కబుర్లు
సత్యమేవ జయతే
తెలుపు – నలుపు
- సత్యం మందపాటి
తెలుగులో ఒక సామెత వుంది, “ తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్ళు కాదు” అని.
ఈ సామెతలో మొదటి సగం బాగానే వుంది. కల్తీ లేని పాలు అయితే, తెల్లగానే వుంటాయి. కానీ నీళ్ళు నల్లగా వుండటమేమిటి? నేను నల్లటి నీళ్ళు అసలింతవరకూ చూడనేలేదు. నీళ్ళకి రంగు వుండదు. ఆకాశం నీలంగా వుంటే, సముద్రంలో నీళ్ళు నీలంగా కనిపిస్తాయి. చుట్టూ పచ్చటి చెట్లు వుంటే, నదిలో నీళ్ళు లేత ఆకుపచ్చగా కనిపిస్తాయి. సూర్యోదయమో, అస్తమయమో అవుతున్నప్పుడు సముద్రంలో నీళ్ళు కాషాయం రంగులోనో, ఎర్రగానో కనిపిస్తాయి. చెరువు పాచి పట్టి వుంటే అక్కడి నీళ్ళు ముదురాకుపచ్చగా వుంటాయి. కానీ ఎన్నడూ నల్లగా వుండవు. మరి ఈ సామెత ఎలా వచ్చిందో!
అలాగే అమెరికాలోనూ, పసిఫిక్ ఆసియాలోనూ, యూరప్ దేశాల్లోనూ మనం తెల్లవాళ్ళు అనే మనుష్యులు తెల్లగా వుండరు. అమెరికాలో కొంచెం గులాబీ, ఎరుపు రంగుల కల్నేతగానూ, జపాన్ చైనాలలో కొంచెం పసుపు పచ్చగానూ వుంటారు. తెలుపు అంటే, ఒక్కసారి తెల్ల కాగితాన్ని గుర్తు చేసుకోండి. అదీ తెలుపు. నేను అమెరికాలో మూడున్నర దశాబ్దాల పైగా వుంటున్నాను కానీ, వచ్చినప్పటి నించీ ఈనాటి వరకూ తెల్ల కాగితంలా తెల్లగా వున్న తెల్లవాళ్ళని ఇంతవరకూ చూడలేదు.
అలాగే అమెరికాలో నల్లవాళ్ళూ నల్లగా వుండరు. డార్క్ చాకొలెట్ రంగులో వుంటారు. నలుపు అంటే, చీకటి రంగు. అలాగే మన భారతీయులు అమెరికాలో మనల్ని బ్రౌనీస్ అంటారు. కానీ మనం బ్రౌన్ రంగు వాళ్ళం కాదు. తెలుపూ కాదు, నలుపూ కాదు. లేత గోధుమ రంగు అందామా… తేనె రంగు అందామా? మీరే చెప్పండి!
అసలు ఈ తెలుపూ నలుపుల తేడాలు ఎందుకు?
సాధారణ మనుష్యులం మనం. మనం కాని రంగుతో మనల్ని అనుకుంటూ, ఎందుకు ఇలా కొట్టుకు చస్తున్నాం?
దిస్ ఈజ్ ఎ మిలియన్ డాలర్ క్వొశ్చన్!
“అగ్రకులం అంటరానితనం, తెలుపూ నలుపూ, నువ్వూ నేనూ, బీదా బిక్కీ
మతాలూ భాషలూ, రాష్ట్రాలూ దేశాలూ అంటూ కొట్టుకు చస్తాం మనం, నీలిగీ నిక్కీ
అంతరిక్షంలో నించీ చూస్తూ వ్యోమగామి కల్పనా చావ్లా ఏమందో తెలుసా?
అక్కడ్నించీ చూస్తే, మన అందమైన భూగోళం మీద, ఏ గీతలూ కనపడటం లేదని!”
“భూదేవికి లేదు చారల చీరా జాకెట్టూ!” అనే మకుటంతో నేను వ్రాసిన “అమెరికా వంటింటి పద్యాలు” పుస్తకంలో పైన ఉదహరించినది ఒకటి.
మన మానవమాత్రులకి గీతలు గీసుకోవటం అంటే సరదా అని ఇంతకుముందు వ్రాశాను. అందులో తెలుగువారయితే మహా సరదా. ఇది ఒకప్పుడు మనకి మహా సరదాగా వున్నా, ఇప్పుడీ బురద ఎంత గోకినా పోని దురదలా తయారయింది.
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? అని శ్రీశ్రీగారు ఆనాడు చెప్పినట్టు ‘పరపీడన పరాయణత్వం
’. నేను ఈనాడు అంటున్నట్టు, నువ్వు “మావాడివి” కాదు అని, ఒకడి నెత్తిన ఇంకొకడు ఎక్కి, వాడిని క్రిందకి తొక్కి పారేయటం. ఏ రాయయితేనేం, పక్కవాడి పళ్ళు వూడగొట్టటానికి?
“తెలుగువాడు పైకొస్తున్నాడు త్రొక్కేయండి!” మీకందరికీ తెలుసు అదేమిటో!
మన దేశంలో ఆ రోజుల్లోని ఓడలు, కొన్ని ఈనాడు బండ్లు అయాయి. ఆనాటి బళ్ళు కొన్ని మాత్రమే ఓడలు అయాయి. ఒకరోజు తొక్కబడినవాడు, ఈనాడు తొక్కుతున్నాడు. మళ్ళీ ఈనాటి ఓడలు, ఇంకొక రోజు బండ్లు అవుతాయేమో చూడాలంటే, ‘కొన్ని తరముల సేపు’ వేచి వుండాలేమో!
ఈ తెలుపు కాని తెలుపు, నలుపు కాని నలుపుల – బేధ భావం ప్రపంచమంతటా ఏనాటి నుంచో వుంది. తెల్లవాడు, బ్రౌనువాడు నల్లవాళ్ళల్లోనించే వచ్చినా, ఏమిటో నలుపంటే చాలమంది వాళ్ళ చేతులు నలుపుతారే కానీ కలపరు. అదో దౌర్భాగ్యం!
ఆమధ్య భారతదేశం నించీ కొత్తగా వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు ఒక వారాంతం మా ఇంటికి అతిధిగా వచ్చాడు. వాతావరణం చాల బాగుంది కనుక, ఆరుబయట వాకిట్లో నుంచుని మాట్లాడుకుంటున్నాం. అప్పుడే మా ఎదురింటి ఆయన, కారు దిగి ఇంట్లోకి వెడుతూ, నవ్వుతూ చేయి పైకెత్తి పలకరించాడు.
అతిధి నాతో నెమ్మదిగా అన్నాడు, “ఏమిటి! మీ ఇంటి దగ్గర అందరూ అమెరికన్లు కాదా? నల్లవాళ్ళు కూడా వున్నారా?” అని.
ఆ మాటలకు నాకు కొంచెం కోపం వచ్చినా, మర్యాదగానే అన్నాను. “ఆయన ఇక్కడే పుట్టి, పెరిగిన అమెరికన్. కొన్ని తరాలుగా వాళ్ళు అమెరికన్సే! నేను ఇక్కడ మూడున్నర దశాబ్దాలుగా వున్నా, ఆయన నాకన్నా ఎక్కువ అమెరికన్! అంతేకాదు, నీలా విదేశస్థుడు కాదు..”
అతిధి కొంచెం ఖంగుతిని, “అంటే ఇక్కడ నల్లవాళ్ళు కూడా వున్నారా అని..” అని మళ్ళీ నసిగాడు, అటూ ఇటూ వున్న పెద్ద పెద్ద ఇళ్ళు చూస్తూ.
ఈసారి నవ్వుతూ అన్నాను, “అమెరికాలో మన భారతదేశంలోలా మాల పల్లెలు లేవు మరి. ఉంటే ఆ నల్లవాళ్ళతో పాటూ, నిన్నూ నన్నూ కూడా అక్కడే వుండమనే వారు!”
అతిధి మళ్ళీ కొంచెం ఖంగుతిని, “అదికాదు.. ఇక్కడ ఇలాటి వాళ్ళు వుంటే, మరి సేఫ్టీ వుంటుందా అని..” అని మళ్ళీ నసిగాడు.
“ఆయన ఎవరనుకుంటున్నావ్? ఇక్కడ ఒక పెద్ద చర్చిలో పాస్టర్. అంటే మన శ్రీవెంకటేశ్వర స్వామి వారి గుడిలో పూజారిలాటివాడు. అంతేకాదు, ఆయన పక్క ఇంట్లోనే వుంటాడు మైకేల్ అనే ఆయన. ఆయనా నల్లవాడే! ఇక్కడ ఒక పెద్ద కంప్యూటర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్..” అన్నాను.
ఇలా చెప్పుకుంటూ పొతే, ఇది మా రోజుల్లో గుంటూరు చాంతాడంత పొడుగు వస్తుంది. ఇప్పుడు గుంటూరులో చాంతాడులు లేవు కనుక, ఈ సంఘటనని ఇక్కడ వదిలేసి, అసలు విషయంలోకి వెడదాం. వెళ్లే ముందు, నా “అమెరికా వంటింటి పద్యాలు” పుస్తకంలో నేను వ్రాసిన ఇంకొక పద్యం చెప్పాలని వుంది.
దాని పేరు, “రాజుగారికి నిత్య దణ్ణాలు”.
“మన దేశమూ కాదు, సంస్కృతీ రంగూ కానే కాదు, మరి లేవా రాగద్వేషాలు
అమెరికన్ యాస ఇంగ్లీష్ అసలే రాదు, మరెందుకిస్తారు మనకిక్కడ ఉద్యోగాలు
ధనస్వామ్యంలోని గొప్పతనమిదేనని ఒప్పేసుకుని చేస్తే చాలదు ఉపన్యాసాలు
రోజూ నిద్ర లేవగానే మార్టిన్ లూధర్ కింగ్ పటానికి చేయాలి నమస్కారాలు!
మా వూళ్ళోనే పంథొమ్మిది వందల అరవైలలోనే అమెరికాకి వచ్చిన, ఒక మంచి స్నేహితులు ఒకాయన వున్నారు. ఆయన చెబుతుంటారు – ఆస్టిన్ నించీ హ్యూస్టన్ కారులో వెడుతుంటే, దారిలో పెట్రోల్ స్టేషన్ దగ్గర, ఆయనకి పెట్రోలు అమ్మేవారుట కానీ, లోపలికి వచ్చి కాఫీ త్రాగటానికి కానీ, అక్కడే టాయిలెట్ వాడటానికి కానీ వీల్లేదనేవారుట. అంతేకాదు, అక్కడ ‘తెల్లవారికి మాత్రమే’ అనే బోర్డులు కూడా వుండేవట!
మార్టిన్ లూధర్ కింగ్, జాన్ కెన్నెడీ, రాబర్ట్ కెన్నెడీ మొదలైన వారి దయవల్ల పరిస్థితులు ఎంతో మారిపోయాయి. తెల్లవారిలో కూడా అధిక శాతం ఈ మార్పునే కోరుకున్నారు. దాని కోసమే పోరాడారు. తెలుపూ నలుపుల కలయిక అక్కడితో ఆగక, ‘రంగాంతర’ వివాహాలతో, వారి కొత్త తరం పిల్లలతో, ఎంతోమంది ఎక్కడ చూసినా కనపడుతూనే వున్నారు. మా స్నేహితులలో కూడా ఎంతో మంది తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు చాల స్నేహంగా, ఏమీ తేడాలు లేకుండా, కొందరయితే స్వంత బంధువులలా దగ్గరయారు. ఇహ ఇక్కడి మన రెండవ తరం ‘గోధుమ’ పిల్లలు, తెల్లవారినీ, నల్లవారినీ, స్పానిష్, చైనీస్ ఇలా అన్ని రంగులవారినీ, వివాహం చేసుకుని సుఖంగా, పండగ పూట రంగవల్లుల్లా కళకళలాడుతున్నారు.
ప్రపంచం మొత్తం మీద, ఎన్నో రంగాల్లో ఎంతో ముందుకు పోయిన అమెరికా, ఒక్క విషయంలో ఒక్క అంగుళం కూడా ముందుకు పోని విషయం ఒకటి వుంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని వందల సంవత్సరాలు అయినా, ఒక స్త్రీని కానీ, నల్లవాళ్ళని కానీ దేశాధ్యక్షుడిగా చూడలేకపోయారు అమెరికా ప్రజలు. 1960 దాకా, ఏమీ హక్కులు లేని నల్లవారిని – కనీసం వాదన కోసం పక్కన పెట్టినా- ఒక తెల్లని స్త్రీని కూడా ప్రెసిడెంట్ పదవిలో చూడని దేశం అమెరికా. కారణం ఏమయి వుంటుందో నేను చెప్పను. మీ ఆలోచనకే వదిలేస్తున్నాను.
అలా అమెరికాలో వుంటున్న మాబోంట్లు, ఒక్కసారిగా ఉలిక్కిపడే సంఘటనలు కొన్ని జరగటం, గత ఆరేడేళ్ళగా చూస్తున్నాం.
అప్పుడే, 2008 సంవత్సర ఎన్నికలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా, డెమొక్రట్ పార్టీలో ఒక స్త్రీ, ఒక నల్ల వ్యక్తి అధ్యక్ష పదవికి బరిలో దిగారు. వారిలో ఎవరికి నామినేషన్ వచ్చినా, ఆ వ్యక్తి గెలిస్తే, చరిత్రలో నూతన అధ్యాయం మొదలవుతుంది. బరాక్ ఒబామాని ఆ పార్టీ తమ అభ్యర్ధిగా ఎన్నుకుంది. ఎంతోమంది నల్లవారూ, తెల్లవారూ, నాలాటి మీలాటి వలస వీరులూ, ముఖ్యంగా యువత ముందుకు వచ్చి, తలా ఒక చేయి వేసి, ధన బలం కన్నా, మాకు మంచి కోసం మార్పే కావాలని, కనీ విని ఎరుగని మెజారిటీతో, ఒబామాగారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అమెరికా దేశచరిత్రని తిరగేసిన, తిరగ వ్రాసిన మొట్టమొదటి నల్ల అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఒబామా! ఎక్కడో “కొన్ని చోట్ల” తప్ప, దేశమంతటా వెల్లి విరిసిన ఆనందం!
అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య ఎనిమిది శాతం వుండేది. ఆర్ధికంగా దేశం ఎంతో వెనకబడి, మొదటి ప్రపంచ యుధ్ధం రోజుల ఆర్ధిక సంక్షోభం కన్నా అధ్ధాన్న స్థితిలో వుంది. స్టాక్ మార్కెట్ బాగా క్రిందకి పడిపోయి, కొంతమంది ఆ నష్టాలని భరించలేక ఆత్మహత్యలు చేసుకునే దాకా వెళ్ళింది. వాళ్ళల్లో కొంతమంది మన భారతీయులు కూడా వున్నారు. అమెరికా ఆరోగ్య శాస్త్రంలోనూ, ఆరోగ్య రంగంలోనూ ప్రపంచంలోనే అగ్రగామి అయినా, ఎంతోమంది సామాన్య ప్రజలకు ఆరోగ్య భీమా పధకాలు అందుబాటులో లేకపోగా, కొండెక్కి కూర్చున్నాయి. ఇలా ఎన్నో సమస్యల మధ్య, ఆ పద్మవ్యూహంలోకి చొరబడ్డాడు అధ్యక్షుడు ఒబామా.
ఆయన ఒక్కొక్క సమస్యను తీరుస్తూ, నాలుగేళ్ళలోనే దేశాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళాడు. నాలుగేళ్ళ తర్వాత కూడా ప్రజలు, మాకు మీరే కావాలి, అని ఆయనని మళ్ళీ ఎన్నుకున్నారు. పెద్ద మెజారిటీతో మళ్ళీ గెలిచాడు. మొత్తం ఆరేళ్ళలో, ఆర్ధిక సమస్య తీరిపోవటెమే కాక, నిరుద్యోగుల సంఖ్య సగానికి పడిపోయింది. స్టాక్ మార్కెట్ ఎన్నడూ చూడని విధంగా పెరిగిపోయింది. మెడికల్ ఇన్స్యూరెన్స్ చాలమంది దరిదాపుల్లోకి వచ్చింది. ఇలా వ్రాసుకుంటూ పోతే, నేనేదో పార్టీ ప్రాపగాండా చేస్తున్నాను అనుకుంటారు. నా ఉద్దేశ్యం అది కాదు, ఈ వ్యాసం ఉద్దేశ్యం కూడా అది కాదు. అసలు పాయంటులోకి, పార్టీ రాజకీయాల ప్రమేయం లేకుండా వెడదాం.
ఒక నల్లవాడు, ఎన్నో సమస్యల్ని అధిగమించి, మొదటిసారిగా దేశ అధ్యక్షుడయి, ఆరేళ్ళలో దేశ ప్రగతినే మార్చివేయటం, ఒక ఉదాహరణగా చూపించి, ఈ తెలుపు నలుపుల మాటలు ఎంత అర్ధహీనమైనవో చెప్పటమే నా ఉద్దేశ్యం. తెలివితేటలు ఒకరి సొత్తు కాదు! అవకాశాలు వస్తే, వాటిని సరిగ్గా వాడుకుంటే, విజయం సాధించటం తధ్యం!
ఒబామా అధ్యక్షుడయాక, చాలమంది ‘రంగు’ తీవ్రవాదులకు వణుకు పుట్టింది, ఆయన విజయాలు చూసి కన్ను కుట్టింది. ఆయన మీద, నల్లవాడనీ, ముస్లిమ్ అనీ, తీవ్రవాది అనీ, కమ్యూనిస్ట్ అనీ, సోషలిస్ట్ అనీ ఎన్నో అభాండాలు వేశారు. గవర్నమెంటులో అనుకున్న సహకారం లభించలేదు. కొంత మీడియా కూడా రంగుల పరంగా విడిపోయింది. చేతిలో ఏ ఆయుధాలు లేని కొందరు నల్లవారిని పోలీసులు రోడ్ల మీద కాల్చి చంపేయటమూ జరిగింది. కొన్ని కోర్టులు కూడా, అలా కాల్చిన తెల్ల పోలీసులని నిర్దోషులుగా నిర్ణయించాయి.
మేము ఇంతకు ముందు చూడనివి, ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం. అలా అని తెల్లవాళ్ళు ఇలాటి వారు అనటం భావ్యం కానే కాదు. కొందరు ‘రంగు తీవ్రవాదులు’ చేస్తున్న ఈ పనులని, నల్లవారితో కలిసి ఎందరో తెల్లవారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, ఒక తెల్ల దురహంకార సంస్థ కె కె కె వారి కార్యక్రమంలో, కీలకోపన్యాసం ఇచ్చి వార్తల్లోకి వచ్చాడు. ఒక టీవీ చానెల్ అయితే నల్లవాళ్ళని, సుప్రభాత వేళనించీ పవ్వళింపు సేవ దాకా తిట్టటమే ఉద్యమంగా పెట్టుకుంది.
మొన్ననే రెండు సంఘటనల గురించి చదివాను.
ఒక తెల్ల అతనికి, తన నల్ల భార్య ద్వారా, ఒక కొడుకు పుట్టాడు. ముగ్గురూ హాయిగా జీవిస్తున్నారు. ఆ పిల్లవాదు భార్య పోలికతో నల్లగానే వున్నాడు. తండ్రి పేరు సీహెచ్ అందాం. అతను ఒక ఇంటర్వ్యూలో అన్నాడు.
“నేను ఈనాడు అమెరికాలో చేయగలినవి కొన్ని, నా కొడుకు చేయలేడు. అది కేవలం అతని శరీరపు రంగు వల్ల. నేను ఏదయినా స్టొరులో తిరుగుతున్నంత సులభంగా అతను తిరగలేడు. అతన్ని వేయి కళ్ళతో చూస్తుంటారు. జాతి విచక్షణ లేకుండా నేను విజయం సాధించగలను. ట్రాఫిక్ పోలీసు నన్ను చూసినట్టు, వాడిని చూడడు. ధనవంతుల ఇళ్ళ ముందు నేను ధైర్యంగా నడిచి వెళ్ళగలను. నేను జాతి విచక్షణ గురించి సులభంగా ఫిర్యాదు చేయగలను. ఈ పరిస్థితి మారాలి. అందరం ఒకటిగా వుండాలి. ఈ మనుష్యులు ఎప్పుడు మారతారో చెప్పటం కష్టం!” ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోయాడు.
అలాగే ఇంకొక తెల్ల అతను, పేరు సీకే అందాం. తన ఇద్దరు కొడుకులతో పాటు, ఇథియోపియాకి వెళ్ళి అక్కడ ఒక నల్ల అనాధ బాలుడిని దత్తత తీసుకుని వచ్చాడు. స్కూల్లోగానీ, ఇంటి దగ్గరగానీ, వూళ్ళోగానీ తన మొదటి ఇద్దరి పిల్లలనీ చూసినట్టు, తన మూడో కొడుకుని చూడటం లేదని వాపోయాడు. ఎంతోమందితో తనకి ఈ విషయంలో మాటా మాటా వచ్చింది అన్నాడు. రేపు తను చనిపోతే, ఆ పిల్లవాడు ఎలా నెట్టుకు వస్తాడు. తన మిగతా ఇద్దరు కొడుకులతో సమానంగా బ్రతకగలడా? అదే ఒక నల్ల స్నేహితుడితో చెబితే, మీ అబ్బాయిని జాతి విచక్షణ అంటే ఏమిటో వివరంగా చెప్పి, దానికి అతన్ని సిధ్ధం చేయమన్నాడుట!
అంటే ఈ జీవన సత్యాలను పిల్లలుగా వున్నప్పుడే, అర్ధమయేటట్టు చెప్పమనా? ప్రపంచమంతటా, జాతి విచక్షణ, మత విచక్షణ మొదలైనవి విపరీతంగా వున్నాయి. కొన్ని కొంతమందికి, అంటే ఈ విచక్షణకి బలి అయేవారికే తెలుస్తాయి. దూరంగా కూర్చుని, సోద్యం చూస్తున్నవారికి, ఇదేదో సత్యదూరం అనిపిస్తాయి. దూరపు కొండలు నున్నగానే కనిపిస్తాయి కదూ!
కొన్ని దేశాల్లో ఇవి బహిరంగంగా కనిపిస్తాయి. కొన్ని దేశాల్లో చాప క్రింద నీటిలా, కనపడకుండా తడిపి ముంచేస్తుంటాయి. ఎలా జరిగినా కొందరు బలి అవక తప్పదు. ఇండియలోనూ, కొన్ని ముస్లిం దేశాల్లోనూ, సౌత్ ఆఫ్రికాలోనూ, యూరప్, ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా మొదలైన దేశాల్లోనూ ఈ జాతి విచక్షణ ఇంకా పోలేదు.
అంతదాకా ఎందుకు, శ్రీకృష్ణుడు నల్లవాడని మనం ఒప్పుకోం.
అంత “నల్లనివాడు, పద్మ నయనమ్ములవాడినే” మనం నీలం రంగు పూసి పూజ చేస్తుంటే, ఈ రంగు ద్వేషాలు ఏనాటికి అంతమవుతాయంటారు!
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)