సారస్వతం

 

తెలుగు వార్తాపత్రికల్లోని భాష - తీరుతెన్నులు

 

- 'అవధాన సుధాకర' రాంభట్ల పార్వతీశ్వరశర్మ (అష్టావధాని)


''పత్రికొక్కటున్న పదివేలసైన్యమ్ము
పత్రికొక్కటున్న మిత్రకోటి''

. నార్ల వేంకటేశ్వరరావు


కాగితం ఉపయోగంలోకి రాకముందు మృగచర్మం, రాతిపలకలు, లోహపురేకులు మొదలయినవాటిమీద రాసేవారు. ఉత్తరభారతంలో భూర్జపత్రాలమీద, దక్షిణాదిలో తాళపత్రాలమీద రాసేవారు. జిగురు పదార్థంతో మసినికలిపి ఎండబెట్టిన పత్రాలమీద (కడితం) సుద్దబలపంతో కొంతమంది రాసేవారు. చైనాలో మల్బరీచెట్లకాడలతో కాగితంతయారీ మొదలయిన కొన్నేళ్ళకు గూటెన్‌బెర్గ్‌ చొరవతో ముద్రణాయంత్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకొచ్చింది. ఇది మతప్రచారానికి ప్రముఖసాధనంగా మారింది. ఆంగ్ల గ్రంథాలు, పత్రికల ప్రచురణ విస్తృతమయింది. భారతీయభాషలో తొలిపత్రిక బెంగాల్‌గజెట్‌ బెంగాలీభాషలో గంగాధరభట్టాచార్య సంపాదకత్వంలో వచ్చింది. తర్వాత 'సమాచారదర్పణ్‌' అనే క్రైస్తవ మిషనరీ పత్రిక మతప్రచారానికే అంకితమయింది. ఈ కోవలోనే హిందూమతప్రచారానికి విశేషస్థానం కల్పించడానికి కొన్ని పత్రికలు పుట్టాయి. తెలుగు పత్రికలు ఆవిర్భవించడానికి ముందే బెంగాలీ, హిందీ, గుజరాతీ, తమిళభాషల్లో పత్రికలొచ్చాయి. తెలుగులో వచ్చిన తొలిపత్రిక విషయంలో 'సత్యదూత' మొదలుగా భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. తర్వాత అర్థవార్షిక, త్రైమాస, ద్వైమాస, మాస, పక్ష, వార, దిన పత్రికలుగా వార్తాపత్రికల ప్రస్థానం విరాజిల్లింది.

విషయప్రాధాన్యాన్ని పరిశీలిస్తే 1860 తర్వాత పత్రికలు భాషాసాహిత్యాల వికాసానికి కృషిచేసాయి. సాంఘిక దురాచారాల నిర్మూలనకు కంకణం కట్టుకున్నాయి. తొలితరం పత్రికల్లో ఇప్పుడున్నంతగా రాజకీయచైతన్యం కనపడదు. 1885లో 'ఆలిండియా కాంగ్రెస్‌' రంగప్రవేశంతో పత్రికల్లో రాజకీయస్పృహ ఊపందుకుంది. రాజకీయపరంగా నిద్రాణావస్థలో ఉన్న తెలుగుజాతిని తొట్టతొలి తట్టిలేపింది 'ఆంధ్రప్రకాశిక'. పార్థసారధినాయుడు సంపాదత్వంలో వచ్చిన ఈ పత్రిక తొలిరాజకీయ పత్రికగా చెప్పవచ్చు. సాహిత్య, రాజకీయపత్రికలేకాకుండా బాల, మహిళా, సినిమా, ఆధ్యాత్మిక, వామపక్ష, విప్లవ పత్రికలవతరించి విస్తరించాయి. వార్తలతోపాటు సంపాదకీయం, ఫీచర్లు, శీర్షికలు, వ్యంగ్య చిత్రాలు, వాణిజ్య ప్రకటనలు పత్రికల్లో చోటుచేసుకున్నాయి. పత్రికారచన చరిత్రను తరచి చూస్తే ఈనాటి వార్తారచనకూ అప్పటి పత్రికారచనకు ముఖ్యమయిన తేడా ఒకటుంది. ఆనాటి వార్తల్లో 'లీడ్‌' ఉండేది కాదు. కథారూపంలో వార్తల్ని రాసేవారు. కానీ ఇప్పుడు వార్తల్లో ప్రధానాంశాన్ని రెండు, మూడు వాక్యాల్లో చెప్పి అదే విషయాన్ని విపులీకరించే పద్ధతి పాటిస్తున్నారు. పత్రికల భాషను అనుశీలిస్తే పందొమ్మిదో శతాబ్దం ఉత్తరార్థ్రంలో నడిచిన పత్రికల్లో దాదాపు గ్రాంథికభాష కనిపిస్తుంది. 'ఆంధ్రభాషాపరిషత్పత్రిక' గ్రాంథికభాషా వాదాన్ని బలోపేతం చేసింది. పత్రికల్లో ఉండాల్సింది వ్యవహారభాషగా గుర్తించి, గిడుగు వేంకటరామమూర్తి 'తెలుగు' పత్రికను వ్యావహారికభాషాప్రచారకోసం స్థాపించడంతో పత్రికల్లో వ్యవహారభాషావాదం ఉద్యమరూపం దాల్చింది. మార్పే మనుగడకు మూలంకాబట్టి పరిస్థితులనుబట్టి పత్రికల స్వరూపస్వభావాలు మారుతూ వచ్చిన క్రమంలో ''నేటి వార్త . రేపటి చరిత్ర''గా రూపుదిద్దుకుంది.

మాతృభాషను జీవనదిగా కాపాడుతున్న ఘనత పత్రికలదే. తెలుగు భాషాపరివ్యాప్తిలో, ప్రయోగాల్లో ప్రసారమాధ్యమాల భాష విశిష్టతను సంతరించుకుంది. అక్షరదోషాలు, ఇతర భాషాపదజాలాన్ని ఎక్కువ వాడడంవల్లే తెలుగుభాషకు ప్రమాదస్థితి వస్తోందేమో అన్నది విశ్లేషించాల్సిన అంశం. కొత్తపోకడలు పత్రికల్లో ప్రతిబింబించాలని పాకులాడడంవల్ల పత్రికలభాష 'రెంటికి చెడ్డ రేవడి'గా మారింది. నిన్న మొన్నటి వరకు ప్రసారమాధ్యమాల భాష ప్రజలకు ప్రమాణం. కానీ ప్రస్తుతం నడుస్తున్న నవీకరణోద్యమంలో వాడుకభాషనే పత్రికలకు ప్రాణమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇది ప్రామాణికతకు నిలువుటద్దమయిన ప్రసారమాధ్యమాల భాషను నీరుకార్చడమే. ''అసలిప్పుడు మనం చదువుతున్న పత్రికల్లో, మనం వింటున్న, చూస్తున్న 'రేడియో', 'టెలివిజన్‌', 'సినిమా' వంటి 'మాస్‌ మీడియా'లో వాడుతున్న భాషకు నిర్దిష్ట స్వరూపస్వభావాలే లేవు, ఈ భాషకు ఏ నీతీలేదు, ఏ నియమమూ లేదు, ఇది అన్ని విధాలా అపసవ్యమైన అవాంఛనీయమైన భాష'' అన్న విమర్శ కూడా ఇటీవలికాలంలో ప్రబలంగా వినిపిస్తోంది. ఇది అంతతేలికగా కొట్టిపారేయాల్సింది కాదు.

భాషకు పదజాలమే అభివ్యక్తిసాధనం. ప్రతిభాషలోను అన్ని అంశాలనూ వ్యక్తీకరించ డానికి సరిపడే పదసంపద ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో విస్తరిస్తున్న శాస్త్ర, సాంకేతిక రంగాల పారిభాషకపదజాలాన్ని యథానువాదం చేయడానికి కొన్ని పత్రికలు స్వతంత్రిస్తున్నాయి. ఈ నవీనపదాన్వేషణ ఆహ్వానింపదగిందే కానీ ఈ ప్రయోగాలు పాఠకులకు ఎంతవరకు అవగమవుతాయనే విషయాన్ని పాత్రికేయులు ఆలోచించాలి. బాహ్య వలయ రహదారి (ఔటర్‌ రింగ్‌రోడ్‌), శిరస్త్రాణం (హెల్మెట్‌), స్థిరాస్తి (రియల్‌ ఎస్టేట్‌), బుట్టబంతి ఆట (బాస్కెట్‌బాల్‌) గోడపత్రిక (వాల్‌పోస్టర్‌), ఏకరూపదుస్తులు (యూనిపామ్‌) లాంటి పదజాలం ఈ కోవకు చెందుతుంది.

1. అక్షరదోషాలు:
పత్రికాభాష చాలా సూటిగా, సరళంగా ఉండాలన్నది అందరికీ తెలిసిన విషయమే. 'శిష్టవ్యావహారికభాష'ను ప్రామాణికభాషగా నిర్ధారించి పత్రికారచన కొనసాగించడం ఏళ్ళతరబడి వస్తున్న ఆచారం. భాషలో ఉన్న 'ప్రవాహశీలత'ను ఆసరాచేసుకుని నేటి వార్తాపత్రికలు భాషాకాలుష్యానికి పాల్పడుతున్నాయని నిస్సంకోచంగా చెప్పవచ్చు. సాంకేతికత ఇంతగా అభివృద్ధిచెందినా పత్రికల్లో విస్తృతంగా అక్షరదోషాలు దొర్లుతుండడం శోచనీయం. ముద్రణామాధ్యమాల్లో భాషాపరమైన దోషాలుండడానికి ఎన్నో వ్యవస్థాగత కారణాలుండొచ్చు. ఈ దోషాలను ఎత్తిచూపి, ఆయా మాధ్యమాల నిర్వాహకుల, అధినేతల దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం పాఠకుడికి అధికం. ఇలాంటి పాఠకుల స్పందన మాధ్యమాలకూ ఎంతో అవసరం. వీటిని ఎంత వరకు నిర్వాహకులు సహృదయంతో స్వీకరించి, విశ్లేషిస్తారన్నది ప్రశ్నార్థకమే.

మహాప్రాణాక్షరాలు, 'శ,ష, స' ల వినియోగంలో సాధారణంగా ఈ అక్షరదోషాలు కనిపిస్తుంటాయి. 'ళ' కార ద్విత్వం (ళ్ళ) వాడుకలోకూడా ళ్ల గా రాస్తున్నారు. వాళ్లు, కళ్లు, జోళ్లు, వెళ్లు అన్న రూపాలు విరివిగా కన్పిస్తున్నాయి. ఈ పద్ధతి మారాలి. దీనికి విలేఖరి నుండి సంపాదకుల వరకు ఉన్న అవగాహనాలోపం ఒక కారణమయితే . సాంకేతికకారణాల వల్ల కూడా కొన్ని సార్లు ఈ 'ముద్రారాక్షసాలు' దొర్లుతుంటాయి. దినపత్రికల్లో రాతప్రతిలోని అక్షరస్ఖాలిత్యాలను పరిశీలించే 'ప్రూఫ్‌ రీడింగ్‌'కు ముఖ్యపాత్ర ఉండేది. ఉపసంపాదకుడు రాసిన, అనువదించిన సమాచారాన్ని 'కంపోజిటర్లు' కంపోజ్‌ చేసి 'గ్యాలీలు' తీసేవారు. ఆ గ్యాలీల్లో 'ప్రూఫ్‌ రీడర్లు' తప్పులుంటే దిద్దేవారు. ప్రస్తుతం 'కంప్యూటర్‌'లు వచ్చాకా ఈ పద్ధతి పూర్తిగా పోయి, చాలా పత్రికల్లో 'ప్రూఫ్‌ రీడర్‌' ఉద్యోగం అవసరంలేకుండా పోయింది. సమాచారాన్ని 'కంప్యూటర్‌'లో పొందుపరిచే విలేఖరి లేదా ఉపసంపాదకులే ఈ దోష పరిహారకులుగా వ్యవహరిస్తున్నారు. ఉపసంపాదకులకిది అదనపు బాధ్యత కావడంతో తప్పనిసరిగా చేయవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో పత్రికల్లో అక్షర దోషాలశాతం పెరుగుతూ వస్తోంది.

'అనుమానాస్పద స్థితి మహిళమృతి': ఆంధ్రజ్యోతి దినపత్రిక (17 ఫిబ్రవరి 2014 సోమవారం విశాఖస్థానికం పుట.6) లో ఈ శీర్షికన నేరవార్త కనిపిస్తోంది. ఇక్కడ అనుమానాస్పదస్థితి 'లో' మహిళమృతి అని ఉండాలి. 'లో' అన్న విభక్తిప్రత్యయం లోపించడం వల్ల అర్థం సమగ్రంగా బోధపడదు.
భక్తులకు ఆకర్షిస్తున్న సాయినాథుడి విగ్రహం: ఈ పత్రికలోనే పుట. 8లో ఏదో ఉత్సవం గూర్చిన వార్తలో 'భక్తులకు ఆకర్షిస్తున్న సాయినాథుడి విగ్రహం' అన్న శీర్షిక కనిపిస్తుంది. ఇక్కడ 'భక్తులను' అని ద్వితీయా విభక్తిప్రత్యయం ఉండాలి. 'కు' అనే షష్ఠీప్రత్యయం వాడడంవల్ల అర్థమే మారిపోయింది. ఈ వార్తలోనే షిర్డీ 'నాయిసాథుడు' అన్న దోషం కనిపిస్తోంది. సాయినాథుడు అనడానికి బదులు ఇలా వర్ణవ్యత్యయం జరిగింది. ఇది కేవలం నిర్లక్ష్యమే. 'పురాణాంతర్గ(త)', 'అనే(క)'..... ఇలాంటి వర్ణలోపాలు, ముద్రారాక్షసాలు ఉత్తమస్థాయిపరిశీలనా లోపం వల్ల దొర్లుతున్నాయన్నది తేటతెల్లమవుతోంది.

అరాచకశక్తులు వస్తున్నారా?: ఇది కూడా ఆంధ్రజ్యోతిపత్రికలో (17 ఫిబ్రవరి 2014 సోమవారం పుట.9) కన్పిస్తున్న శీర్షిక. శక్తులు అన్నప్పుడు తదనుగుణంగా 'వస్తున్నాయా?' అని శిష్టవ్యావహారికంలో వస్తుంది.. ఇక్కడ బహువచనం వాడకంలో అవగాహనాలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి అక్షరదోషాలు ఈనాటి పత్రికల్లో సర్వసాధారణం. ఎవ్వరికీపట్టదో... ఏమవుతుందిలే అనో... అవే సరైనవన్న భావనో తెలియదు కానీ శుద్ధమయిన భాషావినియోగానికి దోషరహితమయిన పత్రికల ప్రస్థానం అవసరం.

2. శీర్షికల్లో అనౌచిత్యాడంబరం:
విషయస్ఫురణకు వీలుగా అనుకరణ చిహ్నాల ('' '') మధ్య విశేషంగా ఒక పదాన్ని ఉంచి 'బ్యానర్‌ హెడ్‌లైన్‌'లో భాగంగా వైవిధ్యభరితమయిన శీర్షికలు పత్రికల్లో విరివిగా దర్శనమిస్తున్నాయి. ఇది జనాకర్షణకోసం చేస్తున్న లిపివిన్యాసమవుతుంది తప్ప అర్థసుబోధకమయిన పద్ధతికాదు. ఆకట్టుకునే శీర్షికల నిర్ణయవ్యవసాయంలో ప్రాసకోసం పాకులాడుతూ , అపార్థానికి, అనర్థానికి దారితీసే విరుపులతో పత్రికలు తెలుగు భాషకు తెగులుపట్టిస్తున్నాయి.

2.1 గ్రామ్యపదజాలం:
లక్షణవిరుద్ధమయింది గ్రామ్యం. ఇది గ్రామీణులు, నిరక్షరాస్యులు మాట్లాడేభాష. మౌఖికమయిన వ్యవహారానికేతప్ప లిఖితవాఙ్మయంలో కనపడదు. కానీ ప్రామాణికతలేని గ్రామ్యపదాలు కూడా పత్రికల్లో, అదీ కూడా ప్రధానశీర్షికల్లో ఎలా చోటుసంపాదించుకున్నాయో మచ్చుకు కొన్ని చూడండి.

మనోళ్ళు మెరిసారు... (సాక్షి : 16.01.2014 ఆదివారం)

ఉచితమేగా.. కోతేద్దాం. (సాక్షి : 12.01.2014 ఆదివారం)

విభజన తీరు బాగోలేదు (ఈనాడు : 19.02.2014 బుధవారం)

ఇలాంటి పదాలవాడకం వల్ల భాషాపరంగా పత్రికలకున్న విలువ సన్నగిల్లుతుంది. చివరకు నైచ్యదశ వాటిల్లుతుంది.

2.2 నిందార్థాలు:
వైయక్తికవిషయాలు, ఆరోపణలు, బెదిరింపులు, నిందావాక్యాలు సరాసరి పత్రికల్లో ప్రచురించడం అంత హర్షనీయం కాదు. కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తే...

కేంద్రమా... కాస్కో: (ఈనాడు : 30.01.2014 గురువారం)

బాబును నమ్మొద్దు: (ఆంధ్రజ్యోతి : 17.02.2014 సోమవారం పుట. 8)

ఏ బాబు అడ్డుకున్నా .. విభజన ఆగదు: (ఆంధ్రజ్యోతి:17.02.2014 సోమవారం పుట.8)

నరికి.. నరికి మీ తాత ఏమయ్యాడు?: (ఈనాడు : 23.02.2014 ఆదివారం పుట.9)

కణతకు తుపాకి పెట్టారు: (ఈనాడు : 10.02.2014 సోమవారం)

ఇలాంటి వాటిని పత్రికాముఖంగా ప్రస్తావించడమనేది కేవలం జనాకర్షణకోసం, పాఠకులను రెచ్చగొట్టడం కోసం చేసే ప్రయత్నమే తప్ప వేరే సమర్థవంతమయిన ప్రయోజనమేమీ ఉండదు. సమాజంలో వివిధ మనస్తత్వాలున్న వ్యక్తులు సందర్భాన్నిబట్టి రాగద్వేషాలతో ఎన్నెన్నో పదాలుపయోగిస్తుంటారు. పత్రికల్లో విలేఖరులు సేకరించిన వార్తలనే ఉన్నవి ఉన్నట్లుగా రాస్తే ఇక సంపాదకులెందుకు?

2.3. పదాల విరుపు:
పదాలను ఖండఖండాలు చేసి ఎటూ అర్థంకాకుండా శీర్షికలుగా పొందుపరిచే చెడు సంప్రదాయం ఎప్పుడు, ఎవరు ప్రారంభించారో కానీ అదే ఆనవాయితీగా అన్ని పత్రికలూ అనుసరిస్తున్నాయి.

దిగ్వి.జైపాల్‌భేటి: దిగ్విజయ్‌ సింగ్‌, జైపాల్‌రెడ్డి సమావేశానికి సంబంధించిన వార్తాశీర్షిక ఇది. ముక్కచెక్కలు చేసిన పదాలతో ఏదో విధంగా వైవిధ్యభరితంగా ఉండాలనే తాపత్రయంతో చేసే ప్రయత్నాలు ఇలాంటి శీర్షికలకి ఊపిరిపోస్తాయి.. (ఈనాడు: 16.07.2013 మంగళవారం)

గ'ఘన'విజయం: అంతరిక్షప్రయోగంలో భారతదేశం సాధించిన ఘనవిజయాన్ని ప్రస్తావించే వార్త ఇది. గగనవిజయం అని వాడవలసి ఉండగా ప్రత్యేకతను కనపరచడానికే కక్కుర్తిపడినప్పుడు ఇలాంటి శీర్షికలు పుట్టుకొస్తుంటాయి. . (సాక్షి : 06.01.2014 సోమవారం)

నేడే పార్ల'మెట్టు'కు: తెలంగాణా ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడడానికి అధికారపత్రాలు పార్లమెంటులో ప్రవేశపెట్టే తరుణంలో ఈ శీర్షిక కనిపిస్తోంది. పార్లమెంటుకు అన్న పదానికి బదులుగా 'మెట్టు'కు అన్న పదం వాడారు. ఇక్కడ అసలు పదం స్ఫురించడం లేదు. (ఈనాడు : 13 . 02 . 2013 మంగళవారం)

'హస్త'వ్యస్తం: అస్తవ్యస్తం అన్న పదానికి రూపాంతరమిది. కాంగ్రెసుపార్టీలోని మంత్రులు, మిగిలిన పాలకులు వేరే పార్టీల్లోకి చేరే విషయాన్ని ప్రస్తావించే వార్త ఇది. . (ఈనాడు : 19 . 02 . 2014 విశాఖపట్నం. బుధవారం)

తలవంపు స్వామ్యం: ఈ ప్రధానశీర్షిక లోక్‌సభలో అస్వస్థతకు గురయిన మంత్రుల అవస్థను తెలియజేసే వార్తలో కనిపిస్తుంది. స్వామ్యం అంటే సొంతం అన్న అర్థం. ప్రజాస్వామ్యం అన్నట్లుగా 'తలవంపుస్వామ్యం' అన్న శీర్షికను నిర్ణయించారు. ఈ శీర్షికకు అర్థం ఏమిటో రాసినవాళ్ళకే తెలియాలి. (ఈనాడు: 14.02.2014 శుక్రవారం)

కాంగ్‌రేసులోలేదు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసుపార్టీ అత్యంతఘోరంగా ఓడిపోతుందన్న 'అద్వాని' అభిప్రాయాన్ని ఇంత అపభ్రంశంగా రాశారు.ఇదేం పైశాచికానందమో తెలియదు. 'కాంగ్రెసు' లో 'రేసు' అన్న పదానికి ఎలాగయినా ప్రాతినిథ్యాన్ని కల్పించాలని చేసే కుతకప్రయత్నాలివి.

3. వెగటయిన సంక్షేప / సంకేతాక్షర పదాలు :
విస్తారంగా ఉన్న పదాలలోని మొదటి అక్షరాలను మాత్రమే గ్రహించి నిర్దేశితార్థాన్నిచ్చే పదాలు సంకేతాక్షరరూపాలు. ఈ సంక్షిప్తపదాలు పాఠకుడికి పరిచయంలేకపోతే పూర్తిగా విషయం అవగతమవదు. అస్పష్టతకు, అయోమయావస్థకు ఇలాంటి సంకేతాక్షరపదజాలం ఆలవాలం. రాజకీయపక్షాల ప్రస్తావనలో 'తె.దే.పా', 'తె.రా.స.' 'ప్ర.రా.ప', 'వై.కా.ప.', 'భా.జ.పా.', వైఎస్సార్సీపీ', లాంటి సంక్షేపపదజాలం పదేపదే నేటి పత్రికల్లో దర్శనమిస్తోంది. ఆంగ్లభాషాప్రభావం ఈ విషయంలో సుస్పష్టం. ఈ విధంగా పదాలను సంక్షేపించి వాడుకలోకి తీసుకువస్తే వాటి మూలరూపాలకు విఘాతం కలగడం తథ్యం. ఉదాహరణకు 'వైఎస్సార్సీపీ' అన్న సంకేతాక్షరపదాన్ని సామాన్యపాఠకుడు 'ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌పార్టీ' అని భ్రమించే అవకాశముంది. తద్వారా 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌పార్టీ' అన్న మూలరూపం మరుగునపడే ప్రమాదం లేకపోలేదు. ఇదే కోవలో 'ఐ.రా.స.', 'ఐ.కా.స', లాంటి ఎన్నో సంకేతాక్షరపదాలు తెలుగు వార్తాపత్రికల్లో వీరవిహారం చేస్తూ పాఠకుడికి, భాషాప్రియులకు వెగటును కలిగిస్తున్నాయి.

4. ఎవ్వరికీ పట్టని సమాసదోషాలు :
వ్యావహారికభాష మార్పులు చెందడం సర్వసాధారణమయిన విషయం. కాలంతో పాటు భాష రకరకాలయిన పరిణామాలకు లోనవుతుంది. ఇందుకు కారణాలు కూడా విభిన్నంగా ఉంటాయి. మన ముఖయంత్రంలోని స్వభావం, ఇతర భాషల ప్రజల సాంగత్యం, సౌలభ్యాపేక్ష, పదస్వరూపజ్ఞానం, ఉచ్చారణలోని తొందరపాటు, వినడంలో అస్పష్టత, నోటిలోని వర్ణోత్పత్తి స్థానాల్లో ఉండే లోపాలు, దేశంలోని శీతోష్టస్థితిభేదాలు మొదలయినవి ఒక భాషాపరిణామానికి హేతువులని చెప్పవచ్చు. భాష వ్యావహారికమయినా గ్రాంథికమయినా నియమం అత్యావశ్యకం. నియమరహితమయిన భాషలో విలువలు శూన్యం. భాషావిలువలను కాపాడే నియమావళి వ్యాకరణం. ఒకప్పుటి ప్రయోగాలనుండి వ్యాకరణం నిర్మితమయింది. పత్రికలభాష వ్యాకరణాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదనడానికి సమాసాలే తార్కాణం. వైర, దుష్టసమాసాలెన్నో పత్రికల్లో జోరుగా వ్యవహారంలోకివస్తున్నాయి.

నేటి పత్రికల్లో ఈ తరహా పొరపాటు అలవాటుగా మారింది. సంస్కృతపదాల తర్వాత తెలుగు పదాలను వాడడం, ఇతర భాషాపదాల తర్వాత సంస్కృతపదం వాడడం, సరాసరి ఆంగ్లంతో తెలుగును మేళవించడం ఇప్పటిపత్రికలకు కరతలామలకమయిన విషయం.

విద్యుత్‌ కోత: అందరికీ నిత్యం పత్రికల్లో కనిపించే పదమిది. విద్యుత్తు పంపిణీని నిర్దిష్టమయిన కాలపరిమితిలో నిలిపివేయడం అన్న అర్థంలో ఈ పదం వాడుతున్నారు. విద్యుత్‌ సంస్కృతసమశబ్దం. కోత అన్నది దేశ్యం (ఆచ్ఛికం). సంస్కృతపదాల తరువాత వికృతపదాలు, దేశ్యపదాలు వ్యాకరణనియమం ప్రకారం ఉండవు. ఆంధ్రజ్యోతి దినపత్రిక (17.02.2014 విశాఖస్థానికం. పుట.12) లో 'వీధిలైట్లకు విద్యుత్‌ కోత ఉండదా!' అన్న శీర్షిక కనిపిస్తుంది. ఇది సమాసదోషం.

ప్రత్యేక వేడి: బీహార్‌లో 'ప్రత్యేక'వేడి అన్న శీర్షిక (ఈనాడు:23.02.2014 ఆదివారం పుట.12)) దర్శనమిచ్చింది. ప్రత్యేకప్రతిపత్తికోసం బీహార్‌ రాష్ట్రంలో ఆందోళనలు ఊపందుకున్నాయని చెప్పడం ఈ వార్త ఉద్దేశం. అయితే ప్రతి+ఏక= యణాదేశసంధిరూపం తో 'ప్రత్యేక' అన్న పదం సిద్ధిస్తోంది. ఇది తత్సమశబ్దం. ఉష్ణం అన్న పదానికి సమానార్థం తెలుగులో వేడి. ఈ రెండింటినీ కలిపి ప్రత్యేకవేడి అనడం అవగాహనాలోపం. కాబట్టి ఇది కూడా పొసగని సమాసమే.

ఉగ్రదాడి: 'సోమాలియా అధ్యక్షభవనం పై ఉగ్రదాడి' (ఈనాడు:23.02.2014 ఆదివారం పుట.12) అని సోమాలియా రాజధానిలో అధ్యక్షభవనం మీద జరిగిన ఉగ్రవాదుల దాడిని పేర్కొన్న వార్త ఇది. ఇక్కడ ఉగ్ర తత్సమ పదం. దాడి వికృతపదం. రెండింటికి సమాసం కుదరదు. 'ఉగ్రవాదుల దాడి' అని ఉండాలి.

సమైక్యపరుగు: 'విశాఖసమైక్యపరుగుకు పోటెత్తినజనం' (ఈనాడు: 10.02.2014 సోమవారం) అని ఆంధ్రరాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేసిన 'పరుగు' కార్యక్రమానికి సంబంధించిన వార్త ఇది. 'సమైక్య' అన్న సంస్కృతపదం మీద 'పరుగు' అన్న దేశ్యపదం ఒదగదు. ఇదికూడా దుష్టసమాసమే. 'సమైక్యంగా పరుగు' అని ఉండాలి.

సముద్రతాబేళ్ళ మృత్యువాత: (ఈనాడు: 24.02.2014 సోమవారం పుట.3) సముద్రమనేది సంస్కృతం. తాబేలు అన్నది దేశ్యం. సముద్రకూర్మాలు అనాలి. లేదా 'సముద్రపు తాబేళ్ళ'అని వాడాలి. కాబట్టి ఈ ప్రయోగం కూడా వైరసమాసమే.

5. అందలమెక్కుతున్న అపశబ్దప్రయోగాలు :
వార్తారచనకు ప్రాథమికార్హత శబ్దజ్ఞానం. పత్రికలు తెలియకుండానే కొన్ని అపశబ్దాలను వార్తాల్లో ప్రయోగిస్తూ పాఠకులను తప్పుతోవపట్టిస్తున్నాయి. ఎక్కడైనా విద్యుత్తుకు సంబంధించిన ప్రమాదం జరిగితే వెంటనే మనకు కనిపించే శీర్షిక 'విద్యుదాఘాతం'. కాని 'విద్యుద్ఘాతం' అన్నది సరైన వాడుక. ఘాతం అంటే దెబ్బ అని, ఆఘాతం అంటే వధ్యస్థానం, చంపేగట్టు అని అర్థాలున్నాయి. 'విద్యుదాఘాతం' అని వాడితే విద్యుత్తు చేత చంపేగట్టు అనే అర్థం వస్తోంది. కాబట్టి విద్యుద్ఘాతం అన్నదే పొసగే పదం. ఈ మధ్య ఈనాడు దినపత్రిక 'నిర్ధరణ' 'నిర్ధరించు' అన్న పదాలను విరివిగా ప్రయోగించింది. ఇది 'నిర్ధారణ' అన్న అర్థానిచ్చే పదస్ధానంలో వాడారు. 'నిర్‌+ధరణ' 'నిర్‌+ధారణ' పదాలకు చాలా వ్యత్యాసం ఉంది.

ఐక్యత: 'హోరెత్తిన ఐక్యతానాదం' (ఈనాడు: 10.02.2014 సోమవారం) అన్న శీర్షికతో విభజనకు వ్యతిరేకంగా స్ఫూర్తిదాయకమయిన పరుగును విశాఖలో నిర్వహించిన విషయాన్ని తెలియజేసే వార్త ఇది. ఏక అన్న సంఖ్యావాచకం నుండి ఏకత అన్న పదం పుడుతోంది. ఐక్యం దీని తద్ధితరూపం. అంతేకానీ 'ఐక్యత' అన్న రూపముండదు. ఇది అసాధుప్రయోగం.

విలేకరి: వార్తారచనకు మూలస్థంభం విలేఖరి. లేఖకుడు అంటే వ్రా(రా)యసకాడు అని అర్థం. 'విలేఖరి' అన్న పదానికి సరాసరి పత్రికారచన చేసేవాడు అన్న అర్థం మనకు కనిపిస్తోంది. లేఖరి అన్నపదానికి 'వి' అనే ఉపసర్గ చేరడం వల్ల విలేఖరి అన్న పదం ఏర్పడుతోంది. ఈనాటి పత్రికల్లో 'విలేకరి' అన్న పదమే బహుళప్రచారంలో ఉంది. 'లేకరి', 'వి.లేకరి' అన్న పదాలకు రాసేవాడు అని మాత్రమే (నిఘంటువులో) రూఢార్థముంది. అందువల్ల పత్రికల్లో వార్తరచన చేసే వ్యక్తులను 'విలేఖరులు' అనడమే సమంజసం.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... వైనతేయులు, కాద్రవేయులు, గాంధారేయులు, కౌంతేయులు, రాధేయుడు మొదలైన పదాలలో 'ఏయ' అనే ప్రత్యయం (అపత్యార్థంలో వచ్చే తద్ధితప్రత్యయం) 'సంతానం' అనే అర్థంలో వాడుకలో ఉంది. అలాగే 'తదీయ, మదీయ, అస్మదీయ, భవదీయ, వాక్యపదీయ, శ్రీకృష్ణపాండవీయ, రాఘవపాండవీయ, వేంకటీయ, భారతీయ' మొదలయిన చోట్ల 'ఈయ' అనే ప్రత్యయం (సర్వనామాల్లో మత్వర్థీయ ప్రత్యయం) 'దానికి సంబంధించిన' అనే అర్థాన్నిస్తోంది. 'పాత్రికేయులు' అంటే 'పత్రికకు పుట్టినవాళ్ళు' అవుతారు. కాబట్టి 'పాత్రికీయులు' అనే పదం వినడానికి కొత్తగా ఉన్నా పత్రికకు సంబంధించిన వాళ్ళు అనే అర్థాన్నిస్తూ సరైన రూపంగా స్ఫురిస్తోంది.

హంతకుడు: 'రాజీవ్‌ హంతకుల విడుదలపై పునరాలోచించండి: కేంద్రం' అన్న శీర్షిక ఈ మధ్య తళుక్కుమంది. (ఈనాడు: 24.02.2014 సోమవారం పుట.2) నేరవార్తల్లో హంతకుడు, హంతకురాలు అన్న పదాలు విరివిగా కనిపిస్తున్నాయి. 'హంత' సరైన రూపం. హంతకుడు, హంతకురాలు అన్నపదాలు వాడుకలో ఉన్నాయి కాబట్టి చెలామణీ అయిపోతున్నాయి కానీ ప్రామాణిక నిఘంటువులు ఈ పదాలను అంగీకరించలేదు.

6. సారూప్యతకు దూరమవుతున్న నామవాచకాలు:
వ్యక్తులపేర్లు, స్థలాలపేర్లు, సంస్థలపేర్లు ఇలా నామవాచకాల ప్రస్తావనలో ఏ రెండు పత్రికలమధ్య పొందిక లేదు.

అద్వాని, అడ్వాని, అడ్వాణీ...
మోది, మోడి... కేజ్రీవాల్‌, కేసరీవాల్‌...
ప్రకాశ్‌ కరత్‌, ప్రకాశ్‌ కారత్‌...
పురంధేశ్వరి, పురందరేశ్వరి, పురంధ్రీశ్వరి...

ఇలా ఎన్నో వ్యత్యాసాలు కన్పిస్తున్నాయి. ఇవన్నీ ఒకే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లారి, నారా, కోళ్ళ, పొన్నాల, గంటా మొదలయిన ఇంటిపేర్లను వ్యక్తులకు సంబోధనావాచకాలుగా ఉపయోగిస్తూ అసందిగ్ధంగా, అసంపూర్ణంగా రాయడం పాత్రికేయుల శైలిగా మారింది.

ముఖ్యంగా పౌరాణిక పాత్రలను, చలనచిత్రపరిశ్రమలోని నటీనటులను, క్రీడారంగప్రముఖులను, ప్రస్తావించేటప్పుడు రాముడు యుద్ధం చేసాడు.. తమన్నా అంది..., మహేష్‌ దూసుకొచ్చాడు.., ధోనీ దంచేశాడు.. అని ఏకవచనప్రయోగమే పత్రికల్లో కన్పిస్తోంది. ఇదిలా ఉండగా రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తల గూర్చి రాసే వార్తల్లో మాత్రం అన్నారు.. చెప్పారు.. అభిప్రాయపడ్డారు... అని పేర్కొనడం పత్రికల్లో నిత్యం కనిపిస్తోంది. అభిమాన, గౌరవాలో లేదా పక్షపాతమో ఈనాటి పాత్రికీయులకే తెలియాలి. వైవిధ్యం భాషలో కాదు.. భావంలో చూపించగలగాలి.

7. విషమ వాక్యనిర్మాణం:
వాక్యంలో వాక్యాంశాల క్రమం తప్పకుండా చూసుకోవడం ముఖ్యం. కర్త, కర్మ, క్రియలు వాక్యాంశాలు. వీటి క్రమం సందర్భానుసారంగా మాత్రమే మారుతుంది తప్ప అక్కరలేని చోట వ్యత్యయమైతే వాక్యం అపార్థానికి దారితీస్తుంది. ఉదాహరణకు:.
ఇది నా కొత్త చొక్కా.. నా కొత్త చొక్కా ఇది.. ఇలా చేస్తే బాగానే ఉంటుంది. అయితే కొత్త నా చొక్కా ఇది... నా కొత్త ఇది చొక్కా... ఇలా వాక్యాంశక్రమం మారితే వాక్యార్థం అభాసమవుతుంది. 'అర్థవంతం కాకపోతే వాక్యమే కాద'న్నారు ప్రౌఢవ్యాకర్త. అందుకే వాక్యనిర్మాణంలో అప్రమత్తత అవసరం. మచ్చుకు కొన్ని వాక్యాలు చూద్దాం.

కిరణ్‌ పార్టీనే మింగేయాలనుకున్నారు: డొక్కా : (ఈనాడు: 23.02.2014 పుట.9) ఈ వాక్యంలో కర్త 'కిరణ్‌'. ఆయన పార్టీనే మింగేయాలనుకున్నారు అని చెప్పడం ఈ శీర్షికకున్న అర్థం. అయితే కిరణ్‌ పార్టీనే . మింగేయాలనుకున్నారు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే వేరే వ్యక్తి ఎవరో కిరణ్‌ పార్టీని మింగేయాలనుకున్నారన్న అర్థం వస్తుంది. అందుచేత ఈ శీర్షిక 'పార్టీనే మింగేయాలనుకున్నారు కిరణ్‌' అని ఉండాలి.

మధ్యాహ్నభోజనం తిని విద్యార్థులకు అస్వస్థత: (సాక్షి: 19.02.2014 విశాఖస్థానికం పుట.7) రాష్ట్రంలో మధ్యాహ్నభోజనపథకం అమలులో ఉంది. ఈ పథకంలో భాగంగా వండిన ఆహారాన్ని విద్యార్థులు తినడంవల్ల అస్వస్థతకు గురయ్యారని చెప్పడం ఈ వాక్యోద్దేశం. అయితే 'మధ్యాహ్నభోజనం తిని' అంటే మధ్యాహ్నం, రాత్రి అన్న సమయానుకూల భోజనవిషయ సామాన్యార్థం స్ఫురించి పేలవంగా ఉంది. మధ్యాహ్నం భోజనంచేసిన తరువాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న అపార్థమే కనిపిస్తుంది. మధ్యాహ్నం భోజనం చేసి నిద్రించారు, బయలుదేరారు.. అన్నట్లుగాఉందిగానీ మధ్యాహ్న భోజనపథకంలోభాగంగా వండిన ఆహరంలో దోషముండడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారన్నభావం స్ఫుటంగా తెలియడంలేదు.

బాలబాలికలు 'రన్‌' చేసారు: (సాక్షి: 19.02.2014 విశాఖస్థానికం పుట.16) విశాఖ ఉక్కుకర్మాగారంలో నిర్వహించిన పరుగు కార్యక్రమాన్ని వివరిస్తూ బాలబాలికలు కూడా ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పవలసి ఉంటే 'రన్‌ చేసారు' అన్న విచిత్ర పదజాలాన్ని ఈ పత్రిక వెలువరించింది. ఇది చాలా శోచనీయం. నామవాచకాలు అన్యభాషలనుండి యధాతథంగా స్వీకరించవచ్చు కానీ క్రియాపదాలతో తెలుగును సంకరం చేయడం చాలా దయనీయం. 'సందేశం సెండ్‌ చెయ్యండి'.. 'మీరు ఆహారం ఈట్‌ చేయండి' అంటే ఎంత హాస్యాస్పదమో... 'రన్‌చేసారు' అన్న ప్రయోగం కూడా అలాగే ఉంది.

8. అనవసరమైన ఇతరభాషాపదాల (అన్యదేశ్యాలు) వినియోగం:
ప్రాచీనతెలుగు భాషను సంస్కృతాన్ని వేరు చేసి చూడలేం. ఆధునిక పత్రికల తెలుగును ఆంగ్లభాషను వేరుగా చూడలేం. లెక్కకు మించిన ఆంగ్లపరిచ్ఛేదాలు తెలుగుదినపత్రికల్లో కనిపిస్తున్నాయి. వీటితోపాటు ధర్నా, హర్తాళ్‌, బంద్‌, రాస్తారోకో, ఘెరావ్‌, హంగామా, గందరగోళం, సర్కారు, జిల్లా, గోరీ, ఖాళీ, సమన్లు, అసలు... ఇలా ఎన్నో అన్యభాషాపదాలు తెలుగు వార్తాపత్రికల్లో నిత్యం పలకరిస్తూనే ఉంటాయి. 'ప్రత్యామ్నాయ సర్కారు' (ఈనాడు 22.2.14), 'జస్ట్‌... అభిప్రాయాలే' (సాక్షి 11.01.2014) 'బిఏసీ.. బేఖాతర్‌' (సాక్షి 7.1.2014) 'వట్టి చేతులతో కోకోనట్‌... ఫటాఫట్‌' (ఈనాడు 24.2.14) లాంటి అనవసరంగా అన్యభాషాదరణతో శీర్షికలు పెట్టడం, వార్తలు వివరించే పద్ధతిని తగ్గించుకోవాలి.

''భాషావ్యవహర్తలు తమతమ నిత్యజీవిత వ్యవహార భాషల్లో ఉన్న భేదాలకు అతీతంగా అందరికీ అవసరమయ్యే వ్యవహారంకోసం వాడే భాషాభేదం ప్రామాణికభాష'' అని భాషాశాస్త్రవేత్తల నిర్వచనం. పదజాలంలో ఈ ప్రామాణికత తేటతెల్లమవుతుంది. ఇన్ని దోషాలతో ఉన్న పత్రికలకు ఇక ప్రామాణికత ఎక్కడినుండి వస్తుంది. ఇవన్నీ మచ్చుకు ఉటంకించిన భాషావైరుధ్యాలు. పరిశీలించే కొద్దీ ఇలాంటి లోపాలు ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి. వార్తాపత్రికలన్నీ తెలుగును రక్షించడానికి, నిలబెట్టడానికి, ఉపయోగపడే ప్రసారమాధ్యమాలో, లేదా తెలుగు ద్వారా ఇతరభాషల్ని నేర్చుకోవడానికి అనుసంధాన వారధులో అర్థంకాదు. ఇప్పటికయినా తెలుగువార్తాపత్రికలు వ్యాకరణదోషాలను పరిహరించి, వాక్యనిర్మాణ సామర్థ్యాన్ని సంతరించుకుంటే తెలుగుభాషకు మేలు చేసినవారవుతారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)