భగవంతుడిని ఓ మహా కవి ఇలా ప్రార్థించేడుట! “ అరసికాయ కవితా నివేదనం శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ” అని. అనగా అరసికుల ముందు (రసజ్ఞత లేనివారు.) కవిత్వం చెప్పడం అనే వ్రాతను నానుదుట వ్రాయవద్దు, వ్రాయవద్దు, వ్రాయవద్దు. అనిగట్టిగ వేడుకోన్నాడట. “ రస వంతమైన కవిత్వం, స్పందించే హృదయం గల రసికులనే అలరిస్తుంది కాని, మూర్ఖులను రంజింప చేయదు” అని సారాంశం. “ వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే” తొందరగా మన అభిప్రాయం చెప్పకుండా, “కని కల్ల, నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు” అని ‘సుమతీశతక’ కారుడు ఎప్పుడో చెప్పేడు. ఇది బాగుంది, ఇది బాగులేదు అనే అభిప్రాయం బాగా పరిశీలనచేసి చెప్పాలి. అంతేకాని ఏదో కొంత చూసి “ ఆ ! ఇందులో ఏముంది అంతా పనికిరాని విషయమే” అనే వారిని ‘కుకవులు’ అంటారు. అట్టివారిని గూర్చి పూర్వ కవులు ‘కుకవి నింద’ అని ఓ కవితా సాంప్రదాయాన్నే పాటించేవారు. అట్టి కుకవులైన అరసికులను తెలిపే కొన్ని చాటు పద్యాలని తెలుసుకొందాం.-----
పూర్వం భట్రాజులు అనేవారు గొప్పవారిని పొగుడుతూ కవిత్వం చెప్పి, వారినుండి బహుమతులు గ్రహించే వారు. అలా ఓ కవి అరసికుని పొగుడుతూ పద్యం చెప్పబోతే అమూర్ఖుడు వద్దు అంటాడు. “వద్దు అన్నవాడికి పద్యం ఎందుకు చెపుతావు” అని రెండవ భట్రాజు - ఆ అరసికుని నిందిస్తూ చెప్పిన చాటువు ఈ పద్యం. తిలకించండి----
“ వద్దన పద్యమేల? మరి పందికి నివ్వెర గంధ మేల? దు
క్కెద్దుకు పంచదారటుకులేల? నపుంసకుడైన వానికిన్
ముద్దులగుమ్మ యేల? నెర ముక్కర యేల వితంతు రాలికిన్?
గ్రద్దకు స్నానమేల? నగరా విని శింగయ వంశ థీమణీ !”
( భావం )
“వద్దన్నవాడికి పద్యం యెందులకు? ఎలా అంటే పందికి మంచి గంధం, ఎద్దుకి అటుకులు, నపుంసకునకు అందమైన వనిత, వితంతువుకు ముక్కు పుడక ,( భర్త చని పోయిన స్త్రీ ని వితంతువు అంటారు. తంతువు అంటే తాళి. అది లేనిది కనుక ఆమె వితంతువు. అని అర్థం. ఆమె ముక్కు పుడక పెట్టుకో కూడదు.) గ్రద్దకు స్నానమ్” అనే పై ఉపమానాలన్నీ ఎలా వ్యర్థమో అలాగే అరసికునకు పద్యం విని పించడం కూడా వ్యర్థ ప్రయత్నమే” అని భావం. ఈ పద్యం శింగయ అనే వానికి వినిపించింది. ఇట్టిదే ఇంకొకటి ----
సీసపద్యం
“ రసము నే నెరుగనా? ప్రారబ్ధమిదియేమి?
ద్రవిడదేశాన్న సత్రములనిడరే
సముచితాలంకారసమితి నేనెరుగనా?
మగువలు ధరియించు నగలు కావె?
యతిని నే నెరుగనా? క్షితిలోన
కాషాయ వస్త్రధారుండైన వాడు కాడె?
గురువు నే నెరుగనా? సరి సరి! అక్షరా
భ్యసనంబు సల్పిన యతడు కాడె?
శబ్దమన నే నెరుంగనా? చప్పుడు గదె ?
అనుచు వచియించు అజ్ఞాన జనములోన
అగ్రగణ్యుండవగు నీ వహా! కవిత్వ
మును రచించుట భాషకు ముప్పు గాదె”
ఈ చాటుపద్యం హాస్య రసస్ఫోరకమైనది. ఓ అరసికుడు తాను గొప్పగా కవిత్వం వ్రాయగలను అని అంటాడు. అప్పుడు ఓ లక్షణ కారుడు కొన్ని కవితా లక్షణాలను చెప్పమని ప్రశ్నించగా? ఆ మూర్ఖుడు చెప్పిన సమాధానాలే పై చాటువు. వివరణ చదవి నవ్వుకోండి. ---
౧.“ కవిత్వంలో ఉన్న శృంగారాది నవరసాలు ఏవి? అని ప్రశ్నించగా ఆ కుకవి-
‘రసం’ అంటే నాకు తెలియదా ద్రవిడదేశం (తమిళ నాడు) లో సత్రాలలో పెట్టే అన్నంలో పోసే రసం ( మనం చారు అంటాము) కదా! అంటాడు.
౨. ‘ఉపమా,రూపకాది’ అలంకారాలను గూర్చి ప్రశ్నిస్తే?
‘అలంకారం’ అంటే నాకు ఆ మాత్రం తెలియదా? ఆడవాళ్ళు పెట్టుకొనే ‘నగలు’ కదా! అని జవాబు చెపుతాడు.
౩. పద్య లక్షణాలలో యతి, ప్రాస అని ఉంటాయి. వాటిలో ‘యతి’ అంటే ఏమిటి? అని అడిగితే –
భూమిపై “ కాషాయ వస్త్రాలు ధరించి తిరిగే సన్యాసే” కదా! ‘యతి’ అని అంటాడు.
౪. ‘లఘువులు, గురువులు, లలో ‘గురువు’ ఏది? అనగా
గురువు ఎవరో నాకు తెలియదా “ అక్షరాలు నేర్పి చదువు చెప్పేవాడు” కదా!అని జవాబు యిస్తాడు.
అక్షర సమూహమైన ‘శబ్దాన్ని’ వివరించమనగా ? ‘ శబ్దం’ అంటే ‘ చప్పుడు’ అని తిక్క,తిక్కగా సమాధానాలు చెప్పే ఆ కుకవి ‘అజ్ఞానులలో అగ్రగణ్యుడిగా’పిలవ బతాడు. అని కవి బాధ పడుతూ పై చాటువు చెపుతాడు.
మనం అలా కాకుండా కవిత్వంలోని రసాన్ని ఆస్వాదించి ‘సరసులమని’ అనిపించుకొందాం.
( సశేషం)