సుజనరంజని పాఠకలకు “ కావ్యలహరి’ శీర్షికలో ఈ నెల నుండి “ఆళ్వారులు మధుర భక్తి” అనే ఉపశీర్షికలో ‘ఆముక్తమాల్యద, వైజయంతీవిలాసము’ అనే కావ్యాలని పరిచయం చేస్తాను. చదివి ఆనందించండి.
“ నామ సంకీర్తనం యస్య / సర్వ పాప ప్రనాశనం
ప్రణామో దు:ఖ శమనః / తం నమామి హరిం పరం//
“ నామసంకీర్తనం చేతనే సర్వ పాపాలు పోగొట్టే వాడు, దు:ఖాన్ని దూరం చేసే శ్రీ హరికి నమస్కరిస్తున్నాను.” అని భాగవతం మనకి వివరిస్తుంది. అట్టి భాగవత భక్తులే ఆళ్వారులు. వారు భగవంతుని ప్రేమలో నిండా మునగిన వారు. భగవంతుని ప్రేమిస్తూ, ఆ స్వామి తమని ప్రేమించాలి అని భావించే ‘ మధుర భక్తి’ ని కోరుకొనే వారే ఆళ్వారులు. మధుర భక్తి అంటే?! “ భగవంతుడొక్కడే పురుషోత్తముడు,మిగతా జీవులందరూ స్త్రీ స్వభావంతో భగవంతుని ఆరాధించాలనీ, స్త్రీ సహజమైన ఆర్ద్రత, చంచలత్వం, మృదుత్వం వంటి లక్షణాలు కలిగి, ఆ స్వామిని ద్వేషిస్తూ, అలుగుతూ, కోపిస్తూ, పరిహసిస్తూ, పరిహరిస్తూ నిండా భక్తిలో మునిగి తమని తాము అర్పించుకొని ఆరాధించడమే మధురభక్తి.” ద్వాపరయుగములో వ్రజ గోపికలు, కలియుగంలో ఆళ్వారులు మధురభక్తికి నిదర్శనంగా నిలుస్తారు.
ఆళ్వారులు ‘పన్నిద్దరు’ అనగా పండ్రెండుమంది. విశిష్టాద్వైత మత ప్రవక్తయగు ‘ భగవద్రామానుజాచార్యులకు’ పూర్వమే ద్రవిడ దేశాన వైష్ణవ సంప్రదాయాన్ని నెలకొలిపి ప్రచారము గావించినవారు ఈ పన్నిద్దరు ఆళ్వారులు.
తెలుగులో తాళ్ళపాక చిన్నన్న వ్రాసిన “ పరమ యోగి విలాసము.”లో ఆళ్వారులు కీర్తించబడ్డారు. అట్లే శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన “ ఆముక్త మాల్యద” సారంగు తమ్మయ వ్రాసిన “వైజయంతీ విలాసము” చదలవాడమల్లన రచించిన “విప్రనారాయణ చరిత్ర” మొదలగు గ్రంథాలలో శ్రీ ఆండాళ్ గా వాసిగాంచిన గోదాదేవి, విష్ణు చిత్తునిగా పిలువబడే ‘ పెరియాళ్వార్, ‘ విప్రనారాయణుడిగా తెలుగువారి సాహిత్యంలో కనిపించే ‘ తొండరడిప్పొడి యాళ్వార్’ చరితలు చిరపరిచితాలు. మధుర భక్తికి తార్కాణంగా నిలిచే పన్నిద్దరాళ్వారులు దైవాంశ సంభూతులు. “ఉత్తమః పురుష స్త్వస్యః పరమాత్మేత్యుదాహృతః” పరమాత్మ ఒక్కడే పురుషుడు “స్త్రీ ప్రాయమితరం జగత్” జగత్తులో ఉన్నవారంతా స్త్రీలే అని నమ్మి స్వామిని నాలుగు వేల ‘పాశురాలలో’ ( పాశురం అంటే పాట అని అర్థం) కీర్తించి వారు తరించి మనలను తరింప జేసిన పరమ యోగులు ఆళ్వారులు. ఆ నాలుగు వేల పాశురాలని “ నాలాయిరం” అని, ద్రవిడ వేదమని వ్యవహరిస్తారు. ఆ పన్నిద్దరాల్వారులకు గల తమిళ సంస్కృత నామాలను తెలుసుకొందాం.
“ ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసంబరీష శుక శౌనక భీష్మ దౌల్బ్యాన్
రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్
పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి.” అనే ఈ శ్లోకంలో భాగవత భక్తులను నిత్యం ఎలా స్మరిస్తామో! అట్లే వైష్ణవులు గురు పరంపరాను సంధానంగా ----
“ భూతం సరస్య మహదాహ్వయ భట్ట నాధ
శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం” అనే ఈశ్లోకంలో పండ్రెండు మంది ఆళ్వారులను స్మరిస్తారు. వరుసగా వారి పేర్లు.---
సంస్కృతం తమిళం
౧ . భూతయోగి. పూదత్తాళ్వార్
౨. సారయోగి పోయిగై ఆళ్వార్
౩. మహాయోగి పేయాళ్వార్
౪. భక్తీ సారయోగి తిరు మజిశైయాళ్వార్
౫. శఠగోపయతి నమ్మాళ్వార్
౬. మధుర కవి మధురకవియాళ్వార్
౭. కులశేఖర కులశేఖరాళ్వార్
౮. విష్ణు చిత్తులు పెరియాళ్వార్
౯. గోదాదేవి ఆండాళ్
౧౦. భక్తాంఘ్రిరేణువు. తొండరడిప్పొడియాళ్వార్
౧౧. పరకాల యతి. తిరుమంగైయాళ్వార్
౧౨. యోగివాహనయతి తిరుప్పాణాళ్వార్
ఈ పన్నిద్దరాళ్వారు లను ‘ నిత్యసూరులు’ అని అంటారు. వీరిని “సాహితీ సమరాంగణ సార్వభౌముడైన” శ్రీకృష్ణ దేవరాయలు తమ ‘ఆముక్తమాల్యద’ ప్రబంధంలో ఇలా ప్రార్థిస్తాడు-----
“ అల పన్నిద్దరు సూరులందును సముద్యల్లీలగా వున్న వె
గ్గలపుం దాపము బాప నా, నిజమనః కంజాత సంజాత పు
ష్కలమాధ్వీక ఝరి న్మురారి సొగియంగా జొక్కి ధన్యాత్ములౌ
నిల పన్నిద్దరు సూరులం దలతు మొక్షేచ్చామతిం దివ్యులన్.”
( సశేషం)