హోమ్మినిస్టర్ ఇంట్లో అందరూ కూర్చుని ఉన్నారు. హోమ్, సిటి ఐజి, మునిసిపల్ కమీషనర్ శివకుమార్.
హోమ్ చెప్పాడు"ఈ బ్లాస్ట్ చిన్న విషయమేమీ కాదు. అందుకని సిబిఐ నుంచి ఒక ఆఫీసర్ ని పంపించమని సెంట్రల్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను"
"మీరు ఆంధ్రా పోలీస్ లను అవమానిస్తున్నారు సార్"
"ఆంధ్రా లేదు. తెలంగాణ లేదు. తమిళ్నాడు లేదు, కర్నాటకా లేదు. ఇప్పుడు నీకు గుండె జబ్బు వచ్చిందనుకో, ఏం జేస్తావ్? ఎవడి ఆపరేషన్ సక్సెస్ రేటెంత, ఆ హాస్పటల్లో చేయించుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తదా రాదా ఇట్లాంటియన్నీ కనుక్కోని ఆడి దగ్గర జేయించుకుంటావు గాని, ఎంత పనికిమాలిన ఎదవైనా నా కులపోడే చెయ్యాల, నా ఊరోడే చెయ్యాల అని కూకుంటావేటి"
"మీరు మళ్ళీ అవమానిస్తున్నారు సార్"
"అవమానం లేదు, బొంగూ లేదు. నాకు నిజంగా పని కావాలనుకుంటే నేను బయటకే పోతానయ్యా అంతే. డిల్లీ నిర్భయ కేసు చూడు, మన ఎయిమ్స్ డాక్టర్ లు ఎంత గోల పెడుతున్నా సింగపూర్ పంపించారా లేదా, అలాగే చనిపోయిన సైనికులకోసం తయారుచేసే శవపేటికల ఆర్డరు ఫారెన్ కంపెనీకి ఇచ్చామా లేదా?. మీమీద పెజలకి ఇశ్వాసం లేదయ్యా? అదీ ప్రోబ్లం"
ఐజి గొంతు సవరించుకున్నాడు."ఇంకొక ప్రోబ్లం కూడా ఉంది సార్. సిబిఐ నుంచి వచ్చిన వాళ్ళు మన కంట్రోల్ లో ఉండరు. మిత్రా మీకు బాగా దగ్గరి వాడు. వాడి దగ్గర దొరకరాని ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికితే అది మన చేతులు దాటిపోయే ప్రమాదం ఉంది"
హోం ఆలోచనలో పడ్డాడు.
"ఐతే ఏంచేయమంటావయ్యా? ఇన్ఫర్మేషన్ సంగతి అలాఉంచు. అసలు పట్టుకునే మగాడు ఉండాలి కదా డిపార్ట్ మెంట్ లో ?"
"ఉన్నాడు సార్. అభిషేక్. సిబిఐ నుంచే రిజైన్ చేసి వచ్చి ఏపి పోలీస్ లో చేరాడు"
హోమ్ చూపు ఐజి ని దాటి సిటీ పోలీస్ కమీషనర్ వైపు వెళ్ళింది. పోలీస్ కమీషనర్ అతని మనిషి. పోలీస్ కమీషనర్ తల అంగీకారంగా ఊపి తను మాట్లాడతానన్నట్టుగా సైగ చేశాడు
"సిబిఐ ని వదిలి మన దగ్గరకు రావడమేంటయ్యా? ఆళ్ళిచ్చే బెనిఫిట్స్ మనం ఇవ్వలేం కదా? పక్క డబ్బులు బాగా నొక్కేసే టైపా?"వ్యంగ్యంగా అడిగాడు హోమ్
"అదేంకాదు సార్. అతనికి ఇక్కడేవో ప్రోపర్టీస్ అవీ ఉన్నాయి. అవి చూసుకోవడానికి వీలవుతుందని. ప్రస్తుతం ఏలూరు పోస్టింగ్ లో మూడు నెలల క్రితమే జాయిన్ అయ్యాడు. ఇంత తొందర ఇక్కడకు రావాలంటే..."ఐజి మాట ఇంకా పూర్తి కాలేదు. సిటి పోలీస్ కమీషనర్ ఇంకొకసారి సైగ చేశాడు.
"సరే ఉండు. కమీషనర్ ఏదో మాట్లాడతాడంట"హోమ్ ఐజి కి అడ్డు తగిలాడు
"అతను వైజాగ్ రావడానికి వెంటనే ఒప్పుకుంటాడు సార్. నన్ను చాలాసార్లు అడిగాడు కూడా."
"ఎందుకు?"అడిగాడు ఐజి
"అది కొంచెం పర్సనల్.."
"చెప్పవయ్యా,ఏ, ఫరవాలేదు. ఇక్కడంతా అంతా పెద్దమనుషులే"అన్నాడు హోమ్
నవ్వాడు కమీషనర్"అతని గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే వైజాగ్ లో ఉందంట సార్"
అందరి మొహాల్లో నవ్వులు విరిశాయి.
"అతనికి సహాయంగా మన డిఎస్పి జగదీష్ ని పెడదాం సార్"సజెస్ట్ చేశాడు కమీషనర్
వెంటనే తల ఊపాడు హోమ్.
'తనవాణ్ణి స్పై కింద పెట్టాడు. ఆల్రెడీ చాలా గ్రౌండ్ వర్క్ చేశారు'మనసులో అనుకున్నాడు ఐజి. వెంటనే అన్నాడు"కానిస్టేబుల్ రాజుని కూడా ఇద్దాం సార్"
"ఎందుకు?"అడిగాడు హోమ్ వెంటనే
`మీకేనా స్పైలు,నాకు అక్కర్లేదా?' మనసులో అనుకుని
"అతను ఎక్స్పీరియెన్స్ వున్నవాడు, కామన్సెన్స్ వున్నవాడు, కంప్యూటర్ మీద అనుభవం సంపాదించినవాడు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ టైపింగ్ కి కూడా కి చాల హెల్ప్ ఫుల్ గా ఉంటాడు సార్"
"ఓకె" ఒప్పుకున్నాడు హోమ్."ఈ కేసులో ప్రతీ విషయం అడుగు అడుగునా నాకు తెలవాల. గుర్తుపెట్టుకోండి"
శివకుమార్ కి అసలు తననెందుకు పిలిపించారో అర్థం కాలేదు. అప్పుడు తెలిసింది
"ఇదిగో శివకుమారో, ఆడు విశ్వామిత్రగాడు నాకు బినామీ. నా డబ్బుతోటి చాలా ప్రోపర్టీస్ కొన్నాడు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆడి దగ్గరే వున్నాయి. ఈరోజునుంచి సిటీలో ఏ ప్రోపర్టి ట్రాన్సాక్షన్ జరిగినా నాకు తెలవాల. అందుకు నీ హెల్ప్ నాకు కావాల."
"తప్పకుండా సార్. నా సహాయం మీకెప్పుడూ ఉంటుంది. అందులో మీరు అనుమానపడకండి"
"థాంక్స్"చెప్పాడు హోమ్ మినిస్టర్
మీటింగ్ ముగిసింది.
హాలునించి బయటకు వస్తుంటే అన్నాడు శివకుమార్, మినిస్టర్ మనిషైన సిటీ పోలీస్ కమీషనర్ తో
"సీరియస్ గా నడుస్తున్న మీటింగ్ లో రొమాంటిక్ ఎలిమెంట్ ఇంట్రొడ్యూస్ చేసి కొంచెం లైట్ అండ్ హాపీ చేశారు."
నవ్వాడు పోలీస్ కమీషనర్. నవ్వుతూనే అన్నాడు
"ఇంకా పూర్తి సినిమా కథలా తయారవ్వాలంటే ఆ అమ్మాయి విశ్వామిత్ర గ్రూప్ అయ్యి వుండాలి."
శివకుమార్ కూడా గట్టిగా నవ్వాడు.కారు ఎక్కబోయేముందు అడిగాడు
"ఇంతకీ ఆ అమ్మాయి పేరు తెలుసుకోవచ్చా?"
"శివహైమ.ఇక్కడే ఏఎమ్ సి లో ఎమ్ డి చేస్తోంది"కారు ఎక్కాడు పోలీస్ కమీషనర్.
అంతవరకూ నవ్వుతూ వున్న శివకుమార్ మొహం ఒక్కసారిగా రంగులు మారింది. పిడికిళ్ళు అప్రయత్నంగా బిగుసుకున్నాయి
"సార్"అన్నాడు ఎక్కమన్న సూచనగా తలుపు తీసి పట్టుకున్న బిళ్ళబంట్రోతు.
"ఆఫీస్ కి వెళ్ళిపొండి. ఒక గంట పోయాక రామక్రిష్ణ మిషన్కొచ్చి పికప్ చేసుకోండి"చెప్పాడు సీరియస్ గా. శివకుమార్ మొహంలో అతని సబార్డినేట్స్ ఎవరూ అంతకూ చూడని ఒక ఆందోళన కనబడింది
"ఓకె సార్" కారు వెళ్ళిపోయింది.
అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామక్రిష్ణ మిషన్ వైపు ధీర్ఘంగా ఆలోచిస్తూ నడక ప్రారంభించాడు సిటీ మునిసిపల్ కమీషనర్ శివకుమార్.
అతని ఆలోచనలకి ఆందోళనకి కారణం ఉంది.
శివహైమ......
ద్రోణాచార్య కూతురుs
(సశేషం)