ఈ మాసం సిలికానాంధ్ర
సిలికానాంధ్ర సేవలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు
కూచిపూడి నాట్యారామం అధ్యక్షునిగా కూచిభొట్ల ఆనంద్ పదవీ స్వీకారం
శ్రీ కూచిభొట్ల ఆనంద్ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ల సమక్షంలో కూచిపూడి నాట్యారామం అధ్యక్షునిగా పదవీ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ కూచిపూడి నాట్యకళకు ప్రపంచస్థాయి వేదికను రూపొందించేందుకు తనపై విశ్వాసంతో ఈ పదవిలో నియమించిన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు, సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తనకు నిరంతరం సోదర వాత్సల్యాన్నిపంచుతున్న శ్రీ మండలి బుద్ధప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కూచిపూడి నాట్యకళా వికాసానికి గత అనేక సంవత్సరాలుగా సిలికానాంధ్ర తరపున చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చిన ఈ పదవిని వినయపూర్వకంగా, ఒక బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. కూచిపూడి సంప్రదాయ కళాకారులు, ఆ కళ ఉన్నతి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న నర్తకీ నర్తకులు, నాత్య గురువులకు కూచిపూడి నాట్యారామాన్ని నిర్మించి అందించడం ఎంతో కాలంగా తనకు ఒక స్వప్నంగా ఉందని చెప్పారు.
ప్రపంచంలో కూచిపూడి లాంటి అద్భుతమైన నాట్యకళారూపాలు చాలా అరుదుగా ఉన్నాయని, ఆరు శతాబ్ధాల చరిత్ర కలిగిన ఈ నాట్యసంప్రదాయాన్ని పరిరక్షించి, కూచిపూడిని ప్రపంచ వారసత్వ నగరాలలో ఒకటిగా నిలబెట్టడం తమ లక్ష్యమని ఆనంద్ వివరించారు.
శంకుస్థాపన జరిగిన ఇరవై నాలుగు నెలల కాలంలో భారతదేశానికే తలమానికంగా ప్రపంచంలోనే అరుదైనదిగా నాట్యారామాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. నాట్యారామాన్ని సందర్శించిన వారు ముగ్ధ్లులై నాట్యన్ని అభ్యసించడం ద్వారా గానీ, తమ పిల్లలకు ఆ కళను నేర్పించడం వల్లగానీ ఇతోధికమైన కళా ప్రాచుర్యం కలిగించాలని భావించేలా వాతావరణం కల్పిస్తామని అన్నారు.
ఇప్పటికే అమెరికా తదితర దేశాలలోని ఇటువంటి సంస్గలను సందర్శించి కూచిపూడి నాట్యారామ రూపకల్పనకు ఒక ప్రణాళికను రూపొందించామని, తెలుగు నేల గర్వపడేలా ప్రపంచస్థాయి నాట్యారామాన్ని నెలకొల్పుతామని కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూచిపూడి నాట్యారామానికి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ నాట్య గురువులు, నర్తకీ, నర్తకులు పాల్గొన్నారు.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)