మనిషి జీవించడానికి కావలసిన అతి ముఖ్యమైనది ఏది? అనడిగితే,
కొందరు గాలి అన్నారు.
కొందరు ఆహారం అన్నారు.
మరికొందరు నీళ్ళు అన్నారు.
ఇంకా కొందరు డబ్బు అన్నారు.
ఒక్క సనాతన భారతీయ ఋషి మాత్రం, ‘ధర్మం’ అన్నాడు.
విస్తుపోయింది ప్రపంచం అర్ధంకాక!
గాలి లేకపోతే జీవించడం సాధ్యం కాదు కదా! శ్వాస తీసుకోవడానికి గాలి ఎంతో అవసరం. అది లేకపోతే ప్రాణం నిలబెట్టుకోలేమనేది వారి వివరణ. కానీ ఒక్క భారతీయ ఋషి మాత్రం, మనిషికి శ్వాస తీసుకోవడానికంటే అతి ముఖ్యంగా కావలసింది ధర్మం అన్నారు. ధర్మమును కనుక కాపాడుకోగలిగితే ఆ ధర్మమే కావలసిన గాలి, నీరు మొదలగు వాటన్నిటినీ మనకు అందించగలదు. ఈనాడు మనలో ఎక్కువమంది కొంతైనా సౌకర్యంగా, సుఖంగా, ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి ధర్మమే కారణం. ఇదీ మన ఋషుల భావన, ఆచరణా శక్తి.
చదివితే కొంత సంక్లిష్టంగా ఉంది కదా! అందుకే మరికొంత వివరణ, విపులీకరణ.
పురుషార్థాలలో మొదటిది ధర్మం.
పురుషార్థం అంటే పురుషుడు సాధించవలసిన అర్ధము. పురుషుడు అంటే మానవుడు అని భావం. స్త్రీ, పురుషులిద్దరికీ వర్తిస్తుంది.
అలాగే అర్థము అంటే, ‘అర్థ్యతే సర్వైః మనుష్యైః ప్రార్థ్యతే ఇతి అర్థః’
అంటే సర్వ మానవుల చేత ప్రయత్నము చేత సాధించబడుతున్నవని భావం.
కాబట్టి పురుషార్థములు అంటే మానవులు ప్రయత్నము చేత సాధించవలసిన అర్థములు. పురుషార్థములు విధించబడటం చేతనే మానవ జాతి ఇతర జాతులకంటే ఉన్నతంగా నిలుస్తోంది.
మానవులు ఇతర జాతుల కంటే ఏ విధంగా ఉన్నతులు? మానవ జాతికి మాత్రమే ఎందుకు పురుషార్థాలు విధింపబడినవి?
శ్లో|| ఆహార నిద్రా భయమైధునం చ సామాన్యమేతద్ పశుభిర్నరాణాం|
బుద్ధిర్హి తేషాం అధికో విశేషః బుద్ధ్యా విహీనః పశుభిర్సమానః||
బుద్ధి శక్తి మాత్రమే మానవులను ఇతర జీవుల నుండి వేరు చేస్తుంది. అన్ని జీవులు క్షణికమైన జీవనం సాగిస్తాయి. ఆ క్షణానికి ఉత్పన్నమయ్యే సహజ భావాలననుసరించి ప్రవర్తిస్తాయి. భవిష్యత్తు గురించిన ఎట్టి ఆలోచన వాటికుండదు. ఆకలేస్తే అప్పటికప్పుడు ఆహారాన్ని వెతుక్కుంటాయి. అంతే తప్ప పై పూటకు ఎలా అని దాచుకోవడానికి ప్రయత్నించవు. అలాగే నీడ, నిద్ర, తోడు అన్నీ ఆ క్షణానికే. కారణం వాటికుండేది స్వాభావికమైన, ప్రకృతి సహజమైన ప్రవర్తనే తప్ప బుద్ధిశక్తితో కూడిన యోచన వాటికి లేదు.
అందుకే పురుషార్థాలు జంతువులకు విధింపబడలేదు!
పురుషార్థాలు నాలుగు - ధర్మము, అర్థము, కామము, మోక్షము.
ధర్మము అంటే దేవుడో, భక్తో, ఆధ్యాత్మికతో అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. మరికొంతమంది ధర్మం అనగానే దానం చేయడమనో, డబ్బులివ్వడమనో భావిస్తారు. కానీ నిజానికి ధర్మం అంతే కాదు.
ధర్మం అంటే ఎదుటివారు నీకేమి చేయాలని కోరుకుంటావో, నీవు వారికి అదే చేయటం. మనసు చేత, మాట చేత, ప్రవర్తన చేత పాటించవలసిన సూత్రమిది.
ఎదుటి వ్యక్తి నీతో ఎలా ప్రవర్తించాలని ఆశిస్తావో, నీవు వారితో అలా ప్రవర్తించటం. అదీ ధర్మమంటే. ఇది ఒక కులానికో, మతానికో, జాతికో, దేశానికో పరిమితమైన సూత్రం కాదు. ధర్మం విశ్వాత్మకం.
ఇప్పుడు మనమున్న ఈ పరిస్థితులలో మనిషికి అతి ముఖ్యంగా కావలసింది ధర్మం. ఆధ్యాత్మికత కన్నా అత్యవసరమైనది ధర్మం. ఆధ్యాత్మికత వడ్డించుకున్న ఆహారం ఐతే, ధర్మం ఆ ఆహారం వడ్డించుకోవటానికి ఉండవలసిన విస్తరి వంటిది.
ఇక రెండవ పురుషార్థం అర్థం. అర్థము అంటే వాడుకలో ఉన్న భావం సంపద, డబ్బు అని. కానీ నిజానికి అర్థము అంటే సూక్ష్మంగా ‘ప్రయోజనకరమైనది లేదా ఉపయోగమున్న పని’ అని భావం. ప్రతీ క్షణాన్ని ప్రయోజనాత్మకంగా జీవించడమే అర్థము. ఇప్పుడు ప్రతి మనిషి ప్రయోజకత్వం డబ్బు మీద ఆధారపడి ఉంటోంది. కనుక దానికి అదే అర్ధంగా మారిపోయింది.
ఉదాహరణకు నీకొక కత్తి ఇచ్చారు. దానిని నీవు ఏ విధంగా ఉపయోగిస్తావనే దాని మీద అర్థం ఆధారపడి ఉంటుంది. ఆ కత్తితో పక్క వ్యక్తి గొంతు కోయ తలపెట్టవచ్చు. అదే కత్తితో పళ్ళు, కాయలు కోసుకుని ఆహారం సముపార్జించవచ్చు. ఆ విధంగా ప్రయోజనకరంగా దేనినైనా ఉపయోగించుకోవడమే అర్థము.
ఇకపోతే మూడవ పురుషార్థము కామము. కామమంటే ధర్మబద్ధమైన కోరిక. ధర్మంగా ఉంటూ, అర్థవంతంగా సంపాదించుకొన్నదాన్ని కోరుకోవడమే కామము. ధర్మపథంలో జీవిస్తూ, అర్థవంతంగా తాను సముపార్జించుకొన్న ధనము, కుటుంబము మొదలైనవాటి ద్వారా తన కామాన్ని లేదా కోరికలను సాధించుకోవచ్చు. అట్టి దైహిక వాంఛా తృప్తి కూడా శ్రేయోదాయకమేనని మన ఋషులు ప్రవచించారు. కనుకనే 'ప్రజాయై గృహమేధినాం' - ఉత్తమ సంతానం కోసం లేదా ఉత్తమ సమాజం కొరకే సంసార జీవనం అని కాళిదాస మహాకవి తమ రఘువంశ కావ్యంలో ప్రస్తుతించారు.
ఇవి మూడూ ప్రయత్నపూర్వకంగా సిద్ధించేవి. ధర్మార్థకామములు ప్రేయస్సును చేకూర్చేవిగా ఋషులు అభివర్ణించారు. నాల్గవ పురుషార్థమైన మోక్షాన్ని మాత్రమే శ్రేయస్సు చేకూర్చేదిగా చెప్పారు.
ధర్మబద్ధంగా జీవించి, అర్థవంతంగా సమకూర్చుకుని, వాటితో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవడం ప్రాపంచికమైన శ్రేయస్సును చేకూరుస్తుంది. అదే ప్రేయస్సు.
మోక్షం యత్నం చేత సిద్ధించేది కాదు. తత్త్వ జ్ఞానం సాధించి, ఋషులు చూపిన మార్గం తెలుసుకొని, సరైన జిజ్ఞాసతో సత్యాన్వేషణకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అప్పుడు గురు రూపమైన భగవంతుడు అనుగ్రహించి, వారి కృపతో నాల్గవ పురుషార్థమైన మోక్షమును పొందగలము. ఇదే సాధనంటే.
ఇవీ ప్రతి మానవుడు సాధించవలసిన పురుషార్థములు.