మూడు నెలలయిందేమో! ఆరోజు రాత్రి భోజనం చేసి, సుజనరంజని కోసం వ్రాదామనుకున్న విషయం మీద సేకరించిన సమాచారాన్ని, ఎలా వ్రాయాలా అని ఆలోచిస్తూ ఇంకోసారి చదువుతున్నాను.
అప్పుడే ఫోన్ మ్రోగింది. మిత్రుడు రామ్.
పలకరింపులు అయాక, “సత్యంగారు, మీకు గుర్తుందా.. మా తమ్ముడు వ్రాసిన “పల్లకీ” పుస్తకాన్ని మీరిక్కడ ఆస్టిన్లో.. 2009లో అనుకుంటాను, మన సాహిత్య సభలో ఆవిష్కరించారు..” అన్నారు రామ్.
“అవును, గుర్తుంది. ఆ పుస్తకంలో చాల కథలూ, కబుర్లూ వున్నాయి కదా.. ఆరోజు ఆవిష్కరణ సభలో మీ అమ్మగారూ, నాన్నగారూ కూడా వున్నారు” అన్నాను గుర్తు చేసుకుంటూ.
“తమ్ముడు దాన్నే ఇప్పుడు సినిమాగా తీశాడు. అట్లాంటాలో వేశారు. ఇక్కడ ఆస్టిన్లో ఈ వారాంతం రెండు షోలు వేస్తున్నారు. మీరు తప్పకుండా రావాలి. మనవాళ్ళందరికీ ఈమైల్ కూడా పంపిస్తున్నాను”
“తప్పకుండా వస్తాం. నేను ఫేస్ బుక్కులో ఈ సినిమా గురించి ఫణి పెట్టిన సమాచారం చూశాను. శుభం. నాకు ఆ కథ పల్లకీ గుర్తుంది. మూడు నాలుగు పేజీల కథ. మనసుకు హత్తుకునేటట్టు వ్రాశాడు ఫణి. కాకపొతే ఆ చిన్న కథని సినిమాగా తీయటం కష్టమే..” అన్నాను.
“సినిమా మొత్తం నలభై నిమిషాలే లెండి. బాగా వచ్చింది. ఫణి కూడా ఈ షో కోసం మన ఆస్టిన్ వస్తున్నాడు” అన్నారు రామ్.
“తప్పకుండా వస్తాం. ఫణి తీసిన సినిమా చూడకుండా ఎలా.. “ అన్నాను.
రామ్, ఫణి నాకు ఎన్నో సంవత్సరాలనించీ తెలుసు. మా ముగ్గురినీ తెలుగు సాహిత్యం ఇంకా దగ్గర చేసింది. ఎన్నో సాహిత్య సదస్సుల్లో ఎప్పుడూ కలుస్తూనే వున్నాం.
ఫోన్ పెట్టేశాక మేడ మీదకి వెళ్లి, నా స్వంత గ్రంధాలయంలో భద్రంగా దాచుకున్న కొన్ని వందల పుస్తకాల్లోనించీ, పల్లకీ పుస్తకం తీసుకుని, అక్కడే కూర్చుని ‘పల్లకీ’ కథ మరోసారి చదివాను. చక్కటి కథ. అది చదివాక దానిని సినిమాగా ఎలా తీసారో చూడాలని గట్టిగా అనిపించింది.
౦ ౦ ౦
ఆరోజు మేము సినిమా హాలుకి వెళ్ళేటప్పటికే, రామ్, ఫణి ఎదురొచ్చారు. ఫణిని అభినందించి లోపలి వెళ్లి కూర్చున్నాం.
సినిమా మొదలయిన నిమిషం నించే, చక చకా, చక చకా, చక చకా నడుస్తూనేవుంది. దానితోపాటు నేనూ, మిగతా ప్రేక్షకులూ, పూర్తిగా ఆ కథలోనూ, కథనంలోనూ పడిపోయి, సినిమా చివరలో కథాపరంగా కొంత మనోద్వేగంతోనూ, ఎన్నో ఏళ్ల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసిన ఒక తీయని అనుభూతితోనూ కళ్ళు చెమర్చేదాకా, కుర్చీలలో నించీ కదలలేదు.
‘సినిమా ప్రక్రియలో, ప్రేక్షకులని తనతో పాటూ చివరిదాకా ఉత్సుకతతో తీసుకువెళ్ళగలిగినదే మంచి సినిమా’ అని నా వ్యక్తిగత అభిప్రాయం. అది హాస్యపరమైన సినిమా కావచ్చు, చారిత్రక, పౌరాణిక, సాంఘిక పరంగా ఏ రసం పండించే (నీరసం తప్ప) సినిమా అయినా కావచ్చు.
‘పల్లకీ’ సినిమా ఈ నా నిర్వచనంలో సరిగ్గా ఇమిడిపోతుంది.
‘పల్లకీ’ ఒక గొప్ప కళాఖండమని చెప్పటం లేదు. మంచి సినిమాలు తెలుగులో రావటం లేదు అని బాధపడే నాబోటి, మీబోటి వాళ్లందరూ తప్పక చూడవలసిన చక్కటి తెలుగు సినిమా.
కథ గోదావరి మీద వీస్తున్న మలయ మారుతంలా చల్లగా వెడుతూ, ప్రేక్షకుల గుండెల్ని ఒక్కసారిగా గోదావరి లోతుల్లోకి తీసుకువెళ్లి, అప్పుడు అక్కడ ముగుస్తుంది.
కథనం – ముందే చెప్పానుగా – మనల్ని కుర్చీలలోనించీ కదలనీయదు. అనవసరపు సన్నివేశాలు వెతికినా కనపడవు. కథకుడూ దర్శకుడూ ఒక వ్యక్తే అవటం వల్ల, రచయిత ఫణి భావాలని చిత్రీకరించటంలో, దర్శకుడు ఫణి మించిపోయాడనే అనిపిస్తుంది. ఇంత చిన్న కథని, కొద్ది మార్పులతోనే నలభై నిమిషాల చలనచిత్రంగా మలచటంలో ఎంతో విజయం సాధించాడు.
పల్లకీ చిత్రంలో నాకు బాగా నచ్చినవి కోనసీమ లేత కొబ్బరిలా పాత్రలు మాట్లాడిన స్వచ్చమైన తెలుగు భాష. గోదావరి గట్టున ఆకుపచ్చని చేలు. మనల్ని చూసి గాలికి తలలూపుతున్న ఆ పసిడి పంటల అందాలు. ఈమధ్యనే మేము కారులో తిరిగిన ప్రదేశాలు, ఆత్రేయపురం, పాపికొండలు, ధవళేశ్వరం.. అన్నీ మళ్ళీ గుర్తుకొచ్చాయి.
ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం నటీనటుల పాత్ర పోషణా సామర్ధ్యం. తనికెళ్ళ భరణిగారి గురించీ, గొల్లపూడి మారుతీరావుగారి గురించీ కొత్తగా చెప్పేదేమీ లేదు. ఎంతో ప్రతిభగల నటులు. ఈ చిత్రంలో వారి పాత్రలు బాగా చిన్నవి కూడాను. అలాగే సుబ్బడి (ముఖ్య పాత్ర) కొడుకూ, కూతురు. మంచి చాతుర్యం వున్న నటులు.
ఈ చిత్రానికి ప్ర్రాణం, వెన్నుపూసా, సారధి... అన్నీ సుబ్బడి పాత్ర ధరించిన ఎల్బీ శ్రీరాం.
ఆయన నాటకాల్లోనించీ, సినిమాల్లోకి వచ్చిన నటుడు. నటనని ప్రోద్దున్నా, సాయంత్రం ఔపోసన పట్టిన గొప్ప నటుడు. ఆయన నటనకి పరాకాష్ట ఏమిటంటే, సుబ్బడి పాత్రలో ఆయన అనుభవించిన అనుభూతులు, మనమూ అనుభవిస్తాం. ఆ పాత్రలో ఆయన చూపించిన ప్రేమానురాగాలు, మనమూ పంచుకుంటాం. ఆయన అమాయకత్వం చూసి నవ్వుకుంటాం. మానవత్వపు విలువలు నశించి పోతున్న ఈనాటి సమాజంలో, ఆయన దగ్గర మళ్ళీ ఆ విలువలేమిటో గుర్తు చేసుకుంటాం. అంత పెద్ద వయసులో, ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా, ఏనాటిదో ఆ విశ్వాసం – దాన్నే తలుచుకుంటూ, ఎంతో ఉత్సాహం తెచ్చుకుని ముందుకు దూకుతుంటే, మనమూ ఆ ఉత్సాహాన్ని పంచుకుంటాం. మనిషికీ మనిషికీ మధ్య వుండే అనుబంధాన్ని, ఆనందాన్నే కాక, కష్టసుఖాలనీ, తన జీవితాన్ని కూడా మనతో పంచుకుంటాడు.
ఎల్బీ శ్రీరాం ఎంతో గొప్ప నటన చూపించిన చిత్రం ‘పల్లకీ’.
శ్రీరామే పల్లకీ!
ఎల్బీ శ్రీరాం వంటి గొప్ప నటుడిని ఎలా వాడుకోవాలో తెలియని, మన ఈనాటి తెలుగు దర్శక దద్దమ్మలు, ఆయనకో చెత్త యాస పెట్టి, అర్ధంపర్ధంమే కాకుండా, హాస్యం కూడా లేని హాస్య పాత్రలు ఇచ్చి, మాణిక్యాన్ని మళ్ళీ మట్టిలో దాచేస్తున్నారనిపిస్తుంది!
మా రోజుల్లో చాల సినిమాల్లో, ఎంతోమంది నటులు తమ నటనా సామర్ధ్యంతో పోటీపడి మరీ నటించేవారు. ఎస్వీ రంగారావు, నాగేశ్వరరావు, జగ్గయ్య, గుమ్మడి, సావిత్రి, జమున, అంజలీదేవి, రమణారెడ్డి, రేలంగి, అల్లు.. ఒకళ్ళని ఒకళ్ళు నటనలో ఛాలెంజ్ చేసుకునేవారు. చిన్న చిన్న నటులు కూడా, కథాపరమైన పాత్రలలో దూరి, మరచిపోలేని నటన ప్రదర్సించేవారు. ఇప్పుడలా కాదు. నట శూన్యులైన కొడుకులూ, మనవలూ, తమ్ముళ్ళూ వచ్చాక, వాళ్ళ ముందు ఎల్బీ శ్రీరాం, మిశ్రో, భరణి, ధర్మవరపులాటి నటులు గొప్పగా నటించటం ఈ జీరోలకి పెద్ద దెబ్బ!
మా చిన్నప్పుడు ఒక చిన్న ఆట ఆడేవాళ్ళం. ఒక చిన్న గీత గీసి, దీన్ని ఏమాత్రం మార్చుకుండా పెద్ద గీతని చెయ్యమనే వాళ్ళం. అదెలాగో తెలీక బుర్ర గోక్కునే వాళ్ళు మిత్రులు. అప్పుడు దాని పక్కన, ఒక చిన్న గీత గీసి, వీటిల్లో ఏది పెద్దది అని అడిగేవాళ్లం. అప్పుడు మొదట గీసిన ఆ చిన్న గీత, ఒక్కసారిగా పెద్దది అయిపోయేది. అందుకేనేమో తెలుగు సినిమాల్లో, శ్రీరాం లాటి చక్కటి నటులకు పిచ్చి పాత్రలు ఇచ్చి, జీరోలను హీరోలు చేయటం!
‘పల్లకీ’ చిత్రం ఒక ప్రచురింపబడిన కథ ఆధారంగా తీయబడిన కొద్ది చిత్రాల్లో ఒకటి. శ్రీరమణ మిథునం, జనార్ధన మహర్షి గుడి కథల ఆధారంగా వచ్చినవి మిథునం, దేవస్థానం చిత్రాలు. చాల ఏళ్ల క్రితం వచ్చిన ‘గ్రహణం’ (చలంగారి కథ దోషగుణం) ఆధారంగా ఇంద్రకంటి మోహనకృష్ణ తీసిన సినిమా. అన్నీ ఎంతో చక్కటి సినిమాలు. ఒకప్పుడు దేవదాసు, అర్ధాంగి, మాంగల్యబలం, రాజు-పేద, తోడికోడళ్ళు, జీవన తరంగాలు, మీనా, సెక్రటరీ, ప్రేమనగర్... ఇలా ఎన్నో ప్రచురింపబడిన సాహిత్యం ఆధారంగా మంచి సినిమాలు వచ్చాయి. కొందరు నటులు ముఖ్యంగా నాగేశ్వరరావు, శోభన్ బాబు, జగ్గయ్య, సావిత్రి, వాణిశ్రీ, జమున మొదలైన వారు నవలా నటులు అని పేరు కూడా సంపాదించారు. ఇప్పుడా అదృష్టం లేదు.
అదీకాక ఒకే కథని ఆరువందల అరవై సినిమాలుగా తీసిన ఏకైక చిత్ర రంగం మన తెలుగు సినిమా. ఎవరో సినిమా తమ్ముళ్ళు వ్రాసిన ఒకే కథని, వ్రాసిన దాన్నే మళ్ళీ వ్రాసి, చిన్న మార్పులతో మళ్ళీ వ్ర్రాసి, పీకి పీకి సాగదీసి, ఈనాటి సినిమా భాషలో ఇరగదీసి.. ఎన్నో సినిమాలు తీశారు. ఆ కథని మారిస్తే, నటులు నిర్మాతలూ దర్శకులూ ఒప్పుకోరు. ఆ నటుల అభిమానులు అసలే ఒప్పుకోరు. అది హిట్టయిన ఫార్ములా. దానికి గ్రాఫిక్స్, బొడ్డు పూజలూ వాడవచ్చుగానీ, ఆ ఫార్ములాని మార్చకూడదు. అందుకే తెలుగు సాహిత్యం, సినిమాలకి దూరమయిపోయింది. ఈ అలవాటుని మారుస్తున్నవే పల్లకీ, పైన చెప్పిన తదితర సినిమాలు.
ఈ తెలుగు సినిమా మాఫియా రంగాన్ని చూస్తింటే, నాకు ఒకటి అనిపిస్తున్నది. వాళ్ళనీ, వాళ్ళ పిల్లల్నీ, వాళ్ళు కబ్జా చేస్తున్న సినిమా హాళ్లనీ వాళ్ళకే వదిలేసి, ఫణి, జనార్ధన మహర్షి, మోహనకృష్ణ , భరణి మొదలైన చక్కటి దర్శకులు, నాటకాలలో నటించే మంచి నటులతో, మన తెలుగు సాహిత్యాన్ని, కొన్ని లఘు చిత్రాలుగా తీసి, సరసమైన టికెట్ చార్జీలు పెట్టి, యూట్యూబ్, హులు, నెట్ఫ్లిక్ష్ మొదలైన స్ట్రీమింగ్ చానల్స్ ద్వారా చూపిస్తే, నిర్మాతలకి వాళ్ళ ఖర్చూ వస్తుంది, ప్రేక్షకులకు మంచి సినిమాలు చూసే అవకాశం వస్తుంది.
ఈనాటి టెక్నాలజీ పురోగతీ, వేగం చూస్తుంటే, ఇంకొక ఐదు, పదేళ్లలో ప్రజలు సినిమాలని సినిమాహాళ్ళలో చూస్తారని అనుకోను. నేను సెల్ ఫొన్లూ, ఐపాడ్ల గురించి చెప్పటం లేదు. గాలిలోనే అప్పటికప్పుడు మన ముందు ఒక తెర వచ్చి, సినిమాలు చూపించే రోజులు వస్తున్నాయి. వర్చువల్ స్క్రీన్స్ అన్నమాట. ఇలాటివి కొన్ని సినిమాల్లో అప్పుడే చూస్తూనే వున్నాం. అవి ఇంకా ఎంతో దూరంలో లేవు.
మన లఘు చిత్రాలకి, ఎక్కువ బడ్జెట్ లేని చిత్రాలకి ఇదొక సదవకాశం. ఈలోగానే, మనం ఈనాడు వున్న స్ట్రీమింగ్ చానల్స్ వాడుకోవటం మొదలు పెడితే, మనం ఈ కొత్త టెక్నాలజీని అందుకోవటానికి పల్లకీ ఎక్కి, సగం దూరం వెళ్ళినట్టే.
మరొక్కసారి, పల్లకీని మన దగ్గరకు తీసుకు వచ్చిన శ్రీనివాస ఫణి కుమార్ డొక్కాని, మళ్ళీ ఇంకోసారి అభినందిద్దాం.
‘ఇంతటితో ఆగక ఇంకా ముందుకు వాళ్ళు బాబూ’ అని – నాలాగా మీరూ అతనికన్నా పెద్దవాళ్ళయితే – ఆశీర్వదిద్దాం.
౦ ౦ ౦