ప్రముఖ రచయిత్రి గంటి సుజల గారి పుస్తకావిష్కరణ కధల సంపుటి "ప్రియే చారుశీలే", నవల అమృతవాహిని" డిసెంబర్ 15-12-2015 NBT Hall లో ఆర్. అనంతపద్మనాభరావుగారు ముఖ్య అతిధిగా డా. పత్తిపాక మోహన్ గారు, స్వాతి శ్రీపాద ల ఆధ్వర్యంలో జరిగింది. ఒక పాఠకుడు రాసిన కధల సంపుటి విశ్లేషణను కింద చదవండి. మరిన్ని వివరాలకు రచయిత్రిని ఈ మెయిల్ ద్వారా సంప్రదించండి. (sujalaganti@gmail.com)
కొన్న మరుసటి రోజే నేను ప్రయాణం చేయవలసి వచ్చింది. కాలక్షేపంకోసం అని కధలసంపుటిని తోడుతీసుకుని వెళ్ళాను. చదవటం మొదలు పెట్టినప్పటినుండి, ఆకధలలోని వైవిధ్యం సరళమైన రచనాశైలి, రచయిత్రి సామాజిక స్పృహ, వాస్తవ పరిస్థితుల అవగాహన, సమస్యలను కూడా సరదాగా చెప్పేసరళి వగైరాలు నన్నుసీటుకి కట్టిపడేసాయి. చేసింది బస్సు ప్రయాణమైనా సమయం, బడలిక తెలియనీయకుండా విమానయానమంత సునాయాసంగా సుఖంగా నన్నుగమ్యానికి చేర్చాయి. ఈకధలు రచయిత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి అనడానికి మచ్చుతునకలు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, ఆచార వ్యవహారాల మధ్యపెరిగినా మారేకాలంతో కలిగే సామాజిక పరివర్తనల అవగాహనతో ఆధునిక భావాలతో మనసు తట్టి ఆలోచనలు రేపే కధలే కాకుండా దరహాస సుమాలను పూయించే సరదా కధల స్రవంతి కూడా రచయిత్రి కలంనించి రాగలసత్తా ఉందని నిరూపించారు.
మురికి వాడలలో ఉండే “పూనమ్” కధలో ఆమెను విద్యావంతురాలిగా చేసి సమాజానికి ఉపయోగపడే వారిగా చేయాలనే తపన “ఒక పువ్వు పూసింది” కధలోఉంటే, “అమ్మ వీలునామా" “అనుబంధాలు” “అమ్మ కాని అమ్మ” “ఆది” “సంధ్యా సమయం” “ ఓ ఇంటి కధ” “నిద్ర” కధల్లోకన్న వారిపట్ల పిల్లవైఖరి, తరాల మధ్య తరుగుతూ, మరుగవుతున్న ఆప్యాయతానుబంధాలు, మనుష్యులమధ్య “హార్ధిక” బంధాలు “ ఆర్ధిక” బంధాలుగా మారటాన్ని హృద్యంగా వివరించారు.
నేటి తల్లితండ్రుల యాంత్రిక, పరుగు జీవితాల్లో పిల్లల మనోవేదనను “గుండుగాడు” “బబ్లూ అనబడే శ్రేయస్కధ” ద్వారా భార్యాభర్తల అనుబంధం విలువ “ప్రియేచారుశీలే” లోనూ “ఇరుకు” కధ ద్వారా ఆ నిర్వచనం ఇంటికే కానీ మనసుక్కాదని వివరించారు. ఒక్కో కధా ఒక సందేశాన్ని ఇస్తూ పాఠకుడ్ని తనవెంట తీసుకు పోతుంది. అన్ని కధలను విశ్లేషణ చెయ్యడం మొదలుపెడితే సమయం, స్థలంకూడా సరిపోవు. ప్రతిఒక్కరూ కొని చదవాల్సిన కధలున్నాయి. మానవతా విలువలు, నేటి సమాజంలో వస్తున్న మార్పులకు అద్దంపట్టే కధలెన్నో ఉన్నాయి. చివరగా నవ్వించి కవ్వించే కధలు కూడా ఉన్నాయి.