ఈ మాసం 5-17-15 ఆదివారం వీక్షణం సమావేశం ఫ్రీ మౌంట్ లో శ్రీమతి తాయిబా మన్సూర్ గారి యింట్లో సంగీత, సాహిత్య సంగమంగా, నవరస రాగ భరితంగా సాగింది. శ్రీ ఇక్బాల్ గారు సభాధ్యక్షులుగా ఉండి, కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. నేటి సమావేశానికి ముఖ్య వక్త సినీ, దూరదర్శన్ నటులు, బహుగ్రంథ కర్త, సంగీత,సాహిత్యాలలో మేటి ,నాటకాలలో, భువనవిజయాలలో నటించి ప్రేక్షకులను తమ సంగీత మాధుర్యంలో ఓలలాడించిన ప్రముఖ నటులు, కవి అయిన శ్రీ అక్కిరాజు.సుందర రామకృష్ణ గారు “ మణి ప్రవాళ “ శైలిలో ఉన్నపద్యాలను పాడి,ఆ పద్యాలలో ఉన్న సౌందర్యాన్ని సభకు వివరించి శ్రోతలను ఆనంద పరవశులను గావించేరు. రామకృష్ణ గారు “శారదా త్రిశతి” అనే అధిక్షేప కావ్యాన్ని రచించి, “అధిక్షేప కవితా చంద్ర” అనే బిరుదును పొందిన వైనాన్ని సభకుతెల్పేరు. ధూర్జటి, జాషువా కవుల పద్యాలను వినిపించి, వివిధ రకాల నవ్వులను వివరించి, పౌరాణిక నాటకాలలో ప్రసిద్ధి చెందిన “జండాపై కపిరాజు” పద్యంపాడి శ్రోతలను అలరించారు. తదుపరి సాయిబా గారు పసందైన విందును ఏర్పాటు చేసారు. .
తదుపరి ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి గారి ‘రిక్షా’ అనే కథను వారి కుమార్తె కె. గీతగారు భావయుక్తంగా చదివి వినిపించగా, రచయిత్రి కథా నేపధ్యాన్నివివరించారు.
తదుపరి దీనిపై సభ్యుల చర్చ జరిగింది. పిదప శ్రీ టి.పి.యన్. ఆచార్యులు గారు “శ్రీకాకుళం జిల్లా మాండలిక భాషలో” రచించిన ‘ స్వప్న సత్యం’ అనేకవితను చదివి శ్రోతల ప్రశంసలను అందుకొన్నారు. డా|| కె.గీతగారు ‘ప్రపంచం కన్నా పాపాయి గొప్పది’ కవితలో పాపాయి కి, తల్లికి ఉన్న అనుబంధాన్ని,పాపాయి బాల్య చేష్టలను కళ్ళకు కట్టినట్లు వర్ణించి సభికుల కరతాళ ధ్వనులనందుకొన్నారు.
పిదప శ్రీ వేణు ఆసూరిగారు ‘ త్రోవ తెలియని బాటసారి’ కవిత చదివి ఆహూతులను అలరించారు. ఈ సమావేశంలో బర్కిలీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతులైన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావుగారికి శ్రీమతి ఆకెళ్ళ
జానకి గారు వారి తల్లిగారి ద్వారా మూడు వేల డాలర్ల చెక్కును తెలుగు శాఖాభి వృద్దికి వితరణగా అందించారు.
అటుపై శ్రీ కిరణ్ ప్రభగారు ప్రముఖ హాస్యనటుడు “ చార్లీ చాప్లిన్” అపూర్వమైన జీవిత విశేషాలను, ప్రముఖతెలుగు సినిమా హాస్య నటి ‘సూర్యకాంతం’ గారి జీవితం లోని వితరణ గుణాన్ని సభకు వివరించి, క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించిరి. చివరగా అధ్యక్షులవారి మలిపలుకులతోను, అరబిక్ వ్యాకరణంలోని అక్షరోత్పత్తి స్ధానాల వివరణతో, గీతగారి వందన సమర్పణతో నేటి సమావేశం దిగ్విజయంగా ముగిసింది.
ఈ సమావేశంలో శ్రీమతి గునుపూడి అపర్ణ, శ్రీ సుబ్బారావు, శ్రీమతి ఆకెళ్ల వరలక్ష్మి, శ్రీమతి ఇక్బాల్, శ్రీ లెనిన్, శ్రీ వేమూరి, శ్రీమతి ఉమా వేమూరి, శ్రీమతి కాంతి కిరణ్ తదితర సాహిత్యాభిలాషులు పాల్గొన్నారు.