సాయంకాల సమయం. సుబ్బారావు పడక్కుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. కొడుకు వస్తే సమాధానం ఏమి చెప్పాలా అని. అసలు జరిగిందేమిటంటే తనకు తెలిసిన వ్యక్తి రాజయ్య కొడుకు రవికి అత్యవసరం పదిరోజుల్లో ఇచ్చేస్తామని అంటే వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అదీ తను చేసిన తప్పు. ఎందుకంటే నెల దాటినా ఆ డబ్బు తిరిగి చేతికి రాలేదు. మరికొంచెం సేపట్లో కొడుకు రాజేష్ కాలేజి నుంచి వస్తాడు నిన్న చేసినట్టే ఈ రోజు కూడా రభస చేస్తాడు.
అరగంట గడిచింది. ఇంతలో రాజేష్ రానే వచ్చాడు. వస్తూనే మొదలైంది సంభాషణ.
‘ఏం డాడీ! రవి ఈ రోజయినా డబ్బు ఇచ్చాడా?’అడిగాడు రాజేష్.
‘ఏం. చేయాలిరా..అతను ఈ వేళ దొరకనే లేదు’. రేపు ఎలాగైనా పట్టుకుంటాలే! అన్నాడు సుబ్బారావు.
మీకు ముందే చెప్పాను. డాడీ..వాడికి ఇవ్వద్దని..తర్వాత అయినా రశీదు రాయించి తీసుకోమన్నాను మిమ్మల్ని..చిరుకోపంతో అన్నాడు రాజేష్.
‘ఆ అబ్బాయి మొఖం చూశేమిట్రా ఇచ్చింది..? ఎప్పట్నుంచో తెలిసినవాడు వాళ్ళ నాన్న. అతని మొఖం చూసి ఇచ్చాను..మరి అతనేమో ఊరెళ్ళి ఇంకా రాలేదు..’
‘మనం ప్రోనోటు రాయించి తీసుకుంటే ఎవర్నీ అడగనవసరం లేదు. మనం చేసేది చేసుకోవచ్చు. ’
‘అంటే.. మనిషి అవసరం మనిషికి ఎప్పుడూ ఉండదంటావా? మనిషి మనసున్న మనిషిగా కాక ఒక ‘వస్తువు’గా మారి మరో వస్తువును మధ్యవర్తిగా పెట్టుకోవాలంటావురా?’ చిరాకు ఎక్కువైంది సుబ్బారావుకు.
‘మనిషి మనసు - వస్తువు. ఇవన్నీ ఏమిటి డాడీ?..నీవి అన్నీ చాదస్తపు మాటలు’
‘..చాదస్తం.. కాదురా అబ్బాయ్..! మనిషన్న తర్వాత ఒకరిమీద ఒకరికి నమ్మకం ఉండాలిరా. నమ్మకం ఉండలి...అది లేకపోతే బ్రతకటం చాలా కష్టం. .. కాకపోయినా ఇప్పుడేమయిపోయిందని..?’
‘మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు డాడీ!..నమ్మకం..నిజాయితీ అని అంటున్నారు.. ఈ రోజుల్లో ఎవరు పాటిస్తున్నారు అవన్నీ..? అసలు ఇప్పుడు సైన్స్ ఎంత అభివృధ్ది చెందిందో ఒక్కసారి చూడండి..టీ.వీ.లు ..వీడియోలు.. కంప్యూటర్లు - రాకెట్లు .. మనం ఎంత ముందుకు పోతున్నామో చూడండి..
ఇదివరకు రేడియోలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు టెలివిజన్లు వచ్చాయి. శాటిలైట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నా ప్రత్యక్షంగా చూడగల్గుతున్నాం.. ఊరూరా స్టార్ టీవీలు ఎలా అల్లుకుపోయాయో చూడండి.. ఇదివరకు స్కూలు, కాలేజీల్లో సర్టిఫికెట్లు చేత్తో రాసి సంవత్సరాల తర్వాత ఇచ్చేవారు. ఇప్పుడు హాల్ టికెట్లతో సహా సర్టిఫీకెట్లన్నీ కంప్యూటర్ల మీద క్షణాల్లో తయారయి వస్తున్నాయి. మామూలు షాపులు మొదలుకొని ఫ్యాక్టరీల దాకా కంప్యూటర్ మీద పని నడుస్తోంది..
..పట్నం నుంచి ఒక గ్రామానికి సమాచారం అందించాలంటే అప్పుడు రోజులు పట్టేవి. ఇప్పుడు ఊరూరా, అడుగడుక్కీ, ఎస్.టి.డి., ఐ.ఎస్.డి. టెలిఫోన్లు ..కొద్ది నిముషాల్లోనే ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నవాళ్ళతోనయినా మాట్లాడగలుగుతున్నాం...
అసలు ఇది కంప్యూటర్ యుగం డాడీ! ఇంకో విషయం చెప్పనా? ఎవరికైనా లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించాలంటే మధ్యవర్తి, ఉద్యోగార్ధి ఇద్దరూ కలిసి ‘ఆ సొమ్మును జాయింట్ ఎకౌంట్ లో వేసుకుంటున్నారు....బజారులో ఏది కొన్నా దానికి రశీదు ఇస్తున్నారు. ...ఇంకా...’అనర్గళంగా చెప్పుకుపోతున్నాడు రాజేష్.
సుబ్బారావుకి విసుగనిపించింది.
‘చాలురా అబ్బాయి! చాలు..ఎక్కువ విషయాలే చెప్పావు...రెండు మూడు రోజుల్లో ఆ డబ్బు ఎలా అయినా రాబట్టుకు వస్తాను. నువ్వేమీ భయపడకు..’ అన్నాడు ధీమాగా.
‘భయమా.? నాకు భయమేమిటి.? ముందు రవిగాడు ఎక్కడున్నా పట్టుకుని వాడిచేత నోటు రాయించి తీసుకొస్తాను’..అన్నాడు రాజేష్ పట్టువదలని విక్రమార్కుడిలా.
‘ఆ సర్లే..! అలాగే చేద్దువుగానీ..వెళ్ళి కాఫీ తాగు’ అన్నాడు సుబ్బారావు. ఆ అనటంలోనే ఉద్ధరించావులే అన్న భావం కొంతలో కొంత వ్యక్తమయ్యింది.
రాజేష్ బాత్ రూం వెళ్ళి ముఖం..కాళ్ళు కడుక్కుని వచ్చి ఈజీ ఛైర్ లో కూర్చున్నాడు. ఆ రోజు చదువుతున్న క్రికెట్ మ్యాచ్ గురించీ.. ఇండియా స్కోరు గురించి తమ్ముణ్ణి అడిగి తెలుసుకున్నాడు. టి.వి. ఆన్ చేసి మ్యాచ్ చూడసాగారు. ఇంతలో తల్లి కఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది. కాఫీ తాగుతూ, టీ.వీ చూస్తూ ఆ రోజు దినపత్రిక పేజీలు తిరగేస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఆ నెల ఇవ్వాల్సిన ఇంటి అద్దె సంగతి గుర్తుకువచ్చింది..
‘ఇంటి వోనరు వద్దకెళ్ళి ఈ నెల అద్దె పైసలు ఇచ్చివస్తాను’ అని చెప్పి డబ్బు జేబులో పెట్టుకుని బయల్దేరాడు.. రెండు సందులు దాటి ఒక అపార్ట్ మెంట్ వద్దకెళ్ళాడు. కాలింగ్ బెల్ నొక్కితే వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా కిరణ్.
‘హలో రాజేష్ గారు’..అన్నాడు అతను.
‘హలో సార్! అంటూ లోపలికి అడుగుపెట్టాడు.
‘ఏం సార్? బావున్నారా? కుశల ప్రశ్న వేశాడు కిరణ్
‘ఫైన్..ఇప్పుడే వచ్చారా? అడిగాడు రాజేష్.
‘అవున్సార్..! ఆఫీసు నుంచి ఇప్పుడే వచ్చా..కూర్చోండి..’ అని కిరణ్ కుర్చీ చూపించాడు..
‘ఈ నెల రెంట్..’అంటే నోట్లకట్ట టేబుల్ పై పెట్టి కుర్చీలో కూర్చున్నాడు.
‘ధాంక్యూ..’ అని కిరణ్ ఆ కట్ట తీసుకుని నోట్లు లెక్కపెట్టుకున్నాడు.
‘ఓకే..సరిపోయాయి..’ అని చెప్పి వాటిని తీసుకెళ్ళి గోడ్రేజ్ బీరువాలో పెట్టివచ్చాడు.
ఫ్రిజ్ లోనుంచి గ్లాసుతో ఐస్ వాటర్ తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. గ్లాసు అందుకొని గటగటా తాగేశాడు రాజేష్. ఇంతలో కిరణ్ రశీదు వ్రాసి తీసుకొచ్చాడు. సంతకం చేసి దానిని రాజేష్ చేతిలో పెట్టాడు.
‘ధాంక్యూ సార్’ - అని చెప్పి ఇంటికి నడిచాడు రాజేష్.
రాజేష్ ఇంటికి వెళ్ళేటప్పటికి సుబ్బారాబు ముందుగదిలో కూర్చుని వీధివైపే చూస్తున్నాడు. తనయుడు ఇప్పుడు మాటలు ఎలా చెబుతాడా, విందామా అన్న ఆశక్తిగా ఉంది అతనికి.
‘రిసీట్ ఇదిగో డాడీ! మనం డబ్బులు ఇచ్చినట్టుగా రశీదు...తర్వాత ఎప్పుడయినా మనం వాళ్ళకి డబ్బు ఇవ్వలేదని అనలేరు. అర్ధమయిందా?.. అన్నాడు రాజేష్ ఉపదేశం బోధిస్తున్నట్లు..’
‘అర్ధమయిందిరా..నువ్వు చేసే పనులన్నీ అర్ధమయినయి..నీకో సంగతి తెల్సా?
‘ఆ ఇంట్లో చాలాకాలం నుంచి మనం అద్దెకుంటున్నాం...కిరణ్ వాళ్ళ నాన్న బ్రతికున్న రోజుల్లో ఇలాంటి రశీదులూ గిసీదులూ..సంతకాలూ..చట్టబండలూ ఏమీ ఉండేవి కావు. కేవలం పరస్పర అవగాహన, నమ్మకంతో ఉండేవాళ్ళం...అందుకే అద్దె డబ్బులు ఇవ్వడం ఆలస్యమైనా, ఇబ్బందివల్ల ఒకోసారి తక్కువ ఇచ్చినా లెక్కలో పైసా తేడా వచ్చేదికాదు, అనుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఇంటి అద్దె ప్రతి అర్నెల్లకీ, సంవత్సరానికీ పెంచుతున్నాడు. ఇష్టమయితే ఉండండి, లేకుంటే ఖాళీ చేశి పొండి’ అని అంటున్నారు నిర్మొహమాటంగా. మరి అతడు అద్దె పెంచాలంటే మన పరిస్థితిని చూసి, ఆలోచించి పెంచేవారు. మన కుటుంబం వారి కుటుంబం బంధువుల్లా కలిసి ఉండేవాళ్ళం. ఇది అర్ధమయిందా నీకు? మాటల్ని కొట్టేలా అన్నాడు సుబ్బారావు.
‘మీరు భలే మాట్లాడతారు డాడీ..! నేనొకటి చెప్తే మీరొకటి అంటారు..ఈ రసీదులకి చాలా వేల్యూ ఉంటుంది డాడీ! ఇవే మనకి ఆధారం.. రవికిచ్చిన వెయ్యి రూపాయలు మనకు అంత ఈజీగా రావు..మీరు చూస్తుండండి రవి ఎక్కడున్నా సరే ‘ప్రామిసరీ నోటు’ రాయించుకుని తీసుకొస్తాను. అన్నాడు ఖండితంగా.
ఇంక కొడుకుతో వాదించడం అనవసరమని భావించిన సుబ్బారావు ఊరుకున్నాడు. పొద్దు పోయింది. భోజనాలు చేసి పడుకున్నారు.
మర్నాడు ఉదయమే రాజేష్ టిఫిన్ చేసి బయల్దేరాడు. ముందుగా రవి ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో రవిలేడు కాని, తల్లి ఉంది.
‘రవి లేడాండీ..! అడిగాడు రాజేష్.
‘లేడు బాబూ..ఎక్కడికో పనుందని వెళ్ళాడు..’ సమాధాన మిచ్చింది ఆమె.
రాజేష్ కి నిరాశ కలిగింది.
‘రవి డాడి కూడా లేరా?" అన్నాడు మళ్ళీ
‘లేరు.. మొన్న రెండు రోజుల క్రితం ఊరెళ్ళారు. . ఇంకా రాలేదు. మలేరియా జ్వరంతో బాధపడ్తున్నారు. వద్దని చెప్పినా వినకుండా ఊరెళ్ళారు. ఎలా ఉందో..!’ అంది ఆందోళనగా., ఆ మాటలు విన్న రాజేష్ కి పిడుగ్ మీద పడినట్టనిపించింది. కొన్ని క్షణాలు అవాక్కయ్యాడు.
‘మలేరియా జ్వరంతో వెళ్ళినవాడు ఇంకా రాలేదా?...జరగరానిది ఏదయినా జరిగుంటే..? తన డబ్బులు..’ ఒక్కసారిగా భయం పుట్టుకొచ్చింది రాజేష్ కి.
ఇప్పుడిక ఒక్కటే మార్గం...రవిగాణ్ణి పట్టుకోవాలి. అనుకున్నాడు మనసులో. నిట్టూర్చి, భారంగా అక్కడనుంచి కదిలాడు.
చౌరాస్తాలో ఉన్న హోటల్ వద్దకు వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చుట్టూరా కలియజూశాడు ఆదుర్దాగా. ఎక్కడా అతని ముఖం కనపడలేదు. బయటకొచ్చి బస్ స్టాప్ వేపు నడిచాడు. కొద్ది నిముషాలు అక్కడే నిలబడ్డాడు. స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళే సమయమది. రవి ఉమెన్స్ కాలేజి వద్ద ఉండవచ్చని తోచింది. వెంటనే ఒక ఆటోని పిల్చి ఎక్కి కూర్చుని కాలేజీకి పోనివ్వమన్నాడు.
సందులూ, గొందులూ, ట్రాఫిక్కూ, అన్నీ దాటుకుని ఆటో ఉమెన్స్ కాలేజీ చేరుకునేటప్పటికి గంట పట్టింది. ఆటోదిగి, కాలేజీ ఆవరణలోకి వెళ్ళాడు. రవి కనబడాలని రెండు కళ్ళని నాలుగు కళ్ళు చేసుకుని అంతా కలయజూసి, మరో గేటుగుండా బయటకు వచ్చాడు.
‘అయిపోయింది వీడు కూడా కనబడ్డం లేదు. ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇంతే సంగతులు..’ గొణుక్కున్నాడు..కొంత సేపు అక్కడే నిలబడిపోయాడు ఏమీ పాలుపోలేదు.
ఎండ ఎక్కువగా ఉండడం వల్ల చమటలు పట్టి నీరసం వచ్చింది. దగ్గర్లో టీ స్టాల్ కి వెళ్ళి రెండు గ్లాసుల నీళ్ళు తాగాడు. టీకి ఆర్డరిచ్చి రోడ్డువేపు చూస్తూ కూర్చున్నాడు. టీ వచ్చింది. టీ చప్పరిస్తూ ఆలోచిస్తున్నాడు.
‘మనిషికి కొన్ని చెడు అలవాట్లు ఉన్నా, కొన్ని విషయాల్లో ఒక పద్ధతిలో మనిషిలాగే కనపడతాడు రవి. ఈ రోజు ఎలాగైనా వాణ్ణి పట్టుకొని ప్రోనోటు రాయించుకోవాలి - అని దృడంగా నిశ్చయించుకున్నాడు మనసులో.
రోడ్డుమీదకొచ్చి ఆ షాపూ, ఈ షాపూ, హోటళ్ళూ, సినిమా హాళ్ళూ చూసుకుని నెమ్మదిగా మళ్ళీ చౌరాస్తాకి చేరుకున్నాడు. ఆత్రంగా హోటల్లో దూరాడు. అన్ని కుర్చీలు లెక్కపెట్టినట్టు గానే చూశాడు అంతా. ఎక్కడా రవి జాడలేదు. సరికదా కనీసం అతని మొఖం కూడా కనపడలేదు రాజేష్ కి.
‘అయిపోయింది.. ఈ ఆశ కూడా తీరిపోయింది...ఇంక డబ్బుల్ను వదులుకోవాల్సిందే..‘ డాడీ తను చెప్పిన మాట వింటే కదా?!’ తనలే తనే గొణుక్కున్నాడు. తిట్టుకున్నాడు రవిని. అతని తండ్రిని కూడా తనకు ఇంగ్లీషులో తెలిసిన తిట్లన్నీ తిట్టాడు. కడుపు ఆకలి కరకరమంటూంటే రెండు సమోసాలు కొనుక్కుని కసితీరా తిన్నాడు. నోటు కాగితాన్ని భద్రంగా జేబులోనే ఉంచుకుని, రిక్షా ఎక్కి తిరుగుముఖం పట్టాడు. ఉసూరుమంటూ ఇంటికి చేరేటప్పటికి సాయంకాలమయింది.
సుబ్బారాబు ఆరుబయట కూర్చుని పేపరు చదువుతున్నాడు. తండ్రిని చూసి రాజేష్ కి కోపం ఎక్కువయింది.
‘నేను అన్నట్టుగానే అయింది.. మన డబ్బు పని అయిపోయింది. అది ఇక రాదు. ఏమయిపోయాడో మలేరియా జ్వరంతో ఊరెళ్ళిన రవి డాడీ రాలేదు. రవి అసలు దొరకనేలేదు...నేను మీకు ముందే చెప్పాను’. అన్నాడు ఆవేశంగా.
దాంతో సుబ్బారావు ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. ‘ఓహో.. అలాగా" అని రాజేష్ వంక చూసి. ఇంతలో సైకిల్ చప్పుడయితే బయటకు చూశాడు రాజేష్.
‘అరే! రవి వస్తున్నాడు..’ అన్నాడు ఆనందంతో..
‘నువ్వు మా ఇంటికి వచ్చావట గదా! మా అమ్మ చెప్పింది’ అంటూ రవి సైకిల్ స్టాండు వేసి వచ్చాడు. రాజేష్ కి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. ‘నీకోసం చాలా వెదికా’ అన్నాడు నవ్వుతూ. జేబులోంచి కాగితం తీసి, రవి చేతిలో పెట్టాడు. అతనూ క్షణాలపాటు దాన్ని తీక్షణంగా చూసి, పెన్నుతో రెండు గీతలు గీసేసి రాజేష్ కిచ్చాడు.
‘ఇదిగోండి డాడీ..! రాజేష్ ప్రోనోట్ ను తండ్రి చేతుల్లో పెట్టి తృప్తిగా.. ఊపిరి పీల్చుకున్నాడు. గొప్ప కార్యం సాధించానన్న భావం కలిగింది అతనిలో.
ఉన్నట్టుండి సుబ్బారావు లోపలికెళ్ళి తిరిగొచ్చాడు. అతని చేతిలో నోట్లకట్ట! రాజేష్ ఆశ్చర్యపోయాడు.
‘మనం వాళ్ళకిచ్చిన వెయ్యిరూపాయలు ఇవి! .. ఎవరిచ్చారనుకుంటున్నావ్?... అతని తండ్రి రాజయ్య..! ! అన్నాడు సుబ్బారావు కొడుకు నుద్దేశించి.
రాజేష్ మరింత ఆశ్చర్యపోతూండగా, సుబ్బారావు మరల చెప్పటం ఆరంభించాడు..మలేరియా జ్వరంతో ఊరెళ్ళీన రాజయ్య ఏమీ అయిపోలేదు...మనకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయల కోసమే పక్క ఊరు వెళ్ళాడు. అక్కడ పంటకు సంబంధించిన డబ్బు రావాల్సి ఉందట.. ఇక్కణ్నుంచి వెళ్ళేటప్పటికి మలేరియా జ్వరమట. తీరా అక్కడికి వెళ్ళాక ఇవ్వాల్సిన వ్యక్తి దొరకలేదట.
ఆరోజు, మళ్ళీ మర్నాడు, అక్కడే ఉండిపోవల్సి వచ్చింది. రెండోజుల్లో విపరీతమైన జ్వరంతో, తెల్లవార్లూ నిద్రలేకుండా బాధపడ్డాడట. మూడో రోజున అంటే ఈరోజు ఆ అసామి వచ్చాక, డబ్బు తీసుకుని మిట్టమధ్యాహ్నం బయల్దేరాడట. ..తిరిగి వాళ్ళింటికి కూడా వెళ్ళకుండా, డబ్బు పట్టుకుని నేరుగా మన ఇంటికే వచ్చాడు!
ఊపిరి బిగపట్టుకుని వింటున్న రాజేష్ ఇంకా తేరుకోనేలేదు.
‘...రాజయ్య నీరసంగా ఉంటే గదిలో ఫ్యాను కింద పడుకోబెట్టాను.’ అని లోపలికెళ్ళి రాజయ్యను రెక్కపట్టుకుని తీసుకొచ్చాడు సుబ్బారావు.
ఇప్పుడు రాజేష్ మరింత సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు. అతనిలో ఉలుకూ, పలుకూ లేదు. రవి అయితే చోద్యం చూస్తున్నట్లుగా ఉండిపోయాడు. అర్ధంకాక.
‘..నోటిమాట సరిగా ఉంటే ఈ నోట్లూ రశీదులతో పనిలేదురా..! మనిషి మీద నమ్మకం, సాటి మనిషిలో నిజాయితీ, మాటమీద నిలకడ ఉన్నంతకాలం ఈ కాగితపు లెక్కల అవసరం ఉండదురా... మనం వైజ్ఞానికంగా ఎంత అభివృద్ధి చెందినా నైతిక విలువలు తగ్గనంతకాలం మనిషి మనసున్న మనిషిగానే బ్రతుకుతాడు తప్ప ఓ కాగితపు ముక్కగానో, ఓ వస్తువుగానో, ఓ జంతువుగానో ఉండలేడు..ఏమంటావ్? అంటూ సూటిగా చూశాడు సుబ్బారావు రాజేష్ ముఖంలోకి..
తండ్రి మాటల్లో తనకు తెలియని ఏదో భావం, కొత్త అర్ధం స్ఫురించినట్లుగా అనిపించి రాజేష్ కి.
‘సారీ డాడీ!’ అన్నాడు అప్రయత్నంగా..