స్వామి వివేకానందుడు విద్య అంటే చరిత్ర నిర్మాణంగా పేర్కొన్నారు. నైతిక, సామాజిక విలువలు కొరవడుతున్న ప్రస్తుత సమాజంలో చరిత్ర బోధన ద్వారా జీవన నైతిక విలువలను పెంపొందించడం ప్రతి చరిత్రబోధకుని కర్తవ్యం. సాంకేతిక విద్యకున్న విలువ ఈ రోజు సామాజిక శాస్త్రాల అధ్యయనానికి లేదు. అసలు ఈ ఒక్క కారణమే సమాజంలో నైతిక విలువలు దిగజారడానికి కారణం...
సాంకేతిక శాస్త్ర అధ్యయనంలో యంత్రాల నిర్మాణాల, పనితీరుల అధ్యయనం జరుగుతుంది. అక్కడ మానవ విలువల ప్రసక్తి కొరవడుతుంది.
కానీ విలువలు ఏ ఒక్కరోజో, నాలుగు గోడల మధ్య నాలుగు గంటల ఉపన్యాసాలతోనో, నాలుగు నెలల శిక్షణలోనో అలవడవు. అది బాల్యం నుంచే పెంపొందించాలి. చిన్న వయసులో చెప్పే రామాయణ, భారతాలు, రాముడు, కృష్ణుడు, భీష్ముడు, ధర్మరాజు, ద్రౌపది, సీత, ఆంజనేయుడు వంటి మహనీయుల చరిత్ర విశ్లేషణ ద్వారా జరగాలి. రాముని పితృవాక్య పరిపాలన, కృష్ణుని ఆపద్భాంధవ తత్త్వం, ఆంజనేయుడి కార్యశీలత, సీత సహనశీలత, ద్రౌపది పాతివ్రత్యం వంటి లక్షణాలు ఉన్నతమైనవిగా చూపించి వారిని విద్యార్ధులకు ఆదర్శంగా నిలపాలి. ఈ పురణాలు ఒక కథగా కాక, ఒక మంచి వ్యక్తుల పరిచయంగా మలచగలగాలి.
ఏసుక్రీస్తు, అల్లా జీవితాలలో ఉన్న ఒడుదుడుకులు, వారి కర్తవ్యనిష్ఠ, ఒక మతాన్ని నెలకొల్పటంలో వారి పాత్ర. ఇవన్నీ చరిత్ర పాఠాలలోని అంశాలే. ఆ ధర్మాలలో ఉన్న కీలకమైన మంచి ఆదర్శాలను ప్రతి విద్యార్ధి అందిపుచ్చుకునేలా విద్య ఉండాలి. ఏ మతం మారణహోమాన్ని ప్రోత్సహించదన్న సత్యాన్ని గ్రహించాలి.
ఇక రాజుల రాజ్యాల చరిత్రలో వారిలోని ఉన్నత భావాలు, ధార్మిక సహియుత అశోకుడు, విక్రమాదిత్యుడు, హర్షుడు, అక్బర్, కృష్ణదేవరాయలువంటి చక్రవర్తుల పాలనలో జరిగిన సాహిత్య, ధార్మిక, ఆర్ధిక అభివృద్ధిని విశ్లేషించి చెప్పగలిగితే, ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థకు చక్కని పునాది లభిస్తుంది.
చరిత్ర అనగానే రాజుల పాలనాకాలం - దానికి సంబంధించిన జ్ఞాపకశక్తి - ఇలా ఎన్నో అపోహలతో విద్యార్ధులు సామాజికశాస్త్ర అధ్యయనానికి వెనుకంజ వేస్తున్నారు. అలాగే దానికి సంబంధించి ఉపాధి అవకాశాల లేమి కూడా విద్యార్ధులను ఈ వైపు ఆకర్షించలేకపోతోంది. కానీ ఏ పోటీ పరీక్షలలో కూడా ప్రాధమిక అర్హత పొందాలంటే సామాజిక శాస్త్ర మరియు సమకాలీన పరిస్థితులపై (జనరల్ నాలెడ్జి) అవగాహన అత్యవసరం. మరి దీనికొరకు సామాజిక శాస్త్ర అధ్యయనం అవసరమేకదా!
ఈ మధ్యకాలంలో సంభాషణా నైపుణ్యాలు, జీవన నైపుణ్యాల (కమ్యూనికేషన్ స్కిల్స్) పై ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణ జరుగుతోంది. రామాయణంలో ఆంజనేయుడికంటే గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి ఈ రోజు దాకా ప్రపంచంలో లేడు. ఎందుకంటే లంకాపురంలోని సీతమ్మని చూసి తిరిగి వస్తూ ‘చూచితిని సీతను’ అన్నారు. ముందే ‘సీత’ అంటే తరువాత శబ్దం ఏమి వస్తుందో అని రామలక్ష్మణులతో సహా వానరులు కంగారు పడి ఏ అఘాయిత్యానికి తలపడతారో అని, అలాగే సీతమ్మ దగ్గర లంకలో చిన్న సూక్ష్మరూపంతో దర్శనమిచ్చి ‘కొండ అద్దమందు కొంచమై ఉండదా?’ అని నిరూపించారు. అలాగే భగవద్గీతలో లేని, తెలియజెప్పని నిపుణతలు ఏమి ఉన్నాయి. ‘కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కథాచనా’ అని కర్తవ్యబోధ చేశారు శ్రీకృష్ణుడు. వ్యక్తిత్వ వికాసానికి ఇంతకన్నా ఏం కావాలి? ఇవన్నీ యంత్రాల అధ్యయనంలో రావు కదా!
ఆదిమానవుని ఆకాంక్షలు అతని అలోచనాతత్త్వం ఒక నిప్పు, చక్రం, పనిముట్లు, ఆయుధాల తయారీకి కారణమైనవని చెప్పేదే చరిత్ర. పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకున్నాడు మానవుడు ఆ కాలంలో. మనకి తగ్గట్లు మార్చుకుని పరిసరాలకు హాని కలిగిస్తున్నాం ఈ కాలంలో మనం. అందుకే చరిత్ర ఒక భారమైన విషయంగా కాక బాధ్యతాయుతంగా చదివి భూతకాలంలో తప్పిదాలను తిరిగి వర్తమానంలో రాకుండా చూసుకుంటూ భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యడం ప్రతి మనిషి కర్తవ్యంగా మిగలాలి. ఆనాడే దేశాభివృద్ధి సాధ్య్తం!
అలెగ్జాండర్ చివరికి తన శవపేటికను చేతులు బయటపెట్టి తీసుకువెళ్ళమని కోరాడట. దానికి చరిత్ర చెప్పిన అర్ధం “ఎంత విశ్వవిజేత అయినా ఖాళీ చేతులతో పోవలసిందే” అని చెప్పదలచాడట. అలెగ్జాండర్ చేసిన యుద్ధాలను చరిత్రగా కాక అతని సందేశాన్ని చరిత్రగా తీసుకోవాలి. కొండప్రాంతమైన మహారాష్ట్ర నుంచి గొరిల్లా యుద్ధ ప్రణాళికతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఛత్రపతి శివాజీ స్ఫూర్తి చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి.
నలందా, తక్షశిల విశ్వ విద్యాలయాలలో విద్య గరిపిన అభ్యసించిన చాణక్యనీతి ఈనాటి రాజకీయాలకు చక్కని పాఠాన్ని అందిస్తోంది. నలందా విశ్వవిద్యాలయాల్లోకి అడుగుపెట్టాలంటే అక్కడి కాపలాదారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సివచ్చేదట. విశేషం ఏమిటంటే చాలామంది విదేశీయులు ఆ సమాధానాలు చెప్పలేక వెనుదిరిగేవారట. మరి కాపలాదారుకే అంత జ్ఞానం ఉంటే మరి అక్కడి ఆచార్యుల విజ్ఞానం ఎంత ఉందో ఊహించగలమా! మరి ఇలాంటి అంశాలను ప్రస్తావించి ఉత్తేజపరిచేదే చరిత్ర.
ఫాహీన్, హుయాన్ త్సాంగ్ వంటి చైనాయాత్రీకుల అనుభవాలు అప్పటి భారతదేశ వైభవాన్ని చాటిచెప్పాయి. మరి ఆ వైభవాన్ని తిరిగి పొందడానికి కావాల్సిన ఆత్మస్థైర్యం విద్యార్ధులలో పెంపొందాలంటే చరిత్ర అధ్యయనం అత్యంత ఆవశ్యకం కదా!