పసుపు రంగుతో మిస మిస మెరిసి పోతూ వింత సుగంధాలను వెదజల్లే అందమైన అడవి పువ్వులు ఈ రేలపూలు. అలాంటి రేలపూలతో పోలుస్తూ తను ఉపాధ్యాయురాలిగా పనిచేసే పరిసర ప్రాంతాల లోని తండావాసుల జీవితాలని తనకు తెలిసినంత మేరకు ఒక్క చోట గుది గుచ్చి కధా మాలికలుగా అల్లింది రచయత్రి శ్రీమతి సమ్మెట ఉమాదేవి.
“తండావాసుల జీవితాలని దగ్గరనుంచి చూసాను. అలా నేను చూసినవి,తెలుసుకున్నవి నలుగురికీ చేరాలన్న తపనతో రాసాను. ఈ కధలన్నీ కూడా నాకు అనువైన విధంగా మలచాను” అని అన్నారు రచయిత్రి తన మాటలలో..
ఇక రచయిత్రి ఎంచుకున్న ఈ కధలకి ఒక ప్రత్యేకత ఉంది. కధలన్నీ కూడా తండావాసుల మాట్లాడుకునే యాస, మాండలికం తోనే రాసారు. ఈ విషయంలో ఆమెని చాలా మంది అడిగారుట. మీరు రాసిన కధలు, వాళ్ళు చదవలేనప్పుడు ఎందుకు మీరు ఇంత శ్రమపడటం అన్నప్పుడు ఆమె ఒకటే అన్నారుట. వాళ్ళ జీవితాలని అక్షరబద్ధం చేయగలడం,భావితరాల వాళ్ళకి అందించడం ఒక రచయత్రిగా నా ధర్మం అని చెప్పారు.
ఇక ఈ కధల గురుంచి ముందు మాట రాసిన భువనచంద్ర గారి ఒక్క వాక్యం చాలు. ఈ కధలు మనలని మరో ప్రపంచం లోకి తీసుకెళ్ళడానికి “ బాషకి శ్వాస యాస. ఆ మాట ఈ రేలపూల కధ ల ద్వారా మరోసారి ఋజువైంది”.
ప్రముఖ కవయిత్రి మరియు రచయిత్రి శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు “ ఇది ఒక అరుదైన కథాంశాల అద్భుత కధనం” అని తన ముందు మాటలో కధలను విశ్లేషిస్తూ ప్రశంసించారు.
ఇక కధలలోకి వెళితే ఈ సంపుటి లో మొత్తం పది హేడు కధలు ఉన్నాయి. ఒక్కొక్క కధ ఒక్కో రకమైన జీవితాలకి ప్రతీకలు. కాసేపు మనం కూడా ఆ తండా వాసుల ప్రపంచం లోకి వెళదాము వాళ్ళ గుండె చప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అస్థిత్వం కధలో తండావాసుల కోసం నడుపుతున్న స్కూల్ లో వాళ్ళ ఆచారవ్యవహారాలు, వాళ్ళు పండగలు గురుంచిన విషయాలతో పాటు వాళ్ళు పేర్లు ఎందుకు మార్చుకుంటారో చేర్యా అనే సారు (అతను కూడా తండావాసే) చెబుతాడు. వాళ్ళకి మాములుగా అందరి పేర్ల లాగానే ఉండాలి అనిపిస్తుంది. అందుకని స్కూల్ లో కొచ్చాక, అమ్రు, సాల్కి, సక్రు, రామ్ నాయక్ పేర్లను, అనూష, శైలజ, పవన్ కళ్యాణ్ , మహేష్, హరీష్ పేర్లగా మార్చుకుంటారు. అలా ఎందుకు మార్చుకోవడం, అని వేరే సారు అడిగితే చేర్యా సారుకి కి కోపం వస్తుంది. ఆ పేర్లు మేము పెట్టుకో కూడదా? మీరే పెట్టుకోవాలా? మేము మీ లాంటి వాళ్ళమే అని కోపంగా అంటాడు? దానికి మాధవ్ అనే సారు అది కాదు చేర్యా లా మార్చు కోవడం వల్ల మీ ఉనికికే ముప్పు అని అన్నాను. అంటాడు. కొన్ని చేదు సంఘటనల మూలంగా చేర్యా కు అర్థమవుతుంది. పేర్లు మార్చు కోవడం వల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారో? ఈ పేర్ల మార్పిడి వల్ల ప్రభుత్వం ఇచ్చే పధకాలు వీళ్ళకి అందటం లేదు. మేము మీలాంటి మనుషులమే అనుకున్న వాళ్ళకి తమ మార్చు కొన్న పేర్ల వల్ల తమ అస్థిత్వమే పోతోందన్న ఆవేదనని చక్కగా చూపారు. అదే విధంగా వాళ్ళ పండగల తీజ్, దాటోడి ల గురుంచి వివరంగా చెప్పారు రచయిత్రి.
అమ్రు బలహీన వర్గానికి చెందిన యువతి తన ఆఫీసులో పడే అవమానాలను ఎంతో నేర్పుగా ధైర్యంగా, ఎదుర్కొని తనదైన ఆత్మస్థైర్యంతో, హుందాగా నిలబడుతుంది ఈ కధ చదువుతున్నంత సే పు కళ్ళ చెమరుస్తాయి.
బిజిలి తండా ప్రజలకి కరెంట్ ఉండదా? అయ్యో వాళ్ళు ఎలా ఉంటారు? ఇవన్నీ మన మది లో మెదిలే ప్రశ్నలు. వాస్తవం లోకి వస్తే చాలా గ్రామాలలో, తండాలలో ఇంకా ఇప్పటి కి విద్యుత్తు రాలేదు.ఆ నేపధ్యంలో సాగిన కధ సాల్కి అనే పాప అక్కడ తండా స్కూల్ లో చదువుకుంటూ ఉంటుంది.కంప్యూటర్ కూడా నేర్చుకుంటుంది. ఉన్నట్టుండి కంప్యూటర్లు పని చేయడం మానేస్తాయి. కారణం అక్కడ విద్యుతు లేకపోవడం. కొంతకాలానికి అక్కడ ఉండే పొలానికి నీటి కోసం విద్యుత్త్ కనెక్షన్ ఇచ్చుకుంటారు. పగలంతా అదే పొలం లో పని చేసే కొంత మంది. దొంగతనంగా ఇళ్ళకి కనెక్షన్ ఇచ్చుకుంటారు. అలాంటి పరిస్థితులలో ఒక రోజున సాల్కి కరెంటు వాళ్ళు వస్తున్నారు అనుకుంటూ కనెక్షన్ వైర్లు తీసే ప్రయత్నం లో కరెంటు షాకు కొట్టి పక్కనే ఉన్న గడ్డపారమీద పది ఒక కంటి చూపు పోగొట్టుకుంటుంది.
గిరికాన దీపం తన భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి పంచాయతికి వెళుతుంది. కారణం తను ఏదైతే సాధించాలి అని ఆశపడుతుందో, ఏవేవో తండాకోసం చేయాలనీ తపన పడుతుంది. కాని అవేమి జరగవు భర్త నుంచి ఎటువంటి సహకారం అందదని తెలిసి పెద్దలకి చెబుతుంది అతను మగవాడే కానీ మనవాడు కాదు . ఆమె సంఘర్షణని చాలా బాగా చూపారు.
చాంది అందరూ మెచ్చే నిర్ణయం తీసుకున్న చాంది చాలా తెలివిగలపిల్ల. పాల బుగ్గలా చిన్ని రైతు దేవ్లా" చదువుకోసం మనసు ఆరాట పడ్డ వెళ్ళలేని పరిస్థితిని తలచుకొని దేవ్లా పడే ఆవేదన దివిలి ఈ కధలో దివిలి తను పుట్టి పెరిగిన ప్రదేశం లోని ప్రకృతి అంటే ఎంతో పరవశం పడుతూఉంటుంది. తావురయా “సొంత చేలో పండిన పంటలా కంకులన్నీ కోసుకు తిని వెళుతున్న దొర తాలుకు వాళ్ళను తావురయాకు కోతులు తింటుంటే అవి వాటి కడుపుకు తింటున్నయ్ గని కార్లల్ల ఏస్కపొతున్నయా వాట్ని కొట్టద్దు అనే తావుర్యా.... దొర సుట్టాలు తన చేలో కంకులు తిన్నదే కాక కార్లలో వేసుకు పొయినప్పుడు ఏం చేయ గలిగాడు...... అతని మనసు నిర్వేదంతో అనే మాటలు అల్యా. అడవి లో ఆ గిరిజన జంట ప్రకృతి తో మమేకమై ప్రేమ తన్మయత్వంతో మునిగి పోయి మనసుకి గిలిగింతలు పెట్టె ప్రణయ కధ
చీనాతండా వాసుల ప్రేమ కధ, భార్య భర్తల మధ్య ప్రేమ, పంతం, ఘర్షణ చాలా కమ్మగా సాఫీగా సాగి పోతుంది.
వాన ఈ కధ లో తండాకు బడికి మధ్య ఉన్న వాగు వానవల్ల పొగి పోర్లుతోంది .స్కూల్ పిల్లలు భయంతో బిక్కి బిక్కు మణి ఉండగా సోమ్లా మానవత్వం తో తన తండాకి తీసుకు వస్తే. తమ వారే వ్యతిరేకించడం సోమ్లకి బాధని కలిగిస్తుంది. తండాల్లో కూడా వర్ణవివక్షని గుర్తించిన రచయిత్రి ఈ అంశాన్ని కూడా చూపడం ముదావహం. కమ్లి, హధిరాం, వారధి, జైగణేశా, ఆశలు, కేస్లా ఇలా ఎక్కడో కొండ ప్రాంతాలలో ఉన్న గిరిజన తండాల జీవన విధానాన్ని ఎన్నోకధలని వాళ్ళ నవ్వులని,బాధలని ,ఆవేదన ని ఒకటేంటి వాళ్ళ సజీవజీవిత చిత్రాన్నే మన కళ్ళముందుంచారు ఆవిష్కరించారు .
రేల పూలు గుత్తులు గుత్తులు గా తమదైన సుగంధాలను వెదజల్లుతూ అడవిలో పూస్తూనే ఉంటాయి. నేల రాలినప్పుడు దుఃఖించి, విరబూసినప్పుడు నవ్వుతూ ఉండే ఆ పూల లాంటి కల్లా కపటం తెలియని మారు మూల ప్రాంతాలలో నివసించే గిరిజన తండాల జీవితాలు కూడా అడవి కాచిన వెన్నెల కాకూడదన్న రచయిత్రి తాపత్రయాన్ని అభినందిస్తూ, ఈ రేలపూల సౌరభాన్ని (పుస్తకాన్ని) సాహితీ ప్రియులందరూ కూడా ఆస్వాదించాలని అభిలషిస్తూ..ఇంత చక్కటి కథానికలని సిలికానాంధ్ర వారి సుజనిరంజని మాస పత్రిక ద్వారా పరిచయం చెయ్యడం సంతోషంగా ఉంది.