సారస్వతం
సాహిత్యంలో చాటువులు -16
- ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు
"శబ్దమనే జ్యోతి వెలిగి ఉండక పోతే, ఈ సర్వ జగత్తు అంధకార బంథురమై ఉండేది.”
అనేవాక్యం శబ్దం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కనుకనే ‘శబ్ద బ్రహ్మ’ అని శబ్దాన్ని బ్రహ్మతో పోల్చారు. అక్షర సమూహమే శబ్దం. అక్షరాలు నవ్విస్తాయి, కవ్విస్తాయి, మునుముందుకు నడిపిస్తాయి, మానవ మనుగడలను తీర్చి దిద్దుతాయి. అందుకే మంచి సాహిత్యం అప్రతిహతంగా నేటికీ కొనసాగుతునే ఉంది. ఉంటుంది కూడ. సాహిత్యం యొక్క గొప్పతనాన్ని తెలిపే ఒక చిన్నికథని తెల్పి ఈనెల చాటువులని వివరిస్తాను.
“ చాణుక్యుడు రాజనీతిలో, అర్థ శాస్త్రంలో చాల గొప్పవాడని మనకి తెలుసు. అంతే కాదు ఋజువర్తనుడు, ఆచరణ శీలికూడ. ఎలాగో చూడండి. ఇది ఈనాటి రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, అందరూ తెలుసుకొని ఆచరింపదగిన ఉదాహరణ. ఒకరోజు చాణుక్యుడు రాత్రి వేళ దీపపు వెలుగులో కొన్ని రాజకీయ పత్రాలను చూస్తూ ఉంటాడు. అప్పుడే ఓ చైనా యాత్రీకుడు చాణుక్యుని కలవడానికి వస్తాడు. అతననిని కూర్చోపెట్టి తనపని ముగించుకొని, అక్కడ వెలుగుతున్న దీపాన్ని ఆర్పి, ఇంకో దీపాన్ని వెలిగించుకొని, అతనితో సంభాషణకి ఉపక్రమిస్తాడు. అప్పుడు ఆ చైనా యాత్రీకుడు “ అతిథులతో మాటాడేటప్పుడు పాత దీపం తీసి, కొత్త దీపం వెలిగించడం మీ ఆచారమా?” అని ప్రశ్నిస్తాడు. దానికి చాణుక్యుడు ఆచారం కాదు అని.“ నేను ఇంతవరకు ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలని చూస్తున్నాను, ఆ దీపం ప్రభుత్వం వారు యిచ్చిన నూనెతో వెలుగుతోంది, ఇప్పుడు నేను మీతో మాటాడటం నా స్వవిషయం కనుక నా నూనెతో వెలిగే దీపం వాడటం సమంజసం!” అని జవాబు ఇస్తాడు. ఇట్టి ఆచరణ శీలానికి చైనా యాత్రీకుడు అబ్బుర పడి చాణుక్యునికి జోహారులు అర్పిస్తాడు. అనవసరంగా ప్రభుత్వ ధనం ఖర్చుపెట్ట కూడదు అనే గొప్ప నీతి ఇందులో ఉంది. ఇలాంటి ఎన్నో విశేషాలు సాహిత్యం మనకి తెలియ జేస్తుంది. అట్టి విశేషాలలో చాటువులు కూడా ఒక భాగం వాటిని చదివి ఆనందిద్దాం.
ఈ నెల పొడుపు కథల వంటి కొన్ని చాటు పద్యాలని వివరిస్తాను.
“ ఎంచగ చతుర్థ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్
కాంచి తృతీయం బచ్చట
నుంచి ద్వితీయంబు దాటి యొప్పుగ వచ్చెన్”
పై చాటువు రామాయణంలో “హనుమ లంకకు వెళ్లి, సీతను చూసి, లంకను కాల్చి, సముద్రాన్ని దాటి తిరిగి వచ్చేడు.” అనే విషయాన్ని వివరిస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మనం పంచ భూతాలైన ౧ పృధివి,(భూమి) ౨.అపస్సు ,( నీరు) ౩తేజస్సు,(నిప్పు) ౪.వాయు,(గాలి) ౫.ఆకాశాలని వాటి వరుస క్రమంలో అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ,చతుర్థ, పంచమ అనే రీతిలో గుర్తించి అర్థాన్ని గ్రహించాలి. ఇపుడు అర్థం తెలిసికొందాం.
“ చతుర్థ జాతుడు = నాల్గవది అయిన వాయువుకి జన్మించినవాడు
(హనుమ)
పంచమ మార్గమున నేగి = ఆకాశమార్గాన లంకకు వెళ్లి.
(ఐదవది-ఆకాశం)
ప్రథమ తనూజన్ కాంచి = భూ పుత్రిక సీతను చూసి.( ప్రథమం-భూమి)
తృతీయంబచ్చట నుంచి =అగ్నిని ఉంచి అనగా లంకను కాల్చి,
( పంచ భూతాలలో అగ్ని మూడవది)
ద్వితీయంబు దాటి = సముద్రాన్ని దాటి ( రెండవది నీరు)
ఒప్పుగ వచ్చెన్ = చక్కగా తిరిగి వచ్చేడు. ( పద్య భావం ముందే తెలుసు కొన్నాం.) చూసారా పొడుపు కథ లాంటి చాటువు ఎంత చక్కగా కవి రచించాడో! ఇంకొకటి.
ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ. ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు? వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు. తిలకించండి.
“ రాముడెవ్వానితో రావణు మర్దించె?
పర వాసు దేవుని పట్నమేది ?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది ?
వెలయ నిమ్మ పండు విత్తునేది?
అల రంభ కొప్పులో అలరు పూదండేది?
సభవారి నవ్వించు జాణ యెవడు?
సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది?
శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు?
అన్నిటను జూడ ఐదేసి యక్షరములు
ఈవ లావాల జూచిన నేక విధము
చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి”
లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !” ( వివరణ)
పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్) మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన. ఇక జవాబుల సూచికలు- ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి, ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ) ఇప్పుడు జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి. ముందుగా ప్రశ్నల అర్థం తెలిసికొందాం –
1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?
2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?
3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)
4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?
5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?
6.సభలో నవ్వించే కవిపేరు ఏది?
7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)
8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?
పై పొడుపులకి పర్యాయ పదాలతో విడుపులు చెప్పగలరేమో ప్రయత్నించండి. లేదా ఈ క్రింది జవాబులు చూడండి.
1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)
2.రంగనగరం! ( శ్రీరంగం )
3.లకోల కోల! ( కోల= బాణం)
4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)
5.మందార దామం! ( దామం అంటే దండ)
6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)
7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)
8.నంద సదనం! ( నందుని ఇల్లు)
పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి. పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.
(వచ్చే నెల మరికొన్ని)
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)