సదాశివ సమారంభాం! వ్యాస శంకర మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం! వందే గురు పరంపరాం!!
శ్రీ చక్రరాజ సక్తాయ! కమలామాతురర్చనే!
సిద్ధాయ పరిపూర్ణాయ నమః శ్రీ ముత్తు స్వామినే!!
కర్ణాటక సంగీత సౌధానికి ముఖ్యమైన మూలస్థంభాలలో సంగీత త్రిమూర్తులు సదా స్మరణీయులు. వారిలో శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారు ఒకరు. వీరు గొప్పవైణికుడైన తండ్రి శ్రీరామస్వామి దీక్షితుల వారి వద్దనే సంగీత విద్యకి పునాదులు ఏర్పరుచుకుని అతి చిన్న వయసులోనే కావ్యాలంకార, జ్యోతిష, వ్యాకరణ శాస్త్రాలలో ప్రావీణ్యతను సంపాదించుకోవడం జరిగింది.
తరువాత వీరు తమ తండ్రి శ్రీరామస్వామి దీక్షితార్ గురువు శ్రీ విద్యోపాసకులు అయిన “శ్రీ చిదంబర నాద యోగి”తో కలసి వారణాసి వెళ్ళడం జరిగింది. అక్కడ దీక్షితార్ శ్రీ చిదంబరనాధయోగి శ్రీ శంకరభగవత్పాదుల అద్వైత గ్రంధాలను చదవడమే గాక, వేద వేదాంత, మంత్ర ఆగమ శాస్త్రాలను అభ్యసించి “శ్రీ విద్యా ఉపదేశాన్ని” పొందారు.
గురువు ఆదేశాన్ని అనుసరించి వారి నిర్యాణం అనంతరం తిరిగి దక్షిణ దేశానికి వస్తూ శ్రీ దీక్షితులవారు తిరుపతి సమీపంలోని తిరుత్తణి కొండ చేరి అక్కడ వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని తాను ముత్తుకుమార స్వామి అనుగ్రహంతో జన్మించారు కనుక ఆయన సన్నిధిలోనే సాధన చేయాలనే సంకల్పంతో ఆరాధిస్తూ నలభై రోజులు గడిపారు. నలభయ్యవనాడు దీక్షితార్ యోగ సమాధిలో ఉండగా“ముత్తు స్వామీ! “నోరు తెరు” అనే మాట వినబడి కళ్ళుతెరచేసరికి... వారిని నోరు తెరువమని ఏదో పెట్టి కళ్ళుమూసుకుని ఇది ఏమిటో చెప్పమని అన్నారట. దీక్షితులు వారు వెంటనే కళ్ళుమూసుకుని పటిక బెల్లం అని చెప్పి కళ్లు తెరవగా ఎదురుగా వల్లీ దేవసేనా సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తేజోమయాకృతితో దర్శనమిచ్చి వెనువెంటనే గర్భాలయం వైపు అదృశ్యం అయ్యారు. అపుడు దీక్షితులవారు జ్ఞాన స్వరూపుడైన గుహుడే తనకు అలౌకికమైన ఆనంద పదాన్ని ఆ కలకండ రూపంలో ప్రసాదించినట్లు గుర్తించి ఆయనే తనకు జ్ఞాన గురువు అని భావించి, ఆ ఆనంద స్థితిలో భావావేశంతో తన గురువైన గుహుని, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని కీర్తించడం ప్రారంభించారు. ఆ విధంగా గురుగుహునిపై ఎనిమిది విభక్తులలో కీర్తనలు రచించారు.
ఈ విధంగా గురుగుహుని సమక్షంలో ప్రారంభమైన దీక్షితుల వారి సంగీతయాత్ర వారి జీవితాంతం వరకు సాగి వారు దర్శించిన ప్రతి దేవతా మూర్తిపైన స్తుతిపరంగా చేసిన కృతి శిల్పంలో దీక్షితులవారి జ్ఞానగురువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు, గురుగుహుడు “గురుగుహ” ముద్రారూపంగా నిక్షిప్తం అయి మనకి దర్శనం ఇస్తాడు.
దీక్షితుల వారు తనని తాను శ్రీ విద్యోపాసనలో ఒక మార్గమైన “కాదిమతానుష్టానునిగా” చెప్పుకుంటారు. కాది విద్యోపాసకులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రధమునిగా అభివర్ణింపబడతారు. ఆది శంకరులు కూడా ఈ సంప్రదాయానికి చెందిన వారే. సరళతలో దీక్షితులవారి రచనలు ఆదిశంకరుల శైలినే పోలి ఉంటాయి.