"అక్కా! ఆరు గంటలు కావొస్తోందే ! నాన్నగారు ఇంటికి వచ్చేసి ఉంటారేమో! ఎలాగ? " అడిగింది రాధ.
"పద పద మాట్లాడకండా నడవ్వే."గబ గబా అడుగులు వేస్తూ అంది ఆమని.
వాళ్ళు బయలుదేరే ముందే అమ్మ హెచ్చరించి పంపింది "నాన్నారు వచ్చే లోపు వచ్చేయండి." అని.
ఆమని స్నేహితురాలు శేషు కుమారి తన తమ్ముడి పుట్టినరోజు అని రావాలని పదే పదే పిలవడం వలన రావలసి వచ్చింది. వాళ్ల ఇల్లు దూరమని అక్కడికీ చెల్లిని తోడుగా పంపింది.
కాసేపు ఉండవే' అంటూ కుచో బెట్టింది శేషు. ఇప్పుడేమో అలస్య మయిందని కంగారు పడుతున్నారు అక్కా చెల్లెళ్ళు.
వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తుండగానే ఇంటి ముందు ఆగి ఉన్న జీపు కనబడింది.
అమ్మో అనుకుంటూ పిల్లి పిల్లల లాగా లోపలికి దూరి పెరటీ వైపు నుండి మెల్లిగా వంటింటి లోకి దూరిపోయారు.
వాళ్ల తరువాతి వాళ్ళు చెల్లి గీత, తమ్ముడు వెంకట్ బుద్ధిగా ముందు గదిలో కూర్చుని చదువుకుంటున్నారు.
అమ్మ ఏమో నాన్న గారికి మంచి నీళ్ళు అందిస్తూ ఉంది.
" అమ్మా! రాత్రికి కూరకి వంకాయలు తరగ మంటావా" అని ఆమని, " అమ్మా! తులసి ముందు దీపం వెలిగించనా?" అని రాధ ,తల్లి వెనుక చేరారు.
కూతుళ్ళు ఇంకా రాలేదే అని ఆందోళన పడుతున్న సావిత్రమ్మ తేలికగా ఊపిరి తీసుకుంది.
"అమ్మా! రేపు సినిమా గురించి అడుగమ్మా!"తల్లి చెవిలో గుస గుస లాడింది ఆమని.
పిల్లలకు తండ్రి దగ్గర ఏ పని కావలసినా అమ్మ ద్వారా అడుగుతారు. నీల కంఠం గారి పెదవుల మీద చిరు నవ్వు తొంగి చూసింది.
" ఊ ఊ సినిమా విడుదలై నెల గడిస్తే వెళ్లండి." అనేశారు.
ఆయన కలెక్టర్ ఆఫీస్ లో హుజూర్ శిరస్తాదారుగా పనిచేస్తున్నారు. పిల్లల చదువు కోసం తాసిల్దారు పోస్ట్ వదులుకుని కాకినాడకు వచ్చేశారు ఆయన. ఆయన అంటే కలెక్టర్ గారికి చాలా గురి. నీల కంఠం గారు మద్రాస్ ప్రెసిడన్సీ కాలేజ్ నుండి ఎకనామిక్స్ ఎం ఏ డిగ్రీ పొందారు. ఇంగ్లీష్ భాష మీద ఆయనకు ఉన్న పట్టు చూసి, ఆయన నిజాయితీ చూసి కలెక్టర్ గారు నీల కంఠం గారిని ఎంతో గౌర విస్తారు.
వాళ్ళకు ఆరుగురు పిల్లలు. పెద్ద అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలకే మంచి సంబంధం వస్తే పెళ్లి చేసే సారు. ఆమని బిఎస్సి, రాధ పియూసీ లో ఉన్నారు.
వీళ్ళు టికెట్ కొనుక్కుని వెళ్దామను కుంటే సినిమా హాలు వాళ్ళు ఒప్పుకోరు. అందుకని సినిమా కొన్నాళ్ళు ఆడి హాలు కాస్త ఖాళీ అయ్యే వరకు భార్య పిల్లలను వెళ్ళ నీయరు ఆయన. తనదైన నీతి నియమాలకు కట్టుబడి ఉంటారు. లంచాలకు ఆమడ దూరంగా ఉంటారు. పై సంపాదనకు ఆశ పడరు కనుకనే తరచూ బదిలీలు అవుతుంటాయి.
రాత్రి వంట కాగానే భోజనాల గదిలో వరుసగా పీటలు వేసి కంచాలు పెట్టారు ఆమని, రాధ కలిసి. ఐదేళ్ల ఆఖరి దానికి అన్నం కలిపి తినిపించి పడుకో బెట్టింది సావిత్ర మ్మ. తండ్రీ బిడ్డలకు కొసరి కొసరి వడ్డించింది ఆమె. రాధ కూర ముక్కలు కంచం కింద దాచేయ బోతుంటే సూటిగా చూశారు నీల కంఠం గారు. గభుక్‌కున నోట్లో పెట్టుకుని నీళ్ళు పోసుకుని మింగింది రాధ.
నీల కంఠం గారు ఆరు అడుగుల పొడవు, పొడుగుకు తగిన లావుతో గంభీరంగా ఉంటారు. తెలుపు ఎరుపు కలసిన రంగు, పిడి కిలి నిండే ముక్కు, ఒత్తు గా ఉండే కనుబొమ్మలు, సన్నని పెదవులు, మంచి రూపసి ఆయన. ఆయన పక్కన సావిత్రమ్మ గువ్వ లాగా అయిదు అడుగుల పొడావుతో చామన ఛాయ ఉంటుంది. అయితే ముఖం చాలా కళ గా ఉంటుంది.
ఆమె తండ్రి ఆమెకు పెళ్లిలో పెట్టిన రవ్వల కమ్మలు, ముక్కు పుడక ధరించి కళ కళ లాడుతూ ఉంటుంది.
భర్త ఇంటి ఖర్చు కోసమని తన చేతికి ఇచ్చే నూట యాభై రూపాయలతో పొదుపు గా ఇల్లు నడపడం ఆమె వంతు. పిల్లల చదువులు, భవిష్యత్తు కోసం ప్రణాళికలు ఆయన వంతు.
" రేపు షరీఫ్తో చెప్పండి సినిమాకు వెళ్లు తున్నామని." భర్తకు గుర్తు చేసింది ఆమె.
షరీఫ్ ఆయన దగ్గర చేసే బిళ్ళ బంట్రోతు. ఇంటి వ్యవహారాలలో కూడా అయ్యగారికి సలహా లివ్వ గలిగే చనువు ఉంది అతనికి. భర్త గారితో జరిపించాల్సిన కొన్ని పనులు అతనికే నేరుగా ఒప్ప చెప్పు తుంటుంది సావిత్రమ్మ. వెండి పళ్లెం లో రూపాయల నోట్ల కట్టలు తెచ్చి ఇవ్వబోయిన పార్టీని కసిరికొట్టి పంపిన అయ్యగారు అంటే షరీఫ్ కు చాలా గౌరువము. అప్పటి నుంచి అలాటి వాళ్ళను తాసిల్దారు గారి దగ్గరికి రానిచ్చే వాడు కాదు.
" అమ్మా!అక్క సంక్రాంతికి వస్తుంది కదా?" అని తల్లిని అడిగింది ఆమని. అంటే నాన్నగారు వెళ్ళి అక్కను ఎప్పుడు తీసుకు వస్తారు అని గుర్తు చేయడం. పెద్ద అక్కా త్రిపుర సుందరి వస్తే ఇంట్లో ముందు పిల్లలకు పండుగ. వాళ్ళు ఉండేది కాకినాడ లో కొంపల్లి వారి వీధిలో. మూడు లాంత్ర్ల జంక్షన్ లో ఉన్న హోటెల్ నుండి పిల్లలకు ఇస్టం అయిన టిఫిను తెప్పించి పెడుతుంది అక్క. మసాలా దోసె బేడ అయితే రవ్వ దోసె ఇంకో అర్థ అణ్న ఎక్కువ.
సంక్రాంతికి సరే బొమ్మల పెట్టె అటక మీద నుండి దింపించడం ,చెక్క పెట్టెలు వరుసగా మెట్ల లాగా పేర్చి మామూలు గా పెట్టె సీతా రాములు , లక్ష్మీ దేవి,విష్ణు మూర్తులు మట్టి బొమ్మలే కాక కృష్ణుడు, గోపికలు పింగాణి బొమ్మలు, కుర్చీలో కూర్చున్న ఇంగ్లీష్ దొరసాని ,ఆవు,దూడలు అన్ని పింగాణి బొమ్మలే. ఇవి కాక పులులు, సింహాలు,దుప్పులు బొమ్మలు అవన్నీ తెల్లని దుప్పటి పరచిన మెట్ల మీద సర్డడం- ఎన్ని సరదాలో ! ఈ పనులన్నిటిలో ముఖ్య సహాయకుడు మసాల్చీ గురువులు. ఇవన్నీ కాక తేగలు కాల్చి ఇవ్వడం, జీడి పిక్కలు ఈత కంపల్లో పెట్టి కమ్మని వాసన వచ్చే దాకా కాల్చి లోపలి పప్పు ముక్కలై పోకుండా ఒక్కొక్క జీడి పిక్క బోర్లా పెట్టి సుత్తితో కొట్టి తీసి ఇచ్చే వాడు. ఆ జీడి కాలి నప్పుడు వచ్చే నల్లని నూనె చాకలి వాళ్ళు బట్టల మీద గుర్తు పెట్టడానికి వాడుకుంటారట.
సినిమాకుఅయిదుగురు వెళ్ళి వచ్చారు. నీలకంఠం గారు సినిమాలు ఎక్కువ చూడరు. ఆరోజు చదువు ఎగిరి పోయింది. తెల్లవారు ఝామున లేచి ముగ్గులు వేయాలని గుర్తు చేసింది అమ్మ. ఆమని ,రాధ పొద్దున్నే లేచి ముగ్గులు పెడితే సావిత్రమ్మ వాళ్ళతో బాటు ఉత్సాహంగా రంగులు నింపుతుంది.
" అక్కతొందరగా వస్తే బాగుంటుంది," రాధ అనింది. "అవును " అని ఆమని వంత పాడింది. త్రిపుర సుందరి వస్తే పండగ సందడి రావడమే కాదు రోజు ఇంచక్కగా రాత్రి భోజనాలు అయ్యాక అక్కను వీణ వాయించమంటారు రోజూ తొమ్మిది నుండి పద కొండు గంటల దాకా తప్పని సరిగ నాన్నగారి గదిలో ఆయన ఎదురుగా కూర్చుని చదువు కోవడమనే గొడవ కొన్నాళ్ళు తప్పిపోతుంది. అది రాధ, ఆమనిల ఆశ.
ఆరోజు సాయంత్రం తాము చూసి వచ్చిన సినిమా గురించి మాట్లాడుకున్నారు అక్కా చెల్లెళ్ళు.
సాయంకాలం చేమంతులు అమ్మడానికి వస్తే " రాధా నీదగ్గర డబ్బులు ఉంటే ఇవ్వమ్మా మళ్లీ ఇచ్చేస్తా" అని అడిగి తీసుకుంది సావిత్రమ్మ.పెద్ద పిల్లలు ఇద్దరికీ చేతి ఖర్చు కోసం నెల నెలా ఆమని కి పది రూపాయలు , రాధకు అయిదు రూపాయలు ఇస్తారు నీల కంఠం గారు.
సావిత్రమ్మ ఆయన తనకు ఇంటి ఖర్చుకు ఇచ్చిన డబ్బు అయిపోతే రాధ దగ్గర అయిదో పదో అడిగి తీసుకుని మళ్లీ ఇచ్చేది మామూలే. ఆమని తన డబ్బు ఖర్చు పెట్టేసుకుంటుంది. రాధ దాచుకుంటుంది. సావిత్రమ్మ లెక్క రాసే పుస్తకములో రాధకు ఇవ్వాల్సింది అని రాసి ఉంటుంది.
రాత్రి మామూలు గానే ఎనిమిది కల్లా భోజనాలు మొదలు పెట్టారు. తొమ్మిది లోపల వంట ఇల్లు అక్కా చెల్లెళ్ళు కలిసి కడిగి ముగ్గు వేసే సారు.
ఆమని ,రాధ ముందు గదిలో మడత మంచాల మీద పడు కుంటారు. మధ్య గదిలో పట్టే మంచం మీద అమ్మ, ఆఖరి పాప ,పక్కనే ఇంకో మంచంలో గీత, వెంకట్ పడుకుంటారు.
బయటి వరండాలో నుండి లోపలికి గుమ్మం ఉన్న మరో ఎల్ ఆకారం గది నీల కంఠం గారిది. అందులో ముందు వైపు భాగం ఆయన ఆఫీస్ గది. వెనుక భాగంలో పట్టె మంచం మీద పడుకుంటారు. ఆమని,రాధ ఆయన ఆఫీస్ గదిలో రాత్రి తొమ్మిది నుండి పద కొండు దాకా నాన్నగారి ముందు కూర్చుని చదువు కోవాలి.
అలవాటుగా నాన్నగారి పడక కుర్చీకి కుడి వైపు ఉన్న పేము కుర్చీల లో పుస్తకాలు పట్టుకుని చేరారు అక్కా చెల్లెలు. ఆమని పుస్తకంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటే, రాధ క్లాస్ పుస్తకం లో తెల్ల కాగితాలు పెట్టుకుని కథ రాయడం మొదలు పెట్టింది.
రాధ ఇంగ్లీష్ మాస్టరు బులుసు గారు పి ఆర్ కాలేజ్ మాగ జైను కోసం రాధను కథ రాసి ఇమ్మన్నారు. తెలుగులో అయితే రాయగలను అన్నది. ఇంగ్లీష్ మాస్టర్ గారిని చిన్న బులుసు గారని ఆయన అన్నగారు తెలుగు సారుని పెద్ద బులుసు గారని పిలుస్తారు కాలేజ్ లో.
మాస్టారి మాట మీద కథ రాయడం మొదలు పెట్టింది రాధ. పడుకునే సమయం అయిందో లేదో అని అర గంటకు ఒకసారి ఇద్దరిలో ఎవరో ఒకరు లేచి మంచి నీళ్ళ కోసమో మరొక దానికోసమో అని ముందు గది లోకి వెళ్ళి గడియారమ్ వంక చూసి వస్తుంటారు.
ఈరోజు కూడా అక్కా సైగ చేస్తే రాధ పుస్తకాలు పక్కన పెట్టి లోపలికి వెళ్ళింది. అక్కడ నుండి బయటి కిటికీ దగ్గరకు వెళ్ళి రెండు చేతులు పైకి ఎత్తి పది అయిందని పది వేళ్ళు చూపింది. పుస్తకం ముందు పెట్టుకుని నిన్న రాత్రి చూసిన సినిమా గురించి ఆలోచిస్తున్న ఆమని బయట చీకటిలో గాలిలో చేతులు మాత్రం కనబడి కెవ్వున కేక పెట్టింది. కిటికీ కన్నా కిందుగా ఉన్న రాధ ఆ కేక విని తనుకూడా కెవ్వున అరుస్తూ హల్లోకి పరిగెట్తు కొచ్చింది. ఏమయిందో ఏమో అని అమ్మ కూడా పరుగున వచ్చింది.
" ఏమయింది తల్లీ" అంటూ అమ్మ, నాన్న ఆమని పక్కన చేరి అనునయం గా అడిగారు.
"కి కిటికీ అవతల దే దెయ్యం . రెండు చేతులు మాత్రం గాల్లో తేలుతూ కనబడ్డాయి నాన్నా" భయపడి పోతూ చెప్పింది ఆమని.
అంతలో అక్కడికి వచ్చిన రాధ అక్క వైపు చూసి తల అడ్డం గా తిప్పుతోంది నేనే అని సైగలు చేస్తూ.
" పిల్లలు భయపడి నట్టు ఉన్నారు . పోయి పడుకో మనండి పాపం"అనింది సావిత్రమ్మ.
" సరే వెళ్ళి పడుకోండి"అన్నారు నీలకంఠం గారు.
" దేవుడికి దండం పెట్టుకుని నిద్ర పొండి." లాలనగా అనింది అమ్మ.
అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ముందు గదిలోకి వెళ్లారు. ఎవరి మంచం మీద వాళ్ళు పడు కున్నారు.
"నేనే అక్కా!" అంటూ ఏదో చెప్పడానికి ఆమని వైపు తిరిగిన రాధ కళ్ళు భయంతో పెద్దవి అయ్యాయి. ఆది చూసి అదిరి పడిన ఆమని తాను కూడా అటువైపు తిరిగీ చూసింది.
అక్కడ గోడకు వేలాడు తున్న కాలెండరు లోని సినిమా తార నవ్వుతూ చూస్తోంది. వాళ్ళు ముందు రోజు చూసిన సినిమాలో దెయ్యంగా వేసిన తార ఆమె. గాలికి కాలెండరు ముందుకు వచ్చి అటు ఇటు ఊగుతున్నది.
ఎంతో నిగూఢము గా ఉంది ఆ నవ్వు. సినిమాలో దెయ్యం " బాబూజీ అవో అవో బాబూజీ" అని పిలుస్తూ వెనక్కి వెనక్కి వెళ్లుతున్నట్టు కనబడి ఇద్దరూ ఒక్కసారే కెవ్వు కెవ్వు న అరుస్తూ అమ్మగదిలోకి పరుగు తీశారు.
"మళ్లీ ఏమయిందే" అంటూ ఉలిక్కి పడి లేచి కూర్చుంది సావిత్రమ్మ.
"దెయ్యం అమ్మా" అంటూ అమ్మ పక్కన చేరారు అక్కా చెల్లెళ్ళు .