భాషే నేను తెచ్చుకున్న తీయని వరం
భాషే నేను కట్టుకున్న జీవన గోపురం
నా ఇంటి వివృత గవాక్షం భాష
నా కంటి వినిర్మల కటాక్షం భాష
(డా. సి. నారాయణరెడ్డి)
భాషా సేవయే భావి తరాల సేవ, ప్రాచీనభాష నుండి ప్రపంచ భాషకు మొదలైన నినాదాలతో తెలుగుభాషామ తల్లికి సేవ చేస్తున్నది సిలికానాంధ్ర మనబడి. 2015-16 విద్యాసంవత్సరంలో అమెరికా, కెనడా, హాంకాంగ్ తదితర దేశాల నుంచి 1019 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే, అత్యంత విశ్వసనీయత కలగిన సంస్థ ‘WASC’ (వెస్ట్రన్ అసోషియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజస్) మనబడిని గుర్తించింది (ManaBaDi is accredited by WASC). మిగత వివరాలన్ని మనబడి శీర్షికలో చదవండి.
గత వారాంతం మూడురోజులుగా 608వ జయంత్యుత్సవం విజయవంతంగా జరిగింది. సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు అన్నమయ్యకు నాట్య, సంగీత ఘననీరాజనం అర్పించారు. పిల్లల పోటీల్లో, నాట్య రూపకాల్లో, సంగీత కచ్చేరీల్లో అన్ని అన్నమయ్య పదాలే. ఆ మూడురోజులు సర్వం 'అన్నమయ్యమయం'. వీడియోలు, ఫోటోలు సిలికానాంధ్ర వెబ్ సైట్లో, సుజనరంజని పత్రికలో త్వరలో వస్తాయి.
అయ్యప్పదీక్షితులు అన్నట్లు తెలుగువాడిగా, తెలుగుభాష మాతృభాషగా జన్మించడం అదృష్టమే!
శుభం భూయాత్!
- తాటిపాముల మృత్యుంజయుడు
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)