసిన ప్రాణాన్ని దు:ఖాన పెట్టాడు. సకాలంలో పెళ్ళి చేసి ఉంటే ఈ సరికి ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యివుండేది. అలాంటిది, పుట్టింటి భారాన్ని నెత్తికెత్తుకుని, మగరాయుడిలా ఉద్యోగం చేస్తూ; ఎండనక, వాననక బస్సులట్టుకు తిరుగుతూ కష్టపడుతోంది, పాపం! తల్చుకుంటే జాలేస్తుంది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. ఇప్పుడేమో కునిష్టి తండ్రి భారం మొయ్యాల్సి వస్తోంది! తోలుక్రింది రాత దొంగరాతట!మనిషి మొహాన ఆ బ్రహ్మ ఏం రాశాడన్నది అనుభవంలోకి వచ్చాక గాని ఎవరికీ తెలియదు కదా!ఎప్పుడు ఎవరి బ్రతుకు ఎలాగుంటుందో ఎవరికెరుక!" అంది శారదాంబ యామినిమీద బోలెడు సానుభూతి కురిపిస్తూ.
"యామిని కేమిటే, మేలిమి బంగారం లాంటి పిల్ల! ఎందుకొచ్చిన బీదార్పులివి? కాలం చాలా మారింది. కాలంతోపాటు విలువలూ మారుతూంటాయి. మంచానపడి జబ్బుతో తీసుకుంటున్న ఆ విశ్వనాధంగారికి ఉన్నది ఈ ఒక్క బిడ్డే! కొడుకైనా, కూతురైనా ఈమేగా! కష్టం వచ్చిందని, కాళ్ళు బారజాపుకు కూర్చోకుండా, సమర్ధత గల పిల్ల కనక, వెంటనే ఉద్యోగంలో చేరి, ఇల్లు నిలబెట్టింది. ఇలా అమ్మాయిలు కూడా కుటుంబానికి ఆసరా ఐతే ఇక వాళ్ళకి ఆడ (అక్కడి) పిల్లలు అనే అపవాదు ఉండకుండా పోతుంది. ఆ తరవాత ఎవరికీ ఆడపిల్లని "మైనస్ పోయింట్" అని వేలెత్తి చూపించే సాహసం ఉండదు. ఆడ, మగా అన్న తేడా లేకుండా అప్పుడు, పిల్లలంతా ప్లస్ పోయింట్లే ఔతారు" అన్నాడు సదాశివం సరదాగా .
శారదాంబ మూతి మూడు వంకరలు తిప్పి అంది, "ఏమో, అందరూ ప్లస్ పోయింట్లే ఔతారో లేక మొత్తం అందరూ మైనస్ పోయింట్లే ఔతారో మనకెందుకుట! మనకసలు పిల్లలే లేరు కదా ...."అంటూ దీర్ఘం తీసింది శారదాంబ.
భార్య సంభాషణ ప్రస్థుతం నుండి అప్రస్థుతం వైపుకి మళ్ళే సరికి కంగుతిన్న సదాశివం తెలివిగా మాట మార్చే ప్రయత్నం చేశాడు.
"ఔనుగాని శారదా! యామిని ఇంకా ఇంటికి రాలేదేమిటి? వేళదాటింది కదూ?"
"ఆ! అదే నేనూ అముకుంటున్నాను. ఏమయ్యిందో ఏమో! ఎప్పుడూ ఇంత లేటు కాలేదు మరి! ఎప్పుడు వచ్చి, ఒండుకు తిని, ఎప్పుడు పడుకుంటుందో ఏమో.... మళ్ళీ తెల్లారకుండా లేచి కూచుంటుంది!"
"చీకటి పడింది, ఏ ఒడిదుడుకులూ పడకుండా ఇల్లు చేరితే చాలు, రేపు కొంచెం పొద్దెక్కి లేస్తుందిలే, మరేం ఫరవాలేదు" అన్నాడు సదాశివం.
"ఈ పిల్లకలాంటి శతభిషలేమీ నచ్చవు. ఏ రోజునా తెల్లారకముందే లేచి, యోగా అనీ, వ్యాయామమనీ, చదువనీ, సంగీతమనీ - ఏవేవో సాధనలు మొదలుపెడుతుంది. ఆ తరవాత స్నానం, ఆ పైనే కాఫీ తాగినా టిఫిన్ తిన్నా! అప్పుడు వంట చేసుకుని, కొంచెం బాక్సులో సద్దుకుని, మిగిలిందేమైనా ఉంటే రాత్రికి దాచుకుని, ఇంటికి తాళం పెట్టుకుని ఆఫీసుకి బయలుదేరుతుంది. ఏ రోజునా ఈ రొటీన్లో రవ్వంత మార్పు కూడా ఉండదు, తెలుసా" అంది. ఈరోజు ఎందుకనో శారదాంబకు యామినిమీద వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చింది.
" ఫరవా లేదులే! ఈ వయసులో ఎవరికైనా ఆపాటి శక్తి ఉంటుంది."
ఇంతలో గేటు చప్పుడయ్యింది. గేటు తెరుచుకుని యామిని లోపలకు వచ్చి, గేటు మూసి గడియపెట్టి, ఇంట్ళోకి వచ్చింది. ఆమెను చూడగానే సదాశివం దంపతుల మొహాలు వికసించాయి.
"వచ్చవామ్మా! నీకు నూరేళ్ళు ఆయుశ్శు! మీ బాబాయీ నేనూ ఇందాకటినుండీ నీ మాటే అనుకుంటున్నాము, లేటయ్యిందేమా - అని. "
వెంటనే సంజాయిషీ ఇచ్చుకుంది యామిని. "ఈ వేళ ఎందుకనో, సిటీ బస్సులు చాలా రద్దీగా ఉన్నాయి పిన్నిగారూ! కాస్త ఖాళీ ఉన్నబస్సు కోసం ఎదురు చూస్తూ నిలబడితే రావడానికి ఇంత లేటయ్యింది!. నుంచుని నుంచుని కాళ్ళు పడిపోయాయి" అంది యామిని ఇబ్బందిగా మొహం పెట్టి.
"అలాగామ్మా! ఇక ఈ రాత్రికి వంట చేసుకునీ పని పెట్టుకోకు, మాతోపాటు నువ్వూ భోజనం చేద్దువుగాని." జాలిపడ్డాడు సదాశివం.
ఆయనా మాట అనగానే, "వద్దు బాబాయ్ గారూ! పొద్దున్న వండినవే చాలా మిగిలి ఉన్నాయి. ఈ పూటకి అవి చాలు నాకు. మీరేమీ అనుకోకండి" అంది యామిని, శారదాంబగారి బొమముడి వైపు చూస్తూ. ఆ తరవాత వాళ్ళకు "వస్తా" నని చెప్పి, తన వాటాలోకి వెళ్ళి తలుపు వేసుకుంది.
యామిని తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోగానే శారదాంబ భర్తను దుయ్యబట్టింది. "మీకేం, మగమహారాజులు! వేళకాని వేళల్లోనైనా సరే , ఎంతమందికైనా ఇట్టే భోజనానికి రమ్మని చెప్పేస్తారు, ఆ తరవాత పడే పాట్లన్నీ మావి కదా! నే నిప్పుడు మనిద్దరి కోసం కటా కటీ, బొటాబొటీగా కాస్తంత వండుకుని కూర్చున్నాను. దాంట్లో మరో మనిషికి వాటా పెడితే ఎవరి కడుపు నిండుతుందో చెప్పండి? "
"సర్లేవే! ఆ పిల్ల ఒప్పుకోలేదుకదా, ఇంకా ఎందుకా గోల? నీ కల్లబొల్లి మాటలు విని విని, ఆ అమ్మాయిమీద జాలిపుట్టి, ఇప్పుడు మొదలెడితే ఎప్పటికి వండుకుంటుంది - అనిపించి, అలా అన్నాను. సర్లే ! నాకు ఆకలేస్తోంది. పద, వడ్డించు" అంటూ లేచి వంటగదిలోకి దారితీశాడు సదాశివం.
వెడుతూ మనసులో,"కావాలంటే, గుప్పెడు బియ్యం కడిగి గాస్ స్టౌ మీద పడేస్తే ఎంతసేపట్లో ఉడుకుతాయిట! దీని మాటలు ఎప్పుడూ ఇంతే, శుష్క ప్రియాలూ, శూన్యహస్తాలూను. మనసుంటే మార్గం ఉండకపోతుందా ఏమిటి" అనుకున్నాడు సదాశివం.
ఆయన మనసులో మాట తెలిసిన దానిలా కస్సుమంది శారదాంబ, "ఇదిగో, మీకే చెపుతున్నా, గుర్తెట్టుకోండి - మీరుగాని ఎవరినైనా భోజనానికి పిలవదల్చుకుంటే, ఒక పూట ముందుగా నాతో చెప్పండి, చక్కగా నాలుగు రసవర్గాలూ వండి వడ్డిస్తా. అంతేగాని, ఇలాంటి చిలక్కొట్టుడు వ్యవహారాలు మాత్రం నాకు సుతలాం నచ్చవుసుమండీ" అంది ఆయనకు భోజనం వడ్డిస్తూ.
(సశేషం)
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)