సారస్వతం
నరసింహ సుభాషితం
- ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి

స్వయం కృషి-1

శ్లోకం:

उद्यमेनैव सिध्यन्ति कार्याणि न मनोरथै: ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा: ॥

ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః ।
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః ॥

సంధి విగ్రహం

ఉద్యమేన, ఏవ, సిధ్ధ్యంతి, కార్యాణి, న మనోరథైః,
న హి సుప్తస్య, సింహస్య, ప్రవిశంతి, ముఖే, మృగాః

శబ్దార్థం

ఉద్యమేన = కృషి చేత, ఏవ = మాత్రమే, సిధ్ధ్యంతి = సిధ్ధించును, కార్యాణి = కార్యములు, న మనోరథైః = మనోభీష్టం వలన మాత్రము కాదు.

మృగాః = మృగములు, లేదా అడవి జంతువులు, సుప్తస్య = నిద్రించుచున్న లేదా విశ్రమిస్తున్న, సింహస్య = సింహము యొక్క, ముఖే = ముఖమునందు, న హి ప్రవిశంతి = ప్రవేశించవు.

Meaning

The great tasks can be accomplished and achieved only with proper industry and efforts. It calls for great tenacity of purpose with strong will and determination. The tasks cannot be done or fulfilled with mere wishful thinking.

Even the mighty lion, who is supposed to be the king of the jungle, has to hunt to gratify the hunger when he is hungry. Just because the lion is king of the jungle, the animals never themselves enter lion's mouth when it is resting to fulfill his hunger.

భావార్థం

ఉద్యమం అనగా కృషి లేక పరిశ్రమ. ఏదైనా మంచి కార్యాన్ని సంకల్పించినప్పుడు లేదా తలపెట్టినప్పుడు, ఆ సత్కార్యాన్ని ప్రారంభించడానికి ముందస్తుగా ధృఢ సంకల్పం ఉండాలి. కొనసాగించడానికి కృషి ఉండాలి. కార్య సాఫల్యతకి కృషి లేదా పరిశ్రమ అత్యంత ఆవశ్యకమే కాక, కీలకము కూడా. ఆ కార్య సాధనని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవాలి. తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేయడానికి పట్టుదల మరియు ధైర్యం ఉండాలి. కార్య సాఫల్యతకై చేసే ప్రయత్నం లో ఎదురయ్యే అపజయాలను ఎదుర్కోవడానికి గుండె దిటవు కావాలి. అట్టి కార్య సాధనకై, కృషీ పట్టుదలతో పాటు స్థిరచిత్తము, ధృఢసంకల్పమూ, ఏకాగ్రతా, గమ్యాన్ని చేరడానికి తగినంత ఓర్పు అత్యంత ఆవశ్యకం. అప్పుడే లక్ష్య సాధన దిశగా పయనించ గలుగుతాం.

ఆ విధమైన ఉద్యమముతోనే కార్యములు సిధ్ధించును. అంతే కానీ, కేవలం మనోరథములచే కార్యములు సిధ్ధించవు. మనోభీష్టము చేత కోరికలు ఈడేరవు.

అరణ్యమంతటికీ రాజైన సింహం కూడా తన ఆకలిని తీర్చుకొనుటకై వేటాడావలసిందే. వేటాడి ఆహారం తినవలసినదే! అంతేకాని, అడవికి రాజైనంత మాత్రాన తన ఆకలిని తీర్చుకొనుటకై నోరు తెరచుకుని కూర్చంటే, “ఓ సింహమా నీ ఆకలిని తీర్చుకొనుము” అని వన్య మృగాలు వచ్చి దాని నోటిలో ప్రవేశించవు.

దీనికి మరొక చక్కని ఉదాహరణ: రామకార్యార్థమై సీతా దేవిని వెదుకుటకై బయలుదేరిన హనుమంతుడు ఎంతో కృషి, పట్టుదల పట్టుదల కార్యదీక్షతో వ్యవహరించుట వలెనే కార్యసాఫల్యతని కైవశం చేసుకోగలిగాడు. దుస్తరమైన నూరు యోజనముల వారథిని అవలీలగా దాటాడు. మార్గమధ్యమం లో ఎదురైన అనేక క్లిష్టమైన సమస్యలని అవలీలగా అధిగమించ గలిగాడు. అడ్డుగా నిలచిన మైనాక పర్వతం యొక్క అడ్డుతొలగించుకొనుట, ఛాయాగ్రాహియైన సింహిక బారినుండి తప్పించుకొనుట, అసలు ఎప్పుడూ చూడని సీతా అమ్మవారిని కనుగొనుట, లంకలో తనకు ఎదురువచ్చిన రాక్షసులనందరినీ వధించుట, రావణాసురుని కలుసుకొని అతనికి తగిన బుధ్ధి చెప్పుట, తిరిగి వచ్చి సీత జాడను కనుగొనిన విషయాన్ని శ్రీరామునికి విన్నవించుట వగైరా అన్నియూ ఆతని కార్య దీక్షత, స్వశక్తి మరియు స్వయం కృషి వలన మాత్రమే సాధ్యమైన విషయాలు. పరమేశ్వరాంశతో పుట్టిన మహానుభావుడైనా ప్రయత్నము లేనిదే కార్య సాఫల్యత లేదని నిరూపించినవాడు

-------------- ॐ ॐ ॐ --------------

స్వయం కృషి-2

శ్లోకం:
नाभिषेको न संस्कार: सिंहस्य क्रियते मृगैः |
विक्रमार्जितराज्यस्य स्वयमेव मृगेंद्रता ||

నాభిషేకో న సంస్కారః సింహస్య క్రియతే మృగైః ।
విక్రమార్జితరాజ్యస్య స్వయమేవ మృగేంద్రతా ॥

సంధి విగ్రహం

న , అభిషేకః , న , సంస్కారః , సింహస్య , క్రియతే , మృగైః ,
విక్రమః , అర్జితః , రాజ్యస్య , స్వయం , ఏవ , మృగాః , ఇంద్రతా

శబ్దార్థం

మృగైః = అడవి జంతువులచేత, సింహస్య = సింహమునకు, అభిషేకః = అభిషేకము గానీ, సంస్కారః = సంస్కార ప్రోక్షణములు గానీ, న క్రియతే = చేయబడవు,

విక్రమః = పరాక్రమముతో, స్వయం = స్వయముగా, అర్జితః = ఆర్జించిన, రాజ్యస్య = రాజ్యమునకు, ఏవ = మాత్రమే, మృగాః ఇంద్రతా = మృగేంద్రత్వాన్ని సిధ్ధించుకొన్నది.

Meaning

Animals do not coronate a lion by sprinkling holy water on him and conducting certain rituals. He assumes kingship, effortlessly through his own prowess.

One has to earn his position and authority by virtue of his own abilities and efforts. Others will not come forward to give it to him, voluntarily.

భావార్థం

అరణ్యంలోని జంతువులన్నీ వాటీంతట అవే కలిసి వచ్చి, “నీవే మా అరణ్యానికి అంతటికీ రాజువు, నీవు మమ్మల్ని పరిపాలించు!” అని పవిత్రమైన గంగా జలాలని శిరస్సు మీద జల్లి, సింహానికి సంస్కార ప్రోక్షణలు, అభిషేకాలు చేసి రాజ్యాభిషిక్తుని చేయవు.

తన స్వంత పరాక్రమముతో సాధించిన రాజ్యానికి మృగేంద్రత్వాన్ని స్వయముగా తానే సిధ్ధింపజేసుకుంటుంది సింహం.

అనగా, స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉన్నవారు, స్వయంశక్తితోను, నాయకత్వముతోను కార్యసాధనని సాఫల్యం చేసుకుంటారు, మరొకరి మీద ఆధారపడకుండా, వేరొకరి ప్రమేయం లేకుండా, ప్రతిభా పాటవాలతో, స్వయం శక్తితో కృషిచేసినచో మాత్రమే లక్ష్య సాధనని చేరుకుంటారు. అట్టి వారి ప్రయత్నమే వారికి సత్ఫలితాలని ఇస్తుంది. ప్రయత్నసాధనయే ప్రగతికి మార్గం అని స్పష్టమౌతున్నది. అంటే “leaders are born and not made" అనే modern saying ని గుర్తు తెస్తోంది.

ప్రస్తుత భారత దేశంలో, భారత ప్రధాని నరేంద్ర మోడి గారిని ఈ కోవలో పరిగణించ వచ్చు. ఎందుకంటే ఆయన స్వయం శక్తితో ఎన్నో అడ్డంకులను అధిగమించి దేశ ప్రధాని కాగలిగారు.

-------------- ॐ ॐ ॐ --------------


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)