ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపలపంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేటతెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసంప్రశ్న:
ఫిబ్రవరి 16 శ్రీకృష్ణదేవరాయలు జయంతి. ఆయన గౌరవార్ధము ఈ నెల పూరంచవలసిన సమస్య:
'దేశభాషలందు తెలుగు లెస్స'
గతమాసం ప్రశ్న:
(దత్తపది) "రెండు, వేల, పదు, నాఱు(నారు)" అన్న పదాలు వాడుతూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ స్వేచ్ఛా ఛందస్సులో పద్యాన్ని వ్రాయాలి.
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
నిండు మనము తోన రెండును పిలువంగ
వేల సంఖ్య గలిపి వేగ మొచ్చె
వయ్యార మున తాను పదునారు కలుపంగ
సరస మాడ నెంచె సంత సమున
సూర్యకుమారి వారణాసి, మచిలీపట్టణం
సాయము సల్పమంచు జనసంద్రము ఆర్తిగ ఘోష పెట్టగా
న్యాయము చేయబూని గణనాధుడు కష్టములన్ని తీర్చ గన్
మాయలు లే ని పాలనకు మార్గము చూపగ వ చ్చె నెంతయో
హాయిగ రెండు వేల పదునారును నూతన సంవిధానమున్
సుమలత మాజేటి, క్యూపర్టీనో
రెండు నాడులు దల్లికి రెండు కనులు
గాగ, వేవేల రసమయ కైతధార
లచిలికించి మా పదును యుల్లములయందు
నాటె భాషాభిమానంపు నారు, మొలక
లెత్తి పచ్చని పంట ఫలించు చుండ
షోడషాధిక ద్విసహస్ర శోభల గన
నటన మాడుచు రారమ్ము నవ్య యుగమ
ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
సుఖము శాంతి రెండు సుస్థిరంబై జను
లేడు వేల లక్ష లే కరువులు
లేక పదిలమగును లే! నూత్న ఈడు
ఆరు మోములయ్య కాచు నయ్య!