కబుర్లు - సత్యమేవ జయతే
తరాలు – అంతరాలు
- సత్యం మందపాటి

తరాలు అంతరాలు అనే విషయం గురించి ఎంతో వ్రాయవచ్చు. ఎన్నో యుగాల నించీ ఎన్నో దేశాల్లో, సంస్కృతుల్లో, ఎన్నో తరాలు, వాటి అంతరాలు మనమందరం చూసినవే, చూస్తున్నవే! వాటన్నిటి గురించీ ఈ చిన్న వ్యాసంలో వ్రాయటం నా తరం కాదు. ఉద్దేశ్యమూ కాదు. అందుకని, నాకు తెలిసిన భారతీయులు, ఎన్నో తరాలుగా నాకు తెలిసిన అమెరికాకి వలస వచ్చి, అమెరికాలో నివసిస్తూ చూస్తున్న ఆ తరాల అంతరాలు గురించి చెప్పాలనేదే ఈ వ్యాసం యొక్క లక్ష్యం. చిత్తగించండి. ఈ వ్యాసంలో మీరు కూడా పాత్రధారులే. ఈ వ్యాసంలో ఇక్కడో అక్కడో ఎక్కడో మీకు మీరు కూడా కనిపిస్తే ఆశ్చర్యపోవద్దు.

‘అవును, నిజమే సుమా!’ అనుకోండి చాలు!

౦ ౦ ౦

ఇండియానించీ రెండువందల సంవత్సరాల క్రితమే మన సర్దార్జీలు, మరికొందరు భారతీయులు, చైనా మొదలైన దేశాలవారితో పాటూ అమెరికాలో రైలు పట్టాలు వేయటానికీ, బంగారం గనుల తవ్వకాలకీ వలస వచ్చినట్టు చరిత్ర చెబుతున్నది. దరిమిలా మిగతా వారు కూడా ఎక్కువగా కార్మికులుగానే వచ్చారు. తర్వాత భారతంలో చదువుకున్నవారు పై చదువుల కోసం రావటం జరిగింది. ఆరోజుల్లో మన తెలుగువారు చాల తక్కువమందే వచ్చినా, 1950, 60, 70 దశకాలలో కొంచెం ఎక్కువగా రావటం మొదలుపెట్టారు. వారిలో అధిక శాతం పైచదువులు అమెరికాలో చదువుకోటానికి వచ్చినవారే. వారిలో కొంతమంది, భారతదేశంలో అటామిక్ ఎనర్జీ, స్పేస్ రిసెర్చి ఆర్గనైజేషన్, ఐఐటీలు లాటి గొప్ప సంస్థలలో మంచి ఉద్యోగాలు సంపాదించి వెనక్కి వెళ్ళిపోయారు. అలా వెళ్ళకుండా, అమెరికానే తమ నివాస దేశంగా చేసుకుని స్థిరపడిపోయినవారిని, నేను ఈ వ్యాసంలో మొదటి తరం అంటున్నాను.

ఈ మొదటితరంలో వచ్చినవారు, ఆరోజుల్లో హాయిగా నున్నటి తారు రోడ్డు మీద ఝుమ్మంటూ తమ జీవన ప్రయాణం సాగించలేదు. ఎన్నో కష్టాలు పడ్డారు. శ్రమకోర్చి పట్టుదలతో తమ గమ్యాన్ని చేరుకోవటానికి, అష్టకష్టాలు పడి తాము అనుకున్నది సాధించగలిగారు. కొత్త దేశం. కొత్త సంస్కృతి. కొత్త భాష. కొత్త ఆహార పద్ధతులు. శాకాహారం అనేది తెలియని ప్రపంచం. అన్నిటికీ మించి ఆరోజుల్లో తెల్లవారిదే ఆధిక్యం. తెల్లవారు, నల్లవారినే కాదు విదేశీయులతో సహా అందరినీ కాలి క్రింద నొక్కి పెట్టిన రోజులు అవి. ఒక వూరు నించీ ఇంకొక వూరుకి కారులో వెడుతున్నప్పుడు, పెట్రోలు కొనుక్కోవచ్చు. కానీ, అక్కడ టాయిలెట్లు వాడుకోవటానికి ప్రవేశం లేదు. అవి తెల్లవారికి మాత్రమే అని బోర్డులు కూడా వుండేవి. అలాగే కొన్ని రెష్టారెంట్లలో తెల్లవారికి మాత్రమే బోయినాలు. ఇతరులు పల్లకీ మోసే అంటరాని బోయీలు మాత్రమే! యాభైలలోనూ, అరవైలలోనూ ఇక్కడికి వచ్చిన మన భారతీయ మిత్రులని అడిగితే, ఇలాటి కథలు ఎన్నో మీరు వినవచ్చు.

1960 దశకంలో ఇద్దరు కెన్నెడీల హత్య, మార్టిన్ లూథర్ కింగ్ హత్య జరిగి, అధ్యక్షుడు జాన్సన్ అన్ని రంగులవాళ్ళనీ సమానంగా చూడమనే బిల్ మీద సంతకం పెట్టాక పరిస్థితి కొంత మెరుగయింది.

అందుకనే నల్లవారిని చులకనగా చూసే మనవాళ్ళకి చెబుతుంటాను, ప్రతిరోజూ మీరు మార్టిన్ లూథర్ కింగ్ గారి ఫోటోకి దణ్ణం పెట్టుకుని ఉద్యోగానికి వెళ్ళమని. మరి ఆయనేగా తన ప్రాణత్యాగంతో, మనకి ఇక్కడ సాటి మనుష్యులుగా జీవించే అవకాశం ఇచ్చింది!

ఈలోగా మనవాళ్ళు సాంకేతికంగా తమ సత్తా చూపించటమేకాక, భారతీయ శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, డాక్టర్లు ఎంతో తెలివిగలవారనీ, మంచి పనిమంతులనీ పేరు తెచ్చుకున్నారు. ఇది నేను ఊహించి వ్రాసినది కాదు. నా అనుభవమే. అదేమిటో ఇంకో మూడు పేరాగ్రాఫులు అయాక చెబుతాను.

ఆరోజుల్లో ఏదో చిన్న అపార్ట్మెంటులో వుంటూ, పిల్లలని సిటీ స్కూళ్ళకి పంపిస్తూ, భార్యా భర్తా ఇద్దరూ చదువుకుంటూనో, చిన్నో పెద్దో ఉద్యోగాలు చేస్తూనో భవిష్యత్తుకి బంగారు బాట వేసుకునే ప్రయత్నం చేసేవారు. ఆర్ధిక స్థోమత లేక ఇండియాకి కూడా ఏ పదేళ్లకో ఒకసారి వెళ్ళేవాళ్ళు. పిల్లలూ, పెద్దలూ, పెద్దలు అయిన పిల్లలూ అమెరికన్ సంస్కృతిలో పూర్తిగా ఇమిడిపోయినా, తెలుగు సంస్కృతినీ భాషనీ కంటికి రెప్పలా చూసుకునేవారు. మొదట్లో ఎవరి ఇంట్లోనో కలిసి, పాటలు పాడుకోవటం, సాహిత్య సమావేశాలు జరుపుకునే వారు. తర్వాత నెమ్మదిగా కొన్ని తెలుగు వ్రాత పత్రికలూ, కొన్ని స్థానిక తెలుగు సంఘాలూ, దేశ వ్యాప్తంగా ఒక తెలుగు సంఘం కూడా వచ్చాయి.

1980, 1990 దశకాలనించీ, 2000 దశకం మొదటి రెండు మూడు సంవత్సరాల్లో అమెరికా వచ్చిన వారిని నేను రెండవ తరం వారు అంటున్నాను. 1980 మొదట్లో వచ్చిన నేను, ఈ రెండవ తరానికి చెందినవాడినే. అందుకనే నాకు ఈ కాలంనించీ మనవారి జీవితాలు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది.

ఈ రెండవ తరంలో మన తెలుగు వారిలో చాల మంచి, కొంచెం చెడూ వున్నాయి. ముందుగా మంచి ఏమిటంటే... మొదటి తరంవారికి దొరకని మనవాళ్ళ సహాయం, మా రెండవ తరం వాళ్లకి దక్కింది. మరీ ఎక్కువమంది భారతీయులు – తెలుగు వాళ్ళతో సహా - అమెరికాలో లేకపోయినా, భాషా బేధం లేకుండా, ఎవరైనా కొత్తగా వచ్చిన భారతీయుడు కనపడితే, ముక్కూ ముఖం తెలియని వారు కూడా ఎంతోమంది సహాయం చేయటానికి ముందుకు వచ్చి, తోడుగా నిలబడేవారు. అలా మమ్మల్నీ ఒక తెలుగు దంపతులూ, బొంబాయి కుర్రవాడూ, తమిళ కుటుంబం, మా కాళ్ళ మీద మేము నిలబడే దాకా మా పక్కనే నిలబడ్డారు. వాళ్ళు అలా దారి చూపించినందుకేనేమో, అప్పటినించీ ఇప్పటిదాకా, కనీసం ఒక డజనుమంది – తెలుగు, తమిళం, గుజరాతీ, సింధీ మొదదలైన భాషా మిత్రులు - ఉద్యోగాలు వచ్చేదాకా మా ఇంట్లోనే వుండి, ఇక్కడ అమెరికాలో స్థిరపడ్డారు. ఇందులో మేము చేసింది ఏమీలేదు, ఒకళ్ళు మాకు చేయి అందిస్తే, మేము ఇంకొకళ్ళకు చేయి అందించాము. అంతే.

మన మొదటి తరం భారతీయులెంతో తెలివిగలవారనీ, మంచి పనిమంతులనీ పేరు తెచ్చుకున్నారని పైన చెప్పాను కదా. దానికి నాకు తెలిసిన రెండు ఉదాహరణలు చెబుతాను. నేను అమెరికాలో మొట్టమొదటి ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, నా మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే జరిగిందిది. ఒక చిన్న కంపెనీలో డిజైన్ ఇంజనీరు ఉద్యోగానికి వెళ్లినప్పుడు, ముందు ఒక వైస్ ప్రెసిడెంటు కేవలం రెండే నిమిషాలు మాట్లాడాడు. ఏమని? ‘మా కంపెనీలో ఒక చాకులాటి ఇండియన్ కుర్రవాడు వున్నాడు. ఎంతో తెలివిగలవాడు, మంచి పనిమంతుడు. మీ ఇండియా వాళ్ళని తీసుకోవటానికి నేను రెండుసార్లు ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు అతనితో మాట్లాడండి. అతను ‘సరే’ అంటే మీదే ఈ ఉద్యోగం’ అన్నాడు. ఆ బొంబాయి కుర్రవాడు, నాతో రెండు గంటలు మాట్లాడాక ‘సరే’ అన్నాడు. మర్నాడే ఉద్యోగంలో చేరిపోయాను. అలాగే మూడేళ్ళ తర్వాత నేను ఇంకొక కంపెనీలో ఇంజనీరింగ్ మేనేజరుగా వున్నప్పుడు, నా డిపార్ట్మెంటులోనే ఒక ఉద్యోగం వుంటే, ‘నీకు తెలిసిన మంచి ఇండియన్ ఇంజనీర్లు ఎవరైనా వుంటే తీసుకోరాదూ’ అన్నాడు మా ప్రెసిడెంటు.

అప్పుడు చిన్న చిన్న వూళ్ళల్లో ఇండియన్ గ్రోసరీ షాపులు కానీ, రెస్టారెంట్లు కానీ వుండేవి కావు, ఎవరైనా దగ్గరలోని పెద్ద నగరాలకి వెడుతుంటే మా నాలుగైదు కుటుంబాలకీ ఎవరికి ఏం కావాలో కనుక్కుని తెచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో అన్ని భాషలవాళ్ళూ మనవాళ్ళే!

తర్వాత ఆనాటి ఇద్దరు కులగజ్జి ఆంధ్రప్రదేశం ముఖ్యమంతులు అమెరికా వచ్చి, మన కులం ఎక్కడ, మిగతా కులాలు ఎక్కడ అని, ఆ ఒక్క తెలుగు సంఘాన్నీ రెండుగా విడిపోవాలని ఆశీర్వదించారు. వాళ్ళు రాజకీయనాయకులు కనుక వాళ్ళు కుల రాజకీయామృతాన్ని తాగించారనుకోండి, మరి అది త్రాగిన అమెరికా డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులు ఏం చేశారు? యు హౌమచ్ అంటే యు హౌమచ్ (నువ్వెంత అంటే నువ్వెంత) ఆని రెండుసార్లు తెంగ్లీషులో అనుకుని విడిపోయారు. అప్పటినించీ ఆ రెండూ ఇంకో రెండై, మళ్ళీ ఇంకో రెండై.. ఇంకెన్నో అవబోవటానికి సిద్ధంగా వున్నాయి. అంతేకాక, ఆయా సంఘాలు వారివారి రాజకీయ నాయకుల్ని, కుల నాయకుల్నీ, సినిమా నటులనీ ఆయా సంఘాల తిరునాళ్ళకి పిలిచి, అలా ఎందుకు చేస్తున్నారో వారికే తెలిసిన కారణాల వల్ల, వారిని సత్కరించటం మామూలయిపోయింది.

ఆరోజుల్లోనే చాల వూళ్ళల్లో ప్రారంభించిన తెలుగు సంఘాల ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అక్కడక్కడా మన పిల్లల కోసం తెలుగు బడులు మొదలయాయి. మన పిల్లలకి తెలుగు సంస్కృతి నేర్పాలనే ఆత్రుత పెద్దలలో ఎక్కువయి, సంగీతం, కూచిపూడి నృత్యాలులాటివి నేర్పటం, స్థానిక తెలుగు సంఘాల కార్యక్రమాలలో పిల్లల్ని వేదిక ఎక్కించి ప్రోత్సహించటం కూడా వీటిలో ఒక భాగం అయింది.

ఈ సమయంలోనే మొదటి, రెండవ తరాలవారు కొందరు, సాంకేతికపరంగా వ్యాపారాలు మొదలుపెట్టి, ఎన్నో విజయాలు సాధించి పైకి రావటం ముదావహం. అలాగే చాల వూళ్ళలో మనవారికి కావలసిన షాపులు రెస్టారెంట్లు కూడా చాల ఎక్కువయి జీవితం కొంచెం సుఖవంతం అయింది. ఇప్పుడే అక్కడా ఇక్కడా కొన్ని హిందూ దేవాలయాలు, భారతీయ చర్చిలు కూడా వెలిసాయి.
అప్పుడే తెలుగు సాహిత్య సదస్సులు స్థానికంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అమెరికా దేశపరంగానే కాక, హ్యూస్టన్ నించీ ఒక సాహితీ సంస్థ నిర్వహించిన ప్రపంచ సాహిత్య సదస్సులు కూడా సాహితీ మిత్రులను ఆకట్టుకున్నాయి. అలాగే తెలుగు వెబ్ పత్రికా ప్రచురణలు. స్థానిక అమెరికా రచయితల పుస్తక ప్రచురణ కూడా, అమెరికా తెలుగు సంఘాల ప్రోత్సాహం ఏమాత్రం లేకపోయినా, ఎక్కువయాయి.

అమెరికాలో స్థిరపడాలా, ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలా అనే మొదటితరంలో మొదలయిన త్రిశంకు స్వర్గం ఆలోచనలూ, ఆచరణలూ, ఈ రెండవ తరంలో ఇంకా ఎక్కువయాయి. అంతేకాక తమ ఆస్తుల్ని హారతి పట్టేసి, దానితో ఇద్దరు పిల్లల్నీ చదివించి అమెరికాకి అర్పించేసి, అమెరికాలో వుండలేని, ఇండియాలో ఒంటరిగా బ్రతకలేని తల్లిదండ్రుల కష్టాల నష్టాల కథలు చాల కుటుంబాలని క్రుంగదీసాయి.

ఈలోగా మొదటి తరం వారి పిల్లలు పెళ్ళిళ్ళకి సిద్ధం కావటం వల్ల, మామూలు సంప్రదాయ ‘అదే కులం’ వివాహాలతోపాటూ వర్ణాంతర వివాహాలేకాక, అంతర్జాతీయ వివాహాలు కూడా మొదలయాయి. అవి రెండవ తరం వారి పిల్లలలో ఇంకా ఎక్కువయాయి. భారతీయ సంతతి వివిధ దేశాల పిల్లలని వివాహాలు చేసుకుని వసుధైక కుటుంబాలని ఏర్పరుచుకుంటుంటే, కొందరు పెద్దలు మాత్రం ఇంకా కులక్షేత్రాలు వారి సంఘాలలోనే కాక, భారతదేశంతో కూడా పంచుకుంటూనే వున్నారు.

ఇలాటి వసుధైక కుటుంబాలు ఇంకా ఎక్కువగా వస్తే, ప్రపంచం మొత్తం ఇంకొక యాభై ఏళ్ళల్లో కులాలు, మతాలూ, రంగులూ, దేశాలు, ఏమీ ఎల్లలు లేని ఒకే ఒక పెద్ద కుటుంబం అవుతుంది కదూ!
అంతకు ముందే అమెరికాలో అంకురార్పణ చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల తరం 2000 దశకం మధ్యలో ఇంకా వేగం పుంజుకుంది. ఎంతోమంది భారతీయులు, తెలుగువారితో సహా, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి రావటంతో ఈ మూడో తరం విస్కృతం అయింది.

ఈ తరంలో చాలామందికి మొదటి, రెండవ తరాల వారు వేసిన బాటలోని ‘అమెరికాలో తెలుగు జీవన విధానం’ వారి రాకను, మనుగడను సులభతరం చేసింది. అంతకుముందు వచ్చిన వారు పడ్డ కష్టాలు, ఇబ్బందులు వీరికి లేవు. అందులో ఇంటర్నెట్ వాడకం కూడా ఎక్కువవటంతో, ఇండియా నించే వాళ్ళు వచ్చే ప్రదేశంలో వసతి మొదలైనవన్నీ ఏర్పరుచుకుని వచ్చే అవకాశం కూడా వచ్చింది.

మేము అమెరికాలో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టినప్పుడు, ఎక్కడ వుండాలా, ఎలా వుండాలా, రేపు భోజనం ఎవరు పెడతారూ అని ఎదురు చూస్తే, ఈనాడు విమానం దిగగానే ఎక్కువ శాతం పిల్లలు ఏండ్రాయిడా, ఐ ఫోనా అనుకుంటూ ఆలోచిస్తున్నారు. అదీ ఒకందుకు మంచిది.

అలాగే తెలుగు జనాభా ఎక్కువ కావటంతో, అవసరాలూ ఎక్కువయి వారికి కావలసిన వ్యాపారాలు ఎక్కువయాయి. ఈ తరం వారిలో కొంతమంది, అంతకు ముందు వచ్చిన మొదటి రెండు తరాల వారితోనూ, స్థానిక అమెరికన్లతోనూ బాగా కలిసిపోతే, చాలామంది వారి తెలుగు మిత్రులతో ఇంకా ఆ ‘తెలుగు లోకం’ లోనే వుండటం గమనించదగ్గ విషయం.

వీరి రాక మొదలయాక, భారతదేశం నించీ వారి తల్లిదండ్రులు అమెరికాకి రావటం ఎక్కువయింది. అలా ఎక్కువమందికి అమెరికా దర్శనం మంచిదే అయినా, ఇక్కడా మళ్ళీ భారతదేశంలో తల్లిదండ్రుల ఒంటరి జీవితం కూడా ఎక్కువయింది. భవిష్యత్తులో ఇప్పుడు చెబుతున్న రెండవ, మూడవ తరాల వారి తల్లిదండ్రుల జీవితాలు, భారతదేశంలో ఎలాటి మార్పులు తెస్తాయో చూడాలంటే మనం ఇంకా కొన్ని సంవత్సరాలు వేచి చూడాలి.

మూడవ తరం సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఐఐటీ, ఎన్నైటీ, ఐఐఎస్సీ, ఇంకా కొన్ని మంచి కాలేజీలలో చదివి వచ్చినవారికి మంచి పేరు వుంది. అలాకాక బట్టీ చదువులు కొనుక్కుని వచ్చిన వారి విషాద గాధలు కూడా ఈ తరం వారిలోనే బాగా వినిపిస్తున్నాయి. తెలుగు జనాభా ఎక్కువవుతున్నా, మనవాళ్ళు మనవాళ్ళ తోనే తెలుగులో ఆఫీసులో పెద్దగా మాట్లాడుతూ, అమెరికన్ కార్పోరేట్ వాతావరణంలో సరిగ్గా ఇమడటం లేదనే ఒక వాదన కూడా వుంది. చాలామంది ‘వర్క్ ఫ్రం హోమ్’ చేయటం వల్ల, వారికి ఉద్యోగంలో చకచకా పైకి వెళ్ళే అవకాశాలు కూడా లేవని అంటారు. ఎందుకంటే అమెరికాలో ఒక సామెత వుంది – ‘If you are not in, you are out!’ అని.

అలాగే బయట కూడా అందరూ ఒకే అపార్ట్మెంట్ల సంమూహంలో వుండటం వల్ల వారి మధ్య సహాయ సహకారాలు ఎక్కువగానే వున్నా, మనవాళ్ళు స్తానికులకి దూరం అవటం కనిపిస్తుంది. అదీకాక మనవాళ్ళు ఎల్కేజీ నించీ మంచి స్కూళ్ళు కావాలని, అలాటి స్కూళ్ళ దగ్గర వున్న కాలనీలలో ఇళ్ళు కొనుక్కున్నా, ఎంతోమంది ఒకే కాలనీలో దాదాపు అరవై శాతం వుండటం వల్ల భారతీయ కాలనీలు మొదలయాయి. భారతీయుల దగ్గర బంగారం ఎక్కువ వుంతుందని తెలుసుకున్న దొంగలు, వారి ఇళ్ళ మీద దాడి చేసి బంగారం తీసుకువెళ్లటం కూడా తరచూ వింటూనే వున్నాం.

ఇలాటి ఎన్నో మంచీ చెడుల మధ్య, మూడు తరాల నించీ మేము, అంటే అమెరికాలో తెలుగు వాళ్ళం ఇక్కడి జీవన వాహినిలో ఈదుకుంటూ వెడుతున్నాం. ఇదీ క్లుప్తంగా మన కథ!

౦ ౦ ౦


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)