కబుర్లు - సత్యమేవ జయతే
పగలగొట్టే వార్తలు!
- సత్యం మందపాటి

“ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది పన్యాల రంగనాథరావు”

“ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది తిరుమలశెట్టి శ్రీరాములు”

“ఆకాశవాణి. వార్తలు చదువుతున్నది జోళిపాలెం మంగమ్మ”

అలాగే ఈ ఇండియాలో జాతీయ వార్తలు కందుకూరి వీరభద్రరావు, ఏడిద గోపాలరావు చదివేవారు.

ఆనాడు అంటే 1960వ దశాబ్దంలోనూ, 1970వ దశాబ్దంలోనూ (అంటే మేము భారతదేశంలో వుండే రోజుల్లో) ప్రొద్దున్నా సాయంత్రం రేడియోలో తెలుగు వార్తలు వచ్చేవి. ఆమధ్యలో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

అలాగే ఇంగ్లీషులో వార్తలు. మెల్విన్ డిమిల్లో, చక్రపాణి మొదలైన వారు చక్కగా వార్తలు చెప్పేవారు. ఇంకా ఒకావిడ కూడా ఇంగ్లీషులో చాల చక్కగా వార్తలు చెప్పేది. పేరు దేశికా రత్నం అనుకుంటాను. నాకు కాస్త వయసు వచ్చింది కదా, ఆనాడు వార్తలు చెప్పిన ఆవిడ పేరు, ఇంకా కొందరి పేర్లు గుర్తు రావటం లేదు. గూగులమ్మని అడిగినా చెప్పలేక పోయింది. మీలో ఎవరికైనా గుర్తుంటే, దయచేసి చెప్పండి.

తెలుగులో వార్తలు ప్రొద్దున్న ఏడు గంటలకు, సాయంత్రం ఏడు గంటలకు, ఇంగ్లీషులో వార్తలు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేవి. దాదాపు ప్రతివారూ తప్పకుండా వార్తలు వినేవాళ్ళు. స్పష్టమైన తెలుగులోనూ, చక్కటి ఇంగ్లీషులోనూ, మనకా సంఘటనలు ఎంతో కళ్ళకి కట్టినట్టుగా చెప్పేవారు. రేడియో వార్తలు ఆనాటి మన తెలుగు సినిమాలలాగానే ఎంతో బావుండేవి.

ఆ రోజుల్లో శ్రీ ప్రభుత్వం వారి ఆకాశవాణి మాత్రమే వుండేది. ఢిల్లీ నించీ జాతీయ కార్యక్రమాలు, విజయవాడ నించీ ప్రాంతీయ కార్యక్రమాలూ వస్తుండేవి. టీవీలు కూడా అరవైలలో లేవు. డెభైలలో టీవీలు ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, కలకత్తాలలో మాత్రమే వుండేవి. అవీ తెలుపూ, నలుపులలో మాత్రమే. మేము భారతదేశంలో వున్న రోజుల్లో మాకుగానీ, తిరువనంతపురంలో నాతోపాటూ పదేళ్లు మా అంతరిక్ష కేంద్రంలో పనిచేసిన మిత్రులకి కానీ టీవీలు వున్న గుర్తులేదు. డెభైల మధ్యలో కేరళ ప్రభుత్వం వారి కెల్ట్రాన్ అనే కంపెనీ అప్పుడే టీవీలు తయారు చేయటం మొదలుపెట్టింది. ఎనభై దశకం మొదట్లో మేము అమెరికా వచ్చాకనే ఇండియాలో టీవీలు, టీవీ కార్యక్రమాలు ఎక్కువయాయి.

అమెరికా వచ్చాక ఇండియాలో అలవాటు ప్రకారం కారులో వెళ్ళేటప్పుడు రేడియో వింటూనూ, ఇంట్లో టీవీలో వార్తలు చూస్తూనూ వుండేవాళ్ళం. వార్తలు వినని రోజు అంటూ వుండేది కాదు.

ఆరోజుల్లో వాల్టర్ క్రాంకైట్, టెడ్ కాపెల్, పీటర్ జెన్నింగ్స్, టామ్ బ్రోకా, శామ్ డొనాల్డ్సన్, డాన్ రేదర్, జేన్ పాలీ, కానీ చంగ్ ఇలా ఎంతోమంది టీవీల్లో వార్తలు చదివేవారు. జాతీయ వార్తలు, ముఖ్యమైన కొన్ని ప్రపంచ వార్తలు చెప్పేవారు. మనవాళ్ళల్లో కొంతమందికి ఈ ప్రపంచ వార్తలు అంతగా నచ్చేవికాదు. ఎందుకంటే భారతదేశంలో జరిగే వార్తలు ఇక్కడ చెప్పేవారు కాదని. ఆరోజుల్లో భారతదేశం రష్యా దేశానికి తొత్తు. మనం ఐక్యరాజ్య సమితిలో అమెరికాకి ఎప్పుడూ వ్యతిరేకంగా, రష్యాకి అనుకూలంగా ఓటు వేసేవాళ్ళం. అందుకని భారతదేశ రాజకీయాలని, అమెరికాకి ముఖ్యమైనవయితేగానీ ఖాతరు చేసేవారు కాదు. ఇండియాలో అతి ముఖ్యమైన వార్తలు మన సినిమాలు, క్రికెట్టు చుట్టూ జరుగుతుండేవి. ఆ రెండూ అమెరికా ప్రజలకు అఖ్ఖర్లేదు. మరి మనవాళ్ళు కొందరికి ఆ వార్తలు నచ్చకపోవటంలో ఆశ్చర్యం లేదు.

సరే.. ఆ రోజులనించీ ఈ రోజులకి వద్దాం.

ఈటీవీ మాటీవీ దూరదర్శన్ లాటి ప్రసారకేంద్రాలలో వార్తలు ఒక భాగం మాత్రమే. తర్వాత అమెరికాలో లాగానే 24 గంటలూ వార్తలు చెప్పే ఛానళ్ళు కూడా ఇండియాలో వచ్చేశాయి. దాంతో వార్తలు ఎక్కడ ఏం జరిగినా వెంటనే టీవీలో చూపించేస్తున్నాయి. దాని వల్ల సమాచారం వెంటనే అందే అవకాశం వుంది. మంచిదే! కానీ ఇంకొక పెద్ద నష్టమూ వుంది. రోజుకి 24 గంటలు వరుసగా వార్తలు దొరకవు కనుక, ఏ చెత్త దొరికితే ఆ చెత్త చూపించేస్తున్నారు. వార్తల్లో ఎక్కువగా చూపించేది, రాజకీయాలు మినహాయిస్తే, సినిమా గోల, ఆటలు (90 శాతం సమయంలో క్రికెట్ మాత్రమే).

దాదాపు ప్రతి ప్రసారకేంద్రం రాజకీయపరంగా చూస్తే ఏదో ఒక పార్టీకి బాకా వూదేదే. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదో కుల ప్రాతిపదిక మీదే నడుస్తాయి కనుక, ఆ ప్రసారకేంద్రాలు కూడా వారి రాజకీయ నాయకులను కులాలను పొగుడుతూ, మిగతా రా.నా.లను కులాలనూ యధాశక్తి తిడుతూ, వారి వార్తలు వారు, వారికి ఇష్టం వచ్చినట్టు చెబుతూ వుంటారు. చూపిస్తూ వుంటారు. వాటిల్లో నిజాలు తక్కువ, ఇజాలు ఎక్కువ.

ముళ్ళపూడి వెంకటరమణగారు ఆగిపోయిన గడియారం కూడా వృధా కాదు, రోజుకి రెండుసార్లు సరైన సమయం చూపిస్తుంది అన్నారు. అలాగే ఈ భజన చానళ్ళు కూడా, ఎంత బాకాలు ఊదినా, ఒక మంచి పని చేస్తున్నాయి. మిగతా పార్టీలలోని కుళ్ళుని, ఎవరెవరు ఎంత తింటున్నారో, ఎన్ని భూములు కబ్జా చేశారో వివరంగా ఆధారాలతో సహా చూపిస్తుంటాయి! అవి చూసే ప్రజలకు మాత్రం ఇటు పక్క కుళ్ళు అటునించీ, అటు పక్క కుళ్ళు ఇటునించీ వివరంగా తెలుస్తుంటాయి.

మా అదృష్టం ఏమిటంటే, ఇక్కడ అమెరికాలో తెలుగు చానల్స్ మేము పెట్టించుకోలేదు. దానికి కారణం, నాకు తెలుగు భాష అంటే అమితమైన ప్రేమ. ఆ వార్తలు చెప్పేవారి భాష భరించలేను. అది వింటుంటే నా మనసంతా వికలమైపోతుంది. అందుకని. అది నా స్వంత విషయం అనుకోండి. అదిక్కడ అనవసరం.

పోయినసారి ఇండియా వెళ్ళినప్పుడు, అక్కడక్కడా టీవీ వార్తలు చూడవలసి వచ్చింది. ఆ వార్తలేవో కొన్ని బాగున్నట్టున్నాయే అని అనుకోబోతుంటే, మధ్యే మధ్యే అవి ఆపేసి “బ్రేకింగ్ న్యూస్” వచ్చేది. దాన్నే నేను ‘పగలకొట్టే వార్తలు’ అంటున్నాను. ఆ పగలకొట్టే వార్తల్లో, నిజంగా పగలకొట్టేది ఏమీ లేదు. ప్రధాన మంత్రి ఐక్యరాజ్య సమితిలో ఏం చెప్పాడో చెబుతూ అది ఆపేసి, అలా ఆపటం కుదరకపోతే టీవీ తెరకి సగం అడ్డంగా స్క్రోలింగ్ వేసేసి, వారి నాయకుల కొడుకు ఆరోజు ఏం తిన్నాడో (లంచం కాదు), ఫలానా సినిమా నటుడి కొడుకు కేవలం తన నటన వల్లే మొట్టమొదట సినిమాలో కష్టపడి హీరోగా ఎలా అయాడోలాటి “పగలగొట్టే వార్తలు” చెబుతుంటారు.

అమెరికాలో కూడా ఇలాటి పగలగొట్టే వార్తలు వస్తుంటాయి. చాలా వరకూ కాకపోయినా, కొంతవరకూ ఇక్కడ కూడా ఎక్కడా ఏమీ ‘పగిలినట్టు’ కనపడదు.

టీవీలో రోజుకి రెండు మూడుసార్లు వచ్చే జాతీయ, ప్రాంతీయ వార్తల్లో, సమయం అరగంటే వుంటుంది కనుక – రాజకీయాలు, స్టాక్ మార్కట్, వాతావరణం, ఆటలు.. మొదలైన వార్తలు అన్నీ గబగబా చెప్పేస్తారు. కాళిదాసు కవిత్వానికి వాళ్ళ పైత్యం కలపటానికి ఎక్కువ సమయం వుండదు మరి.

ఇక ఇరవై నాలుగు గంటలూ వచ్చే వార్తల్లో, ఇహ వాళ్ళ ఇష్టం. దున్నల్లా దున్నేయటమే. ముఖ్యంగా ఒక నక్క ఛానల్ అయితే గుంట క్రింద నక్కలా అబద్దపు వార్తల్ని ఎంతో నిజమని నమ్మించేటంతగా చెబుతూ వుంటుంది. అబద్ధం అంటే గుర్తుకి వచ్చింది. అలాగే రేడియోలోనూ ఒకడున్నాడు, బడాబడా (రష్షు రష్షుగా – ఈ ఇంగ్లీషు మాట వాడటం ఇష్టం లేకపోయినా వాడేశాను. మీరు అమెరికాలో నివసిస్తుంటే, ఎందుకో మీకు తెలుస్తుందని నాకు తెలుసు) తను చెప్పే వార్తల్లో ఎక్కడా నిజాలు లేకుండా మరీ జాగ్రత్తపడి, బక్కెట్లకు బక్కెట్లు తప్పుడు సమాచారం అందిస్తుంటాడు. దౌర్భాగ్యం కొద్దీ ఆతనికి కూడా విసినికర్రలు బాగా వున్నారు.

అది అలా వుంచి, ఇక అమెరికా వార్తల విషయం చూస్తే, నాకు నాలుగు రకాల కథనాలు కనిపిస్తాయి. అవేమిటో చెబుతాను.

ఒకటి పరిశోధనాత్మక వార్తలు. Investigative News Stories. బాగుంటాయి. నాకేకాక చాలామందికి నచ్చుతాయి. నిక్సన్ వంటి అమెరికా అధ్యక్షుడినే పదవిలోనించీ క్రిందికి దించిన పరిశోధనాత్మక వార్తలు. ఇవి కొంచెం తీరిగ్గా కూర్చుని చూడవలసిన వార్తా కథనాలు.

రెండవది జరిగినవి జరిగినట్టు చెప్పేవి. ఫలానా దేశం నాయకుడు, ఇకో దేశం నాయకుడి కలిశాడు. ఇద్దరూ కలిసి ఇలా అన్నారు. లేదా అనుకున్నారు. స్టాక్ మార్కెట్ పైకి వెడదామా, క్రిందకి వెడదామా అని విచారించి, ఏమీ నిశ్చయించుకోలేక క్రిందకే వెళ్ళింది, ఇందాక మీ వూరి విమానాశ్రయంలో వాన పడింది. వడగళ్ళు మాత్రం పడలేదు. ఈ టీము మీద, ఆ టీము ఫలానా ఆటలో ఓడిపోయింది. వార్తలు సమాప్తం.

ఈ రెండవ పద్ధతి వార్తలు గడ్డం చేసుకుంటూనో, ప్రొద్దున్న ఏడు గంటలకి ఆఫీసుకి వెళ్ళటానికి తయారయి, గడియారం చూసుకుంటూ, సోఫాలో కూర్చుని, సీరియల్ తింటూ వినేవి. ఎన్నో వార్తలు ఒక్క గుటకలోనే వచ్చేస్తాయన్నమాట. ఇవి కూడా నాకు ఇష్టమే.

మూడవ రకం వార్తలు, పైన చెప్పిన నాలుగు వార్తలకీ ఇంకో రెండు కలిపి, వాటిని లాగిలాగి, పీకిపీకి, సాగదీసిదీసి, చితగ్గొట్టి, చావగొట్టి – రెండు గంటలు గంట కొట్టి వాయిస్తారన్నమాట. ఇలాటివి ఇరవైనాలుగు గంటల వార్తల ఛానళ్ళలో వస్తాయి. ఇష్టమున్నంత వాళ్లకి ఇష్టమున్నంత.

ఇక నాలుగవది పట్టిందే పట్టురా పాచిపళ్ళ దాసరీ అని. ప్రొద్దుటినించీ రాత్రిదాకా అదే వార్తని ఇటూ అటూ తిప్పితిప్పి, తిరగ్గొట్టి, వాయగొట్టి, వాత పెట్టి వాయించేస్తారన్నమాట.

ఈమధ్యనే, అంటే నిన్నా మొన్నా రేడియో వార్తల్లో ప్రొద్దున్న ఆఫీసుకు వెడుతున్నప్పుడు విన్నదే, మధ్యాహ్నం బోయినానికి వెడుతున్నప్పుడూ, సాయంత్రం ఇంటికి వెడుతున్నప్పుడు, భోజనానంతరం పళ్ళూ పాలూ కొందామని గ్రోసరీ షాపుకి వాడుతున్నప్పుడూ, ఒకటే విషయం మీద – ముందు వార్తలు, తర్వాత ఒక యూనివర్సిటీ ప్రొఫెసరుతో అదే విషయం మీద ముఖాముఖీ, దాని తర్వాత అదే విషయం మీద శ్రోతల ప్రశ్నలు, మళ్ళీ ఆ విషయం మీదే ఎంతో పరిశోధన చేసిన నిపుణుడి అమూల్యమైన అభిప్రాయాలు, ఇలా సాయంత్రమే కాక రాత్రి కూడా తల పగిలిపోయేలా తబలా వాయించారు.

ఇంతకీ ఆ విషయం ఏమిటో తెలుసా? నేను చెప్పేది తమాషాకీ కాదు, అబద్ధమూ కాదు. నూటికి నూట అరవై పాళ్ళు నిజం. నన్ను నమ్మండి!

మా సాంప్రదాయపరమైన టెక్సస్ రాష్ట్రంలోనూ, ఇంకా కొన్ని రాష్ట్రాల్లోనూ ఒక కొత్త చట్టం అమలులోకి తెచ్చారు. అదేమిటంటే ఇటు ఆడ, అటు మగ కాని వాళ్ళు, స్కూళ్ళల్లోనూ, కాలేజీలోనూ, షాపుల్లోనూ, మిగతా చోట్లా, ఆడవాళ్ళ మరుగుదొడ్డికి వెళ్ళాలా, మగవాళ్ళ మరుగుదొడ్డికి వెళ్ళాలా అనే ప్రశ్నకి జవాబు ఆ చట్టం ఒక్క ముక్కలో తేల్చేసింది. పుట్టినరోజు సర్టిఫికెట్లో సెక్స్ ఏమని వ్రాసివుంటే అదేను అని. మరి పెరుగుతున్నప్పుడు వారివారి హార్మోనుల దృష్ట్యా ఆడ మగగానూ, మగ ఆడగానూ ప్రవర్తిస్తుంటేనో అని ఒక నిపుణుడి ప్రశ్న. మరి వాళ్ళు ఆ బాత్రూములో ఎవరి మీదనైనా అఘాయిత్యం చేస్తేనో అని శ్రోతగారి ప్రశ్న. ఇలాటివారు తరతరాలుగా ఇక్ష్వాకుల కాలం నించీ వున్నారు కదా, మరి ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు జరగని అఘాయిత్యాలు ఇవాళే జరుగుతాయని మీకేమిటి అనుమానం అని ఒక సైకాలజిస్ట్ ప్రశ్న. అలా జరిగే అవకాశం వుంది కదా అని ఒక నిపుణుడి ఉవాచ. అలా జరిగేదాకా ఎందుకు ఆగటం అని ఇప్పుడే చట్టం అమలులోకి తెచ్చారు, దాంట్లో తప్పేముంది అని గవర్నమెంటు లాయరుగారి జవాబు.

మధ్యే మధ్యే “ఇది చట్ట విరుద్ధం. వ్యక్తి స్వాతంత్రానికి దెబ్బ. నేను పై కోర్టుకి తీసుకువెడతాను. నాతోపాటూ రండి. నన్ను సంప్రదించండి. మనం గెలిస్తే నాకు, మీకు డబ్బులు వస్తాయి” అని ఆకలితో వున్న ఒక లాయర్ గారి ప్రకటన.
ఇలా ఆరోజంతా బాదుడే బాదుడు. ఇక రేడియో ఆపేసి, నన్ను వద్దు అనటానికి కారులో ఇంకెవ్వరూ లేరు కదా అనే ధైర్యంతో నేనే “ఎవరూ లేని చోట.. “ అని ఘంటసాలవారి పాట పెద్దగా పాడుకుంటూ ఇంటికి వచ్చాను.

ఎన్నో ఏళ్ల క్రితం ముళ్ళపూడి వెంకటరమణగారు వార్తలు ఎలా పుడతాయా అని ఒక జోకు వ్రాశారు.

ఎక్కడా వార్తలు దొరకని ఒక విలేఖరి మంత్రిగారిని కలిసి, ఆయన్ని “అయ్యా, మీరు మీ భార్యకి ఇప్పుడు విడాకులు ఇస్తున్నారా?” అని అడిగాడుట.

ఆయన విలేఖరిని సూటిగా చూసి “లేదు” అన్నాడు అక్కడినించీ వెళ్ళిపోతూ.

మర్నాడు పేపరులో పెద్ద మకుటంతో వార్త. “మంత్రిగారు ఆయన భార్యకి ఇప్పుడు విడాకులు ఇవ్వటం లేదని మన విలేఖరితో చెప్పారు. అంతేకాదు మరి విడాకుల దాకా ఎందుకు వెడుతున్నారో, అది ఎప్పుడు జరుగుతుందో లాంటి మిగతా వివరాలు ఏవీ చెప్పకుండా వెళ్ళిపోయారు” అని.

అదే ఈరోజుల్లో జరిగివుంటే, అది టీవీలో “పగలకొట్టే వార్త”గా మన టీవీ పగలగొట్టి మరీ చెప్పేవాళ్ళు!

౦ ౦ ౦

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)