కబుర్లు - వీక్షణం - సాహితీ గవాక్షం
వీక్షణం 50వ సమావేశ సమీక్ష
- పెద్దు సుభాష్

వీక్షణం 50వ సమావేశం దుర్ముఖి, ఆశ్వయుజ నవమి నాడు, అనగా అక్టోబర్ 10, 2016 న శ్రీ తల్లాప్రగడ రావు, జ్యోత్స్న గారి గృహమునందు జరిగినది.

ఈ సమావేశములోని మొదటి అంశము తల్లాప్రగడ రావు గారు రామాయణములోని "సంజీవనీ యాత్ర" ప్రసంగము. ఈ ప్రసంగములో రావు గారు వాల్మీకి రామాయణములోనుండీ, తులసీదాసు రామాయణము నుండీ పలు శ్లోకాలను, దోహాలను ప్రస్తావించారు. ప్రసంగ విశేషములు: "రావణుడు మయుడుచే చేయబడిన శక్తి శూలాన్ని లక్ష్మణుడిపై విసరగా, అది వాసుకిలాగా, ఒక మహా కాల సర్పములాగా లక్ష్మణుడిని కాటువేయగా, లక్ష్మణుడు స్పృహ తప్పాడు. జాంబవంతుడు, సుశేనుడూ చెప్పగా హనుమ హిమాలయ దక్షిణ శిఖరాలలో ఉండే ఓషధి పర్వతమునుండీ విశల్యకరణి, సంజీవనీకరణి అనే ఔషధములను తెమ్మని పంపుతారు. హనుమంతుడు దారిలో కాలనేమిని అంతమొందించి, ఓషధీ పర్వతాన్ని చేరుకుని, అందులో ఉండే మూలికలని గుర్తించలేక, పర్వతాన్ని మొత్తాన్నీ పెకిలించి, తీసుకువస్తుండగా, మార్గ మధ్యమున అయోధ్యా నగర వైభవమును దర్శించుటకు కొంత క్రిందికి దిగుతాడు. భరతుడు ఎవరో రాక్షసుడు అనుకుని బాణము వేసి కొట్టగా, "హే రామా" అంటూ కుప్ప కూలతాడు. భరతుడు రామ నామము విని, జరిగిన విషయము తెలుసుకుని హనుమంతుడికి సపర్యలు చేసి, "ఒక బాణము వేసెదను, ఆ బాణమును అధిరోహించి సూర్యోదయమునకు ముందే రాముని వద్దకు చేర"మని పంపిస్తాడు. ఈ సమయములోనే రాముడు ఒక సామాన్యుని వలె దుఃఖిస్తూ, "నా భార్య కోసం నా సోదరుని పోగొట్టుకొని అయోధ్యకు తిరిగి ఎలా వెళ్లగలను?" అని కన్నీరు కారుస్తాడు. ఈ సమయములో హనుమ రాముని వద్దకు చేరగా, వానరులు సంతోషముతో కేరింతలు వేస్తారు. రాముడు కృతజ్ఞుడై హనుమంతుడిని కౌగలించుకొనగా, సుశేనుడు సంజీవనీ లేపనము చేయగా లక్ష్మణుడు సజీవుడై లేచాడు."

తర్వాత శ్రీ నాగ సాయిబాబా తాను రచించిన "వీక్షణం" పాటను శ్రావ్యంగా ఆలపించారు.

అనంతరము రామాయణం గురించి జరిగిన చర్చలో ప్రధాన అంశము యుద్ధానతరము సీత అగ్ని ప్రవేశము. ఈ విషయముపై చర్చ వాడిగా, వేడిగా జరిగినది.

రెండవ ప్రసంగము లెనిన్ గారు ఆత్మ పై చేసిన ప్రసంగము. వారి ప్రసంగ విశేషములు: "రామాయణ మహభారతాలలోని ఆత్మ ప్రతిబింబం మన నిజ జీవితములో కనబడుతుంది. ఈ రెండు మహాకావ్యాలలోని పాత్రలు మన నిజ జీవతములోని మానవ భావ, వ్యసన, వ్యాకుల, మోహములకు ప్రతిబింబించే తత్త్వాలు. రామాయణము మానవ సంబంధాలకు ప్రతీక. రాముడు అనేది మనలోని ఒక ఆత్మ, సంస్కృతి, సంస్కారము. సీత అంతరాత్మ, మనము మన తల్లి దండ్రులు, పూర్వీకులు దగ్గర నుండీ సంక్రమించుకున్న వ్యక్తిత్వము. మనము ఇతరులతోనూ, భావి తరాలతోనూ ఏర్పరుచుకునే సంభంద, భాంధవ్యాలకు ప్రతీక. లక్ష్మణుడు మన నీడ. మన వెంట ఎప్పుడూ ఉంటాడు. మనము చేసే పనులు ప్రభావము, మనలని ఎప్పుడూ వెన్నంటి నడుస్తూనే ఉంటుంది. రామునిలోనూ, మనలోనూ ఉండే దృఢ నిశ్చయత్వానికి ప్రతిబింబం హనుమంతుడు. మన అందరిలోని సామూహిక ఆలోచనా శక్తి సుగ్రీవుడు. మనలోని మూర్ఖత్వం, మొండితనాలకు ప్రతీక వాలి. మనలొని కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలకు ప్రతీక రావణుడు. వీటి అన్నిటితోనూ కలసి జరిగే ప్రయాణం రామాయణం. వీటన్నిటిపై మనము జపము తోనూ, ధ్యనముతోనూ జరిపే పోరాటం రామాయణంలోనీ యుద్ధకాండ. ఈ యుద్ధము తరువాత నీవెవరివో తెలుసుకోవటానికి జరిగే ప్రయత్నమే రామాయణము యొక్క ఆత్మ. వాల్మీకి మహాముని రామాయణం ద్వారా మనకు అందించే సందేశం ఇదే. అందుకే ఆయన చాలా గొప్ప కవి."

తరువాత జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమములో చదివిన కవితలు:

1. వేణుగారు చదివిన గంగిశెట్టి గారి కవిత

"నా అందమైన దేశంలో
ఒకప్పుడు ఆదరాభిమానాలు
..."

2. సాయి బాబా గారి బ్లాండు కవిత్వము
3. ఉదయలక్ష్మి గారి కవిత "నాన్న"
4. కె. గీత గారి కవిత్వము "ఉద్యోగాన్నీ ప్రేమించాలిసిందే "
5. అక్కిరాజు గారి పద్య గానం
6. భాస్కర రావు గారు చదివిన తిలక్ కవిత్వము మొదలైనవి.

ఆ తరువాత కిరణ్ ప్రభ గారి తెలుగు క్విజ్ కార్యక్రమం ఎప్పటివలనే ఉత్సాహముగా సాగింది. ఒక ఉదాహరణ ప్రశ్న "నీలుగు + నీలుగు" ఏమవుతుంది?

కాళిదాసు కవిత్వాన్ని "ధార"గా చెప్పగలిగిన వారు శ్రీ చరణ్ గారు మాత్రమే. కవి కాళిదాసు మొదటి సారిగా భోజ రాజాస్థానములు ప్రవేశించి నప్పటి దృశ్యాన్ని వర్ణించి, ఆ సందర్భములో కాళిదాసు చదివిన ఐదు శ్లోకాలని శ్రీ చరణ్ గారు పఠించి వివరించారు. కాళిదాసు ప్రతిభ మెచ్చి భోజ రాజు ఒక్కొక్క పద్యానికి తన రాజ్యములోని ఒక దిక్కును బహూకరించి, ఐదవ శ్లోకానికి తన సింహాసనాన్నే ఇచ్చి వేయగా, కాళిదాసు భోజ రాజుని వారించి, బ్రాహ్మణులు సింహాసనాన్ని చేపట్ట కూడదని, భోజ రాజు పోషణలో ఉండేందుకు సిద్ధపడతాడు.

ఈ సమావేశంలో శ్రీ వికాస్, శ్రీ శ్రీనివాస్, శ్రీ కృష్ణ మోహన్, కుమారి మాధవి, శ్రీమతి శారద, శ్రీ వేణు ఆసూరి, శ్రీ శ్యామ్ పుల్లెల, శ్రీమతి కాంతి మొ.న సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

 
     
 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)