ధారావాహికలు
మరీచికలు
- వెంపటి హేమ

(గత సంచిక తరువాయి)
మినీ పుట్టినరోజుకని, గురు, శుక్ర వారాలు రెండురోజులూ శలవుపెట్టి యామిని, ఇంటికి వెళ్ళిపోయింది. అత్తవారింటినుండి సుచరిత కూడా రావడంతో, యామినికి ఆ నాలుగురోజులూ ఇట్టే తెలియకుండా గడిచిపోయినట్లు అనిపించింది.

గురువారం నాడు, మినీ పుట్టినరోజు, ఆ మరుసటి రోజు అక్షరాభ్యాసం చక్కగా జరిగిపోయాయి. యామిని తాను హైదరాబాదులో కొని తెచ్చిన కార్టూన్ బుక్సు, కొత్తబట్టలూ మినీకి బహూకరించింది. యామిని వచ్చినందుకు సోమయాజులుగారి ఇంట్లోవాళ్ళందరూ ఎంతో సంతోషించారు. వాళ్ళ దృష్టిలో మినీ , యామిని వాళ్ళకు పెట్టిన బిక్ష మరి !

ఆత్మీయులతో సరదాగా ఆ నాలుగురోజులు గడిపి, ఆపై యధాప్రకారం, సోమవారం తెల్లవారు ఝామునే బయలుదేరి హైదరాబాదు వెళ్ళిపోయింది యామిని. .

వేళకి ఆఫీసుకి చేరుకున్న యామినిని రెండు రోజులుగా మేటవేసుకుని ఉన్న టైపింగ్ పని పలకరించింది. ఆమె అదంతా క్లియర్ చేసి లేచే సరికి లంచ్ అవర్ అయ్యింది. ఆ పూట, డిక్టేట్ చెయ్యాల్సినవేమీ లేకపోవడంతో బాస్ నుండి ఆమెకు పిలుపు రాలేదు .

మామూలు ప్రకారం తన లంచ్ బాక్సు పట్టికుని వచ్చింది భామిని, "అక్కా! ఈ నాల్గు రోజులూ నిన్ను చాలా మిస్సయ్యా" అంటూ.

ఇద్దరూ పక్కపక్కల కూర్చుని భోజనాలు చెయ్యసాగారు. మధ్యలో హఠాత్తుగా తినడం ఆపి అడిగింది భామిని, " నేను మారా కదా, బాస్ నా గురించి నీ దగ్గర ఏమైనా కామెంట్ చేశారా?"

నోటిలో అన్నం ఉండడంతో యామిని వెంటనే జవాబు చెప్పలేకపోయింది. అంతేకాదు, భామిని అడిగింది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న కావడంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కాని క్షణం ఆలస్యం కూడా సహించలేకపోయింది భానిని.

ఎడం చేత్తో యామిని బుజం పట్టి కుదుపుతూ, "చెప్పక్కా! వినాలని నాకు చాలా ఆత్రంగా ఉంది"అంటూ నిలదీసింది. ఆ చర్య వల్ల యామినికి పొలమారడంతో మరింత ఆలస్యమయ్యింది.

"నాది ఒట్టి డిగ్రీయే కావడం వల్ల వెనకబదిపోయాను గాని, నీలా నేనూ టైపు, షార్టుహాండు నేర్చుకుని ఉంతే, ఇప్పుడు బాసుకి P.A.గా నేనే ఉండేదాన్ని, తెలుసా! చిన్న ప్రశ్న అడిగానో లేదో, జవాబు చెప్పడానికి ఇంత ఇదిగా మురిపించుకుంటున్నావు! చెపితే అరిగిపోతావా ఏమిటమ్మా" అంటూ నిష్టూరంగా మాటాడింది భామిని.

" భామినీ! కాస్త ఆగు. అలా తొందరపడి మాటలు మిగలకు, మంచిపద్ధతి కాదది. నన్ను కొంచెం సద్దుకో నివ్వవా? మాటాడాలంటే నోరు స్వాధీనంలోకి రావాలి కదా" అంది యామిని.

"సరే, సారీ! ఇప్పుడు చెఫ్ఫు ......" ఆత్రం పట్ట లేకపోతోంది భామిని.

" నీలో వచ్చిన మార్పును చూసి బాస్ చాలా సంతోషించారు. కీపిట్ అప్" అంది యామిని, వకుళలా బొటనవేలు ఎత్తి థంబ్సప్ సైన్ చూపిస్తూ.

నిజం చెపితే నిష్టూరం తప్పదు ఎంతటి వాళ్ళకైనా సరే! అంతేకాదు, నిజం చెపితే, భామిని లాంటి అమాయకురాలిని బాధపెట్టినట్లు కూడా ఔతుంది. అందుకే యామిని ఏమాత్రం సందేహించకుండా అర్థసత్యంతో సరిపెట్టేసింది.

ఆ కాస్తకే మురిసిపోయింది భామిని.! ముచ్చిబంగారపు మెరుపుల్లాంటి మేకప్ జిలుగులు లేకపోవడం వల్ల భామినిలోని గ్లామర్ బాగా తగ్గిపోయింది. ఆమె ఒక సాదాసీదా సంసారపక్షపు - టమ్మాయిలా కనిపిస్తోంది ఇప్పుడు. భామిని ఆరోజు లంచ్ చేస్తూండగా యామినితో అంది, "అక్కా! నీలా కనుముక్కు తీరు బాగున్నవాళ్ళు మేకప్ చేసుకున్నా, చేసుకోకపోయినా కూడా చక్కగా, అందంగా ఉంటారు. కాని,

నాలాంటివాళ్ళు కంటికి కాస్త అందంగా కనిపించాలంటే మేకప్ చేసుకోక తప్పదు కదూ! "

"ముస్తాబవ్వడం తప్పేం కాదు! చక్కగా ముస్తాబవ్వ వచ్చు. కాని అది మరీ దిగజారి, వల్గర్ గా ఉండకూడదు. ఆడది, మగాళ్ళకోసమే పుట్టినట్లు, వాళ్ళని మెప్పించడమే తన ధేయమైనట్లు భావిస్తూ తన ఆత్మా గౌరవాన్ని మర్చిపోయి ప్రవర్తించకూడదు - అని నా ఉద్దేశం. మనం ఏ పని చేసినా, అది మన డిగ్నిటీని పెంచేదిగా ఉండీలా చూసుకోవాలి. ఆడది "అంగడిబొమ్మ" కాదు, అంగాంగ ప్రదర్శనలతో అందర్నీ రంజింపజెయ్యడానికి!

చూడగానే, మనకీ అత్మాభిమానం, వ్యక్తిత్వం ఉన్నాయనిపించాలి చూసినవాళ్ళకి. అప్పుడే మనకు నిజమైన గౌరవం వస్తుంది. అది ముఖ్యం నా దృష్టిలో. మనం ఉద్యోగినులం! మనకు ఆఫీసులో గుర్తింపు రావలసింది మన అందం వల్ల కాదు, మన వర్కు ఎఫిషియన్సీ వల్ల!"

భామిని చిరాగ్గా మొహంపెట్టి, "ఏమోబాబూ! ఇవన్నీ నాకేం తెలియవు. ఇంతకీ ముస్తాబవ్వడం మంచి పనౌనా కాదా? ఒక్కమాటలో చెప్పు అక్కా! "

"నీకు ఎలా చెపితే తెలుస్తుందో నాకు అర్థమవ్వడం లేదు. ప్రతి మనిషికి నీట్నెస్సు, జనరల్ హైజీన్ గురించిన అవగాహన ఉండాలి. కొద్దిపాటి ముస్తాబు, మనిషి అందాన్ని పెంచడమే కాకుండా, మనిషికి ఒక విధమైన సంతృప్తినీ, ప్లెజంట్ ఫీలింగునీ కలిగిస్తుంది. గాడీగా ఉండకూడదు మన ముస్తాబు. "అతి సర్వత్ర వర్జయేత్" అన్నారు పెద్దవాళ్ళు. ఏదీ ఎక్కువ కాకూడదు, అలాగని తక్కువా కాకూడదు, మధ్యే మార్గంగా ఉండాలి, ఏదైనా సరే!"

"అక్కా! అన్ని చెప్పొద్దు. నువ్వెలా ముస్తాబౌతావో అది చెపితే చాలు, నేనూ అదే ఫాలో ఔతా ఇకనుండీ." అంది భామిని ఉబలాటపడుతూ.

యామిని చిన్నగా నవ్వేసి ఊరుకుంది. కాని భామిని విడిచిపెట్టలేదు. "నీ సౌందర్యపు రహస్యమేమిటో, గుట్టువిప్పి నా క్కూడా కొంచెం చెప్పు అక్కా! పుణ్యముంటుంది" అంటూ గారాలుపోతూ బలవంతం చేసింది.
"సరే, ఐతే విను...... " అంటూ చెప్పసాగింది యామిని.

"వెలుగు రాగానే నిద్రలేచి, శుభ్రంగా, తెల్లగా అయ్యీలా పళ్ళు తోముకోడంతో మొదలౌతుంది నా ముస్తాబు. ఆ తరవాత వ్యాయామం చేస్తా. తరవాత స్నానం చేసి, ఒక కప్పు పాలు తాగుతా. అప్పుడు ఇంటి పనులు మొదలుపెడతా అవయ్యాక బాక్సు సద్దుకుని, కొంచెం అన్నం తిని, మిగిలింది రాత్రికి మూతపెట్టుకుని, మళ్ళీ ఒకసారి ముఖం చన్నీళ్ళతో కడుక్కుని, శుభ్రంగా తడిపోయీలా తుడుచుకుని, కొద్దిగా పౌడర్ రాసి; కాటుకా, బొట్టూ పెట్టుకుంటా. పౌడర్ రాసుకోడంవల్ల మొహం ఫ్రెష్ గా, చాలాసేపటివరకూ జిడ్డు కారకుండా ఉంటుందని నా నమ్మకం. ఇక కాటుకా, బొట్టూ అంటావా ....... , అవి నా ముస్తాబుకు హైలైట్లు. అప్పుడు ఇస్త్రీ బట్టలు కట్టుకుని, కట్టు సడలకుండా అవసరమైన చోటుల్లో సేఫ్టీ పిన్నులు పెట్టి, ఒకసారి అంతా సరిగా ఉందో లేదో అద్దంలో చూసుకుని అప్పుడు జోళ్ళు తొడుక్కుని ఆఫీసుకి బయలు దేరుతా. ఇక నా ఆభరణాలంటావా - మెడలో ఒకపేట గొలుసు, ఒక చేతికి రెండు గాజులు, మరో చేతికి రిష్టు వాచీ, చెవులకు రింగులు - అంతే!

నా సౌందర్యరహస్యం అన్నా, దినచర్యలో భాగం - అన్నా, ఆరోగ్య సూత్రం అన్నా - అంతా ఇదే! గుట్టు విప్పి మొత్తం చెప్పేశా నీకు, ఆ తరవాత నీ ఇష్టం " అంది యామిని చిరునవ్వుతో.

"ఔనమ్మా! నువ్వు అందగత్తెవు కనుక నీకాపాటి ముస్తాబు సరిపోతుంది. మరి నా కలా కాదే..... ! సర్లే, బాసుకి నచ్చుతుందంటే చాలు, నేను నున్నగా గుండు చేయించుకోడానికి కూడా సిద్ధమే! నే నాయన్ని అంత గాఢoగా ప్రేమించాను అక్కా!" అంది భామిని కళ్ళు రెపరెపలాడిస్తూ.

యామిని షాక్ తిన్నట్లు దిమ్మెరబోయింది. భామిని వైపు అదోలా చూసి, కాసేపు ఆగి, "బాగుంది భామినీ! లౌ ఎట్ ఫష్టు సైట్ - అంటారే ...., అలాగా ఏమిటి " అని అడిగింది.

యామిని మాట ప్పూర్తి చెయ్యగానే అందుకుని, " ఔనక్కా! నిజం గానే నేను ఆయన్ని తొలి చూపులోనే ప్రేమించేశా! ఆ హైటు, ఆ లుక్సూ, సూటైన ముక్కు, చిలిపిగా నవ్వేకళ్ళూ ......! మగసిరి ఉట్టిపడే ఆ స్ఫురద్రూపం చూసి ఏ అమ్మాయి పడిపోదు....... నువ్వే చెప్పు? పలకరించి మాటాడాలని ఉంటుంది, కాని చొరవ చెయ్యలేకపోతున్నా. రోజంతా నా ఆలోచనలు ఆయన చుట్టూ గిరగిరా తిరుగుతున్నాయి. ఈ సంగతి ఆల్రడీ మావాళ్ళకు చెప్పేశా. మంచిరోజు చూసుకుని మా బావ వచ్చి, సార్ ని కల్సుకుని, వాళ్ళ తల్లితండ్రుల అడ్రస్ అడిగి, వెళ్లి మాటాడి మారేజ్ ఫిక్సు చేసుకుని వస్తానన్నాడు . త్వరలోనే మా పెళ్లి జరిగిపోతుంది అక్కా!

ఆయన బాచిలర్ అన్నంతవరకూ నాకు తెలుసు. రాజు చెఫ్ఫాడు. అదిచాలు, వాళ్ళు ఎంత కట్నం అడిగినా మా వాళ్ళు ఇవ్వగలరు. ఇంక అడ్డేముంది? యామినీ! నా పెళ్ళికి నువ్వు తప్పకుండా వస్తావుకదూ? నా ముస్తాబు బాస్ కి నచ్చేటట్లు ఉండేలా నువ్వే చూసుకోవాలి" అంది భామిని, కలల్లో తేలిపోతూ.

యామిని మనసులో "ఇదమిద్ద" మనరాని అలజడి ఏదో మొదలయ్యింది. తనదైన వస్తువును ఎవరో లాక్కుపోతున్నట్లు గుండెల్లో ఏదో తెలియని బాధ బయలుదేరింది! తన మన: స్థితికి తానే నిర్ఘాంతపోయి, "ఛీ! ఇదేం వికారం నాకు" అనుకుని, తనని తాను సరిదిద్దుకునే ప్రయత్నంలో పడింది యామిని.

* **

ఆరోజు ఆఫీసు నుండి ఇంటికి వఛ్ఛేసరికి యామినికి, భయంకరమైన తలనొప్పి బయలుదేరింది. ఇంక ఆ రాత్రి తిండి తినాలనిపించక ఒక గ్లాసు మజ్జిగ కలుపుకుని, తాగి, మంచానికి అడ్డం పడింది, తొందరగా నిద్రపోవాలన్న సంకల్పంతో.

గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుందన్నమాటేగాని, ఆమెకు నిద్ర రాలేదు ఎంతకీ. అంతేకాదు, పదేపదే భామిని మాటలే గుర్తువస్తున్నాయి. ఏదో తెలియని బాధ గుండెల్ని పిండేస్తోన్నట్లుగా ఉంది. రకరకాల ఆలోచనలు ఊహాపోహలుగా వస్తూ, పోతూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ, నిద్రపోనీకుండా వేధిస్తున్నాయి.

అదెంతవరకూ నిజమో కాని హైదరాబాదులోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వరకూ గూండాల చేతుల్లోనే ఉంది - అంటారు! భామిని బావగారైన వీరేంద్రభూపతి, ఇక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో కింగ్ లాంటివాడు. ఇంటర్వ్యూ ఐనా లేకుండా మరదలికి ఉద్యోగం ఇప్పించగలిగిన స్తోమత ఉన్నవాడు, రేపు నయాన్నో భయాన్నో ఒప్పించి, బాస్ తో భామిని పెళ్ళి జరిపించినా జరిపించగలడు. ఈ రోజుల్లో గన్ పోయింట్ మీద ఎన్ని సెటిల్మెంట్సు జరగడం లేదు! ఇక ఇస్టాయిస్టాలతో పనేముందిట!

ఇలా ఏవేవో ఊహలు మనసుని దొలిచేస్తూండడంతో, చాలా రాత్రి వరకూ నిద్రపోకుండా పక్కమీద దొల్లుతూనే ఉండిపోయింది యామిని. తెల్లవారుఝామున వీచే చల్లగాలికి ఆమెకు ఎలాగో నిద్రపట్టింది. అదైనా కలలతో కూడిన కలతనిద్ర!

ఎప్పుడో తను తల్లి ఒడిలో కూచుని, తండ్రి చెప్పగా విన్నకల్పనా కథ, తనకు మనసుకు హత్తుకుపోయిన "ఫెయిరీటేల్", తనకింకా లీలగా గుర్తున్న "స్లీపింగ్ బ్యూటీ" కథ, కొద్దిపాటి మార్పులతో ఆ తెల్లవారు ఝామున ఆమెకు కలగా వచ్చింది!.

చిన్నప్పుడు ఊహించుకున్నట్లుగానే ఇప్పుడు కూడా, ఆ కలలోని "స్లీపింగ్ బ్యూటీ" మరెవరూ కాదు, తానే - అన్న భావం కలిగింది యామినికి.

స్లీపింగ్ బ్యూటీ పుట్టినరోజు నాడు, దురదృష్ట దేవతలాంటి "బాడ్ ఫెయిరీ" కోపించి ఆమెను మృత్యువు వాతను పడెయ్యాలనే ఉద్దేశంతో దీర్ఘనిద్రను ప్రసాదిస్తే; అదృష్టదేవతలాంటి "గుడ్ ఫెయిరీ" దానిలోని దీర్ఘాన్ని తుంచేసి, కేవలం నిద్రమాత్రమే మిగిలివుండేలా చేసింది. అంతేకాదు, ఆ శాపాంతం కూడా చెప్పింది ..... .

ఒక అందాల రాజకుమారుడు పంచకల్యాణి గుఱ్ఱం మీద వచ్చి, నిద్రలో ఉన్న రాజకుమారిని చూసి ప్రేమించి, ఆ ప్రేమ తమకంతో నిద్రలో ఉన్న ఆమెను గాఢంగా ముద్దు పెట్టుకోగానే ఆ "స్పెల్" విడిపోతుందనీ, వెనువెంటనే రాజకుమారి ఆ మాయాజాలం నుండి బయటపడి, మామూలుగా

నిద్రనుండి లేస్తుందనీ శాపాంతాన్ని కూడా నిర్దేశించి మరీ వెడుతుంది గుడ్ ఫెయిరీ . అది మొదలు ఆ రాజ్యంలో అందరూ గాఢ నిద్రావసులై అచేతనంగా పడి ఉంటారు.

అలా నిద్రలోనే శాన్నాళ్ళు గడిచిపోయాక నిజంగానే ఒక అందాల రాకుమారుడు తన పంచకల్యాణి గుఱ్ఱాన్నెక్కి విహరిస్తూ, ఆ ప్రాంతానికి వచ్చాడు.

గుర్రం దిగి తన వైపుగా నడిచి వస్తున్నఆ అందాల రాకుమారుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది యామిని, అంటే - స్లీపింగ్ బ్యూటీ అన్నమాట! చిన్నప్పటిలాగే నిద్రలో కలగంటూ కూడా తానే స్లీపింగ్ బ్యూటీ ననుకుంటోంది ఆమె!

" అబ్బా! ఎంత స్ఫురద్రూపి! మగసిరి ఉట్టిపడే శరీర సౌష్టవంతో ఎంత బాగున్నాడు ఈ రాజకుమారుడు - అనుకుంది స్లీపింగ్ బ్యూటీ. అంతలోనే, ఎత్తుగా, రాజసంగా కనిపిస్తున్న అతన్ని ఇదివరకే తాను ఎక్కడో చూసినట్లు అనిపించింది ఆమెకు! తనను సమీపిస్తున్న ఆ అందాల
రాజకుమారుడివైపు మురిపెంగా చూసింది స్లీపింగ్ బ్యూటీ!

( గాఢ నిద్రలో ఉంది కదా స్లీపింగ్ బ్యూటీ, ఆమె ఆ అందాల రాజకుమరుణ్ణి ఎలా చూడ గలిగింది - అంటూ, మీరు దయయుంచి నన్ను నిలదీసి అడగొద్దు. ఇలలో సాధ్యం కానివి ఎన్నో , కలలో సాధ్యపడవచ్చునన్న సంగతి, ఎప్పుడో ఒకప్పుడు, కనీసం ఒకసారైనా మీకూ అనుభవంలోకి వచ్చే ఉంటుంది కదా! దాన్ని గుర్తుచేసుకోండి., ప్లీజ్! సమస్య తీరిపోతుంది.)

రాజకుమారుడు గాఢ నిద్రలోవున్న స్లీపింగ్ బ్యూటీకి దగ్గరగా వచ్చాడు.

నిద్రలో కూడా సొగసులీనుతున్న ఆమె సుందర ముఖారవిందాన్ని చూసి, ఉన్నబడంగా తన మనసు పారేసుకున్న ఆ రాజకుమారుడు, అప్పటికప్పుడు ఆమెను ప్రేమించేస్తాడు. ఆమే తన హృదయరాజ్ఞి - అని నిర్ణయించుకుంటాడు. అందంగా, అమాయికంగా, అతిగాఢంగా నిద్రపోతున్న ఆ రాజకుమారి ముఖాన్ని చూసి ముచ్చటపడి, ఆమె గులాబీ పెదవుల్ని మృదువుగా ముద్దుపెట్టుకోవాలన్న ఉబలాటంతో ముందుకి ఒంగాడు ఆ రాకుమారుడు. అతని మెడలోని ముత్యాలహారం ఆమె ఎదపై జీరాడడంతో ఆమెకు గిలిగింతలు పుట్టాయి.

దాంతో చటుక్కున మెలకువ వచ్చి ఆమె కళ్ళు తెరిచేసింది. కాని అతన్ని ఆమె గుర్తించింది, ఎలుగెత్తి అతన్ని పేరుపెట్టి పిలవాలనుకుంది గాని ఆమెకు గొంతు పెగలలేదు. "అమర్" అన్న పిలుపు కంఠం లోనే ఆగిపోగా గమ్మున లేచి కూర్చుంది యామిని. ఆ కలతాలూకు "స్పేల్" చెదిరిపోయింది.

అంతవరకూ, ఆమె గుండెలమీద కూర్చుని ఆడుకుంటున్న ఎలకపిల్ల క్రిందకు జారి పడి , ప్రాణభయంతో పారిపోయింది. భావోద్వేగంతో గడగడా వణికింది యామిని. తాను అంతవరకూ నిజమనుకున్నదంతా వట్టి కల! అంటే - కల్ల! ఆ విషయం అవగతమయ్యేసరికి ఆమె మనసు దిగులుతో

చిన్నబోయింది. యామిని వాస్తవంలోకి దిగి వచ్చింది ....... .
ఇదేం కల?! తనకు ఇలాంటి కలవచ్చిందంటే, తన ప్రమేయమేమీ లేకుండానే, అమర్ తన మనసులో చేరిపోయాడన్నమాట! ఎంతపని జరిగింది! మనసు కోతిలాంటిది అంటారు. అది చెప్పిన మాట వినదు. అందుకే కాబోలు, భామిని బాస్ ని తను "లౌ చేస్తున్నాను" అన్నప్పుడు, తన మనసు అంతలా బాధపడింది! మరుభూమిలో, మరీచికలవెంట పరుగిడిన లేడి కూనలా, తాను ఇలా అందీ అందని ఆశల వెంట పరుగులుపెడితే ప్రయోజనం ఏముంటుంది,
అవమానపడడం తప్పించి! తననుతానే మందలించుకుంది యామిని .... "

"పిచ్చి మనసా! ఎందుకే నీకు ఈ ఆశలు? రేపో మాపో భామిని బావగారు వచ్చి, నయాన్నో భయాన్నో బాసుని ఒప్పించి, వాళ్ళ పెళ్ళి జరిపించేస్తాడు. అక్కడితో అతడు భామినికి భర్త ఐపోతాడు. అప్పుడు పూర్తిగా పరాయి వాడు అవుతాడు కదా! ఈ అర్ధంలేని ఆలోచనలవల్ల ఒరిగేదేమీలేదు. అంతా వెర్రిగాని, పెళ్ళినిగురించి ఆలోచించే పరిస్థితా నాది? అటువంటి అవకాశం నా కెక్కడిది! "అనుకుని తనలో చెలరేగిన
భావాలని తలుచుకుని గాఢంగా నిట్టూర్చింది యామిని.

తెల్లవారిందని హెచ్చరిస్తూ కాకులు కుయ్యడం మొదలుపెట్టాయి. దూరంగా ఎక్కడో తీతువు ఒకటి దీనంగా అరుస్తోంది. పక్కవాటాలోంచి, శారదాంబ నిద్రలేచిందనడానికి గుర్తుగా చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. నిద్ర చాలక బద్ధకంగా ఉన్నా, యామినికి ఇంక ఏమాత్రం పడుకోవాలనిపించ లేదు. భవోద్వేగం వల్ల ఆమెకు ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఒళ్ళు కూడా బాగున్నట్లు లేదు. తలనాదుగా, జ్వరం వచ్చింట్లు, ఒళ్ళంతా నొప్పులతో సలపరంగా ఉంది. కాని ఆమె ఆఫీసుకి సెలవు పెట్టాలనుకోలేదు.

"ఐడిల్ మాన్సు బ్రైన్ ఇస్ డెవిల్సు వర్కుషాప్" అంటారు. ఇంట్లోఉన్నకంటే ఆఫీసుకి వెళ్ళిపోతేనే బాగుంటుంది. పనిలోపడితే పొద్దు తెలియకుండా గడిచిపోతుంది" అనుకుంటూ దినచర్య మొదలుపెట్టింది యామిని. ఆమె మనసంతా నిరీహతో నిండిపోయింది.

** *

భారంగా నడుచుకుంటూ ఆఫీసుకి వచ్చింది యామిని. బడలికతో సొక్కిన మొహంతో ఆమె నాలుగు లంఖణాలు చేసిన దానిలా నీరసంగా కనిపిస్తోంది. ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు అమర్.

"ఏమయ్యింది నీకు యామినీ, అలా ఉన్నావు" అంటూ పలుకరించాడు.

పేలవంగా నవ్వింది యామిని. "నా బాధ నీకు ఏమనిచెప్పను! ఎలా చెప్పను" అనుకుంది నిరాశగా మనసులో. పైకి మాత్రం, "ఏమీ లేదు సర్! బాగానే ఉన్నాను" అంది.

"ఏమీ లేదా! ఎలానమ్మేది? వాడిన పూవులా వేలాడిపోతున్న నిన్ను చూస్తే ఎవరికైనా అర్థమౌతుంది, నువ్వు ఏదో బాధపడుతున్నావని! అంతా కులాసాయా? ఏమిటి నీ బాధ, చెప్పు"అని అడిగాడు అనునయంగా.

"అంతా బాగున్నారు. నాకే, పెద్ద అనారోగ్యమేం కాదు, కొంచెం తలనెప్పిగా ఉంది - అంతే!"

"జ్వరమేమో చూడనీయ్" అంటూ దగ్గరగా వచ్చి ఆమె నుదుటి మీద చెయ్యి ఉంచి చూశాడు అమర్. అదాటుగా జరిగిన దానికి కంగారుపడింది యామిని.

కాని, అమరేంద్ర అదేం పట్టించుకోలేదు. "నీ నుదురు వేడిగా ఉంది యామినీ! ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నడు నేను డ్రాప్ చేస్తా" అంటూ, బల్లమీదున్న కారు కీస్ చేతిలోకి తీసుకున్నాడు

"ఒద్దు! వద్దు సర్! నాకు ఇక్కడే బాగుంటుంది. ఇంటి దగ్గర తోచక మరీ జబ్బుచేసినట్లు ఉంటుంది. ఇక్కడైతే పని చేస్తూ అన్నీ మర్చిపోవచ్చు" అంది యామిని దృఢంగా.

"రాత్రి సరిగా నిద్రపోయి ఉండవు. పీడకలలేమైనా వచ్చాయా? ఏం కలలు కన్నావోగాని, అవి నిన్ను బాగా డిస్టర్బు చేసి ఉంటాయి! ఒక్కపూటలో నీరసించిపోయావు, సడన్ గా దివాళాతీసిన షావుకార్లా" అన్నాడు అమర్, తన సహజధోరణిలో.

యామిని మొహం మరింత ముడుచుకుంది. "ఎటువంటి పరిస్థితిలోనూ టీజింగ్ మానడుకదా! మొగలి పువ్వంటి మొగుడు అంటే ;బహుశ: ఇలాంటివాడే అయ్యివుంటాడు. ఇంతలో మంచి, మళ్ళీ అంత లోనే చెడ్డ! అంతలో ఘుమఘుమలు, మళ్ళీ ఇంతలోనే ఘోరమైన ముళ్ళ పీడ! పాపం, భామిని అమాయకురాలు! ఈ మనిషితో ఎలావేగుతుందో ఏమో" అనుకుంది.

అంతలో ఇంటర్ కం రింగయ్యింది. పక్కనే ఉన్న యామిని ఫోన్ ఎత్తింది. భామిని మాటాడింది. యామిని మనసులో ఫ్రెష్ గా మళ్ళీ మంటలు పుట్టాయి, కాని డ్యూటీ చేసింది, "భామినీ వాళ్ళ బావ, అదే ...., ఆ వీరేంద్రభూపతి వచ్చారుట, మీతో మాటాడాలిట. పర్మిషన్ కోసం ........ "

"పంపించమను" అంటూ డ్రాయర్ తెరిచి, క్రోసిన్ బిళ్ళ ఒకటి తీసి, యామినికిచ్చి, "రాజుచేత కాఫీ తెప్పించికుని తాగి, ఇది వేసుకో, అరగంటలో మొత్తం భారం తగ్గిపోతుంది. మాకు రాజుచేత కాఫీలు పంపించు. పని తరవాత చేసుకోవచ్చు, విశ్రాంతిగా ఉండు" అన్నాడు బాధ్యతగా అమరేంద్ర. యామిని అక్కడనుండి వెళ్ళిపోయింది.

రాజుకి కాఫీలు తెమ్మని పురమాయించి , తన రూములోకి వెళ్ళి, టైపుమిషన్ కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది యామిని. "ఐపోయింది, అంతా ఐపోయింది. రేపటినుండి బాసు పరాయివాడు. నాలాంటివాళ్ళు అతని వైపు కన్నెత్తి చూడడం కూడా తప్పే ఔతుంది. ఇలా జీవితకాలం, ఎండమావుల వెంట పరుగులు తీస్తూ బ్రతకమనే నా నుదుట రాశాడు కాబోలు దేవుడు" అనుకుంది బాధగా. మనసులో చెలరేగిన విపరీతమైన అశాంతితో వచ్చిన అస్థిరత్వంతో తన చేతిలోఉన్న మందుబిళ్ళను చెత్తకాగితాల బుట్టలో పడేలా విసిరికొట్టింది. ముందుకి వాలి, టైపు మిషన్ మీద తలవుంచుకుని అనుకుంది, "తీరే ఆశలేనా నీవి? మనసా అల్లరి చేసి, అల్లరిపడకుండా బుద్ధిగా పడి ఉండడం నీకే మంచిది సుమీ!"

తనకి తానే సద్ది చెప్పుకుని ఓదార్పు పొందాలని చూసింది యామిని. తలవాల్చి, కళ్ళు మూసుకున్న ఆమెకు అనుకోకుండా నిద్రపట్టేసింది. మళ్ళీ ఆమె కళ్ళు తెరిచీసరికి లంచవర్ అయ్యింది.

నిద్ర బాగా పట్టడంవల్ల ఒకమాదిరిగా కోలుకుంది యామిని. కాని, ఆమెకు ఏమీ తినాలనిపించలేదు. భామిని వస్తే చూడొచ్చులే - అనుకుంది. కాని ఆ పూట భామిని రాలేదు.

చాలాసేపు భామినికోసం ఎదురుచూసి, ఎంతకీ ఆమె రాకపోయీసరికి లేచి గది బయటకు వచ్చింది యామిని, రాజు ఎదురుగా వచ్చి చెప్పాడు, ఆఫీసు వెంకట్రావుగారికి అప్పగించి, బాస్ ఇంటికి వెళ్ళిపోయారని. భామినిని గురించి అడిగింది .....

"మేడం, వీరూభాయ్ వచ్చారు కదా! ఆయన బాస్ తో చాలాసేపు మాటాడారు. రూం బయటికి వస్తూనే భాయ్ చాలా కోపంగా, భామినీ మేడం చెయ్యి పట్టుకుని, "నువ్వింక ఇక్కడ ఉండాల్సిన పనేం లేదు, నడు" అంటూ, ఆమెకు మాటాడే అవకాశం కూడా ఇవ్వకుండా, బరబరా లాక్కుని వెళ్ళిపోయారు. ఏమయ్యిందోగాని, మరికొద్ది సేపట్లో సారు కూడా వెళ్ళిపోయారు " అన్నాడు రాజు.

తెల్లబోయింది యామిని. ఏమయ్యిందో ఆమెకు కొంతవరకూ అర్థమయ్యింది. భామిని ఆశ తీరలేదన్నమాట!."పాపం! భామిని" అనుకుంది యామిని జాలిగా.

ఇక ఆమెకూ అక్కడ ఉండబుద్ధి పుట్టలేదు. అప్పటికప్పుడు వెంకట్రావుగారికి చెప్పి యామిని కూడా వెళ్ళిపోయింది. ఆరోజు శుక్రవారం కావడంతో ఇంటికి వెళ్ళి, వెంటనే సామాను సద్దుకుని, తిన్నగా బస్సు స్టాండుకి వెళ్ళిపోయింది.

* * *

మరుసటి సోమవారం ఎప్పటిలాగే ఫస్టుబస్సు ఎక్కి హైదరాబాదు వచ్చిన యామినికి, బస్సు స్టేషన్లో, "అక్కా" అంటూ ఎదురుగా వచ్చింది భామిని. పరీక్షగా ఆమెను చూసిన యామిని చాలా

కంగారుపడింది. ఎప్పుడూ పూసిన తంగేడు చెట్టులా నిండు ముస్తాబుతో ఉండే భామిని, ఇప్పుడు ఏ అలంకరణా లేకుండా, మోడువారిన మొక్కలా ఉంది. బాగా ఏడ్చిన దానికి గుర్తుగా, ఆమె కనురెప్పలు ఉబ్బి, కళ్ళు ఎర్రబడి ఉన్నాయి.

ఆమెవైపు ఆశ్చర్యంగా చూస్తూ, "ఏమయ్యింది భామినీ? ఎందుకలా ఉన్నావూ" అని అడిగింది యామిని.

ఇద్దరూ వెళ్ళి అక్కడ ఒకవారగా ఉన్న బెంచీ మీద కూర్చున్నారు. భామిని కారే కన్నీళ్ళు తుడుచుకుని, "ఐపోయింది అక్కా! అంతా ఐపోయింది. మా బావ వెళ్ళి బాస్ తో పెళ్ళి విషయం మాటాడితే ఆయన ఎంత సేపూ ఒకే మాట చెప్పారుట! " ఐ యాం అల్రడీ ఎంగేజ్డు" అన్నఒక్క మాటా తప్ప మరోటి మాటాడలేదుట! ఎవరో ఆ అదృష్టవంతురాలు? ఎంత సౌభాగ్యాన్ని పెట్టిపుట్టిందో ఆమె! మా బావ ఎన్నో విధాలుగా చెప్పి చూశాడుట!

నేనే కాదు, నాతో వచ్చే కట్నం, నా వెనక ఉన్న ఆస్తీ, మా బావ స్టేటస్సు - అన్నీ ఎందుకూ పనికిరానివైపోయాయి! మా బావ నచ్చచెప్పాలని ఎంతగానో చూశాడుట! బాస్ వినలేదు. బావకు కోపం వచ్చింది. ఇంత వరకూ ఎవరూ ఆయన మాట కాదన్నవారు లేరు. ఆయన చాలా హర్టయ్యాడు. బయటికి వచ్చి నా జెబ్బ పట్టుకుని, బరబరా ఈడ్చుకుపోయి కారులో కుదేసి, ఇంటికి తీసుకుపోయాడు - అప్పటికప్పుడు! "మళ్ళీ ఆఫీసు గడప తొక్కడానికి
వీలులే" దంటూ కట్టడి చేశాడు.

మాటలాపి ఏడుస్తూ ఉండిపోయింది భామిని. ఆమెను ఓదార్చడం ఎలాగో తెలియలేదు యామినికి. ఏడుస్తున్న భామిని వైపు బేలగా చూస్తూ ఉండిపోయింది. .

కొంచెం సేపట్లో సద్దుకుని, మాటాడింది భామిని, "మా బావ పైకి అలా కనిపించడుగాని, బాగా కోపధారి! పగపడితే త్రాచుపాము! అందుకే ఎవ్వరూ ఆయనమాట కాదనే సాహసం చెయ్యరు. తను తెచ్చిన ప్రపోజల్ కాదన్నాడని, మాబావ బాసు మీద కోపగించి, ఆయన కేదైనా ఘోరమైన అపకారం తలపెడతాడేమోనని నాకు భయంగా ఉంది అక్కా" అంది భామిని.

ఆమెవైపు వింతగా చూసింది యామిని, " భామినీ! బాస్ నిన్ను కాదన్నా కూడా నీకు ఆయన మీద కోపం రాలేదా! ఆయనకు కీడు జరుగుతుందేమోనని బాధపడుతున్నావా " అని అడిగింది.

"కోపమా! ఎందుకు? "లౌ ఈస్ డివైన్! " నీ ప్రేమ నిజమైనదైతే అది ఎప్పుడూ ప్రేమగానే ఉండి పోతుంది. ఎన్నటికీ అది కోపంగా మారదు. ప్రేమ ఫలించలేదని కోపగించిన నాడు అది ప్రేమ కానేకాదు, ప్రేమ ముసుగులో దాగి ఉన్న స్వార్థమని నా అభిప్రాయం అక్కా!"

ప్రేమమీద ఆమెకున్న కఛ్ఛితమైన అభిప్రాయానికి విస్తుపోయింది యామిని.

"మరి నువ్వు ఈ ఉద్యోగం వదిలేశావు కదా, ఆ తరవాతి ప్లాన్సు ఎమైనా ఉన్నాయా?" మాట మార్చే ప్రయత్నం చేసింది యామిని.

"నాకంటూ ఒక ప్లాను కూడానా! బహుశ:: త్వరలోనే నాకు పెళ్ళి తలపెడతారు అనుకుంటా. ఇక నన్ను ఉద్యోగానికి పంపుతారనుకోను. మా కుటుంబాలన్నింటికీ పెద్దదిక్కు మా బావే! ఆయన ఏం చెపితే అది మేమంతా పాటించాల్సిందే! త్వరలోనే మా బావకి నచ్చిన సంబంధం సెటిల్ చేస్తారు. ఇక నేను

తలవంచుకు తాలి కట్టించుకుని, కళ్ళు మూసుకుని కాపురం చెయ్యాల్సిందే" అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది భామిని.

భామిని బుజమ్మీద చెయ్యివేసి, ఓదార్పుగా చేరదీసుకుంది యామిని. ఇద్దరూ అలా కొంత సేపు ఉండిపోయారు. నెమ్మదిగా తమాయించుకుని ఏడుపు ఆపింది భామిని.

యామిని ఆమెను చుట్టి వున్న చెయ్యి తీసి, "సారీ భామినీ! ఆఫీస్ టైం అయ్యింది, ఇక నేను
వెళ్లిరానా" అని అడిగింది మృదువుగా.

భామిని పర్సు తెరిచి, తన రాజీనామా పత్రం తీసి యామినికి ఇచ్చిఅంది,. "ఇది ఫార్మల్గా నా రాజీనామా! బాస్ కి ఇవ్వు. మళ్ళీ మనం అసలు కలుసుకుంటామో, లేదో. అక్కా! సెలవ్" అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది భామిని, తనకోసం ఎదురుచూస్తూ అగి ఉన్నఇంపాలా కారుదగ్గరకి.

యామిని కళ్ళుకూడా చెమ్మగిల్లాయి. వెళ్ళిపోతున్న భామినినే చూస్తూ కళ్ళు తుడుచుకుంది. భామిని ఎక్కగానే సర్రున వెళ్ళిపోయింది కారు. ఇంక టైం చాలదని, అటునుండి అటే ఆటో ఎక్కి ఆఫీసుకి వెళ్ళిపోయింది యామిని.

* * *

యామిని ఆఫీసుకు చేరుకునీసరికి అమరేంద్ర ఆఫీసుకి వచ్చి ఉన్నాడు. యామిని రాగానే అతనికి "విష్" చేసి, "సారీ" చెప్పింది లేటైనందుకు.

తను చూస్తూన్న ఫైల్లోంచి తలపైకి ఎత్తకుండానే అడిగాడు, " ఈ వేళ లేటయ్యిందేం? దారిలో బస్సు ట్రబులిచ్చిందా మళ్ళీ ?" అని.

"బస్సు సరైన వేళకే వచ్చింది, కాని బస్సు దిగగానే భామిని కనిపించి ఆపింది. తనని పంపించి వచ్చేసరికి లేటయ్యింది" అంది యామిని, సంజాయిషీగా, పర్సులోంచి భామిని ఇచ్చిన రాజీనామా లెటర్ పైకి తీస్తూ.
అతని ముఖంలో చిరాకు దోబూచులాడింది. యామిని ఇచ్చిన లెటర్ అందుకుని, చదవనైనా చదవకుండా దానిమీద "గ్రాంటెడ్" అనిరాసి సంతకం పెట్టి వెనక్కి ఇచ్చేశాడు. యామిని దానిమీద ఆఫీసు స్టాంప్ వేసి దాన్ని ఫైల్ చేసింది.

"సర్! భామిని మీతో ఒకమాట చెప్పమని అడిగింది .... " అంది యామిని ఉపోద్ఘాతంలా. "మీమీద వాళ్ళ బావగారికి చాలా కోపం వచ్చిందిట. ఇంతవరకూ ఆయనమాట ఎవరూ కాదన్నవారు లేరుట! అతడు మీ కేమైనా హానిచేస్తాడేమోనని భామిని చాలా భయపడుతోంది. ఈ విషయం మీకు చెప్పి, మిమ్మల్ని హెచ్చరించమని నన్ను కోరింది భామిని."

"ఇంటరెష్టింగ్! ఇది ఇండైరెక్టు బ్లాక్ మెయిల్ కాబోలు! ఇన్నాళ్ళూ "అరటాకూ - ముళ్ళకంప" సామెత ఒక్క ఆడవాళ్ళకే వర్తిస్తుంది అనుకునీవారు, ఇప్పుడు మగవాళ్ళకి కూడా అది చక్కగా వర్తిస్తుంది అన్నది ఋజువయ్యింది! వెరీ ఇంటరెస్టింగ్!!' అన్నాడు అమర్ వెక్కిరింపులా.

"భామిని మంచిపిల్ల సర్! పాపం, మీ మేలుకోరి చెప్పింది. "నోన్ డెవిల్ ఇస్ బెటర్ దాన్ యాన్ అన్నోన్ డెవిల్" అంటారు కదా! మీకు ముందె తెలిస్తే జాగ్రత్త పడతారని .... . " భామినిని సపోర్టు చేస్తూ మాటాడింది యామిని. కాని అతడు ఆమెను మాట పూర్తీ చెయ్యనివ్వలేదు .....

" మీకే కాదు, మాకూ ఇష్టాయిష్టాలుంటాయండీ అమ్మాయిగారూ" అన్నాడు వెటకారంగా అమరేంద్ర . అతని మనసులో పాత జ్ఞాపకాలు బుసలుకొట్టాయి! కోపంతో కనుబొమలు ముడిపడ్డాయి. యామినివైపు తీక్షణంగా చూస్తూ,"వరమాల పట్టుకుని అమ్మాయి రాగానే ప్రతి మగవాడూ తలవంచేసి ఆ వరమాల మెడకీ, ఆ గుదిబండను బతుక్కీ తగిలించేసుకుంటాడని నీకు ఎందుకనిపిస్తోంది? చెంప పగలకొట్టినా, చంపేస్తారని బెదిరించినా - అన్నప్పుడూ ప్రయోజనం ఉండదు." ఒక విధమైన ఉద్వేగం ప్రేరేపించగా దడదడామాటాడేశాడు అమరేంద్ర . . భావోద్వేగం వల్ల అతని ముఖం ఎర్రబడింది.

ఖంగుతిని, బిత్తరపోయి చూసింది యామిని. "నా కసలు బుద్ధిలేదు. గురుడి సంగతి తెలిసీ కూడా, నాకు కాని విషయాల్లో నేను తలదూర్చాను చూడూ, అందుకు నన్నునేను చెప్పుచ్చుకుని ....... " అనుకుంది భారంగా.

"ఇంతేనా ఇంకా ఏమైనా చెప్పిందా నీ ఫ్రెండు?"

"ఇంకా చాలానే చెప్పింది. ఎవరు ఎంగేజ్డైనా, ఎవరికి పెళ్ళి జరిగినా - ఎవరు ఏమైనా మధ్యలో నాకెందుకు నిష్టూరం! మంచికి పోతే చెడు ఎదురొచ్చిందిట!" యామిని కంఠస్వరంలో రవంత నిష్టూరం ధ్వనించింది.

"నిష్టూరం ఎందుకు? నేను "ఆల్ రడీ ఎంగేజ్డు" అనడం నీకూ బాధకల్గించిందా ఏమిటి?" అంటూ మూడ్ మార్చి నవ్వాడు అమర్.

"బాధా? నాకెందుకు బాధ!" అంది యామిని, శక్తంతా కూడదీసుకుని, నిర్లక్ష్యాన్ని ప్రకటిస్తూ.

యామిని నిజం చెప్పి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవోగాని, అప్పటికే ఎంగేజ్ అయ్యి ఉన్న మనిషికి ఏం చెప్పి ఏం ప్రయోజనం, మరోసారి అవమాన పడడం తప్ప - అనుకున్న యామిని, పంటిబిగువున యదార్ధాన్ని నొక్కిపెట్టి, తన మనసులో లేని మాటల్ని కల్పించి మాటాడింది. తలవంచుకుని పోస్టుని సార్టు చేస్తూండడంతో యామిని ముఖం అమరేంద్రకి కనిపించలేదు. ఒకవేళ అతడు ఆమె మొహంలోకి చూసి ఉంటే, ఆమె మనోగతభావాలు గ్రహించగలిగేవాడేమో! అది జరగలేదు.

"ఎంగేజ్డు" అన్నా కదా! ఆమె ఎవరో ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం, అదే - క్యూరియాసిటీ ఏమీ లేదా నీకు?"

"ఎంతమాత్రం లేదు. ఉడుముకెందుకురా ఊరి పెత్తనం" అన్నారు! జరిగింది చాలు! మీ సంగతి మీ ఇష్టం, నా కెందుకుట!" తలపైకెత్తకుండానే మాటాడింది యామిని.

ఖంగు తిన్నట్లయ్యింది అమరేంద్రకి.. కొంతసేపు అతడు అవాక్కై, మౌనంగా ఉండిపోయాడు. టేబుల్ మీది పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుని, ఒక చేత్తో పట్టుకుని, రెండవ చేత్తో దాన్ని గిరగిరా తిప్పుతూ, ఎప్పుడూ చూసి ఎరుగని వాడిలా దానివైపే నిశితంగా చూస్తూ కూర్చుండిపోయాడు. కొంతసేపటికి మాట కూడదీసుకుని నెమ్మదిగా అన్నాడు .......

"మరైతే ఎవరో నన్ను చంపుతానన్నారని నువ్వు ఎందుకంత భయపడ్డావు? నీ కేమైతే నా కేమిటిలే - అని ఊరుకోక, అంత ఆత్రంగా వచ్చి హెచ్చరించడం ఎందుకు?"

ఆమె కనురెప్పలు రెపరెపలాడాయి. తన ముఖంలోకి చూస్తే అతడు ఇట్టే తన మనోభావాలు చదివెయ్యగలడు - అన్న భయంతో ఆమె తల మరింత వంచుకుంది.

" ఇది మరీ బాగుంది సర్! మనిషి పుట్టుక పుట్టినవాళ్ళకి కొంచెం మంచితనం, మానవత్వం ఉండకూడదా ఏమిటి? తోటివారికి ఎవరికైనా ప్రమాదం ముంచుకొస్తోందని తెలిస్తే, మనసున్న మనుష్యులెవరూ చూస్తూ ఊరుకోలేరు. మరే సహకారం చెయ్యలేకపోయినా, తమకి తెలిసిన విషయం, అదే - ఆ పొంచి ఉన్న ప్రమాదాన్నిగురించైనా తెలియజేసి, కనీసపుసాయంగా హెచ్చరించడమైనా చెయ్యాలని అనుకోకుండా  ఉండగలరా ఏమిటి!. మీ దృష్టిలో అది వాళ్ళ బలహీనత కావచ్చు! పైగా మీ విషయంలో అది, భామిని నన్ను కోరిన కోరిక కూడా !"

అమరేంద్ర మనసు చిన్నబోయింది. యామినికి ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. కాని మనసులోనే అనుకున్నాడు, " ఇంతేనా! నీలో మానవత్వం తప్ప, నాపై నీకు మరే భావమూ లేదన్న మాట! ఇంకానయం, నేను తొందరపడి బయటపడకపోడం మంచిదయ్యింది, గొప్ప అవమానం తప్పింది!"

కాసేపు గడిచాక యామినితో, "ఈ మాటు నీ స్నేహితురాలు కనిపిస్తే చెప్పు, భయపడొద్దని. మనిషికి మరణం ఒక్కసారే వస్తుంది. కాని పిరికివాడు మాత్రం భయంతో క్షణానికొకసారి చస్తూ, మళ్ళీ పుడుతూ, తనజీవిత కాలంలో లెక్కలేనన్నిసారులు మరణిస్తాడు. అంతకంటె ఘోరమైన విషయం ఇంకోటి లేదు. టేకిట్ ఈజీ మై డియర్!
ఒక విషయం మాత్రం నేను కచ్చితంగా హామీ ఇవ్వగలను - మార్షల్ ఆర్ట్సులో చాంపియన్ని, నా విషయంలో దొంగదెబ్బతీస్తే ఏమోగాని, ఎదురుపడి ఎవరూ నన్ను మరీ అంత తేలిగ్గా చంపలేరు. నావిషయంలో ఎవరూ భయపడనక్కరలేదు. నా సంగతి నేను చూసుకోగలను" అన్నాడు.

"చాలా సంతోషం సర్! ఈ మాటు భామిని కనిపిస్తే తప్పకుండా ఈ మాట చెపుతా. ఇప్పుడేమైనా లెటర్సు ఉంటే చెప్పండి, రాసుకుంటా" అంది. తరవాత తను సార్టు చేసిన ముఖ్యమైన ఉత్తరాలు అతని ముందు ఉంచి, యామిని టేబుల్ మీద ఉన్న పేడ్డు, పెన్సిల్ చేతిలోకి తీసుకుంది.

"ఇంకా పోష్టు చూడలేదుకదా! పొచికోలు కబుర్లలోపడి మనం ముఖ్యమైనవి వెనక్కిపెట్టేశాం" అంటూ సీరియస్ గా లెటర్సు చూడడం మొదలు పెట్టాడు అమరేంద్ర.

"అబ్బ! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు బాస్ ని ఖంగు తినీలా చెయ్యగలిగాను" అనుకుని సంబరపడింది యామిని.

ఇన్నాళ్ళూ అతడు ఆమెను ఎన్నో విధాలుగా ఆటపట్టించి రకరకాలుగా ఏడిపించాడు. ఇప్పుడు అతడు ఎంత మారినా, ఆ కసి ఆమె మనసులో ఓమూల పేరుకుని ఉండిపోయింది. ఈ వేళ ఆ బాధ తీరి ఆమె మనసు తేలికపడి, సంతోషించింది. కాని మరో కొత్తబాధ ఆ స్థాన్నాన్ని ఆక్రమించింది ఇప్పుడు.

యామిని మనసంతా నిరాశతో నిండిపోయి ఉంది. "ఆల్రడీ ఎంగేజ్డుట! ఎవరో ఈ క్రౌన్ ప్రిన్సుని పెళ్ళాడే ఆ యువరాణి!! పాపం, భామినికి ఆ ఛాన్సు దక్కలేదు. ఇక నా విషయానికి వస్తే అంతా మిధ్య, ఒట్టి మరీచిక! అన్నీ తెలిసుండీ ఎందుకొచ్చిన బాధ ఇది! భామిని కాకపోతే మరో కామిని! ఎవరైతేనేమిలే, ఎట్టిపరిస్థితిలోనూ అది యామిని మాత్రం కాలేదు కదా " అనుకుందియామిని నిరీహతో. .

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)