గూడు - గువ్వ

గూడు చెదిరిన గువ్వ


- రామకృష్ణ నిమ్మగడ్డ

స్నేహం ఊపిరులూది
జడంలో జీవాన్ని నింపి
ఆశల వేళ్ళూనుకొనేలా చేసి
అనుభూతుల ఆకులను తొడిగి
వెచ్చటి వేసవిలో నీడనిచ్చి
నను కాచిన నేస్తం,

ఆకులన్నీ రంగు మారి, నేలకు రాలి
మోడువై నిలిచావే!

శిశిరమా, నీ కేల
ఇంత నిర్దయ
నా స్నేహము పైన

ఎచటికి పోవును ఈ గోరింక,
ఉత్తరమునుండి
కఠినమైన శీతగాలి
వీచునపుడు,
జీవితము
శిలాసదృశమై
తోచునపుడు

ఈ చిన్ని గుండెలో,
నిను మరలా తిరిగి
చూడకపోతానా
అని ఆశలు నింపుకొని
వసంతాగమనాభిలాషినై
నిను వీడి పోతున్నా...
గూడు చెదిరి
కలలు కరిగి
ఒంటరినై
ఎగిరి పోతున్నా....
ఎటువైపో
వెళ్ళి పోతున్నా,
గమ్యము తెలియని
పధికునికి
ఏ దిక్కు అయినా,
ఒకటే అన్న తెగువతో

ఈ కాసింత ప్రాణిలో
రవ్వంత ఊపిరి నిలుపనా
నీ దరికి మరలా చేరేదాకా,
చండ ప్రచండ హిమ ఖండాలు
శాంతించేదాకా, ముంచుకొచ్చిన
మంచు తెరలు కరిగేదాకా....

కాలగతిన మంచులా గడ్డ కట్టి
బండరాతిగా మారిన
స్నేహ మధువులు కరిగి
ఉప్పొంగునపుడు
గుండె లోతుల్లో
ఆనంద వీచికలు వీయగ
రెక్కలు విప్పుకొని
తిరిగి వస్తానపుడు

మనసున మల్లియలు విరియ
నవ వసంత మరుదెంచునపుడె
మంచు కాలమున మూగవోయిన కోయిల
మావి చివుళ్ళు తిని మత్తెక్కి కూయునపుడె

శక్తిని కూడగట్టి, మరిన్ని పుల్లలు పేర్చి
మరలా గూడు కట్టి నీ యొద్దనె
తల దాచుకొనియెద, ఇంతకన్న
వేరు ఇచ్ఛ లేదు, ఈ జీవితమున...

మనియెద నీ వాకిట
మహాప్రస్థానమరుదెంచుదాక
మౌనరాగమాలపించుచూ !



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)