ధారావాహికం

సుందరకాండ - (9 వ భాగం)



-డా||అక్కిరాజు రమాపతిరావు

సీతాదేవి దుర్దశకు హనుమ తల్లడిల్లడం:

ఈమె రాముడి ప్రియపత్ని. ఇప్పుడీ రాక్షస స్త్రీలు చుట్టు ముట్టి ఉండగా ఎవరూ ఎప్పుడూ ఊహించని ఆపదల పాలైంది. ఎవరి పట్లా దృష్టి సారించటం లేదు.

తదేక చిత్తంతో రాముణ్ణే ధ్యానిస్తున్నట్లుగా ఉన్నది. రామలక్ష్మణులు సతతం రక్షించే ఈమెను రాక్షస స్త్రీలు కావలి కాస్తున్నారు. ఇంతకన్నా ఘోరకష్టం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఈ పరిస్థితి చూస్తే నాకే గుండెలు తరుక్కొని పోతున్నాయే. ఇక రాముడికీ, సీతాదేవికీ మనస్సు ఎంత దు:ఖపు బరువుతో తల్లడిల్లి పోతూ ఉండి ఉంటుందో కదా! ఈమె తప్పకుండా సీతాదేవే" అనే గట్టి నిర్ణయానికి వచ్చాడు హనుమంతుడు.

అప్పుడు నీల జలసరస్సులో కదలాడుతున్న తెల్ల కలువల పూలగుత్తి లాగా ఆకాశంలో చంద్రుడు పైకి వచ్చాడు. హనుమంతుణ్ణి సాంత్వన పరచటానికీ, ఆయనకు సహాయపడటానికీ ఉద్దేశించినట్లు చంద్రుడు ఆకాశం మధ్యకు వచ్చాడు.

సీతాదేవి చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరి రూపాలు భయంకరంగానూ, క్రూరంగానూ, వెగటు కలిగేటట్లుగానూ ఉన్నాయి. వాళ్ళ కళ్లు, పెదవులూ, చెవులూ, ముక్కూ, జానువులు, పొట్టలూ వికృతంగా ఉన్నాయి.

వాళ్ళంతా సీతాదేవి చుట్టూ కూచుని ఉన్నారు. హనుమంతుడికి వాళ్ళంతా కనపడుతూనే ఉన్నారు. సీతాదేవి ఒంటిమీద ఎటువంటి ఆభరణమూ లేదు. ఆ తల్లి పూలు లేని పూలతీగ లాగా ఉంది. కడు దీనురాలిగా ఆమె కనపడటమే తన మహాభాగ్యమని హనుమంతుడు సంతోషించాడు.

ఇంకా కాస్సేపటిలో తెల్లవారబోతున్నది. వేదవిదులైన బ్రహ్మరాక్షసులు చేస్తున్న వేదపారాయణం అక్కడకు వినపడుతున్నది. ఇంకా కాసేపటికి రావణాంత:పురంలో మంగళవాద్యాల ధ్వనులు చెలరేగాయి. రావణుడు మేల్కొన్నాడు. నిద్రలేస్తుండగానే ఆ రావణాసురుడు సీతాదేవిని తలచుకున్నాడు. మదనపీడితుడైనాడు. వెంటనే గొప్పగా అలంకరిచుకున్నాడు. ప్రాత:కాలిక పక్షుల కలకలారావం అశోకవనంలో ప్రారంభమైంది.

రావణుడు అశోకవనానికి రావటం

రావణాసురుణ్ణి అప్పుడు కొందరు స్త్రీలు వెంబడించి వచ్చారు. వాళ్ళు నూరుమంది ఉన్నారు. అందులో కొందరు వివిధాయుధాలు ధరించి వచ్చారు. కొందరు ఛత్రచామరాలు వీజనాలు పట్టుకొని రావణుడి సేవలు చేస్తున్నారు. మణిమయ మద్య పాత్ర ఒక రాక్షసాంగన రావణుడి ముందు నడిచింది. రావణుడి భార్యలు కూడా కొందరు అతడి వెంట వచ్చారు. అశోకవన ద్వారం దగ్గరకు రావణాసురుడు చేరడం హనుమంతుడు చూశాడు. ఇంకా స్పష్టంగా దగ్గరగా వాళ్ళను చూడాలని హనుమంతుడు తాను కూచుని ఉన్న కొమ్మనుంచి కింది కొమ్మ మీదకి వచ్చాడు.

సీతమ్మ దురవస్థ

ఇట్లా వస్తున్న రావణాసురుణ్ణి చూసి సీతాదేవి హోరుగాలికి అరటిచెట్టులా వణికిపోయింది. ముందుకు వంగి తన అవయవాలు కనిపించకుండా ముడుచుకుని ఏడుస్తూ కూచుంది. కటికనేల మీద ఆమె కూచుంది కాబట్టి దుమ్ము ఆమె శిరోజాల మీద, అవయవాల మీద అలముకొన్నట్లుగా ఉంది. మంత్రంతో కట్టిపడవేసిన సర్పంలాగా ఉంది. చల్లారిన జ్వాలలాగా ఉంది. చంద్రుణ్ణి రాహువు కబళించినందువల్ల శోభావిహీనమైన పున్నమి రాత్రిలా ఉంది. ఏనుగు కలచివేసిన తామరపూల కొలనులా ఉంది. వేటకాడు వలపన్ని బంధించగా గుంపు నుండి వేరయిన ఆడేనుగులా రాక్షసరాజు నిర్బంధంలో ఆమె దీనంగా ఉంది. రావణుడి పాపం పండాలి అని సర్వదేవతలను ప్రార్ధిస్తున్నది. వణికిపోతుండటంచేత ఆమె మనోదైన్యం స్పష్టమవుతున్నది.

 

రావణుడి ప్రలాపాలు

ఆమెను అనేక విధాలుగా ప్రలోభపెట్టాలని రావణుడిట్లా ఆమెతో మాట్లాడాడు- "ఎందుకు నన్ను చూసి అంత భయపడిపోతావు? అట్లా వణికిపోతూ, ముందుకు వంగి నిన్నుఎక్కడ చూస్తానో అని కలత చెందుతా వెందుకు? నీ కోసం నా సర్వస్వం, సమ స్తైశ్వర్యం, సర్వపరాక్రమం నీ పాతాల ముందు సమర్పించ తానికి నిశ్చయించుకున్నాను. నీ వంటే నాకు ఇంతా అంతా కాదు వ్యామోహం. పరదారాపహరణం పాపమంటావా? అది రాక్షసులకు స్వధర్మమే. కాని నీవు ఇష్టపడితేనే నిన్ను నా వశం చేసుకుంటాను. నీవు ఎంత మాత్రం భయపడవద్దు. నీవు ఇక్కడ మహాసామ్రాజ్ఞివిగా ఉండాలి. ఈ ఉపవాసాలు, ఈ దైన్యం, ఈ కృశత్వం అంతా ఎందుకు? అపురూపమైన ఆభరణాలు ధరించు. మద్యమైరేయాలు అనుభవించు. నీవు లోకంలోనే సాటిలేని సౌందర్యవతివి. స్త్రీలలో రత్నం వంటిదానవు. గడచిపోయిన యౌవనం తిరిగిరాదు. నా అనుపమాన యౌవనం ఎందుకు వృధా చేసుకుంటావు? ఆ బ్రహ్మ కూడా నిన్ను చూస్తే మోహించకుండా ఉండడు. నాకు భార్యలెందరో ఉన్నారు. కాని నీ అంత అందగత్తె ఒక్కరూ లేరు నా భార్యలలో. నీకోసం సమస్త పృథ్వినీ జయించి జనక మహారాజుకు కానుకగా ఇస్తాను. సురాసురులనందరినీ ఎన్నో మాట్లు జయించాను నేను. దిక్కూమొక్కూ లేకుండా నారవస్త్రాలు, అడవి దుంపలతో రోజులు వెళ్ళబుచ్చేవాడి మీద ఇంకా ఎందుకు ఈ భ్రమ! ఆ రాముడు బతికున్నాడో లేడో కూడానూ! ఆ కుబేరుడి సంపద అంతా తెచ్చి నీ పాదాల ముందు సమర్పిస్తాను. ఈ సమస్త లోకంలో నా వంటి పరాక్రమం కలవాడు లేడు. రాముడికీ నాకూ పోలికేమిటి? నాతో ఉద్యానవనాలలో సంతోషంగా విహరించు" అన్నాడు రావణాసురుడు.

రావణుడి ప్రలాపాలు విన్న సీతాదేవికి పట్టరాని దు:ఖం వచ్చింది. వాడి వైపు కన్నెత్తి అయినా చూడకుండా ఒక గడ్డిపోచను మచ్య ఉంచి (తృణ మంతరత: కృత్వా) ఆ రావణుడికి ఎన్ని విధాలుగానో హితవు ఉపదేశించింది. " పాపాత్ముడు స్వర్గాన్ని కోరితే ఎంత ప్రయోజనమో, నీవు నా మీద మనసు పెట్టుకోవటం కూడా అటువంటిదే. నేను శీల సంపన్నమైన వంశంలో పుట్టాను. పూజ్యవంశంలో మెట్టాను. పరకాంతను కామించేవాడి ఐశ్వర్యం, పరాక్రమం, సర్వనాశనమైపోతాయి."

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)