సారస్వతం

సద్గురువాణి


మీలోని మానవత్వాన్ని పొంగి పొర్లనివ్వండి, దైవత్వం అదే వస్తుంది



- సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్, ISHA Foundation

మీరు సృష్టికర్తను ప్రేమిస్తే, ఆయనను అన్నిటింకన్నా మిన్నగా భావిస్తారు. ఆయన్ని సృష్టికి అతీతుడుగా కొలుస్తారు. అతని దర్శన భాగ్యం పొందడాన్ని, ఆయనతో ఉండడాన్ని సర్వోత్కృష్టంగా పరిగణిస్తారు. ఆయనపై నమ్మకం లేనప్పుడే అస్థిత్వం, అమనస్తత్వం లాంటివి మాట్లాడతారు. నమ్మకం లేని క్షణం మొత్తం విషయం అంతా మీకు గజిబిజి గందరగోళంగా మారిపోతుంది. వేలం ప్రేమ లేకపోవడంతో పనులు జరగడానికి జుట్టుపీక్కోవాల్సి వస్తుంది. నమ్మకం అంటే షరతులు లేని సహజమై ప్రేమ. అవతలి పక్షం నుంచి స్పందన లేకున్నా... మీరు మాత్రం ప్రేమిస్తూనే ఉండడం. అదీ నమ్మకం అంటే.

చదువుకునేటప్పుడు స్కూల్లోనో, కాలేజీలోనో మీరూ ఇలాగే ప్రేమించి ఉండాలి. అవతల వైపు నుంచి ఎటువంటి స్పందన లేకున్నా... మీరు మాత్రం ప్రేమిస్తూ పోయారు. ఒకసారి ఏం జరిగిందంటే కాలేజిలో ఒక అబ్బాయి తన ప్రొఫెసర్‌ దగ్గరకెళ్లి, ''నాకు మీ సహాయం కావాలి'' అని అర్థించాడు. ''తప్పకుండా, నేను మీకు సహాయం చేయడానికే ఉన్నాను'' అని ప్రొఫెసర్‌ బదులిచ్చాడు. ''ఇది నా చదువుకి సంబంధించినది కాదు. వేరే విషయం'' అని ఆ అబ్బాయి అన్నాడు. ''పరవాలేదులే చెప్పు'' అన్నాడా ప్రొఫెసర్‌. అప్పుడా అబ్బాయి... వాళ్ళ కాలేజీలో అందరి కన్నా అందంగా ఉండే ఓ అమ్మాయి గురించి చెప్తూ... ''నేను ఆమెను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నాను. అయితే ఇందులో ఇప్పటి వరకు కేవలం సగం విజయం మాత్రమే సాధించాను, మిగతా సగానికి మీరు సాహాయం చేయాలి'' అని కోరాడు. ఇది అర్థం కాక ''సగం విజయమంటే అర్థమేమిటి?'' అని అడిగాడు ఆ ప్రొఫెసర్‌, ''నేను ఆమెను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నాను. కానీ ఆమె ఇంతవరకు స్పందించలేదు'' అని బదులిచ్చాడా అబ్బాయి.

అవతల వ్యక్తి స్పందించకపోయినా పర్వాలేదు. నేను మాత్రం ప్రేమిస్తూనే ఉంటాను అని భావించే వారితో ఎలాంటి ఇబ్బంది లేదు. దేవుడు ఉన్నాడని గట్టిగా నమ్ముతూ కూడా చివరకు దేవుడు స్పందించకపోయినా పర్వాలేదు అని భావించే వారితో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఎప్పుడూ లేనివాళ్లను ప్రేమిస్తూ ఉంటాం. మనలో చాలా మంది చనిపోయిన వాళ్లని ప్రేమిస్తుంటారు. వాళ్లు బతికున్న రోజుల్లో? వాళ్ల మొహాలు కూడా సరిగ్గా చేసే వాళ్లం కాదు. మీకు వారితో సరిగ్గా మాటలు కూడా ఉండేవి కావు. కాని ఆ మనుషులే చనిపోయిన తర్వాత ఎందుకో వాళ్లపై ప్రేమ పుట్టుకొస్తుంది. మీరు ఎప్పుడూ లేని లేనివాళ్లనే ప్రేమిస్తారు. దేవుడి పట్ల కూడా అదే తీరు. ఒకవేళ ఆయనే కనుక మీతో ఇక్కడ ఉండి ఉంటే, మీ భోజనం కాని, జీవితం కాని ఆయనతో కలిసి పంచుకోవలసి వచ్చినట్లయితే, అప్పుడు మీకు ఆయనతో ఎన్నో సమస్యలుండేవి. కాని ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు. కనీసం మీ అనుభవపరిధిలో కూడా లేరు, కాబట్టి ఆయనను ప్రేమించడం మీకు తేలికే.

ప్రేమ ఆనందం కాదు. అది ఒక బ్రహ్మాండమైన ఆవేదన. తీవ్రంగా తొలిచివేసే ఆవేదన. మీ లోపల ఏదో తొలిచివేయబడాలి. ఏదో కాదు. మీ లోపలంతా తొలిచివేయబడాలి. అప్పుడే మీకు తెలుస్తుంది ప్రేమంటే ఏమిటో... మధురంగా కనుక అనిపిస్తే అది ప్రేమ కాదు. కేవలం ఒక రకమైన సుఖం మాత్రమే. మీకు కొంతవరకు ఆప్యాయంగా అనిపిస్తుందేమో కాని, అది నిజమైన ప్రేమ కాదు. మీరు ఎప్పుడైనా నిజంగా ప్రేమించి ఉంటే, ప్రేమ అనే భావన మిమ్మల్ని తొలిచేస్తుంది. నిజంగా పీల్చిపిప్పి చేస్తుంది. భరించలేని బాధను కలిగిస్తుంది. కానీ అదే బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంటే అంతటా తియ్యటి గాయాలే అన్నమాట. ఎప్పుడు మీకు ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరి పట్ల ప్రతి వస్తువు పైన ఇలాంటి భావన కలడం మొదలవుతుందో, మీరు మీ భౌతిక, మానసిక పరిధుల్ని దాటడం దానంతట అదే సహజంగా జరిగిపోతుంది. ఇది ప్రయత్నిస్తే జరిగేది కాదు. ప్రయత్నపూర్వకంగా మీరు మీరు మీ భౌతికపరిధుల్ని దాటాలనుకుంటే, చివరకుమీకు మిగిలేది గాయాలే, కాని సహజంగా దానంతట అదే జరిగిన నాడు భౌతికపరిమితులు మీకు ఏ మాత్రం అడ్డుకాబోవు.

ఎవరో ఋషులు, మహానుభావులు దేవుడ్ని ప్రేమించడం గురించి మాట్లాడి ఉండవచ్చు. కాని మీరు ఈ విషయం గురించి మాట్లాడడం తగదు. ఎందుకంటే ఎప్పుడూ ఆలోచనలు, తర్కాలు, సంశయాలు, ప్రశ్నలతో నిండి ఉండే మీ మనసుతో దేవుడి గురించి ఆలోచించడం అర్థం లేని పని. ఈ ప్రకృతిలో జీవిస్తున్నారు కాబట్టి మీరు దేవుడు, సృష్టికర్త గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మీరు పుట్టకముందు నుంచి ఈ సృష్టి ఉంది కాబట్టి 'ఎవరో సృష్టించి ఉండాలి' అని మీరు అంచనాకు వస్తున్నారు. అందుకే సృష్టికర్తను రకరకాల రూపాలలో కొలుస్తూ రకరకాల పేర్లతో పిలవడం మొదలుపెట్టారు.

కాబట్టి సృష్టికర్త అనే కల్పన మీరు ఈ సృష్టి నుంచి వచ్చింది. మీరు ఈ సృష్టిని, మీ పక్కన కూర్చున్న వ్యక్తిని అసహ్యించుకుంటారు. అదే మళ్లీ దేవుణ్ణి ప్రేమిస్తానంటారు. ఇదంతా అర్థంపర్థం లేని వ్యవహారం. ఈ రకమైన ధోరణి మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. ఎందుకంటే మీరు సృష్టినే తిరస్కరిస్తున్నప్పుడు ఈ సృష్టిని సృష్టించిన వారితో మీకేం పని? మీరు సృష్టితో ప్రేమలో పడ్డప్పుడు మాత్రమే, ఈ సృష్టిని సృష్టించిన వారితో మీకు సంబంధం ఉండవచ్చు. దైవం అనే పేరుతో మీ మానవవత్వాన్ని మంటగలపొద్దు. మీలోని మానవతను పరిమళించనివ్వండి. దివ్యత్వం దానంతట అదే దిగివస్తుంది.

''నీ పక్కన ఉన్నవాణ్ణి ప్రేమించు'' అన్న ఏసుప్రభు మాటల్లో భావన కూడా ఇదే. ఈ మాటకు అర్థం మీరు మీ పక్కనే ఉన్నవారితో ప్రేమలో పడమని కాదు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ''ఈ క్షణం ఎవరైతే మీ పక్కన ఉన్నారో, వారు ఎవరైనా సరే, వారి పట్ల ప్రేమగా ప్రవర్తించు!'' అని.

ఎదుటివారి మనసులో ఎలాంటి చెడు తలంపులు ఉన్నా మీకు అనవసరం. అసలు అతను మంచివాడా కాదా అనేది మీకు అనవసరం. అతనంటే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా... అతను ఎలాంటి వాడైనా, అతన్ని ప్రేమించు. మీరు ఇలా మారినప్పుడు మాత్రమే మీ ఈ సృష్టిలో కలిసిపోగలరు. సృష్టిలో ఎప్పుడు కలిసిపోతారో సృష్టికర్త వైపు దారి అదే ఏర్పడుతుంది. సృష్టికర్తను చేరుకునే ఒకే ఒక దారి సృష్టి మాత్రమే. మీరు సృష్టిని పక్కన పెట్టేస్తే సృష్టికర్త గురించి ఏమీ తెలుసుకోలేరు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం గురించి ఆలోచించండి. మీ ప్రతి శ్వాసలో, మీరు వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి పనిలో ప్రేమను ఎలా నింపాలో ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న అన్నింటితో కలిసిపోవాలనే కోరికను, తపనను మీలో మీరు సృష్టించగలిగితే... సృష్టికర్తను చేరుకునే దారిని ఈ సృష్టి మీకు చూపించడమే కాదు, మిమ్మల్ని తనే స్వయంగా తీసుకెళ్తుంది.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)