ధారావాహికలు
రామ నామ రుచి
- ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం
తీ.గీ.
కొన్ని ఏండ్లుగ ఈ ’కేసు’ 'కోర్టు’ నందు
మ్రగ్గుచుండంగ మన రైతు లెగ్గుదలచి,
చేరి ఒక సంఘ మేర్పాటు జేసి, వారె
చెఱువు త్రవ్వ మొదలిడిరి చొరవతోడ.
తీ.గీ.
అంత 'కోర్టు’ లో వాజ్యె మున్నంతవరకు,
చెఱువు చెంతకు పోవ నిషేధమనుచు
కోర్టు ధిక్కార భీతిని కొంతమంది
కొలను త్రవ్వక మాపించి రలవుజూపి.
తీ.గీ.
ఎండియుండెను మనచెఱు విన్నియేండ్లు
పొలములన్ని బీటలుదేసె జలములేక,
వలయు ధాన్యము పండింప నలవిగాక
కఱవుతో కుందిరి జనులు గ్రామమందు.
చం.
అసదృశలీల మ్రంగిరి జనావళి గ్రామమునందు, కొందఱో
అసువులు బాసినారు మదియందు కలంగి కృశించి బెంగతో,
నిసుగులకైన క్షీరముల నిండుగ నీయ నశక్తులౌటచే -
పసులు తినంగ నింత కసవైనను పండని కారణమ్మునన్.
తీ.గీ.
మధ్య తరగతి గేస్తులు మనుట కష్ట
మయ్యె, కూలిచేయగ నేర రాత్మగౌర
వాన, ఖర్చులు తగ్గించు పథములేదు,
రాబడియు సున్న - తిండెట్లు! బ్రదుకుటెట్లు!
తీ.గీ.
పొలములను గాని లేనిచో నెలవులైన
అమ్మజూపిన కొనువార లసలె రాక,
ఏండ్లు దాటిన బాగు చేయించ లేక
పోయి రిండ్లు చివికి పడిపోవుచున్న.
కం.
అప్పుల పాలై పౌరులు
తిప్పలు పడినారు, తగిన తిండియు లేమిన్
తప్పనిసరియై కూలికి
చిప్పలుగొని పోయినారు స్త్రీలున్ గూడన్.
కం.
చొప్పడక కొందరు మనము
ముప్పిరిగొని యూరు విడిచి పోయిరి బ్రదుకన్,
ఎప్ప్పట్టునుండ నేరమి
అప్పటి కెట్లో ఒకట్టు లడగిరి ధీరుల్.
కం.
వెచ్చముకై పొచ్చెముతో
కుచ్చితులై ప్రక్కయిండ్ల కొందలపడుచున్
మ్రుచ్చ్లిలిరి కొందఱు యువకు
లుచ్చము నీచమును మరచి ఉద్విగ్నతతో.
కం.
పశువుల కసాయివారల
కెసరేగుచు నమ్మినార లెకసక్కెముగా;
వసివాడక చేసిరి తమ
అసువులు నిలుపగ నవసర మయ్యెడి పనులన్.
తీ.గీ.
ఇంక నా సంగతియనిన - ఇచటె తాత
తండ్రుల గృహము వదలి పో దలపు లేక,
చిన్న ఉద్యోగియైన నా చిన కొడుకు
పంపు సొమ్ముతో నెటులనో బ్రదుకుచుంటి.
తీ.గీ.
పొలము సాగుకు వనరులు పుష్కలముగ
కలిగియును చూడు మేరీతి గ్రామజనులు
కఱువుతో తిండి దొరకక కందినారొ!
పాలకుల యాజమాన్య లోపాల వలన"
కం.
మిత్రుని పలుకులు వినగా
నేత్రము లార్ధ్రంబులయ్యె - నిట్టలముగ నా
గాత్రము తడబడె - ఆలో
గోత్రముపై దేవళంబు గోచరమయ్యెన్.
(సశేషం)
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)