కవితా స్రవంతి
ఊండెడ్ హార్ట్
- అయినంపూడి శ్రీలక్ష్మి
పింక్ హోప్
నా చిన్నప్పుడు
మా వీధి మొత్తం మీద
రెండు జడల అమ్మయిని నేనే
అమ్మతో గొడవపడి
అల్లరి చేసి, అరచీ
రెండు జడలు వేయించుకునేదాన్ని
రిబ్బ్న్-
నా వెంట్రుకల పాయలని
ఒక్కటిగా అల్లేది
స్తెప్పులుగా కలసిపోయి
నా కురులకు కొనసాగింపు అయ్యేది
అమ్మెప్పుడూ
పచ్చ రిబ్బన్లే అల్లేది
నాకేమో
లేలేతగా కన్పించే
గులాబీ రిబ్బన్ బాగా నచ్చేది
అప్పుడు-
అంతగా ఆశపడినందుకేనేమో
ఇప్పుడు-
పింక్ రిబ్బన్
నా కొత్త
సహచరి అయ్యింది
పింక్ రిబ్బన్
నా బ్రతుకు పతాక అయ్యింది
కొత్త జన్మపు
జీవ శ్వాస అయ్యింది
గుండెలకి రక్షణ లేకపోవటమంటే
కొత్త ధైర్యం రావటమని
అర్ధం అయ్యింది
చంద్రుళ్ళను కోల్పోవటమంటే
నిశీధి చీకటి కాదని
కొత్త సూర్యోదయమని తెలిసొచ్చింది
అందుకే
పింక్ రిబ్బన్ తో
గుండెలకి రక్షణ్ లేకపోవటమంటే
కొత్త ధైర్యం రావటమని
అర్థం అయ్యింది
చంద్రుళ్ళను కోల్పోవటమంటే
నాలాంటి కోట్లాది స్త్ర్రీల గుండెలో
జీవనేచ్చను నింపటానికి
నేను కదం తొక్కాను
కొత్త బతుకును జీవించటానికి
నేను-
ఆశాగీతం పాడుతున్నాను
ఇంతకాలం ఆడపిల్లని
వేరేవరి గుండెల పైన్నో కుంపటి అన్నారు
ఆడపిల్ల గుండ్ల్లోనే కుంపట్లు వున్నాయని
ఇప్పుడు ప్రకటించాలి
ఆ కుంపట్లను చల్లార్చడానికి
ఆత్మస్ధైర్యపు నీటి రిజర్వాయర్లను కూడా నిర్మించాలి.
నా ప్రియ స్నేహితా!
ఆప్త జీవనీ-
గాయాలు-బాధలు
దు:ఖాలు-వేదనలూ,
ఖండనలూ, దండనలూ
మనకు కొత్తకాదు కదా!
అనాదిగా ప్రతిగాయం మనల్ని
మరింత పదును తేల్చింది కదా!
ప్రతి విషాదం మనలో
ఇంకొంత విశ్వాసాన్ని
పాదుకొల్పింది కదా
ప్రతి భూకంపం-
మనలో మళ్ళీ గూడు నిర్మించుకునే
స్థైర్యాన్ని నింపింది కదా!
ఇదీ అంతే-
నా సహచరీ,
ఆకులు రాలడమంటే
వసంతం ఆగిపోవడం కాదుకదా
కొమ్మలు విరగడమంటే
చెట్టు నేలకూలడం కాదుకదా
మబ్బు కురవడమంటే
ఆకాశం కరగడం కాదుకదా
ఫైల్ కరప్ట్ కావడమంటే
సిస్టమ్ కొలాప్స్ అవడం కాదుకదా
పింక్ స్లిప్ అంటే జాబ్ లోంచి
తీసేయడమేకానీ,
ఉద్యోగంలోంచి రిటైర్మెంట్ కాదుకదా
ట్రోజన్ హార్స్ రావడమంటే
గ్రీక్ నాగరికత అంతం కాదుకదా
అమావస్య ఆగమనమంటే
పున్నమి చరమాంకం కాదుకదా
వక్షోజాలు రాలిపోవడమంటే
అక్షయ పాత్రలాంటి మనసు మోడువారడం కాదుకదా
అందుకే ఈ గుండె కోతని
గుండెల్లో కొత్తకాతగా మలుచుకుందాం.
ప్రసవమంటేనే కొత్తజన్మ
కనీసం రెండు సార్లయినా
పునర్ జన్మించిన వాళ్ళం
ఇపుడు మనకోసం
మరోసారి సరికొత్తగా జన్మ్దిద్దాం
ఫీనిక్స్ లా పునరుత్ధానం పొందుదాం.
ఈ రాచపుండుని
దేహ సంస్కృతిలోని కొత్త పండుగగా ఆహ్వానిద్దాం
ఉరోజ రాహెత్యదశని
ఇనాళ్ళూ స్త్రీత్వం పేరిట
వేసిన సంకెళ్ళు నుండి విముక్తిగా భావిద్దాం
జీవన పుస్తకంలో
కొత్త పాఠంలా చదువుకుందాం
ఈ స్తనాతీత దిశని
మహిళా ప్రస్థానంలో
నవయుగోదయం అని చాటి చెపుదాం
ఈదురు గాలి వీచిందని
గడ్డిపువ్వు పూయకుండా ఆగదు
తుఫాను వచ్చిందని
పంటలు మొలకెత్తకుండా ఉండవు
కొమ్మలు విరిగి పోయాయని
వృక్షాలు ఏడుస్తూ కూర్చోవు
చీకట్లు ఆవరించాయని
మళ్ళీ సూర్యోదయం వెలుగులు చిందకుండా ఉండదు
న ప్రియ సహోదరీ,
రా....
ఇప్పట్నుంచీ
’షీ’గా కాకుండా
మని’షి’గా జీవిద్దాం.....
లే..... నిలబడు.....
ఇప్పట్నించీ
’జెండర్’ గా కాకుండా
’జెండా’యై నడుద్దాం.......
(అయిపోయింది.)
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)