(మిత్రుడు నల్లమోతు ఫ్రసద్ సౌజన్యంతో)
1968లో ఆనంద మోహన కావ్యమాల సంస్థ ప్రచురించిన పుస్తకం నుండి కొన్ని తెలుగు అష్టకాలను ప్రతినెలా ప్రచురిస్తాము. మంచి తెలుగు సాహిత్యాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో పొందుపరచాలనే తపన, ధ్యేయం తప్ప కాపీరైట్ ఉల్లంఘించాలనే దురుద్దేశం ఏమీ లేదు.
అయిదు పద్యాల రచనను పంచరత్నాలని అంటే మకుటనియమం గల ఎనిమిది పద్యాల మాలికను అష్టకం అంటారు. సుప్రసిద్దమైన సంస్కృతాష్టకాలు - కాలభైరవాష్టకం, లింగాష్టకం, అన్నపూర్ణాష్టకం, జగన్నాధాష్టకం మనకు సుపరిచితమే. శృంగారాష్టకాలలో రుద్రకవి జనార్దనాష్టకమే ప్రాచీనమైనది. మత్తకోకిల ఛందస్సును మాత్రా ఛందస్సులలోనికి మార్చి రచనను సాగించాడు. ఆదిప్రాసేకాక తొలి మూడుపాదాలకు అంత్యనియమం కూడా ఉంది. 'దనుజమర్దన! కందుకూరి జనార్దనా!' అన్న సంబోధనే మకుటం.
జనార్దనాష్టకం లోని ప్రతిపద్యానికి బాపుగారు అత్యంత అందంగా బొమ్మ వేసారు. ఆ బొమ్మను పద్యం కిందే ప్రచురిస్తున్నాము.
సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారగా
చరణ పద్మము మీద దేహము చంద్రకాంతులు దేరగా
మురువు చూపుచు వచ్చినావో మోహనాకృతి మీరగా
గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!