రావూరి కాంతమ్మ స్మారక కథా అవార్డు(రూ|| 1,116) పొందిన ఉష కథ
పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టెక్కి, శవాన్ని భుజాన వేసుకుని దీక్షా కంకణ బద్దుడై నడుస్తున్నాడు.
అమావాస్య నిశిరాత్రి.
నక్షత్రాలు నక్కల కళ్లలా మెరుస్తున్నాయి.
శవాన్ని భుజాన వేసుకుని నడుస్తూండటం, శవంలో ప్రవేశించిన భేతాలుడు విక్రమార్కుడు మాట్లాడక తప్పని పరిస్థితిని కల్పించడం, మౌనంగా పయనం సాగాలన్న నియమభంగం కాగానే భేతాళుడు శవంతోసహా మాయమై మళ్ళీ చెట్టెక్కెయ్యటం అనంతకాలంగా జరుగుతూనేవుంది!
"అసలు ఎందుకు నేనీ శవాన్ని మోస్తున్నాను? ఈ శవయాత్రల నుండి నాకు విముక్తి ఎప్పుడు?" మౌనంగా మూలిగింది విక్రమార్కుడి మనస్సు.
నియమభంగం కాకుండా పయనిద్దామంటే... తన తెలివి తేటలకీ, పట్టుదలకీ, న్యాయనిర్ణయదక్షతకీ అవమానం! తనకి నిజంగా జవాబు తెలియని ప్రశ్న ఉంటుందనుకోవటమే యాంటీ - సెంటిమెంట్ అర్ధంకాని తికమక విక్రమార్కుడి మనసుని కల్లోల పెడుతుంది.
అతడు వేగంగా నడుస్తున్నాడు. స్పృహకతీతంగా జరగవలసిన శ్వాసక్రియ అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది.
"మానవదేహం బరువు- జీవించి ఉన్నప్పటికంటే మరణించాక పెరుగుతుంది కాబోలు!" ముఖాన స్రవిస్తూన్న స్వేదధారల్ని తుడుచుకుంటూ అనుకున్నాడు విక్రమార్కుడు.
అప్పటికి కొన్ని క్షణాలముందే శవంలో ప్రవేశించిన భేతాళుడు "రాజా! నీ సందేహం నాకు తెలియదనుకున్నావా? ఒంటరతనం మనసుకి భారం. ఒంటరి శ్రమ శరీరానికి భారం అంతే! ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండవని ఓ కవి అన్నాడట! అందుకే - నీకు బడలిక తెలియకుండా ఉండటానికి ఓ కథ చెబుతా, విను! నా మిగతా నిబంధనలన్నీ షరామామూలే!" అన్నాడు’ విలాసంగా నవ్వుతూ.
మౌనంగా తలవూపాడు విక్రమార్కుడు.
భేతాలుడు కథ చెప్పటం ప్రారంభించాడు.
అది...
ఓ వైపు ఆకాశాన్ని మోస్తున్న హిమవన్నగమూ, మిగతా మూడువైపులా సాగరాల రక్షణ పర్యవేక్షణలో నున్న భరతఖండం!
కాలవాహినిలో అనేక ఆటుపొట్లకు గురై - ప్రస్తుతం ప్రజాస్వామ్య పర్వంలో పయనిస్తూన్న భారతదేశం!
’ఏడ్గార్‍స్నో" పరిభాషలో చైనా పైపుట్టిన అరుణతార ఎర్రని కిరణాలు హిమాలయ పర్వత శీతల శ్రేణుల్నీ -కాళీ హిల్స్‌నీ తాకి, పశ్చిమ బెంగాల్‍లో పరావర్తనం చెందిన దరిమిలా ఆ వెలుగు ఆంధ్రరాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో ప్రతిఫలించి రెండు దశాబ్దాలు దాటిన నేపధ్యంలో--
అరవై తెలుగు సంవత్సరాలూ ’రక్తాక్షులే’ అయి, కాలాన్ని నెత్తుటి ఇంధనంతో నడిపిస్తున్న వర్తమానంలో --
హింసకూ, ప్రతిహింసకూ తేడా తెలియని గందరగోళంలో మైదానాల్లో రాజనాలు పండిస్తున్న గోదారితల్లి తూర్పు కనుముల దట్టమైన కీకారణ్యాల్లో విప్లవాల్ని పండిస్తుంది!
ఆ గోదావరి... యిప్పుడు ఎర్రగా ప్రవహిస్తుంది- హెచ్చరిల్లుతున్న హింసకు నిరసనగా ప్రకృతి చేస్తున్న నెత్తుటి ఊరేగింపులా! ఆ ’అరుణిమ’ రక్తానిదని ఏ ఎన్ కౌంటర్ దేహాన్నడిగినా చెప్తుంది: ఆ ’ఎరుపు’ నెత్తురుదని మందుపాతరల ప్రేలుడిలో మరణించిన ఏ ’యూనిఫాం’ నడిగినా చెప్తుంది.
వీళ్ళంతా ఎవరు?
విప్లవాల సారధులా?
పాలక వర్గాల సేవకులా?
ఎవరైతేనేం" సామాన్యులు.
ఉదయం పదిగంటలైంది. నీలినింగినంటుతోన్న అడవితల్లి హరితశిరోజాల్లోంచి కిరణాల కళ్ళతో అప్పుడప్పుడూ తిరిగి చూస్తున్నాడు సూర్యుడు.
టాపులేని జీపు నడుపుతున్న సూర్యం, ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ, అనుభూతిని గుండెల్లో పదిలపరుచుకుంటున్నాడు అడివంతా పచ్చగా - ఆకుపచ్చ చీర కట్టుకున్న అమ్మలా ఉందతనికి.
సూర్యంలో భావుకత పాలెక్కువ. అతని మదిలోని భావుకత కాగితంపై అక్షర చిత్రాలుగా రూపొందటం కాలేజి మేగజైన్స్ తోనే విరానచిహ్నానికి తలొగ్గినా మనసు లోలోపల మాత్రం పున్నమినాటి కడలి తరంగాల్లా ఎగిసిపడుతూనే వుంది.
’వృక్షాలు పుడమితల్లి నాసికలు!’ రియోడిజనిరోలో జరిగిన ధరిత్రి సదస్సు సూర్యంలో దిద్దుకున్న భావరూపమది. ఇప్పుడూ అలాగే అనిపిస్తుంది.
కలప వ్యాపారం చేసుకుంటున్న ప్రభుత్వాలకు గానీ, అక్రమంగా అడవుల్ని అరగించేస్తున్న ఫారెస్టు కాంట్రాక్టర్లకుగాని ఇలాంటి సున్నిత భావాల్ని స్పందింపజేయగల హృదయమే ఉంటే ధరిత్రీ సదస్సుల అవసరమే లేదేమో!
రోడ్లు లేని అడవుల్లోకూడా ఎంతో చాకచక్యంగా జీప్ నడపటం సూర్యానికి రెండు సంవత్సరాలుగా అలవాటైంది. మరో రెండుమూడు కిలోమీటర్లు వెళితే - కంకర రోడ్డు రూపంలో కృత్రిమ నాగరికత ప్రారంభమౌతుంది.
ఒకసారి విప్లవకారుల్ని గుండెలో దాచుకుని, వాళ్ల ఆలనాపాలనా చూసిన అడవే... ఇంకోసారి పోలీసులకింత నీడనిచ్చి సేద తీర్చింది. విప్లవ కారులూ, గిరిజనులూ తల్లిలా ప్రేమించి కొలుచుకునే అడవే - పోలిసులకి మాత్రం పోస్ట్ మార్టం కోసం ఎదురు చూస్తున్న మృత దేహంలా కనిపిస్తోంది; అంతేకాదు - గుండెలో వణుకు పుట్టించే భయం కలిగిస్తుంది.
పిరికితనం వాళ్ళ వృత్తి ధర్మంకాదు. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అంతేనేమో! ఏ చెట్టు వెనుక ’ఏకే - ఫార్టి సెవెన్’ పొంచివుందో... ఏపుట్ట ’గుప్పిట్లో నిప్పులా’ గుండెల్లో మందుపాతరని దాచుకుందో అనూహ్యం భయం ఉన్నచోట భావుకత చస్తుంది! బహుశా సూర్యం తప్ప అడివినింతగా ’ఆనందించగలిగిన’ పోలీసులెవరూ ఉండరేమో!
అయితే - ఇప్పుడూ సూర్యం తన భావుకతను మరెవ్వరితో పంచుకోగల అవకాశం లేదు. అలాగని అతను వంటరిగా లేడు.
జీపులో మరో పదిమంది ఉన్నా... ఎవ్వరికీ తెలుగు తెలియదు. తన భావాలని వాళ్లు ఆస్వాదించగల భాషలో చెప్పగల పాండిత్యం వారి మాతృభాషలో సూర్యానికి లేదు.
వాళ్లు - రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం పంపిన సరిహద్దు భధ్రతాదళ సైనికులు. అడవిని ప్రతి అంగుళమూ గాలించి విప్లవ కారుల్ని పట్టుకోవాల్సిన కర్తవ్యమే వారినందర్నీ ఒకే జీపులోకి చేర్చింది.
విప్లవకారులు ప్రజావ్యతిరేకులా? నిజంగా - నిర్మూలించబడవలసిన వారా? వారి మార్గంలో వారనుకుంటున్న లక్ష్యం సాధించటంలో సాథ్యాసాధ్యాలెంత? వారాశిస్తున్న వ్యవస్థ వస్తుందా? వస్తే, గిస్తే... తూర్పుయూరప్ దేశాల, సోవియట్ పరిమాణాల వెలుగులో... ఎంతకాలం నిలుస్తుంది? - అనే ప్రశ్నలు ఎన్నోసార్లు సూర్యానికి తూనీగల్లా చుట్టుముట్టాయి.
ఇంత విశాలమైన దేశంలో... ఓ జిల్లా మారుమూల ప్రాంతంలో మొదలై... రెండు దశాబ్దాల అనంతరం కూడా రెండు, మూడు జిల్లాలకు మాత్రమే పరిమితమై... భారతదేశమంటే అంతేనా?
అని కనీసంగానైనా ప్రశ్నించుకోకుండా ... కొందరు త్వరపడినంత మాత్రాన ’పిందె’ పండుకాదన్న ప్రకృతి సత్యాన్ని విస్మరించి, ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా పణంపెడుతున్న విప్లవ కారులంటే సూర్యానికెంతో సానుభూతి ’ఖాకీడ్రస్’ వేసుకున్న ప్రతి వ్యక్తిలోనూ కసాయివాడిని చూసేకళ్లకు సూర్యంలాంటి వారిని చూడగల హృదయమున్న కళ్లు లేక పోవచ్చునేమో!
అలాగే... వారిపోరాటం వెనుకనున్న సిద్దాంతం తప్పో, ఒప్పోగానీ... అది ఏలక్ష్యమూలేని రక్తదాహ పోరాటమా? ఆర్ధిక అంశాలకు అతీతమైన ఆరాటమా? అని ఆలోచించకుండా ’ఎన్‍కౌంటర్’ అన్న ఏకపద సూత్రాన్నే పదునైన ఆయుధంగా వాడుతూన్న ప్రభుత్వ వైఖరిపట్ల సూర్యానికి తీవ్రమైన అసంతృప్తి.
ఆమాటకొస్తే... వారి పోరాటానికి కారాణాలేమిటో తెలిసికూడా. ఆ పరిస్థితుల్ని తొలగించమని ప్రభుత్వంపై ఒత్తిడి తేకుండా - విప్లవ కారుల్నే శాశ్వతంగా తొలగించెయ్యమని కసిగా అంటూ - తమకి అధికారం అందినచోట్ల దీక్షతో ఆ పని చేసేస్తూన్న పక్షాలంటే సూర్యానికి ఒళ్ళు మండిపోతుంది.
అభ్యుదయానికంటున్న రాజకీయ దుర్గంధం అసహ్యం కలిగిస్తుంది.
’యూనిఫాం’ అతని అభిప్రాయాల్నీ, అలోచనల్నీ, అసంతృప్తినీ, సానుభూతిని, అసహ్యన్నీ,.. అన్నిటినీ నొక్కేస్తుంది. అతను యూనిఫాంలోకి వెళ్ళాగానే - అన్ని భావాలనూ అధిగమించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడచుకునే పోలీసవుతాడు.
జీప్ ముందుకు సాగుతుంది.
సన్నగా చినుకులు మొదలయ్యాయి. వానగాలికీ, చినుకుల పలకరింపుకీ చెట్లు ఆనందంతో పులకరిస్తున్నాయి. వర్షాన్ని -
’ అవనిపై దోపిడీలు,
అబలలపై అత్యాచారాలు
చూడలేక రోధించే
ఆకాశపు కన్నీళ్ళు! ’ గా అభివర్ణిస్తూ సూర్యం హృదయంలో ఓ భావవీచిక పల్లవించింది.
చిటపట చినుకులకి పులకరించిన నేల వర్షాన్ని ఆహ్వనిస్తూ మట్టి వాసన వెదజల్లుతోంది. ఆవాసనతో అతను ఇరవైఏళ్ళ జీవితం ముడిపడివుంది. ప్రత్తిపంట తండ్రిని బలి తీసుకోవటంతో - పొలంతో అతని బంధం శాశ్వతంగా తెగిపోయింది. గతం కళ్లముందు మెదలటంతో చిప్పిల్లిన అశ్రువులు వర్షంతో కలిసిపోయాయి.
వర్షాకాలంలో సెలయేళ్లు ప్రవహించే ఆ ప్రదేశంతో జీపుకుదుపులు ఎక్కువకావటంలో వేగం బాగా తగ్గింది. టైర్లు నున్నటిరాళ్ళమీద పట్టుదొరకక జారుతున్నాయి.
హఠాత్తుగా ’ఢాం! అన్న శబ్దం!
వర్షానికి గూళ్ళలోనూ, చెట్టు కొమ్మలలోనూ తలదాచుకున్న పక్షులు కలవరపడుతూ ఒక్కసారిగా అరవసాగాయి. ఆ కలవరం అడవంతా ప్రతిధ్వనిస్తోంది.
జీప్‍లోని పొలీసుల ’గుండెల్లో పిడుగు’ పడిన భావన! కర్తవ్యనిర్వాహణ, ప్రాణభయమూ అందర్ని ఏకకాలంలో అప్రమత్తం చేసింది. ’లోడెడ్ గన్స్’ పొజిషన్ తీసుకున్నాయి. వారి చూపుడు వ్రేళ్ళు ట్రిగ్గర్ నొక్కేందుకు సిద్దంగా ఉన్నాయి.
చీమ చిటుక్కుమన్నా వినటానికి చెవులు సంసిద్దమయ్యాయి. కళ్ళు దట్టంగా ఉన్న ఆవలివైపుని పసికట్టే వ్యర్ధ ప్రయత్నం చేస్తూన్నాయి! వారి ముఖాల్లో ఎటువంటి పరిస్థినైనా ఎదుర్కొనే సంసిద్దత ద్యోతకమవుతుంది.
’ఫికర్ మత్ భాయియోం! టైర్ బరస్ట్ హుయి! అంటూ సూర్యం జీపుదిగాడు. సరిహద్దు భద్రతాదళ సైనికుల్లో ఓ మహా ప్రళయం రెప్పపాటులో నిరపాయకరంగా తేలిపోయిన రిలీఫ్! పదినిమిషాల్లో టైరు మార్చాడు సూర్యం.
జీపు కదిలింది. అరకిలో మీటరు తరువాత - కంకరు రోడ్డెక్కి వేగంగా పరుగెడుతోంది.
అంతలో ... ఓ భయంకరమైన విస్పోటం!
జీపు తునాతునకలైంది! పదకొండు మృతదేహాలు ఏది ఎవరిదో గుర్తించటానికి కూడా వీల్లేనంతగా ఛిన్నాభిన్నమై మాంసఖండాలు వెదజల్లినట్లుందా ప్రదేశం.
కొద్దిసేపటిక్రితం సూర్యాన్ని పులకరింపజేసిన మట్టివాసన అదృశ్యమై సగంకాలిన మాంసం వాసన వ్యాపిస్తుంది. ఆ సాయంత్రం రేడియో, టీవీల వార్తల సమయంలో కొన్ని సెకండ్ల కాలాన్ని ఈ దారుణ సంఘటన కరిగించింది.
ఆ మరునాటి దినపత్రికల కలర్ ఫొటోలతో వార్తని ప్రచురించాయి. విన్న చెవులూ, చూసిన కళ్ళూ, చదివిన మెదళ్ళూ ’అలాగా!’ అనుకుంటూ పేజీ తిప్పాయి.
హోం మంత్రి ఎప్పటి లాగానే ’కాలరాచేస్తాం’ అన్న హెచ్చరికతో పాటు, విప్లవకారుల్ని ’జన జీవన స్రవంతి’లోకి రమ్మని ఆహ్వానోపదేశం కూడా చేశారు.
ఆ మర్నాటికవన్నీ నిన్నటి... పాత వార్తలైపోయాయి. దోపిడి నిత్యకృత్యమైన చోట... సహనం కూడా సాయుధమవుతుంది; మృత్యువు దినచర్య అయినచోట... స్పందన కూడా స్తబ్దతకు గురవుతుంది.
అక్కడ--
అడవిలో నేలకు తిలకం దిద్దిన విస్ఫోటం... వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ’సీత’ నుదుటి కుంకుమని శాశ్వతంగా చెరిపివేసింది. సూర్యం మృత దేహంగా చెప్పబడిన మాంస ఖండాలకి పోలిసు గౌరవంతో అంత్యక్రియలు జరిగాయి.
అయినా, ఆ సీత కన్నీటి వరద ఆగలేదు. జిల్లా యస్.పి. స్వయంగా వచ్చి ఓదార్చినా ఆ గుండెకోత తీరలేదు. ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ ఆర్తనాదం వినిపించినా, మరెక్కడ కన్నీరు పొంగినా తలుపు తట్టే హక్కుల సంఘాల చేతులు... పోలీసు భార్య కనుకనేమో... సీత కన్నీరు తుడిచేందుకు రాలేదు!
ఇరవై రోజులు గడిచాయి.
కరుగుతున్న కాలపులేపనంతో ఆమె కన్నీటి గ్రంధులు వాడిపోయాయి. కనిపించని దేవుడిని ప్రార్ధించినట్లే - అన్నలకి ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టింది - సీత!
అన్నలూ!
ఇది నేనెంతో కాలంగా వ్రాయలనుకుంటున్న ఉత్తరం. మరి... ఇన్నాళ్లూ ఎందుకు వ్రాయలేదని మీరు అనవచ్చు. ’తనదాకా వస్తేనే...’ అంటారే - ఆ పరిస్థితి ఎంత భాధాకరమో స్వయంగా అనిభవిస్తుంటే... యిక ఆలస్యం చేయకూడదని వ్రాస్తున్నాను.
ఈ ఉత్తరాన్ని చివరంటా చెబుతారో - మీ మార్గానికి చెప్పండి! మీ తుపాకులకు చెప్పండి! మీ మందు పాతర్లకి చెప్పండి! బూడిదలో కలిసిపోతున్న మీ పన్నీటి త్యాగాలకు చెప్పండి!
ఇరవైరోజులక్రితం - దుర్గాపూర్ అడవుల్లో మీకు విజయ గర్వం కలిగించిన మందుపాతర ప్రేలుడులో మరణించిన సూర్యం భార్యని నేను. నాటి మృత్యు ధ్వానం మీ చెవుల్లో ఆనంద తరంగాలు సృష్టిస్తూ యింకా ప్రతిద్వనిస్తూనే ఉంటుంది. గనుక మర్చిపోయి ఉంటారనుకోను.
"మాలోని వాడివే - మావాడివేనీవు.
పొట్టకూటికి నీవు- పోలీసువైనావు!" అని మీ కవే అన్నట్లు.. నాభర్త ఎన్‍కౌంటర్లు చేసే సరదా తీర్చుకోవటానికో, రక్తదాహంతోనో ’పోలిసు’ కాలేదు! కేవలం పొట్టకూటి కోసమే... తల్లి,చెల్లెలు, భార్యబిడ్డల పొట్టకూటి కోసమే పోలిసైనాడు.
ఆ ఉద్యోగం కొనుక్కోవటానికి చేసిన ముప్పైఅయిదువేల రూపాయల అప్పులో అసలు తాలూకు ఇంకా మిగిలి ఉన్న పాతికవేల రూపాయల అప్పులో నాభర్త మరణంలానే నన్ను భయపెడుతుంది.
ముసలి అత్త, పసిపిల్లల భాద్యతతోపాటు, పెళ్ళికెదిగిన ఆడబిడ్డతో సహా నాకు నాకుటుంబం భవిష్యత్తు హఠాత్తుగా అంధకారమయం కావటానికి కారణం ఏ దేవుడి శాపమూ కాదు. నా నుదుటి మీద మీరు ఉక్కుతూటాలతో వ్రాసిన నెత్తుటిరాత!
సాద్యమో? అసాద్యమో?... ఒకనాడు ఓ మహత్తర లక్ష్యంతో మొదలైన మీ విప్లవం భూస్వాముల హత్యలతో, ధనికుల రక్తంతో ఆదిపర్వాన్ని అరుణాక్షరాలతో లిఖించుకుంది. ఆ భూస్వాములూ, అలాంటి యితరులూ... ఫారెస్టు కాంట్రాక్టర్లు సారా, కాంట్రాక్టర్లు అయి, మీ బడ్జెట్లకు రెవిన్యూ సమకూర్చే వారుగా పరిణామం చెందాక మీలోనూ పరివర్తన వచ్చింది.
తరువాత... మీ విప్లవానికి అర్.టి.సి. బస్సులూ, ప్రభుత్వ కార్యాలయాలూ, రైలింజన్లు, మైక్రోస్టేషన్లు బలవుతూ వచ్చాయి. ఇవన్ని ప్రజాధనమేనన్న స్పృహ కలిగిందో! లేక బస్సు, రైలు చార్జీలు పెంచటానికి ప్రభుత్వం మీ దహన కార్యక్రమాల్ని సాకుగా చూపుతోందని గ్రహించారో... తగల బెట్టడం ఆపేశారు.
కిడ్నాపుల పర్వ రచన ప్రారంభించారు. కిడ్నాపులకు గురైన సామాన్యులకు రక్త స్నానాలూ, ఆసామాన్యులకు మర్యాదపూర్వక సురక్షత వీడ్కోలూయిచ్చి... ఆ పర్వాన్ని రక్తపాత, పక్షపాతమయంగా చిత్రించుకున్నారు.
కోడివేపుడు కావాలనీ, పొటేలు పలావు కావాలనీ అడిగే తరహాలో - కోళ్ళనీ కుక్కల్నీ బలిస్తూ, సింహాలు, పులుల జోలికి పొని సురక్షిత నీతినే అవలంబిస్తూ వచ్చారు. అయినా - విప్లవం ’మీ’గాంనే ఉండిపోయింది.
విప్లవానికి ఉత్ర్పేరకంగా ప్రజా ఉద్యమాల్ని నిర్మించాల్సిన అవసరంకన్నా - విప్లవమంటే సంచలనం సృష్టించటమేనన్న దురవగాహనా పథంలో పయనిస్తున్న మీకు కిడ్నాపులు. పాతబడిపోయాయి. యిప్పుడు పోలిసులు మీ లక్ష్యం అయినారు.
ఈ ప్రభుత్వ రధానికి చక్రాలు పోలీసులే అంటూ వారిని ’టార్గెట్’ చెయ్యటానికి సమర్దించు కుంటున్నారు.
అన్నలూ! మీరంటున్న మీప్రభుత్వమే వస్తే... దానికి పోలీసుల అవసరం ఉండదంటారా? సోవియట్ యూనియన్ లో సోషలిష్టు ప్రభుత్వం ఉన్నప్పుడూ, చైనాలోనూ పొలీసు వ్యవస్దని రద్దు చేశారా? చెప్పండి.
కోపగించకుండా ఒక్క మాటవినండి.
ఈ ప్రభుత్వ రధాలకు ఇంధనం మీరు. ఏ ప్రజల కోసం యివన్నీ చేస్తున్నామనుకుంటున్నారో - ఆప్రజలు కడుతున్న పన్నులు కారా? అది ఏ రధమైనా ఇంధనమూ చక్రాలూ కనీస అవసరాలు. టైర్లని పంచర్ చేసే, పెట్రోల్ టాంకుల్ని బద్దలు కొట్టి మీరనుకుంటున్న సమాజాన్ని స్థాపించగలమనుకుంటున్నారేమో! రధం యొక్క గమనాన్ని నిర్ధేశించే ’స్టీరింగ్’ ఎవరి చేతిల్లో ఉంటే - రధం వాడి కంట్రోల్లో ఉంటుంది... ఇవన్నీ సంయమనంతో ఆలోచిస్తే మీవిచక్షణకీ అందని విషయాలు కాదు.
ప్రపంచంమొత్తంలో... విప్లవించిన ఏదేశ విప్లవ క్రమంలోనూ కనిపించని విపరీత ధోరణులు మీ పధంలో చోటు చేసుకుంటున్నాయి.
ఆ గందరగోళాన్ని ఒడిదిడుకులుగా చెప్పుకుంటూ - ఒకర్నొకరు ’నయానయా’ రివిజనుస్టులుగా అభివర్ణించుకుంటూ ముక్కలు, చెక్కలు అవుతూ - కుందేటి కాళ్ళ లెక్కను తేల్చటంలో మల్లగుల్లాలు పడుతున్నారు, జుట్టు పీక్కుంటున్నారు.
చివరకు మీలో మీరు చంపుకుచావటమే వర్ణ పోరాటామన్న అధమస్థాయికి విప్లవొన్నతిని దిగజార్చారు.
అన్నలూ! ప్రపంచంలోని విప్లవాలన్నీ ప్రజల భాగస్వామ్యంతోనే జరిగాయి. అలాంటి విప్లవాలే విజయవంతమయ్యాయి. అన్నలూ! మరోసారి ప్రపంచ విప్లవాల చరిత్రలు చదవండి! మీ మార్గాన్ని నిర్ధుష్టంగా నిర్ణయించ వలసిన ఎంతో మేదస్సు మీ వ్యర్ధత్యాగాలతో యిప్పటికే మట్టి పాలైంది. పట్ట పగలు వెలిగే కొవ్వొత్తి త్యాగం ఎవరి కోసం? ఆలోచించండి!
ఈ లోపం - దారీ, తెన్నూలేని విప్లవాలు చేస్తూ - నాలాంటి విధవల్ని, నా బిడ్డల వంటి అనాధల్ని సృష్టించడం ఆపండి! మా ఆకలికి అన్నం పెట్టాకపోతేపోయారు...మా దాహానికి కన్నీరు యివ్వకండి.
ప్రియమైన అన్నలూ! ప్రభుత్వం యిచ్చే పరిహారం, పెన్షన్ లతో నా బ్రతుకు సాఫిగా బ్రతికెయ్యవచ్చు నంటారేమో!... అన్నలూ, ఆడబ్బంతా మీకే యిచ్చేస్తాను... నాభర్తని తిరిగి బ్రతికించి యిస్తారా; నా బిడ్డలకి ’నాన్న’ అనే రెండక్షరాలు శాశ్వతంగా మర్చిపోవల్సినవిగా, ఎప్పటికి స్పర్శానుభూతికి అందని అదృశ్య పదార్ధంగా మార్చిన మీ చర్య ఫలితాన్ని ఏ పెన్షన్లు నింపగలవు? ఏ గ్రాట్యుటీలు ఆ లోటుని భర్తి చేయగలవు?
అన్నలూ, నాకు తెలుసు మృత్యువు అనివార్యమని! ప్రజలకు అకాలమృత్యువుని ప్రసాదించే వ్యవస్థ ఏకాలంలోనూ నిలవలేదు; ఏదేశంలోనూ చురస్థాయి కాలేదు.
బిర్లా... టాటాల బిడ్డలకి పోలీసు ఉద్యోగం చేసే అవసరంలేదనీ... ఈ ఉద్యోగంలోకి వచ్చే వారంతా అతి సామాన్యకుటుంబీకులనీ మీకు తెలియదా? అలాంటి పొట్టకూటి కూలి మనుషులకి...మీ వ్యవస్థ ఆవిష్కరణ కోసం అకాలమృత్యువుని ప్రసాదిస్తున్నారు.
మీచర్యల ద్వారా ఏ ప్రజల్ని నమ్మించగలమని? ఏ ప్రజల సానుభూతి పొందగలమని? ఏ ప్రజల సహకరం ఆశించి?ఏ ప్రజల గుండేల్లో మీకు స్మారక మందిరాలు నిర్మింపబడాలని?
ఆలోచించడన్నలూ; పోయినదాని విలువ పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నా భర్త విలువ నాకు ఓజీవిత కాలపు దుఖం. పక్షవాతంతో మంచంలో ఉన్ననా అత్త- తిరిగి మాట్లాడగలననీ, నడవగలననీ పెట్టుకున్న ఆశల సజీవదహనం! అన్న పెళ్ళిచేస్తాడనీ...తన రేపటి జీవితాన్ని అందంగా ఊహించుకున్న ఓ అమ్మాయి కరిగిన కన్నీటి స్వప్నం.
పసితనంలో ఉన్న నా బిడ్డల కూలిపోయిన భవితవ్యం!
తొంబై కోట్ల జనాభా ఉన్న దేశంలో నాభర్త మరణం చారిత్రక అంశం కాకపోవచ్చు. స్మారక స్థూపాలకు అర్హమయ్యేటంత గొప్పది కాకపోవచ్చు. కానీ - ఆయన తప్ప వేరేదిక్కు లేని ఓ అయిదు ప్రాణాలకు అది... నిత్యమరణం!
అన్నలూ! మీ చేతులతో పోగొట్టిన నా పసుపు, కుంకుమల్ని ఎలాగూ తిరిగివ్వలేరు. కనీసం యికనైనా-
అబలల్ని విధవల్ని చెయ్యకండి!
పసిపిల్లల్ని అనాధల్ని చెయ్యకండి!
నేను ఏ ’యిజమూ’ చదవలేదు. ఈ సమాజంలో ఆడది ఒంటరిగా బ్రతకటం దుర్బరమన్న నిజం తప్ప. నా బాధతో మిమ్మల్ని నొప్పిస్తే మన్నించండి!
ఇట్లు,
వైధవ్యాన్ని ఆడపడుచు కట్నంగా పొందిన మీ చెల్లెలు,
సీత.
* * *
భేతాలుడు కధ చెప్పటం ఆపాడు.
ఆర్ధ్రమైన గొంతు సవరించుకుని, "విక్రమార్కా! సూర్యం తల్లి పక్షవాతం నయమైందా? చెల్లి పెళ్ళిజరిగిందా? ప్రభుత్వం సూర్యం భార్యకు ఆడపొలిసు ఉద్యోగం యిచ్చిందా? అతని పిల్లల భవిష్యత్తు ఏమైంది? ఈ ప్రశ్నలకి జవాబు తెలిసీ చెప్పకపోయావో నీతల వెయ్యి వ్రక్కలవుతుంది.
భళ్ళున ఓ నవ్వు రువ్వుతూ అడిగాడు భేతాలుడు.
తనవంటి మేధావిని ఎల్.కె.జి. ప్రశ్నలడిగినందుకు విక్రమార్కుడికీ ఒళ్ళు మండింది. కోపంగా "భేతాళా! నువ్వడిగిన ప్రశ్నలేవీ ఈ కధనుంచి పుట్టవు. ఈ కధవిన్న తరువాత వచ్చే ఒకే ఒక్క ప్రశ్న - "సీత ఉత్తరం చదివి అన్నలు ఆగ్రహించారా? అనుగ్రహించారా?" అని, అన్నాడు.
వెంటనే భేతాలుడు - "ఎలాగూ నీకు మౌన భంగమైంది గనుక నా నిభందనలేవి వర్తించవు గానీ... అదే నాప్రశ్ననుకుని నీ జవాబు చెప్పు!" అన్నాడు చిన్నబుచ్చుకుంటూ.
విక్రమార్కుడు - భేతాళా! విప్లవం విజయవంతం కావాలంటే - కావలసింది ’సంచలనం’ కాదు, సంయమనం! సీత ఉత్తరం చదివాక అన్నలు ఆ ఆలోచన చేసితీరాలి.
అలా ఆలోచించలేదనుకో - అప్పుడు ’ప్రజ’ కల్కి అవతారమెత్తటమే మిగిలిన ఏకైక మార్గం! అన్నాడు. తనకి అన్నల మీదకంటే, ప్రజల మీదే ఎక్కువ నమ్మకముందన్నంత థీమాగా!
విక్రమార్కుడి సమాధానంతో సంతృప్తి పడిన భేతాలుడు శవంతో సహా మయమై ఎప్పటిలా చెట్టెక్కకుండా - ఎన్నికల సీజన్ కనుక భాగ్యనగరం వైపు గగన మార్గంలో తేలిపోయాడు, అక్కడ జరుగుతున్న ’రాజకీయ డ్రామాలో విక్రమార్కుడి కోసం మరో క్రొత్త కధ దొరక్కపోతుందా! అన్న ఆశతో...