కథా భారతి
సెలయేరు
- శర్మ జి ఎస్
మొదటి ఆటకి వేళ మించిపోతుందని కొంతమంది , బస్స్సు మిస్సు అయితే అనవసరగా యింట్లో పెద్దల కస్సు బుస్సులను ఎదుర్కోవలసి వస్తుందేమోనని మఱి కొంతమంది, త్వరగా యింటికి చేరుకొని వసారాలో వాలు కుర్చీలో కూర్చొని, తనవారితో కాఫీ తాగుతూ, హాపీగా ఫీలవ్వాలని ఇంకొంతమంది, యిలా రకరకాల ఆలోచనలతో అడుగులు వేస్తున్న జనంతో ఆ నడిబజారు నిండిపోయింది.
నవ్య కూడా యిదే బజారులో నడుస్తున్నది. అయితే తన ఆలోచన వేరు. ఈ రోజు ఎలాగైనా తన ప్రేమ విషయం చెప్పెయ్యాలని ఆలోచిస్తున్నది. సరస్వతమ్మ, బ్రహ్మంల సంతానంలో ఆఖరిది నవ్య. ఆడపిల్లలో రెండవది. ఇద్దరు అన్నయ్యలకు, ఒక అక్కయ్యకు చెల్లెలు.
ఇంటికి చేరుకున్న నవ్యకు, చిన్నన్నయ్య మోహన్ తల్లితో ఘర్షణ పడటం చూడగానే, నీరసం ఆవహించి, నోట మాట పెగల్లేదు. ఇంక తన ప్రేమ గురించి ఎలా తెలియచేయటం అన్నది ప్రశ్నగానే వుండిపోయింది ఆ నాటికి .
ఇంట్లోకి వస్తున్న నవ్యని చూడగానే, రవంత ఆశతో “ నువ్వైనా చెప్పవే వీడికి “ అన్నది సరస్వతమ్మ .
“ అమ్మా ఏం జరిగిందమ్మా ? “ అడిగింది.
“ ఎవరో పోరంబోకు దానిని ఈ యింటికి కోడలుగా తెస్తానంటున్నాడే. ఇన్నాళ్ళూ యింటిపట్టున వుండకున్నా , బజార్ల వెంట బలాదూర్ లా తిరుగుతుంటే, వాడే తెలుసుకుంటాడులే అని సహించాను. కాని యిలా, కులం , గోత్రం లేని అనాధను నా కోడలుగా తెస్తానంటే, ఎలా వూర్కోగలనే? నీకంటే పెద్దవాడు, వాడే యిలాంటి పొరపాటు పనులు చేస్తుంటే, ఇంక మీరెలా నడుచుకొంటారు? మీకెలా పెళ్ళీళ్ళు అవుతాయే? “ అంటూ కళ్ళ వెంబడి వస్తున్న కన్నీళ్ళను చీర కొంగుతో తుడుచుకుంది.
సహజంగా ఎక్కడైనా, ఎపుడైనా, ఎవరైనా సాయం కోరి మనల్ని సంప్రదించినపుడు, సహజంగానే ఎవరైతే ముందు సంప్రదిస్తారో వారికే సాయం చేయాలనుకొంటారు. వారి శాయశక్తులా కృషి కూడా చేస్తారు. ( అవతలవారిది తప్పా ,ఒప్పాఅన్న విషయం కూడా ఆలోచించకనే ). ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ .
దీనినే ఆ నాడు మహాభారత యుధ్ధానికి ముందు, ఓ నాడు శ్రీకృష్ణుడు నిద్రిస్తుండగా తల వైపు కూర్చొన్న దుర్యోధనుడిని వదలి , కనులకెదురుగా కనపడేలా కాళ్ళ వద్ద కూర్చొన్న అర్జునుడి ద్వారా తెలియచేశాడు .
నేడు ఈ అధునాతన కాలలో ‘ ఫష్ట్ యీజ్ బెష్ట్ గా ‘ క్లాస్ గా చెప్పుకుంటున్నారు .
“ ఏడవకమ్మా , ఏడవకు, నేనూ చెప్పి చూస్తాగా “ లో లోపల బాధపడ్తూనే , అర్ధం చేసుకున్న దానిలా పైకి అన్నది నవ్య .
“ నువ్వు నాకు చెప్పేదేమిటే ? నీ గురించి , నీ ప్రేమ గురించి చెప్పమంటావా ? “ గట్టిగా గద్దించాడు మోహన్ .
ప్రశాంతంగా వున్న చోట , కుంపటి వెలిగించాడు , ఆ కుంపట్లో నెయ్యి పోసినట్లయింది సరస్వతమ్మ పరిస్థితి . వీడితోనే ఛస్తుంటే ,దీనికి తోడు , యిది కూడా ఆ బాటనే ఎంచుకొందా ???????? అనుకొంటూ, నవ్య వైపు తిరిగి “ ఏమిటే, నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించావా? “ అడిగింది సరస్వతమ్మ ఆదుర్దాగా.
అమ్మతో తనెలా చెప్పాలనుకొంటున్న, తన ప్రేమ విషయం, చాలా తేలికగానే పరిష్కారమవుతుంటే, యిక తను హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు, కొంచెం వాడినే కవ్విస్తే సరిపోతుంది అనుకొని, “ ప్రేమా లేదు, దోమా లేదు” అన్నది.
“ మీ స్నేహితురాలు జయ వాళ్ళన్నయను ప్రేమిస్తూ, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటూ, లేదంటే సరిపోతుందటే” అన్నాడు.
“ జయ అంటే, కార్లో వచ్చే ఆ పెద్దింటి వాళ్ళ అమ్మాయటే “ అన్నది సరస్వతమ్మ.
ఇంక చెప్పేస్తే సరిపోతుందని , “ అవునమ్మా “ అని బదులిచ్చింది నవ్య .
“ అదేమిటే, వాళ్ళు మన కులం కాదుగదే.”
“ కాదమ్మా “ అన్నది .
“ మరెలా ప్రేమించావే? నువ్వేమో వేరే కులం అతనిని, వాడేమో పోరంబోకు దానిని, యిలాగైతే ఎలాగే? “ అంటూ వాపోయింది.
“ ఊరుకోండే, పోరంబోకుదాన్ని కోడలిగా, వదినెగా, మఱదలిగా చూడలేకున్నారే. అదే పోరంబోకు స్ధలమైతే ,ఆనందంగా పరుగులు తీసుకొంటూ తీసుకొనటానికి సిధ్ధపడ్తారు కదా! ఆ స్ధలమెలా పనికొస్తుందే ? ” పేదలపట్ల తన విశాల హృదయాన్ని , పెద్దలపట్ల తన అసహనాన్ని యిలా వ్యక్తం చేశాడు.
“ ఒరేయ్ పిచ్చిగా మాట్లాడకు. మామూలు మనిషిలా ఆలోచించు. పోరంబోకు స్ధలానికి ఎగబడ్తున్నామంటె , ఆ పోరంబోకు స్ధలాన్ని, మనకు కావలసిన రీతిలో మనం మలుచుకొంటాం. కానీ మనిషి పోరంబోకు అయితే, మార్చలేమురా. నీకు పెళ్ళి కావలసిన అవిటి అక్కయ్య, చెల్లెలు వున్నారన్న విషయం మరచి ప్రవర్తించకురా . మనవాళ్ళమ్మాయిని చూసి చేసుకోరా, అవిటిదైనా, అందవికారైనా ఫరవాలేదురా .మాకే అభ్యంతరం లేదు” మనసులోని ఆవేదనను యిలా తెలియచేసింది సరస్వతమ్మ.
“అక్కయ్యతొ అలవాటుపడ్డావు కనుక , అవిటిదైనా ఫరవాలేదంటున్నావ్. నేను మాత్రం అవిటిదానిని చేసుకోలేను. ఇక్కడే చూసి చూసి విసుగుపుట్టి చస్తున్నాననుకో. ఇంకా దానిని కూడ ఎక్కడ చూస్తాను. నేను అందవికారిని చేసుకోను, ఈ అమ్మాయినే చేసుకొంటాను “ మరోమారు తన అభిప్రాయం వివరించాడు.
తనను తాను సంబాళించుకున్న సరస్వతమ్మ తొందరపడకురా, “మీ నాన్నగారికి ఈ రోజు చెప్తాలే. మనవాళ్ళలోనే ఓ పేదపిల్లని చూడమని. నామాట వినరా “ ఏ తల్లీ బ్రతిమలాడని రీతిలో బ్రతిమలాడుతున్నది వంశమర్యాదలను వదులు కోలేక, పరువు ప్రతిష్టలను మంటగల్సిపోతున్నాయన్న బాధతో.
“ ఇన్నాళ్ళు ఆయనగారేం చేశారమ్మా, ఇపుడేదో ఆయన చేస్తారనుకోవటానికి . గంతకు తగ్గ బొంత అన్నట్లుగా నాకు నేను చూసుకొన్నాను. మీ విలువమీరు కాపాడుకోదలచుకోవాలనుంటే రేపు సరాసరి రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చి సంతకాలు చేసి సంతసం కలిగించండి. ఈ నా నిర్ణయానికి మార్పు లేదు “ అంటూ బదులుకి ఎదురు చూడకుండా చకచకా బయటకు వెళ్ళిపోయాడు.
*** ***
రాత్రి 11 గంటల సమయం దాటినట్లుగా గడియారం సూచిస్తోంది. ఊరూ క్రమంగా నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తున్నది.
ఈ రాత్రినిద్ర కలవారికి దూరమవుతుందంటారు. కలవారంటే డబ్బు కలవారని కాదు సుమా !, బాధ, బాధ్యతలు కలవారికి కూడా ఆ కునుకు పట్టదని గ్రహించాలి.
సరస్వతమ్మ రెండో కోవకు సంబంధించినదవటం వలన, ఆమె కూడా కునుకుకు దూరమై, బాధకు చేరువై ఆలోచించసాగింది.
మెల్లగా లేచి భర్తను సమీపించి, భుజం తట్టింది. బదులుగా గురకలు వినిపించాయి. మరో మారు గట్టిగా కుదిపింది.
“ అబ్బబ్బ మంచి నిద్రను చెడగొడ్తున్నావ్ గదుటే, మహాపాపమే “ అన్నాడు బ్రహ్మం.
“ మీరు చేస్తున్నదానికంటేనా? పగలంతా ఆఫీసులో, చీకటి పడ్తుంటే బజారు సెంటర్లో, అర్ధరాత్రి అయితే మంచాన్నంటి పెట్టుకొనే మీతో మాట్లాడటానికి టైం దొరకక ఛస్తున్నా. ఇన్నాళ్ళూ నిద్రపోయింది చాలు ,యికనైనా మేలుకోండి” అన్నది.
“ ఈ ప్రపంచంలో చాలా మంది ఈ నిద్ర పట్టకే, నానా అవస్త్ధలు పడుతూ, మందులతో, మాత్రలతో, పుస్తకాలతొ , టీ వీ తో, సినిమాలతో శతవిధాలా, తంటాలు పడ్తుంటారు. మనకా ఖర్చు లేకుండా హాయిగానే నిద్రపోతుంటే , మధ్యలో నీ గొడవేంటే . “
“ అదికాదండి, చిన్నది, చిన్నవాడు వర్ణాంతర వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. మనమే వాళ్ళకు సంబంధాలు చూసి వుంటే యీ దుస్థితి మనకీరోజు వచ్చేదే కాదండి “ అన్నది .
“ ఈ రోజుల్లో మనలాంటి వాళ్ళు సంబంధాలు చూడటమంటే మాటలు కాదే. పెళ్ళికొడుకుని చూడటం కంటె ఎవరెస్ట్ శిఖరం ఎక్కటమే తేలిక అన్నట్లున్నదే. మనవాళ్ళని కదిలిస్తే చాలు, కట్నాలని, కానుకలని, ఆచారాలనీ , సాంప్రడాయాలని చంపుకుతింటున్నారే. “
మన సమాజంలో వరుల ధరవరుల, కోరికల పట్టిక తలచుకుంటేనే గుండె పట్టేసినట్లయిపోతున్నదే.
1 ) సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు / ఎం బీ ఏ / : 4 లక్షల పై మాటే . అమ్మాయి కూడా సాఫ్ట్ వేర్ లోనో , హార్డ్వేర్ లొనో జాబ్ చేస్తుండాలి. రంగు తక్కువైనా ఫరవాలేదు. ఎం సీ ఏ / గేట్ .
2 ) డాక్టర్లు / మెకానికల్ ఇంజినీర్లు : అందం , రంగు ప్రాధాన్యం కాదు. ఛదువు తనకు దీటుగా, అదే ప్రొఫెషన్ లో వుండి వుండాలి.కట్నం ప్రధానమేమీ కాదు, కానీ లాంఛనాలుగా ఓ పేద్ద బంగళా, ఓ కారు మాత్రం తప్పక సమర్పించుకోవాలి .
3 ) గ్రాడ్యుయేట్స్: నెలసరి 12 నుంచి 15 వేలు సంపాదించే ఉద్యోగాలలో ( ప్రైవేటు దైనా ఫరవాలేదు ) స్ధిరపడి ఉండాలి. ఆందం వున్నా / లేకున్నా అడ్జష్ట్ అయిపోతాం ( మామూలుగా ఇచ్చే ఆ 2 లక్షల కట్నం కంటే , అదనంగా 50 వేలు ముట్ట చెప్పాలి ) .
4 ) ఇంటర్మీడియేట్స్: 1 లక్ష నుంచి 1 లక్షా 50 వేలు కట్నం సమర్పించుకోవాలి. వరుడు ప్రైవేటు ఉద్యోగస్ధుడైనా , గవర్నమెంటు ఉద్యోగస్ధుడిలా చూసుకోవాలిట . ఫెద్ద అందంగా లేకపోయినా ఫరవాలేదుట .
5 ) ఎస్ ఎస్ సి పాస్ / ఫెయిల్: 80 వేల నుంచి 1 లక్ష వరకు కట్నంగా ముట్టచెప్పాలి. ఉన్నత చదువు చదువుకొన్నదై వుండాలి. గవర్నమెంట్ ఉద్యోగస్ధురాలై అందంగా ఉండాలి.
ఇదంతా చూసినా నా ప్రయత్నమేమీ మానలేదు. మనకంటే కొంచెం ఒక మాదిరి పై వాళ్ళని చూద్దామనుకొంటే , వాళ్ళేమో వాళ్ళకంటే పైవాళ్ళని చూడాలనుకోవటంతో , ఇంతదాకా ఎవర్నీ చూడలేకపోయాను.
మార్కెట్లో మనం కొనాలనుకున్న వస్తువుపై దాని మీదున్న ఎం ఆర్ పి మీద ఎంతో కొంత డిస్కౌంట్ యిస్తారు ( అన్ని పన్నులు కలుపుకుని ).
అలా అలా కాలం గడిచిపోతుంటే , ఇక ఆ కాలానికే వదిలేశాను. అందుకే యిలా అంధునిలా మిగిలిపోయాను. “ అలాగంటే ఎలా ? కన్నందుకు మన బాధ్యతను నిర్వర్తించాలిగా, యిలా విస్మరిస్తే ఎలాగండి? “
“ విస్మరించానని నీవనుకొంటున్నావు.ఎల్లప్పుడూ స్మరిస్తూనే వున్నానని నేననుకుంటున్నా. కాని ప్రయోజనం కనపడటం లేదు. “
“ మనకు ప్రయోజనం కనబడే వరకు వాళ్ళ వయసు వూర్కోదు కదండి. కనీసం మన వాళ్ళలో పేదవాళ్ళనైనా చేసుకున్నా , బాధపడేదాన్ని కాదండి. “
“ పరిస్ధితి చేయి దాటింది కనుక, యిలా అనుకొంటున్నావు. నిజానికి మన నవ్య మనవాళ్ళబ్బాయిని ప్రేమించినా, ఆ పెళ్ళి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదే. ప్రేమించిన ఆ కుఱ్ఱవాడు పెళ్ళి ప్రస్తావన వచ్చేసరికి, తల్లితండ్రుల వెనక నక్కి, కట్నకానుకల మిషతో వాళ్ళ పెద్దల్ని ముందుకు నెట్తాడు. మన అమ్మాయి అతన్ని తప్పితే మరెవ్వరినీ
చేసుకోనని భీష్మించుకు కూర్చొంటే, మనమా పెళ్ళీ చేయగలమా? చేయలేం కదా! మన సాటివాళ్ళే మనల్నిలా మట్టి గరిపిస్తుంటే, మనమెలా ఎక్కి రాగలమే? మన కులమే కాదే, ఏ కులానికైనా కళంకం అంటకుండా కళకళ లాడాలంటే, ముందుగా ఈ కట్నా పిశాచిని పారద్రోలాలి. అలా పారద్రోలలేని నాడు ఏకులమైనా సరే వ్యాకులానికి గురి
కావలసిందేనే. “
“ శాఖ అంతరాన్నే గట్టిగా పట్టి చూసే మనం , వేరే వాళ్ళతో సంబంధం కలుపుకోవటమేమిటండి ? నిద్రమత్తులో మాట్లాడటం లేదు కదా? వాపోయింది .”
“ నిద్రమత్తా? ఏనాడో వదిలింది. నీకున్న ఆ కులం, మతం మత్తులు వదిలించుకో. కలికాలంలోని ఈ అపరిమిత ఆడసంతానానికి, కులమత ఛాందసవాదులకు, ఈ వర్ణాంతరమే సరైన మార్గమని, తప్పదని, కళ్ళకు స్పష్టంగా కనపడ్తుంటే, మొగ్గు చూపక వ్యతిరేకిస్తే , మనుగడకే నష్టం అని తెలుసుకోవాలి. “
“ అందుకని వర్ణాంతరాలని ప్రోత్సహించమంటారా ? “
“ప్రోత్సహించమని , కులాల్ని , మతాల్ని వదలమనటం లేదు. ఎక్కడ అవకాశం లేదో అక్కడ చూసీ చూడనట్లు పోవాలంటున్నా.ఈ కులాంతర మతాంతర వివాహాల వలన కులాలు కుళ్ళినా , మతాలు మట్టిగఱచినా , ( కుమిలిపోయే ఆ పెద్దలు తప్ప) మిగిలిన ఆకుటుంబ సభ్యులందరూ ,సంతోషంగా జీవిస్తారు. కులభ్రష్ఠ్త్వం జరిగిందని కుమిలి కుమిలి ఏడ్చే బదులు, మతభ్రష్ఠత్వం జరిగిందని, మలినమై పోతున్నామని మధనపడే బదులు , ఇది కాలానుగుణంగా వస్తున్న మార్పుగా భావించి , తదనుగుణంగా నడచుకోవాలే తప్ప , ఎదురీతకు ప్రయత్నించ కూడదు. అపుడే మన ( సు ) కు అన్నివిధాలా శాంతి లభిస్తుంది. “
“ ఏమిటండి ఈ సంభాషణ ? మనం సంఘంలో జీవిస్తున్నాం. సంఘ నియమాలకు కట్టుబడి జీవించాలి. ఫిల్లలు పెద్దల మాటలు వినాలికదా ! “
“ చూడు సరసూ , ఈ నియమాలేవీ శాశ్వతం కాదు . ఇవి మనకు అనువుగా నియమించుకొన్నవే. మనిషి ఎక్కడ నుంచి వచ్చాడో మరిచిపోకూడదు.
ఆ నాడు లేని జనం, ఈ నాడు ప్రభంజనంలా అధికమవుతుంటే, ఆ పాత నియమాలకు నీళ్ళొదలక తప్పదు. క్రొత్త నియమాలను సాదరంగా స్వాగతించక తప్పదే.
ప్రఖ్యాత వాస్తు శాస్త్రాలు కూడా, పాపులేషన్ ప్రభంజనమైనపుడు , వాస్తు శాస్త్రాన్ని అనుసరించవలసిన పని లేదని నిర్ణయించాయి. అందుకే పేద్ద పేద్ద మహానగరాలలో తదనుగుణంగానే నిర్మాణాలకు అనుమతిస్తున్నారు, ముందుకు దూసుకువెళ్తున్నారు.
పిల్లలు పెద్దల మాట వినాలనేది పాత కాన్సెప్ట్, ఆ పిల్లల మాట పెద్దలు వినాలనేది లేటెష్ట్ కాన్సెప్ట్.
పిల్లల అభిప్రాయాలు, పెద్దల అభిప్రాయాలతో ఏకీభవించాలనుకోవటం కాంక్ష. ఏకీభవిస్తే సతోషపడవచ్చు. ఏకీభవంచక పోతే బాధ పడకూడదు.
సహజంగా యిరువురికి అభిప్రాయాలు కలవవు. కారణం తరాల దూరం. పిల్లలు ఉదయించబోతున్న సూర్యులు.
పెద్దలు అస్తమించబోతున్న సూర్యులు.
ఆ వెలుగులో తేడా వున్నట్లుగానే, ఆ యిరువురి ఆలోచనా ధోరణిలో తేడా వుంటున్నది అందరూ గ్రహించవలసిందే. బాధగా వున్నా తప్పదు.
సృష్టి అంటేనే కొత్తదనం. పరిశీలించి చూస్తే మన పెద్దల కాలంలో ఎఱుగనివి, జరగనివి, మన కాలంలో చూస్తున్నాం. మనకు మామూలుగానే ఉన్నాయి, కాని మన పెద్దలకు తప్పుగా అగుపించాయి. ఇలా తరానికి, తరానికి మధ్యగల తారతమ్యాలే ఈ మార్పుకి ప్రవేశార్హత కల్గిస్తున్నాయి. సర్దుకుపోయే మనస్తత్వం గల వారికి ఈ మార్పు మొదట కొంచెం వింతగా తోచినా, క్రమేణా అలవాటు చేసుకొంటారు.
ఈ ప్రపంచంలో ఫృధివ్యాపస్తేజోవాయురాకాశాత్ లు మాత్రమే శాశ్వతం , ఈ మొత్తం కలయికతో మార్పు కూడా శాశ్వతత్వాన్ని సంపాదించుకొంది. మానవ శరీరంలో ఆకారం లేకున్నా ఆ శరీరాన్నే తన గుప్పెటలో పెట్టుకుంటున్న మనసు లాగే ఈ మార్పుకి ఆకారం లేదు . మనసు ఆకారం వెంటే ఉన్నట్లు , మార్పు ఈ ఫృధివ్యాపస్తేజోవాయు రాకాశాత్ ల వెంటే వుంటూ తన పని తాను చేసుకుపోతుంటుంది.
పారే సెలయేరు లాంటిదే ఈ ప్రపంచపు పోకడ , సెలయేరు కైతే పాతనీరు పోయి కొత్తనీరు వస్తుంది . అలాగే మనలో కూడా పాతదనం పోయి కొత్తదనం రావాలి . ప్రభుత్వం కూడా వర్ణ వివాహితులకు ప్రోత్సాహకాలిచ్చి , వారి జీవితాలను సరిదిద్దుతున్నది . మన వల్ల కానప్పుడు మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలే తప్పదు . కనుక అధైర్య పడకు ,ఇకనైనా అర్ధం చేసుకొని మసులుకో , హాయిగా , ప్రశాంతంగా నిద్దురపో . “
“ అది కాదండి. వింటుంటే బాగానే వుంది. ఆచరణకే సాధ్యం కాదండి “ అంటూ నసిగింది.
“ సాద్యం కానిదేదీ ఈ ప్రపంచంలో లేదంటారు. మా , మీ తాత ముత్తాతలు కాలినడకనే కాశీ , రామేశ్వరాలు చూసొచ్చారు కదా ! మరి మనం అలా కాలినడకన వెళ్తున్నామా ? లేదే .
ఆ కాలంలో కిరోసిన్ దీపాలనే వాడారు , మరి మనం వాడ్తున్నామా ? లేదే , కట్టూ , బొట్టు, వేష, భాష ,
అంతే కాదు పౌరసత్వం కూడా , మనకు తగ్గట్లుగా మనం మనజీవన విధానాన్ని సైతం మార్చుకొంటూ వస్తున్నాం . ఏం వర్రీ అవకు, “ ఆవలిస్తూనే నిద్రాదేవి ఒడిలోకి ఒరిగాడు బ్రహ్మం.
“ ఇన్నాళ్ళూ ఈయనగారికేమీ తెలియదనుకొన్నది. ఇంత తెలిసినవారని అనుకోలేదెపుడూ. తనేమో అన్నీ తెలిసినదానిలా ప్రతిదీ పట్టించుకొని ఈ సమస్యకు పరిష్కారం లేదు అనుకొని ఎంతగా మధనపడేదో ?
నిజానికి తెలుసుననుకోవటంలో లేదు గొప్పదనం, తెలిసినట్లుగా నడచుకోవటం లోనే ఉన్నది అసలు సిసలు గొప్పదనం అని ఈ నాడే తను గ్రహించింది . “
సరస్వతమ్మ మనసు తేలిక పడింది, ఆదమరచి నిద్రపోతున్న భర్తను ఆప్యాయంగా ముద్దు పెట్టుకొని , తన గుండెలకు గట్టిగా హత్తుకుని ఆనందం పొందింది.
****
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)