జనవరి 10, 2016 న ఫ్రీమౌంట్ లో తాయిబా మన్సూర్ గారింట్లో జరిగిన వీక్షణం 41 వ సమావేశం ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.
ఈ సమావేశానికి శ్రీ మహమ్మద్ ఇక్బాల్ గారు అధ్యక్షత వహించారు. సభకు తాయిబా, మన్సూర్ దంపతులు ఆహ్వానం పలికారు. ముందుగా శ్రీ నాగ సాయిబాబా కీబోర్డుతో బాటూ గానాన్ని మిళితం చేసి సభను అలరించారు. సభాధ్యక్షులు ఇక్బాల్ గారు రమణ గారి "కోతి కొమ్మచ్చి" లోంచి కొన్ని ఘట్టాల్ని అందరికీ చదివి వినిపించారు.
ఆత్మకథ రాయడానికి ప్రోత్సాహం కలిగించిన వేమూరి బలరాం గారి మాటలతో మొదలుకుని, బాల్యంలోని పేదరికపు అనుభవాలు, బాపూతో స్నేహం, సినీ ప్రస్థానంలో ఎదురైన చేదు అనుభవాల వరకు ప్రతీ సంఘటనా హాస్యంతో మిళితం చేసి, ఎక్కడా దాపరికం లేకుండా తన గురించి చెప్పుకున్నారు శ్రీ ముళ్లపూడి రమణ.
తరువాత శ్రీ భాస్కర్ "కందుకూరి శ్రీ రాములు కవిత్వ పరిచయం" చేసారు. మట్టి పరిమళం వేసే కవిత్వం శ్రీ రాములి కవిత్వం అనీ, కవిత్వం ఎంత స్వచ్ఛమైనదో అతని వ్యక్తిత్వమూ అంత స్వచ్ఛమైనదని కొనియాడారు. మిత్రులు "కంశ్రీ" గా పిల్చుకునే కందుకూరి తనకు చిరకాల "ద్వారకా" మిత్రుడని చెప్పుకొచ్చారు. పుస్తకంలోని కొన్ని కవితా పంక్తుల్ని ఉదహరిస్తూ అతని కవిత్వాన్ని పుస్తక రూపంలో పరిచయం చేసిన సౌభాగ్య కవిత్వాన్ని కూడా ఉదహరించారు. తేనీటి విరామం తర్వాత శ్రీమతి బండారి విజయ గారు భానుమతి పాడిన చక్కని సినీ గీతాల్ని ఆలపించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసారు. శ్రీ కిరణ్ ప్రభ అందరినీ ఆసక్తి దాయకుల్ని చేసి ఎప్పటిలా క్విజ్ కార్యక్రమంతో కట్టిపడెయ్యడమే కాకుండా సుభాష్ చంద్ర బోస్ జీవితం గురించి తనదైన చక్కని బాణీలో వివరించారు. సుభాష్ చంద్రబోస్ విభిన్నమైన, విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడని, భారత దేశ చరిత్రలో అంతటి ధైర్యమూ, తెగువ కలిగి, నిస్వార్థంగా పనిచేసిన నేత మరొకరు లేరని కొనియాడారు. ఆ రోజుల్లో అయ్యేఎస్ ఉత్తమ శ్రేణి లో సాధించినా స్వాతంత్రం కోసం ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసిన ఉత్తముడన్నారు. గాంధీకి ఎదురు నిలబడి జాతీయ కాంగ్రెస్ కు రెండు సార్లు అధ్యక్షుడిగా నిలిచారన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడ్తూ కూడా జర్మనీలో దేశ స్వాతంత్రం కోసం పాటుపడడం, "అజాద్ హింద్ ఫౌజ్" ను నడిపించడం వంటి గొప్ప బాధ్యతలను భుజస్కంధాల మీద మోసారన్నారు. ఆయనకు ప్రతీ అడుగులోనూ సహరించిన తెలుగు వారైన "అబీఊద్ హస్సన్", "దాట్ల సూర్య నారాయణ రాజు" మొ.న వారి నిస్వార్థ సేవను కూడా వివరించారు.
ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమం లో డా|| కె.గీత "సెలయేటి దివిటీ" కవితని "నువ్విక్కడ లేవు అయినా జ్ఞాపకాలవెన్నెల దివిటీతో దారి వెతుక్కుంటూ ఇక్కడిక్కడే తచ్చాడుతున్నాను- నీ క్షేత్రంలో మొలకెత్తిన పంటల మధ్య తిరుగుతున్నాను..." అంటూ వినిపించారు. శ్రీ సాయిబాబా కొన్ని సరదా "రుబాయతులు" తెలుగు ను, ఉర్దూను కలిపి వినిపించారు.
చివరగా శ్రీ లెనిన్ కథలు, కవిత్వంలో ఉండవలిసిన ముఖ్యాంశాల గురించి వివరించారు. ఆద్యంతం అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సాహిత్యాభిమానులు ఆసక్తి గా పాల్గొని సభను జయప్రదం చేసారు.