ధారావాహికలు - శ్రీరామాయణ సంగ్రహం
యుద్ధకాండ
- డా. అక్కిరాజు రమాపతిరావు

నీలుడు ప్రహస్తుణ్ణి సంహరించటం

పరమతేజశ్శాలి జాంబవంతుడు క్రోధవివశుడై ఒక మహాశిలాశకలాన్ని మహానాదుడి వక్షఃస్థలానికి గురిచేసి విసరి వాణ్ణి హతమార్చాడు. తారుడు ఒక వృక్షంతో కుంభహనుడి తలమీద మోదడంతో ఆ రాక్షసమంత్రి మరణించాడు. తన మంత్రులు చావడం ప్రహస్తుడు రథం మీద నుంచి చూశాడు. అతడికి తన సేనానాయకుల మృత్యువాత పడడం దుస్సాహమనిపించింది. శవాలు గుట్టలు గుట్టలుగా ఎప్పటికప్పుడు యుద్ధభూమిలో పెరిగిపోతున్నాయి. పట్టరాని కోపంతో రథం మీద నిలచి శరవర్షం కురిపించి వానరులను చంపుతున్న ప్రహస్తుణ్ణి నీలుడు చూశాడు. ప్రహస్తుడి మీదికి రివ్వున దూసుకొనిపోయినాడు. నీలమేఘాన్ని తూలగొట్టే ప్రచండ వాయువులాగా తనమీద పడబోతున్న నీలుణ్ణి ఢీకొనటానికి పోయినాడు ప్రహస్తుడు. తన ధనుస్సు నుంచి అమితవేగంగా దూసుకొనిపోయే బాణాలతో నీలుణ్ణి నొప్పించాడు. ఆ బాణాలు నీలుణ్ణి పాములలాగా కరిచాయి. శరత్కాలపు పలుచటి వాన కురిసి ఇట్టే వెలసిపోతే ఏమీ చలించని మహా వృషభంలా నీలుడు ప్రహస్తుడి శరవర్షాన్ని ఎంతమాత్రం లెక్కచేయలేదు. అయితే ప్రహస్తుడు కురిపించే ఈ బాణవర్షానికి అగ్రహోదగ్రుడై పోయినాడు నీలుడు. పెద్ద మద్దిచెట్టును ఊడపెరికి ప్రహస్తుడి పైకి విసిరాడు. ఆ ధాటికి ప్రహస్తుడి రథాశ్వాలు ప్రాణాలు వదిలాయి.

అప్పుడా మహాబలుడు నీలుడు అమాంతం ఎగిరిపోయి ప్రహస్తుడి చేతిలోని ధనువును ముక్కలుగా విరిచేశాడు. అదే పనిగా సింహనాదం చేశాడు. అప్పుడు విరథుడూ, ధనుస్సు లేనివాడూ అయిన ప్రహస్తుడు భయంకరమైన ముసలాయుధంతో కిందికి దూకి నీలుడిపై దాడి చేశాడు. నీలుడి దేహం నిండా రక్తధారలు కారడంతో అత్యంత కుపితుడై ఒక పెద్దచెట్టుతో ప్రహస్తుణ్ణి నీలుడు తాడించాడు. ఇద్దరి దేహాలు నెత్తురులతో నిండాయి. ముసలాయుధంతో నీలుణ్ణి చంపాలని మీదిమీదికి వస్తున్న ప్రహస్తుణ్ణి ఒక పెద్ద బండరాతితో మోది నీలుడు చంపివేశాడు. ఇట్లా చచ్చిపడి ఉన్న ప్రహస్తుణ్ణి చూసి రాక్షససైన్యమంతా భయకంపితమై లంకలోకి పరుగులు తీసింది. అప్పుడు నీలుడు రామలక్ష్మణుల దగ్గరకు పోయాడు.

రావణుడి రంగప్రవేశం

ఇట్లా అగ్నిహోత్రుడి పుత్రుడైన నీలుడు ప్రహస్తుణ్ణి హతమార్చగా రాక్షసులంతా హడలిపోయినారు. ఈ వార్త తెలిసి, రావణుడు అమితదుఃఖం పొందాడు, విలవిలలాడాడు. తీవ్రమైన కోపం రావణుణ్ణి నిలవ నీయలేదు. తన రాక్షసయోధులతో ''ఇక నేనే పోయి రామలక్ష్మణులను, సమస్త వానరయూథనాయకులను, వానరసేనను పరిమారుస్తా'' నని బంగారురథం మీద బయలుదేరాడు. అప్పుడు రాక్షస సైనికులు యుద్ధవాద్యాలు బోరు కొలిపారు. శంఖధ్వానాలు చేశారు. ఢక్కా మ్రోగించారు. భేరీలు నినదింప చేశారు. ప్రళయకాలరుద్రుడు భూతగణాలతో సంరంభించినట్లు కన్పడ్డాడు అప్పుడా రావణుడు. అట్లా లంకాపట్టణం వెలువడి రథం మీద యుద్ధభూమికి వచ్చాడు. అప్పుడు భయంకరంగా పెనుశిలలను, మహావృక్షాలను పట్టుకొని భయోత్పాతం సృష్టిస్తున్న వానరసేనను చూశాడు. వాళ్ళ రణసమ్మర్దధ్వని సముద్రఘోషను మించిపోవటం గమనించాడు.

ఈ విధంగా మహాక్రోధంతో వస్తున్న రావణుణ్ణి చూసి శ్రీరాముడు ఇంత భయంకర రాక్షస సైన్యంతో వస్తున్న ఆ పరభయంకరవీరులు ఎవరెవరు?'' అని విభీషణుణ్ణి అడిగాడు. అప్పుడు విభీషణుడు ఆ రాక్షసయోధు లను బాగా ఎరిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళ అతిబలపరాక్రమాలను వివరిస్తూ అందరినీ గూర్చి శ్రీరాముడికి ఇట్లా చెప్పాడు - ''రావణుడి పక్కనే మదపుటేనుగుపై ఎక్కి ఏనుగులా తలాడిస్తూ వస్తున్నవాడు రావణుడి కుమారుడు అకంపనుడు. (హనుమంతుడి చేతిలో హతుడైన అకంపనుడు వేరొకడు, అతడు రావణుడి సేనాధిపతులలో ఒకడు), సింహధ్వజంతో అలరారుతున్న రథంపై వస్తున్నవాడు ఇంద్రజిత్తు. బ్రహ్మదేవుడి వరప్రభావంతో శత్రువులకు కనపడకుండా యుద్ధం చేయగల మేటి బలపరాక్రమవంతు ఇంద్రజిత్తు. ఇతడి చేతిలో ఇంధ్రదనుస్సు వంటి పెద్ద ధనువున్నది. కొండవంటి మహాకాయతో రథంపై వస్తున్నవాడు అతికాయుడు, ధనుర్థరులలో శ్రేష్ఠుడు. అరుణనేత్రాలతో వస్తున్న రాక్షసవీరుడు మహోదరుడు, గంటలపట్టెడతో ఉన్న ఏనుగు నెక్కి వీడు వస్తున్నాడు. పిడుగులాగా మీదపడే రాక్షసుడు పిశాచుడు. వీడు గుర్రం ఎక్కి వస్తున్నాడు. ఈ గుర్రం అస్తాద్రిలాగా చిత్రవర్ణ శోభితంగా ఉంటుంది. ఇతడు భయంకరమైన ఈటెను ధరించి వస్తున్నాడు.

పర్వతసమానమైన మహావృషభాన్ని అధిరోహించి వస్తున్నవాడు త్రిశిరుడు. వీడు యోధాగ్రేసరుడు, వజ్రాయుధంకంటే వీడి శూలం వాడి అయినది. మేఘశరీరుడు కుంభాసురుడు, వీడు సర్పధ్వజుడు. అల్లెతాటిని మాటిమాటికీ మోగిస్తూ వస్తున్నాడు. అటువైపు ఉన్నవాడు నికుంభుడు, ఇంద్రనీలమణులు పొదిగిన పరిఘ వీడి ఆయుధం. అది పొగతో ఉన్న అగ్నిలాగా జ్వలిస్తున్నది. వీడు కుంభకర్ణుడి కుమారుడు, రాక్షసయోధాగ్రేసరులలో ప్రముఖుడు, క్రూరకర్మనిరతుడు. బాగా ఒడ్డూపొడుగులతో ఉన్న ఈ రాక్షసుడు నరాంతకుడు, రణకండూతి కలవాడు. పర్వతాలతో కూడా యుద్ధం చేసి తన కండబలం దురద తీర్చుకుంటాడు. వీడు ధనుర్బాణాలూ ఖడ్గమూ ధరించి వస్తున్నాడు. వీడి పతాకం మంటలాగా జ్వలిస్తున్నది. ఇక మహాట్టహాసంగా వస్తున్నవాడు రావణుడు. దేవతలను మట్టి కరిపించినవాడు. భయంకర క్రూరరాక్షసులు ఇతడి చుట్టూ చేరి వస్తున్నారు. వీడు హిమవత్పర్వతాన్ని, వింధ్యపర్వతాన్ని తలపింపచేస్తాడు. ఇంద్రుణ్ణి, యముణ్ణి కూడా ఈ రావణుడు హడలకొట్టాడు.'' అప్పుడు శ్రీరాముడు రావణాసురిడి తేజోబలసంపదను మెచ్చుకున్నాడు. ''ఈ దుష్ణుణ్ణి నేనే సంహరించి, నా పత్నిని అపహరించిన వీడిపై ప్రతీకారం తీర్చుకుంటాను'' అని శ్రీరాముడు విభీషణుడికి చెప్పాడు. తన ధనుర్బాణాలను అందుకున్నాడు.

సుగ్రీవుడు, హనుమంతుడు రావణుడితో తలపడటం

అప్పుడు రావణుడు కూడా యుద్ధసన్నద్ధుడై లంక సంరక్షణలో అప్రమత్తులుగా ఉండవలసిందని తన సేనాధిపతులను కోరాడు. వాళ్ళను పంపించివేశాడు. ''మీరు యుద్ధరంగంలో పోరాడుతూ ఉంటే వానరులు లంకలో ప్రవేశించి దానిని నాశనం చేస్తారు. కాబట్టి మీరు లంకను కాపాడండి'' అని వాళ్లకు చెప్పాడు. వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత రావణుడు తిమింగలం మహాసముద్రాన్ని సంచలింప చేసినట్లు వానరసైన్యాన్ని సంక్షోభం పాలు చేయటానికి పూనుకున్నాడు. రావణుడి విజృంభణం చూసి సుగ్రీవుడు ఒక పర్వతశిఖరాన్ని రావణుడిపై విసిరాడు. రావణుడు ఆ పర్వతశిఖరాన్ని తన బాణాలతో భగ్నం చేశాడు. తర్వాత సుగ్రీవుడిపై తీవ్రశరాన్ని ప్రయోగించాడు. ఆ బాణం సుగ్రీవుణ్ణి మూర్ఛిల్లచేసింది. దీన్ని చూసి రాక్షసులు కోలాహలంగా అరిచారు. అప్పుడు గవాక్షుడు, గవయుడు, సుదంష్ట్రుడు, ఋషభుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు అనే మహాకాయులైన వానరవీరులు శిలాయుధాలతో రాక్షస రాజుపై తలపడ్డారు. రావణుడు తన బాణాలతో వాటినన్నిటినీ పొడిపొడి చేశాడు. ఆ వానరయోధులందరినీ తన శరాఘాతంతో పీడించాడు. వానరసేన నంతా తన శరసంధానంతో కప్పివేశాడు. వానరవీరులు భయకంపితులైనారు. శ్రీరాముణ్ణి శరణు వేడారు. శ్రీరాముడు వెంటనే చేతిలోకి విల్లు తీసుకున్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ''అన్నా! ఈ పనికి నీవెందుకు? నేనే రావణుడికి బుద్ధి చెబుతాను. నాకనుజ్ఞ ఇవ్వు'' అని అన్నను ప్రార్థించాడు. అప్పుడు శ్రీరాముడు తమ్ముడికి జాగ్రత్తలు చెప్పాడు. రావణుడి పరాక్రమం గూర్చి చెప్పాడు. లక్ష్మణుడు ధనుస్సు సజ్యం చేసి బాణం ఎక్కుపెట్టి రావణుడితో పోరుకు తలపడుతుండగా, వరపరంపరలు కురిపిస్తున్న రావణుడిపై తీవ్రమైన ఆగ్రహం కలిగి, రావణుడిని సమీపించి తీవ్రంగా మందలించాడు రావణుణ్ణి వాయుసుతుడు. ''వాయుసుతుడను దాసుడనై నేను ఉండగా ఈ దుష్టుడిపై పోరు మీకెందుకు'' అని లక్ష్మణుడితో పలికాడు. రావణుడు హనుమంతుణ్ణి ఎకసక్కెం చేశాడు. పరస్పరం ఇద్దరూ తూలనాడుకున్నారు. ''నీ కొడుకు అక్షరకుమారుడు నా చేతిలో మడిసిన విషయం గుర్తు తెచ్చుకో, నీకూ అదే గతి పడుతుం''దని హనుమంతుడు రావణాసురుణ్ణి హెచ్చరించగా, రావణుడు ఆయనను సమీపించి హనుమంతుడి వక్షఃస్థలంపై తన చేతిని గట్టిగా తాడించాడు.

హనుమంతుడు తూలిపోయినాడు. నిలదొక్కుకుని రావణుడి వక్షఃస్థలంపై హనుమంతుడు మరింత గట్టిగా చరిచాడు. దానితో రావణుడు భూకంపానికి చలించిన కొండలాగా కంపించిపోయి, తెప్పరిల్లి పరమక్రుద్ధుడై హనుమంతుడి గుండెపై పిడికిటిపోటు పొడిచాడు. హనుమంతుడు తూలిపోయి ఉండటంతో, రావణాసురుడు నీలుడిపై విజృంభించాడు. కోపంతో విషసర్పాల వంటి బాణాలు నీలుడిపై ప్రయోగించాడు రావణుడు. నీలుడి శరీరమంతా మంటలు పుట్టాయి. అప్పుడు నీలుడు బాణం గుచ్చుకొని బాధపడుతూనే ఆగ్రహం చెంది ఒక గిరిశిఖరాన్ని రావణుడిపైకి విసిరాడు. ఇంతలో హనుమంతుడు తేరుకున్నాడు. రావణుడు ఆ సమయంలో నీలుడితో పోరాడుతున్నాడు కాబట్టి ఇరులతో యుద్ధం చేస్తున్నవాడిపై దెబ్బతీయడం యుద్ధనీతి కాదని భావించి హనుమంతుడు రావణుణ్ణి పట్టించుకోలేదు.

నీలుడు విసరిన శిఖరశిలపై రావణుడు శరప్రయోగం చేసి దానిని తుత్తునియలు చేశాడు. అది చూసి నీలుడు ప్రళయాగ్నిలా మండిపడ్డాడు. చెట్ల నెన్నిటినో తెచ్చి రావణుడిపైకి విసిరాడు. ఆ చెట్ల నన్నిటినీ తన బాణాలతో ముక్కలు ముక్కలు చేసి రావణుడు నీలుడిపై శరవర్షం కురిపించసాగాడు. పర్వతంపై పెద్ద వర్షం పడినా అది ఏమీ చలించనట్లు నీలుడు ఏమాత్రమూ తొణకలేదు. అప్పుడిక నీలుడు తన రూపాన్ని బాగా కుంచించుకున్నాడు. సూక్ష్మశరీరుడై ఎగిరి రావణుడి ధ్వజంపై వెళ్ళి కూచున్నాడు. ఇట్లా తనను అవమానించినందుకు రావణుడికి పట్టరాని కోపం వచ్చింది. నీలు డంతటితో ఊరుకోలేదు. సింహనాదం చేస్తూ రావణుడి ధనుస్సు అగ్రభాగానికీ అక్కడ నుంచి రావణుడి కిరీటం మీదకు దూకడం సాగించాడు. ఈ చోద్యం చూసి రామలక్ష్మణులూ, హనుమంతుడూ నివ్వెర పోయారు. నీలుడి చురుకుతనానికి రావణుడూ ఆశ్చర్యపడ్డాడు, కలవరపాటు చెందాడు. రావణుడి ఆందోళన చూసి వానరులంతా పకపకా నవ్వారు పరవశంగా సింహనాదాలు చేశారు.

రావణుడు గందరగోళంలో పడిపోయాడు. నీలుడిమీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాలనుకున్నాడు. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించబోతూ దాన్ని మంత్రపూతం చేసి 'నీ ప్రాణాలు కడతేరుస్తాను. శక్తి ఉంటే కాపాడుకో, కుప్పిగంతులైతే వేస్తున్నావు కాని నీపని ఇంతటితో సరి' అని నీలుడిపై నిప్పులు కక్కాడు. రావణుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం నీలుడి గుండెను తాకింది. నీలుణ్ణి దహించడం ప్రారంభించింది. ఆ కేతనం అంచు నుంచి నీలుడు కింద పడిపోయినాడు. అయితే నీలుడు అగ్నిహోత్రుడి పుత్రుడు కాబట్టీ, తన దివ్యత్వాన్ని బట్టీ మోకాళ్ళమీద నేలపై కూచుని ఆ అస్త్ర ప్రభావాన్ని తట్టుకున్నాడు. మర్ఛపోయినాడు కాని ఆయన విగతజీవుడు కాలేదు. రావణుడిది చూసి పరమోత్సాహంతో రణమధ్యంలో నిలిచి ధనుష్టంకారం చేశాడు. ఆ అల్లెతాటి భీకరధ్వనికి భూమి కంపించింది.

(సశేషం)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)