యధాలాపంగా టి.వి. ఆన్ చేసాను. 'నా బంగారు తల్లీ’ అనే సినిమా వస్తోంది. స్త్రీలకు జరిగే అన్యాయాలు, అవమానాలను గురించిన ఇతివృత్తంతో కథ సాగుతోంది. ఇలాంటి చిత్రాలు ఎన్నో ఇది వరకు వచ్చి ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని రూపొందించిన స్త్రీమూర్తి ధన సంపాదన కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో చేయలేదు. బాధిత స్త్రీ జనాభ్యుదయానికి కృషి చేసే దిశలో వెలుగు చూసిన ఓ ప్రయత్నమిది. తరచి చూడగా ఆమె అంతరంగం నా ముందు ఇలా సాక్షాత్కరించింది.
"ఆ దేవుడే కనిపిస్తే నడిరోడ్డులో నరికిపారెయ్యాలన్నంత కోపంగా ఉండేది నాకు.
నేను కలిసే వందలాది మంది పిల్లల అమాయక బాల్యం చిదిమేసిన ప్రాణులు, పరిస్థితుల పట్ల నిస్సహాయమైన కోపం, కసి రేగేవి. కానీ వాళ్ళతో కలిసిమెలిసి కదిలిన కొద్దీ నా భావంలో మార్పు వచ్చింది. వాళ్ళ బాధ, నొప్పి, కలతలతో మనసుని మరిగిస్తుంటే, వాళ్ళ పునరుజ్జీవనం, శక్తిని పునర్నిర్మించటంలో లోటు ఏర్పడుతుందని అర్థమైంది. ఆనాటి ఏ బాధిత బంగారు బిడ్డ కనిపించినా, వాళ్ళ పట్ల వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి కాదని, అది వాళ్ళ తప్పు కాదని అర్థమయ్యేలా చెప్పేదాన్ని. వాళ్ళలోంచి బాధ, నొప్పి, భయం, ఆవేశం తొలగించి, ఒక జీవితకాలానికి కావలసిన ధైర్యస్థైర్యాల్ని నూరిపోసేదాన్ని. తనలోనే దాగున్న అందమైన మరో వ్యక్తిని తనకి చూపేదాన్ని. ఆ క్రమంలో నేను తెలుసుకున్న కొత్త నిజం - దేవుడెక్కడో రోడ్డు మీద కనిపించడు. నీలో, నాలో, నా చుట్టూ, నాతోనే ఉన్నాడు. నాలోని ఆవేశపు అంతరాత్మలోనే కాదు అమాయక పసిపిల్లల గాయపడ్డ ఆత్మలలోనూ ఉన్నాడని అర్థమైంది.
ప్రజ్వల స్థాపించాను. ఇక్కడ ఏం చేస్తామో చెప్పడానికి నలుగురు ఆడపిల్లల గురించి చెప్తాను.
ఒకరు ప్రణీత. తల్లి వ్యభిచార వృత్తిలో ఉంది. ఎయిడ్స్ తో బాధపడుతూ, మరణానికి అతిదగ్గర్లో ఉన్న ఆమె, వేరే దారి లేక నాలుగేళ్ళ ప్రణీతను ఒక దుర్మార్గుడికి అమ్మేసింది. విషయం తెలిసి మేము అక్కడకు వెళ్ళేప్పటికే ఆ చిన్నపాప ముగ్గురు దుర్మార్గుల రాక్షస చేతలకు బలైంది.
రెండో అమ్మాయి షహీన్. ఎవరో కూడా తెలీదు. రైల్వే పట్టాల మీద పడుంది. ఎంతమంది కిరాతకుల కోరలకు బలైందో లెక్క కూడా తేలలేదు. మేము తెచ్చుకునేప్పటికి ముప్పై రెండు కుట్లతో పేగుల్ని లోపలికి పెట్టాల్సిన దారుణస్థితిలో ఉంది.
మూడవది అంజలి. తండ్రి తాగుడికి డబ్బు కోసం పోర్నోగ్రఫీకి అమ్మేశాడు. మూడేళ్ళ వయసునుంచే చిన్న, చిన్న ఆడపిల్లలను ఈ వృత్తిలోకి దింపుతున్నారు. ఒక్క వ్యభిచార వృత్తే కాదు, అవయవ విక్రయము, బాలకార్మికులు వంటి ఎన్నో అన్యాయమైన మార్గాలకు వాళ్ళను మళ్ళిస్తున్నారు.
ఇక నాల్గవ ఆడపిల్లను నేనే. నా పదిహేనవ సంవత్సరంలో ఎనిమిది మంది రాక్షసుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురయ్యాను. ఆనాటి నా ఆవేశమే, ఆవేదనై, ఆలోచనై, నాలాంటి ఎందరికో అండగా నిలబడాలన్న ఆచరణగా మీ ముందు నిలిచింది. ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు. ఇంకా ఆనాటి ఆవేశం నాలో అణువంతైనా తగ్గలేదు. అదే ప్రతిరోజూ నాలో సుప్రభాతమై కొత్త శక్తిని జాగృతం చేస్తుంది.
ఇప్పటికి మూడు వేల రెండు వందల మంది ఆడపిల్లల వ్యధల కథలు విన్నను. మూడేళ్ళ నుండి నలభైయ్యేళ్ళ వరకు అన్ని వయసుల ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరి కథల్లోనూ ఒక్కటే పునరావృతమౌతోంది. అదే జాతిలోని మరొక నమూనా ఎలా తనని బలిగొందో వివరిస్తుంది. వాళ్ళనే మనం తండ్రిగా, అన్నగా, తమ్ముడుగా, మామయ్యగా, బాబాయిగా, కొడుకుగా ఆదరిస్తాం, ప్రేమిస్తాం. మరి ఇలా ప్రవర్తించిన వాడి పట్ల మాత్రం మౌనం వహించాలా?"
అని ఆవేశపూరితంగా మాట్లాడుతుంది సునీతా కృష్ణన్.
బెంగుళూరులో పుట్టి, పెరిగిన సునీత ఎనిమిదేళ్ళ వయసులోనే సమాజం పట్ల బాధ్యతను, బాధితుల భారాన్ని తనదైన పద్ధతిలో పంచుకుంది. మతిస్థిమితం లేని పిల్లలకు ఆట, పాట నేర్పేది. పన్నెండేళ్ళ వయసులో మురికివాడల్లో పిల్లల కోసం బడి ప్రారంభించింది. పదిహేనేళ్ళ వయసులో దళితవాడలో ఆడపిల్లలకు చదువు చెప్పే ప్రయత్నంలో సామూహిక అత్యాచారానికి గురైంది.
రెండేళ్ళు కోలుకోలేని బాధ అనుభవించింది. కుటుంబం, సమాజం జాలితో, హేళనతో తనను ఒంటరిని చేసి, చెడిపోయిన ఆడపిల్లగా ముద్రవేసింది. ఆ వలయంలోంచి బయటపడి చదువు కొనసాగించి, సోషల్ వర్క్ లో పి.హెచ్.డి పట్టా పొందింది. పసిబిడ్డగా, బాలికగా, యువతిగా, అమ్మగా అన్ని వయసులలో స్త్రీ అనుభవిస్తున్న దారుణాలను ప్రతిఘటించాలని నిర్ణయించుకుంది.
తన జీవితాశయం నిర్ధారణయ్యాక, హైదరాబాదుకు నివాసం మార్చింది.
1996లో హైదరాబాదులోని మెహబూబ్ కీ మెహందీ అనే రెడ్ లైట్ ఏరియాను ఖాళీ చేయించడంతో వేలమంది వ్యభిచార వృత్తిలోని ఆడవారి కోసం నడుం కట్టింది సునీత.
ప్రజ్వల స్థాపించింది. దాదాపు పన్నెండు వేలమంది ఆడవాళ్ళకు అండగా, నీడనిచ్చింది ప్రజ్వల. నైతికంగా, ఆర్థికంగా, చట్టపరంగా, సామాజికంగా చేయూతనివ్వడమే ప్రజ్వల కార్యాచరణం.
అంతేకాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వర్కర్స్ రీహాబిలిటేషన్ గైడ్ లైన్స్ రూపొందించటంలోనూ ప్రముఖ పాత్ర పోషించింది.
అనేక సార్లు ప్రమాదపు అంచుల దాకా వెళ్ళింది. నిధుల కోసం చేస్తున్న ప్రచారాలనే నిందలు కూడా ఎదుర్కొంది. చంపేస్తాము, రోడ్డుకీడుస్తాము అంటూ రకరకాల హెచ్చరికలు ఎదుర్కొంది. అయినా తొణకలేదు. భయపడలేదు. తన పనిని ఆపలేదు.
రాజేష్ అనే చిత్రనిర్మాతను వివాహమాడింది. అతడి సహాయంతో కొన్ని చిత్రాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు నిర్మించింది. వాటి ద్వారా స్త్రీ చైతన్యానికి కృషి చేసింది. నవంబర్ 2014లో వచ్చిన నా బంగారు తల్లి చిత్రానికి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ప్రపంచంలోనే మొదటిసారిగా విరాళాలతో నిర్మించిన చిత్రంగా కూడా ప్రఖ్యాతమైన చిత్రమిది.
ఈ సునీత అందరికీ చేసే విన్నపం ఒక్కటే. ఎవరిని కలిసినా ఒక్కటే చెప్తుంది.
"మీరు స్పందించలేకపోవడానికి వంద కారణాలు నాకు చెప్పొద్దు. స్పందించగల ఆ ఒక్క కారణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీరందరూ మహాత్మా గాంధీలు, మార్టిన్ లూథెర్ కింగ్ లు, మేధా పాట్కర్ లు కానక్కర్లేదు. మీకున్న చిన్న ప్రపంచంలోంచే మీ హృదయాలను నిద్రలేపండి. మీ సహాయం నేను అర్థిస్తున్నాను. మీ ఆదరువును నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీ ఆదరణను నేను కోరుకుంటున్నాను. మీ మౌనాన్ని ఛేదించండి. మాట్లాడండి. చేతనైన విధంగా చేయూతనివ్వండి. “