శీర్షికలు - తెలుగు తేజోమూర్తులు
మేటి పర్వతాధిరోహకుడు మల్లి మస్తాన్ బాబు
- ఈరంకి వెంకట కామెశ్వర్

ప్రగాడ విశ్వాసం, అకుంటిత దీక్ష, శ్రమ,, క్రమశిక్షణ, కార్య దీక్షా తత్పరత కలిగి ప్రపంచంలోని అత్యంత ఉన్నత శిఖరాలైన - మౌంట్ అకోంకాగ్వూఅ, డెనాలి, ఎల్బ్రస్, కిలిమంజారో, కొస్కీగుఒజ్కో, మౌంట్ ఎవరెస్ట్, విన్సన్ మాసిఫ్, కార్స్టెంజ్ పర్వతాలను అదిరోహించిన తొలి భారతీయుడు, మేటి పర్వతాధిరోహకుడు మల్లి మస్తాన్ బాబు. 172 రోజులలో ఏడు శిఖరాలు అదిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాదించారు. ఇది అసాధారణ విజయం. ఎంతో నేర్పు, ఓర్పు, కూర్పు, ఏకాగ్ర చిత్తం ఉంటే కాని ఇన్ని పర్వతాల లక్ష్యం సాదించలేరు మరి!. మస్తాన్ బాబు గొప్పతనం ఏమిటంటే ఈ పర్వతాధిరోహణ విద్య, వాటి సూక్ష్మాలు ఆయన ఏ కేంద్రానికి వెళ్ళి నేర్చుకున్నవి కావు. స్వానుభవంతో ఆయనే నేర్చుకుని నైపుణ్యం సంపాయించుకున్నారు.

మస్తాన్ బాబు భారత దేశ అత్యుత్తమ పర్వతాధిరోహకుడు. అంటార్టికాలోని అత్యుత్తమమైన మౌంట్ విన్సన్ మాసిఫ్ అధిరోహించిన తొలి భారతీయుడు. హిమాలయాలలోని మౌంట్ ఎవరెస్ట్ అధిరోధించిన తొలి ఆంధ్రుడు. పర్వతాలు ఎక్కే నైపుణ్యం సంపాదించుకుని హిమాలయాలు, ఆండీస్, డెనాలి, ఇలా అనేక పర్వతశ్రేణులను అధిరోహించి తన వసం చేసుకున్నారు.

జననం, బాల్యం, పర్వతాలపై మక్కువ:

శ్రీ మల్లి మస్తాన్ బాబు గారు సెప్టెంబర్ 3, 1974 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నెల్లూరు జిల్లా గాంధి జన సంగంలో గిరిజన కుటుంబంలో జన్మించారు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా బడికి వెళ్ళారు. చిన్నప్పటి నుండి కాయ కష్టం చేసుకుని బతికిన మనిషి ఆయన. పసి ప్రాయంలోనే పినాకిని నదిలో ఈదటం నేర్చుకున్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ లో చదివారు. తండ్రి పాంక్రియాస్ క్యాన్సర్ తో చనిపోయారు. మస్తాన్ బాబు గారి సోదరి డాక్టర్ మల్లి దొరశానమ్మ; ఇద్దరూ కష్టపడి చదువుకుని పైకొచ్చారు.

ఎన్ ఐ టి జమ్షెడ్పూర్ లో చదివు మిగించి, ఐ ఐ టి లో చదువుకున్నారు. ఆతరువాత ఐ ఐ ఎం - కోల్కత లో చదివారు. మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండవచ్చు. కాని ఆయన దృష్టి, దోరణి మరోవైపు - ఆసేతు హిమాలయ పర్వత స్రేణుల మీదే. పర్వతాధిరోహణ క్షేత్రంలో ఏ ప్రాధమిక శిక్షణ లేకండానే, తన సొంత ఊహతో, క్రమ శిక్షణతో నైపుణ్యం సంపాయిస్తూ వచ్చారు. వారి అభిరుచే వారికి ప్రేరణ అని ఒక్క మాటలో చెప్పవచ్చు. మంచి ఉద్యోగం చేసుకుని జీవించు అని సలహా ఇచ్చారు కొందరు. కాని మనసు పర్వతాల మీదే, లక్షం ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నిటినీ అధిరోహించడం. అనుకున్నది సాధించడానికి ఉపక్రమించారు. యోగా, ప్రాణాయామం, విపాశనా ధ్యానం కూడా నేర్చుకున్నారు. ఇవి కూడా లక్ష్య సిద్ధికి మంచిగా ఉపకరించాయి.

2006 లో, పర్వతమంత తన లక్ష్యం సాధించారు. 172 రోజులలో ప్రపంచంలో అతి శ్రేష్టమైన ఏడు శిఖరాలు అదిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాదించాడు. ఈ ఘన విజయంతో చరిత్ర పుటలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.

అధిరోహించిన ఏడు శిఖరాలు:

- మౌంట్ అకోంకాగ్వూఅ, దక్షిణ అమెరికా
- డెనాలి పర్వతం
- ఎల్బ్రస్
- కిలిమంజారో
- కొస్కీగుఒజ్కో
- మౌంట్ అవరెస్ట్ (హిమాలయాలు)
- విన్సన్ మాసిఫ్
- కార్స్టెంజ్

మొరో విశేష ఏమిటంటే ఆది, సోమ, మంగళ, బుద, గురు, శుక్ర, శని వారాలలో ఈ ఏడు శిఖరాల అధిరోహణ పూర్తి చేశారు. అది మస్తాన్ బాబు గారి కోరిక!. అన్ని రోజులు మంచివేగా మరి!.

అవార్డులు, పురస్కారాలు:

- ది ప్రైడ్ ఆఫ్ ఇండియా పురస్కారం గ్రహించారు. ఇది అక్షరాల నిజమైంది. ఆయన భారత దేశ కీర్తిపతాకం ఎగురవేశారు. అందుకనే ఆయన్ని చూసి అందరూ గర్వించవచ్చు.

- కొంజీ రుస్తంజీ కొహౌ జీ అవార్డు

- సార్క్ నేష్నల్ సెవన్ సమ్మిటీర్ పురస్కారం

- సిలికాంధ్ర కూడ ఈ తెలుగు జాతి మల్లి ని గౌరవించింది.

"చిన్న ఊరు లో పుట్టినా చాలా మంచి పేరు తెచ్చాడు" అని ఆయన తల్లి మురిసిపోయింది.

మార్చ్ 24, 2015 నాడు ఆర్జెంటినా, చిలీ దేశాల సరిహద్ధున ఉన్న ఆండీస్ సిరోస్ పర్వతాధిరోహణకు ఉపక్రమించారు. హెలికాఫ్టర్ బేస్ క్యాంప్ వద్ధ దించి వెళ్ళిపోయింది. ఆండీస్ పర్వత శ్రేణుల ట్రెస్ క్రురెస్ సర్ శిఖరం అధిరోహించారు. వెనుదిరిగి వస్తూండగా, వర్షం, వరద రావటంతో ఉపద్రవం సంభవించింది; సంక్లిష్ట వాతావరణ పరిస్థితుల వల్ల, ప్రకృతి వైపరిత్యం వల్ల, అక్కడే, తాను మిన్నగా అభిమాంచే ఆ హిమవత్ శ్రేణుల మంచుపాతంలో కూరుకుని, ప్రకృతి ఒడిలోకి జారిపోయారు. రెండు మూడు రోజుల ముమ్మర హెలికాఫ్టర్ గాలింపు చర్యల వల్ల వారి పార్ధివ దేహాన్ని కనుగొని, భారత, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం ద్వారా భారత దేశానికి తీసుకొచ్చి, రాష్ట్ర లాంచనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.

చిరు ప్రాయమైన నలబై ఏళ్ళకే ఆయనకు వందేళ్ళూ నిండుకున్నాయి. ఎన్నేళ్ళు ఉన్నామన్నది కాదు - ఎలా ఉన్నామన్నది ముఖ్యం. మల్లి మస్తాన్ బాబు ధన్య జీవి. తాను నమ్ముకున్న విద్యనే కొలిచారు. అదే పరమావధిగా భావించారు. తన జీవితం దానికోసమే వెచ్చించారు. అనేక శిఖర విజయాలు సాధించి, ఆఖరికి ప్రకృతి సౌందర్యమైన ఆ హిమ శ్రేణులలోనే ఓడిపోయారు.

మల్లి మస్తాన్ బాబు ఇక లేరు, కాని ఆయన సాధించిన " మస్త్ " విజయాలు భావి తరాలకు స్పూర్తిదాయకం. ప్రపంచంలో ‘అత్యంత వేగ శిఖరాగ్రుడు’ ఈయన. "ది ప్రైడ్ ఆఫ్ ఇండియా" అవార్డుకి తగ్గటుగానే ఆయన నిజంగా "ప్రైడ్ ఆఫ్ ఇండియా". మరెవరూ సాధించలేని శిఖరాలను అధిరోహించిన ఘనత వీరిదే మరి!.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)