అన్నమాచార్యుని శృంగార కీర్తనలలోని గొప్పదనం ఏమిటంటే, నాయక, నాయికలను ఏ పరిస్థితులలోనూ లౌకికస్థాయి శృంగారస్థాయికి దిగజార్చకపోవడం. శ్రీవేంకటేశ్వరుని ఏ నాయక రూపంలో మనకు సాక్షాత్కరింపజేసినప్పటికీ ఆ పరంధాముని దివ్యత్వానికీ ఏమాత్రం భంగం కలుగజేయకుండా ఉదాత్త గంభీరునిగా మనకు దర్శింపజేయడం. అలాగే అలమేలు మంగమ్మనూ మనకు దివ్యమైన శోభతో దైవత్వం ఉట్టిపడేట్టు ప్రతిపాదించడం, మధుర గంభీర మూర్తిగా మనకు నిరూపింపజేయడం. బహువ్యాపకుడైన నాయకుడు నాయిక వద్దకు వెంటనే రాక కాలయాపన జేసినప్పటికీ మానవ సహజగుణములను వారికి ఆపాదించక సర్వత్రా వారిని దైవ పీఠం మీదే నిలిపి ఉంచడం.
ఈ మాసం కీర్తనలో స్వామి "శఠుడు" అనగా స్వామి చేసే అనుచితకార్యాలు దేవేరికి మాత్రమే తెలిసేట్టుగా చేయడం శఠుని గుణంగా అలంకారికులు నిరూపించారు. శఠుడు నాయికకు తప్ప ఇతరులకు తెలియకుండా తప్పులు చేసేవాడు అని అర్ధం. శఠుడైన నాయకుని తీరు మనం ఇప్పుడు ఈ క్రింది కీర్తనలో చూద్దాం.
కీర్తన:
పల్లవి: మచ్చికెంత గలిగినా మఱగు మొఱగు లేదా
ఇచ్చ యెరిగి లోలోన యొనయుటగాక
చ.1 గుట్టుతోడ జవరాలు కుచములు దాచుకోగా
చుట్టమువలెనే తొంగి చూడ వచ్చేవు
చిట్టకములు సేయగా సిబ్బితిగల యాటది
వొట్టు వెట్టక మానునా వూరకే జంకించేవు
చ.2. వాసి తోడ ముద్దరాలు వదనము వంచుకుంటే
సేసకొప్పు జారదీసి చెక్కునొక్కేవు
బేసబెల్లి చేతలకు పేరుకల పూవుబోణి
ఈసడించ వలదా నీవేల తమకించేవు
చ.3 వోజ తోడ చదురాలు వోవరిలో నుండగాను
రాజసాన బచ్చిదేర రతిగూడేవు
తేజముతో మన్నించగా తేకువగల కోమలి
సాజపు శ్రీవేంకటేశ సంతోసించకుండునా.
(రాగం: భైరవి; శృం.సం.సం.28; రాగి రేకు 1805; కీ.సం.24)
విశ్లేషణ:
పై కీర్తనలో దేవ దేవుడు జరిపిన శృంగార కలాపాలు దేవేరికి తెలిసిపోయాయి. స్వామిని అడుగుతోంది స్వామీ ఆమెపై నీకెంత ప్రేమ ఉంటే మాత్రం సమయం సందర్భం అక్కరలేదా? నలుగురిలో ఆమెను అల్లరిపాలు చేస్తారా? అని అడుగుతోంది. స్వామి చేసే కార్యాలన్నీ ఏమీ గుట్టు దాచుకోడు అన్నీ దేవేరికి చెప్పేస్తూ ఉంటాడు లేదా తెలిసేట్టే చేస్తూ ఉంటాడు. అలాంటి ఒకానొక సంఘటనలో చిక్కుకున్న స్వామిని గూడి అలమేలు మంగమ్మ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అయినా సమాధానం వస్తుందా? స్వామి అన్నిటికీ చిరునవ్వే సమాధానం అన్నట్టు ఉంటాడు. చూడండి.
పల్లవి: మచ్చికెంతగలిగినా మఱగు మొఱగులేదా
ఇచ్చ యెరిగి లోలోన యొనయుటగాక
స్వామీ! ఆ నాయికపై మీకు ఎంత మక్కువ, ఆసక్తి, ఇష్టం ఉన్నా..చాటు మాటూ చూసుకోవాలికదా! ఏ పనికైన హద్దూ పద్దూ ఉంటాయికదా! తమకెంత తమకం ఉన్నా ఆ ఇష్టాన్ని మనసులోని దాచుకుని సమయమెరిగి పొందికకు ప్రయత్నించాలి తప్ప, ఆ పిల్లను ఇలా నలుగురిలో సిగ్గుపడేట్టు, అవమానం పాలయేట్టు ప్రవర్తించడం మీకు తగదు అంటోంది దేవేరి అలమేలు మంగమ్మ.
చ.1 గుట్టుతోడ జవరాలు కుచములు దాచుకోగా
చుట్టమువలెనే తొంగి చూడ వచ్చేవు
చిట్టకములు సేయగా సిబ్బితిగల యాటది
వొట్టు వెట్టక మానునా వూరకే జంకించేవు
హవ్వ! పాపం ఆ యువతి సిగ్గుతో వక్షస్థలం దాచుకోడానికి ప్రయత్నిస్తుంటే తమరు ఆమె కుచముల వైపే మాటి మాటికీ తొంగి తొంగి చూడడం సరయిన కార్యమేనా? చెప్పండి! మీరు చేసే శృంగార చేష్టలకు ఆమె సిగ్గుతో నావేపు చూడవద్దు ఒట్టు సుమా అనేంతగా ఆమెను భయపెట్టేసారు. ఇవన్నీ ఆ జవ్వని భరించలేకపోతోంది అన్న విషయం తమరు గ్రహించరా నాధా! ఎంత విరహం అయితే మాత్రం అని అడుగుతోంది.
చ.2. వాసి తోడ ముద్దరాలు వదనము వంచుకుంటే
సేసకొప్పు జారదీసి చెక్కునొక్కేవు
బేసబెల్లి చేతలకు పేరుకల పూవుబోణి
ఈసడించ వలదా నీవేల తమకించేవు
అభిమానంతో, సిగ్గుతో ఆ యువతి తల వంచుకుని కూర్చుంటే..మీరు ఆవిడ కొప్పు లాగి చెక్కిలి నొక్కుతారా? నీ కపటపు పనులకు ఆపూబోణి తమరిని సిగ్గుతో, భయంతో ఎంత ఈసడించుకుంటుందో అన్న అలోచన తమరికి ఉండదా స్వామీ! ఎందుకు అంత త్వరపడతారు? స్త్రీ మనసెరిగి ప్రవర్తించాలన్న విషయం తమకు తెలియనిది కాదు కదా నాధా!
చ.3 వోజ తోడ చదురాలు వోవరిలో నుండగాను
రాజసాన బచ్చిదేర రతిగూడేవు
తేజముతో మన్నించగా తేకువగల కోమలి
సాజపు శ్రీవేంకటేశ సంతోసించకుండునా
ఉత్సాహముతో చతురతగల స్త్రీ పడకగదిలో ఉండగా, రాజసంతో వచ్చి పచ్చి రతుల గూడేవు. వింత వింత అలంకారలతో శోభించే వేంకటేశ్వరా!... స్వామీ! తమరు మన్నించినట్లైతే బింకముతో ఉన్న ఆ జవ్వని ఎంత సంతసిస్తుందో కదా!
- - -
విశేషాంశాలు: తాళ్ళపాక కవులను చదివితే తెలుగు సంపూర్తిగా వస్తుందని వేటూరి ప్రభాకర శాస్త్రి గారన్న మాట అక్షర సత్యం. ఇందులో ఆనాడు వాడుకలో ఉండి నేడు మరుగున పడ్డ తెలుగు పదాలు ఎన్ని ఉన్నాయో చూసారా? అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా టీ.టీ.డీ వారు చేస్తున్న కృషి అనితర సాధ్యమే అయినా ఈ సంకీర్తనలన్నిటికీ అర్ధ తాత్పర్యాలను రాయించి భద్రపరచగలిగితే భవిష్యత్తరాలవారి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మన తెలుగు తరతరాలు నిలుస్తుంది.
ముఖ్యమైన అర్ధములు:
మచ్చిక = మోహము, ఆసక్తి;
మఱగు మొఱగు = చాటు మాటు అనే అర్ధంలో ఆకాలపు జంట పదం;
ఒనరు, ఒనయు = పొందిక, వీలు, వాటము;
జవరాలు = యౌవనస్త్రీ;
చిట్టకములు = శృంగార చేష్టలు;
సిబ్బితి = సిగ్గుగల ఆడది;
జంకు = భయము;
వాసి = అభిమానము;
సేసకొప్పు = అక్షింతలు చల్లించుకునే కొప్పు;
బేసబెల్లి = మోసం, కపటం;
తమకించు = త్వరపడు;
ఓజ = ఉత్సాహము;
చదురాలు = చతురతగల స్త్రీ;
వోవరి = పడక గది;
పచ్చిదేర = పచ్చిగా;
తేకువ = జంకు, బింకం;
సాజపు = అలంకరణతో యున్న.