ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసంప్రశ్న:
సారా కొట్టుకు సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్ఠుల్ గనన్
గతమాసం ప్రశ్న:
మిక్కిలి చక్కెరాయె మధుమేహపు రోగికి ఔషదమ్ముగా
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
పోచిరాజు సుబ్బారావు
మిక్కిలి చక్కెరాయె మధు మేహపు రోగికి ఔష ధమ్ముగా
నక్కట యేమి యీపలుకు హర్షము గొల్పదు నెట్టి వారికి
న్జక్కెర పెంచి రోగమును జంపును దప్పక మానవాళిని
న్మక్కువ యున్నయున్ దినక మంచిగ నుండగ మిమ్ము గో రుదున్
పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్
అక్కజ మైన ధైర్యమును నందము లొల్కు ముఖారవిందముం
జక్కని వేష ధారణయుఁ జారు వచోరు విలాస చూడగా
నక్కలకంఠి మాటలు మహామయ శీఘ్ర వినాశ హేతువుల్
మిక్కిలి చక్కెరాయె మధుమేహపు రోగికి నౌషధమ్ముగా
రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
మక్కువ మీరుగా తినెను మంచివి తీయని పాయసాన్నముల్
చక్కర వ్యాధికిన్ మిగుల సాయపడం గను రోగ మెక్కువై
మిక్కిలి చక్కెరాయె మధు మేహపు రోగికి , ఔషదమ్ముగా
గుక్కెడు చేదుమందు నిల గొంతున పోయగ సాధ్యమౌ నటన్
చింతా రామ కృష్ణా రావు, మియాపూర్, భాగ్యనగరము.
మ్రుక్కడి వైద్యముల్ తనదు రోగముఁ బాపఁగ లేకపోవుటన్
జక్కఁగ దైవముం గొలిచి శాంతముఁ బొందెను రోగదూరుఁడై.
యొక్కఁడు సన్నుతాత్ముఁడు. మహోజ్వల సన్నుత రామ నామమే
మిక్కిలిచక్కెరాయెమధుమేహపురోగికినౌషదమ్ముగా.
వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
చిక్కని పాలతో కలిపి చేసిన తీయని పాయసమ్మునూ
చక్కెర తోడునెయ్యి మరి చక్కగ వేసిన పిండివంటలున్
మెక్కిన శంకలేక శృతి మించిన రాగము వోలె నొప్పగా
మిక్కిలి చక్కెరాయె మధుమేహపు రోగికి ఔషధమ్ముగా
శివప్రసాద్ చావలి, సిడ్నీ, ఆస్ట్రేలియా
ఎక్కువ చక్కెరున్నదని వైద్యుడు చెప్పగ పెక్కు భీతితో
గ్రక్కున తగ్గునన్చు మరి గట్టిగ నమ్ముచు సత్వరంబు చే
జిక్కిన హోమియో గుళిక జిహ్వను చేర్చగ శీఘ్రమే మదిన్
మిక్కిలి చక్కెరాయె మధుమేహపు రోగికి ఔషధమ్ముగా!
గండికోట విశ్వనాధం, హైదరాబాదు
రొక్కము ఖర్చు చేయకనె రోగము తగ్గును, ధ్యాన యోగముల్
మక్కువ తోడ చేయగనె మంచిగ జీవన శైలి మారెడిన్
చక్కగ నొత్తిడుల్ తొలగు, స్వస్థత గూర్చు చికిత్సగా తగున్
మిక్కిలి చక్కరాయె, మధు మేహపు రోగికి ఔషధ మ్ముగా !
"కళాగౌతమి" బులుసు వేంకటసత్యనారాయణమూర్తి, రాజమహేన్ద్రవరం
ఎక్కువ సార్లు నిన్పిలిచి యిమ్మని కాఫిని కోరినందుకా?
తక్కువ తీపితో షుగరు దగ్గర రాకను నిల్పవచ్చులే !
మక్కువ వీడి మద్యమును మానుము, కానిచొ చేకొనన్ తగున్
మిక్కిలి చక్కెరాయె-మధుమేహపు రోగికి-ఔషధమ్ముగా
(క్రమాలంకారముగా పూరింపబడినది)
అవధాన అష్టాపద, అవధాన చింతామణి, అవధాన యువరాట్ తాతా సందీప శర్మ, రాజమహేన్ద్రవరం
అక్కట నేటి కాలమున యందరకున్ గల యాస్తులేమనన్
ఒక్కటి బీపి రెండవది యుగ్రమునౌ మధుమేహమయ్యెడిన్
పెక్కు రలోపతిన్ విడచి ప్రేమగ వాడగ హోమియోపతిన్
మిక్కిలి చక్కెరాయె మధుమేహపు రోగికి యౌషధమ్ముగా
మహీధర రామశాస్త్రి, రాజమహేన్ద్రవరం
మిక్కిలి చక్కెరాయె మధుమేహపు రోగికి, ఔషధమ్ముగా
చక్కని యాసనమ్ము లుపచర్యలు లెక్కకు మించి యుండగా
చక్కగ సాధనాబలము జాణతనంబున వాడుకోవలెన్
నిక్కము వాడి చూడుడిది – నే పదిమందికి తెల్పుచుంటిదే!
పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫొర్నియా
పెక్కుగ చేదునిన్ దినగ ప్రీతిగ చక్కెర బోలునంచు తాఁ
మక్కువతోడఁ జెప్పె కవి మాన్యుడు వేమన పద్యమందునన్
చక్కగ కాకరందినుచు చక్కని పద్యము తాఁ దలంపగా
మిక్కిలి ‘చక్కెరా’యె మధుమేహపు రోగికి ఔషదమ్ముగా
(కాకరకాయ తింటే మధుమేహము తగ్గుతుందని కొంతమంది నమ్మకం)