పండుగ నెల వచ్చేసింది!!
ఎక్కడ చూసినా దట్టంగా అలముకున్న పొగమంచు!
ప్రతి ఇంటి ముందు వైకుంఠ వాకిళ్ళతో రంగవల్లులు!
ఏపుగా ఎదుగుతున్న పైరును చూసి, ఎదిగివచ్చే బిడ్డలను చూసుకొన్నంత సంతృప్తిగా మురిసిపోతున్న రైతన్నలు!
వేకువనే ఆలయాలలో సందడి చెప్పనక్కర్లేదు! ఏకాదశి వంటి పర్వదినాలైతే ప్రత్యేక దర్శనాలతో విష్ణు ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయి ఉంటాయి!
తెల్లవారకమునుపే వైష్ణవాలయాలలో తమిళంలో వినవచ్చే సొంపైన పాసురాలు!
సాధనకు అత్యంత ప్రముఖంగా చెప్పబడే మార్గశిర, ధనుర్మాసాలలో కానవచ్చే అనిర్వచనీయ దృశ్యాలివి!!
భక్తికి ప్రాంతము, కాలము, భాష, స్త్రీ, పురుష భేధాలు వంటివేమీ అంటవు!! నేడు గ్రామగ్రామాన ప్రబలమౌతున్న సాయి మందిరాలే అందుకు తార్కాణం. ప్రతి రోజూ నాలుగు వేళలా మరాఠీ భాషలో ఆరతులను ప్రతి తెలుగు హృదయం తమదిగా చేసికొని, సాయికి ఆరతులిస్తున్నారు. అలాగే తమిళంలోని తిరుప్పావై పాసురాలను, నయనార్ల తేవారాలను భక్తిగా ఆలపిస్తున్నారు.
" ఏకం సత్ విప్రా: బహుధా వదంతి " అన్న శ్రుతి వాక్యానుసారం, సత్యం ఒక్కటే, దాని వ్యక్తీకరణలో వ్యత్యాసాలు ఉండవచ్చుగాక! సందర్భాన్ని, అవసరాన్ని బట్టి ఆయా దేశకాలాలకు అనుగుణంగా ఆ సత్యం ఆవిష్కృతమౌతుంది.
ఏడు-పదకొండు శతాబ్దాల మధ్య కాలంలో భారతదేశమంతటా భక్తి విప్లవం అడవిమంటలా వ్యాపించింది. దేశంలో ఆన్ని చోట్లా భక్తిని ప్రోది చేసే మహాత్ములు, భక్త కవులు, పరమ భాగవతులు ఉద్భవించారు. రామానుజుడు, నింబారకుడు, మధ్వాచార్యుడు, వల్లభాచార్యుడు, రామానందుడు, నామదేవుడు, చైతన్య ప్రభువు, మీరాబాయి, తులసీదాసు, కబీరు, ఙ్ఞానదేవుడు, ఏకనాధుడు, అన్నమయ్య, త్యాగయ్య- ఇలా కాశ్మీరం మొదలుకొని కన్యాకుమారి వరకూ వారు విరజిమ్మిన్న భక్తి పరీమళాలలో జనులంతా మైమరిచిపోయారు. కొన్ని వందల సంవత్సరాల పాటు ఆంగ్లేయ పాలనలో మగ్గిపోయి, తమ సంప్రదాయాన్ని, ఋషి విధానాన్ని మరుగుపరుచుకుని, స్తబ్ధమైన భారతీయుల హృదయాలను తట్టిలేపి, మరొక్కసారి తమ వారసత్వ బీజాలకు నీరు పెట్టల్సిన కాలం వచ్చిందని అలా వచ్చిన మహాత్ములంతా గుర్తు చేశారు.
దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా వైష్ణవ భక్తి, శైవ భక్తి అనే రెండు విధానాలు ప్రాచూర్యంలో ఉన్నాయి. వైష్ణవ భక్తులను ఆళ్వారులని, శివభక్తులను నయనార్లు అని పిలుస్తారు. ఆళ్వార్లు పన్నెండుమంది, నయనార్లు అరవై ముగ్గురు. అన్ని ప్రసిద్ధ విష్ణు, శివ ఆలయాలలో వీరి మూర్తులు దర్శనమిస్తాయి.
ఆళ్వార్లలో సుప్రసిద్ధురాలు, ఏకైక స్త్రీ మూర్తి ఆండాళుగా పసిద్ధమైన గోదాదేవి. తమిళనాట జన్మించి, మాతృభాషలో విష్ణు భక్తిని సుశ్రావ్యంగా గానం చేసి, నిద్రావస్ధలో జోగుతున్న జనాల మత్తు విదిల్చి, భక్తి విప్లవానికి తన వంతు సమిధ కాగలిగింది. మార్గశిర మాసం మొదలవ్వగానే ఈమె నుండి జాలువారిన తిరుప్పావై ప్రతినోటా ప్రముఖంగా వినిపిస్తుంది.
తమిళనాడులోని మదురై నగరానికి దగ్గరలో ఉంది విల్లుపురం(శ్రీవిల్లిపుత్తూర్). విల్లుపురంలో విష్ణుచిత్తుడనే భక్తవరుడు నివసించేవాడు. అతడు నిత్యము విష్ణుమూర్తిని కొలవడానికి పూలు సేకరించి, భక్తిగా మాల కట్టి, శ్రీరంగనాధ ఆలయంలో సమర్పించేవాడు.
ఒకనాడు పూలు కోయడానికి తోటకు వెళ్తే, తులసి చేట్టు కింద ఒక శిశువు కనిపించింది. బ్రహ్మచారిగా జీవనం సాగిస్తున్న విష్ణుచిత్తుడు ఆమెను భగవత్ప్రసాదంగా స్వీకరించి, గోదా(భూమాత కానుక అని అర్ధం) అని నామకరణం చేసి, తన కుమార్తెగా పెంచుకోసాగాడు.
ప్రేమ, భక్తి మిళితమైన వాతావరణంలో గోదా పెరగసాగింది. చిన్నతనం నుండి ఆమెకు విష్ణుచిత్తుడు నిత్యం కృష్ణుని కథలు, పాటలు, తమిళ పద్యాలు అత్యంత ప్రేమస్పోరకంగా బోధించేవాడు. దాంతో ఊహ తెలిసేప్పటికి గోదాలో కృష్ణ భక్తి గాఢంగా నాటుకుంది.
విష్ణుచిత్తుడు నిత్యపారయణలో భాగంగా పెరుమాళ్ళు 108దివ్యాదేశములను ఆలాపిస్తుంటే, ముఖ్యంగా అరంగన్ గురించిన ప్రస్థావన వచ్చినప్పుడు, వారి జగన్మోహన సౌందర్యం గురించి వర్ణిస్తుంటే, గోదా సంభ్రమాశ్చర్యాలతో, కన్నీరు కార్చేది. ఆ దివ్య సౌందర్యాన్ని కన్నులార గాంచాలని ఉవ్విళ్ళూరేది.
ఎప్పుడూ తనను కన్యగా, తనను స్వీకరించబోయే ఆ కృష్ణపరమత్ముడే తన భర్తగా విశ్వసించనారంభించింది. ఆటలాడినా, పటపాడినా, తదనుసారంగానే ఉండేవి ఆమె బాల్యచేష్టలన్ని కూడా.
నిత్యం విష్ణుచిత్తుడు శ్రీరంగనికి సమర్పించే పూలమాలను తాను ధరించిన తర్వాతే సమర్పించేది. మాలను అలంకరించుకొని, తన ఇంటి వెనుకవున్న బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని, మురుసిపోయేది. తన వాడైన శ్రీరంగడు ఆ మాలలో ఎంత శోభాయమానంగా ఉంటాడో, ఊహించుకొని మరింత పొంగిపోయేది.
ఒకనాడు విష్ణుచిత్తుడు ఆ మాలలో వెంట్రుకను చూడటంతో గోదా చేస్తున్న పని తెలుసుకొన్నాడు. ఇక ముందు అలా చేయవద్దని మందలించాడు. కానీ ఆనాటి రాత్రే రంగడు కలలో కనిపించి, గోదా చేస్తున్న పని తనకు సమ్మతేనని, తనకలాగే మాల సమర్పించమని ఆదేశించాడు.
ఆనాడు శ్రీరాముడు శబరి రుచి చూసిన ఫలాలను స్వీకరించినా, ఈనాడు శ్రీరంగడు గోదా ధరించిన మాలను ప్రీతితో అంగీకరించినా, రెంటికీ వెనకనున్న అంతఃసూత్రం అవ్యాజమైన, అమలిన ప్రేమ మాత్రమే! అదే భక్తి అంటే!!
విష్ణుచిత్తుడు తన కుమా ర్తెగా పెరుగుతున్న గోదా, జన్మసంస్కారంగా భక్తిని నిలుపుకొన్న గొప్ప హృదయం వున్న బాలిక అని గుర్తించి, ఆనాటి మొదలు ఆమె చేస్తున్న ఏ పనికీ అడ్డుతగిలేవాడు కాదు. ఆనాటి నుండి ఆమెకు ఆండాళు అనే పేరు వచ్చింది. ఆండాళు అంటే భగవంతుని పాలించేది అని అర్ధం.
ఆండాళుకు యుక్త వయసు వచ్చింది. తగిన వరుని కోసం విష్ణుచిత్తుడు అన్వేషణ ఆరంభించాడు. కానీ ఆండాళు స్ధిరంగా, కచ్చితంగా తన నిర్ణయం తెలిపింది.
తాను కృష్ణపరమత్ముని తప్ప మరొకరిని భర్తగా అంగీకరించనని!
ఆనాటి రాత్రి కలలో శ్రీరంగనాధుడు దర్శనమిచ్చి, గోదాదేవిని సర్వాలంకారాలతో, వధువుగా తీర్చి, ఆలయానికి విచ్చేయమని చెప్పారు. ఆలయ ప్రధాన అర్చకులకు కూడా అటువంటి సందేశమే అందింది.
నిర్ణయించిన శుభముహూర్తాన నవవధువుగా పదహారేళ్ళ గోదా ఆలయానికి సర్వాలంకారభూషితయై కదిలివచ్చింది. ఆమె కోసమే ఆహ్వానం పలుకుతూ, ఆలయంలో మంగళవాద్యాలు మోగుతూ, కళ్యాణకర వాతవరణం నెలకొని ఉంది. ఊరి జనులంతా ఆ వింతైనా వివాహాన్ని కన్నులారా గాంచడానికి గుమికూడి ఉన్నారు.
వధువు గోదాను పల్లకీలో ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఆలయం ముందు పల్లకీ ఆగింది. ఆమె క్రిందికి దిగుతూనే, మరెవ్వరినీ పట్టించుకోకుండా గర్భగుడి వైపు పరుగుతీసింది. ఆ ఒక్క క్షణం కూడా తన ప్రియతముని విడిచి, ఉండలేని విరహం ఆమె నడక వేగంలో కనిపిస్తుంది.
సాలెగూడువంటి సంసారంలో చిక్కుకునేందుకే జనులు అంతగా పరుగులు పెడుతుంటే, భగవంతుడే తనను వధువుగా స్వీకరించిన గోదా హృదయం ఎంత ఆతృతతో ఉరకలెయ్యాలి!!
వరుడు శ్రీరంగడు!!
ఆమె ఆలయంలోకి అడుగుపెట్టగానే దేదీప్యమానమైన వెలుగు రూపంలో ఆమెను ఆలింగనం చేసుకొని, తనలో ఐక్యం చేసుకున్నాడు.
వీక్షకులందరి హృదయాలలో గొప్ప శాంతి అలుముకుంది!
ఇంతకంటే గొప్ప వివాహమేముంది ఈ ధరిత్రిలో?!!
జీవాత్మ పరమాత్మలో సంలీనమవడమే పరమోత్తమ సంయోగం, పరమ పవిత్ర పాణిగ్రహణం!
ఆమలిన ప్రేమ, అకుంఠిత భక్తి ఆమెను పరమాత్మార్పణం గావించాయి!!!
ఆండాళు జీవితం అంతటితో ముగిసిపోలేదు. తరతరాలకు సరిపడా ఆధ్యాత్మిక వారసత్వాన్ని పాసురాల రూపంలో మిగిల్చివెళ్ళింది. తిరుప్పావై, నాచియార్ తిరుమోళి అనే రెండు అపూర్వ రచనలను మనకందించింది.
నాచియార్ తిరుమోళి 143 కవితల సమ్మేళనం. తిరుమోళి అంటే పవిత్ర వాక్కులు అని అర్ధం. నాచియార్ అంటే దేవత. నాచియార్ తిరుమోళి కృష్ణుని పట్ల గోదాకి ఉన్న గాఢతర ప్రేమను, భక్తిని తెలియపరుస్తుంది. సంస్కృత వాజ్మయంలోని కధలను, తన అనుభూతులతో కలగలపి తనదైన శైలిలో అత్యద్భుతంగా వివరిస్తుందీ గ్రంధంలో.
తిరుప్పావైలో గోదా తనను తాను గోపికగా భావించుకొని, తనకు, తన తోటి వారికి కృష్ణ ప్రేమను ముప్పై పాసురాలలో రసరమ్యంగా ఆలపించింది. రామాయణ మహాకావ్యంలాగా తిరుప్పావై ఎన్ని సార్లు శ్రవణం చేసినా, గానం చేసినా తనివితీరదు.
తిరుప్పావైలో ఆరు ముఖ్య అంశాలు ప్రస్తావించబడ్డాయి
1. పావై నోము ఆచరించండం
2. సమిష్టిగా నోమును నిర్వహించుకోవడం
3. కన్నయ్యకు సుప్రభాతం
4. కన్నయ్య వైభవాన్ని స్తోత్రం చేయడం
5. కన్నయ్యను భక్తితో ఆరాధించడం
6. సర్వస్య శరణాగతికై ప్రార్దించడం
గోదాదేవి ఈ ఆరు అంశాలను అత్యద్భుతంగా తన పాసురాలలో వర్ణించింది.
పావై నోము దక్షిణభారతదేశంలో చాలా పురాతనంగా ఆచరింపబడుతున్న నోము లేదా వ్రతం. రేపల్లెలో గోపికలు ఈ వ్రతం ఆచరించినట్లు, మార్గశిర మాసంలో సూర్యోదయ పూర్వమే నిద్రలేచి, కాళింది నదిలో స్నానమాచరించి, నది ఒడ్డునే కాత్యాయని దేవిని ఉత్తముడైన భర్తను అనుగ్రహించమని, ప్రార్ధించినట్లుగా భాగవతంలో ప్రస్తావించబడి ఉంది. శ్రీకృష్ణుడి కంటే ఉత్తముడెవరు? కాబట్టి కృష్ణుడినే తమ పతిగా పొందేలా అనుగ్రహించమని దేవిని ప్రార్ధించినట్లు వ్యాఖ్యానించబడి ఉంది కూడా.
శ్రీకృష్ణుడు భగవద్గీతలో, "మాసానాం మార్గశీర్షోహం", మాసములలో మార్గశిరమును నేను, అని చెప్పినట్లుగా, గోదాదేవి మార్గశిర మాసంలో ఆచరిచే పావై నోమును తన భక్తి, ఙ్ఞానావిష్కారాలకు రంగం చేసికొంది.
రోజుకొకటి చోప్పున ముప్పై దినములకు ముప్పై పాసురాలను అక్షరమాలగా కూర్చి, రంగడికి అలంకరించింది.
అలతి, అలతి పదాలలో అందంగా అమరిన పాసురాలవి! విన్నవారికి, పాడుకున్నవారికి భక్తికి, ముక్తికి కలిగించగలవు.
అలా 'శ్రీ కృష్ణుడు కాక పురుషుడెవ్వరు ఈ ధరితిలో' అన్న మీరాబాయిలాగా, పరమాత్ముడే పతియన్న పతిత పావని గోదాదేవికి ప్రణతులర్పిస్తూ....