వీక్షణం 45 వ సాహితీ సమావేశం మే నెల 8 వ తారీఖున ఫ్రీ మౌంట్ లోని పిల్లల మఱ్ఱి కృష్ణ కుమార్ గారింట్లో ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. సభ శ్రీ సాయిబాబా "నమో వేంకటేశా" అనే కీబోర్డుతో ప్రార్థనా గీతంతో ప్రారంభమయ్యింది. సభాధ్యక్షులు శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు మాట్లాడుతూ ఆనాటి వక్తలు శ్రీమతి కొండేపూడి నిర్మల, శ్రీ రామానుజరావు గార్లను సభకు పరిచయం చేసారు. నిర్మల స్త్రీవాద కవయిత్రులలో మొదటి అయిదు స్థానాలలో నిలిచిన కవయిత్రి అనీ, అనువాదంలో చెయ్యితిరిగిన వారు రామానుజరావనీ అన్నారు.
ముందుగా నిర్మల తన కవితా నేపథ్యాన్ని గురించి మాట్లాడుతూ "వీక్షణం సభలకు రావడం అంటే మళ్లీ మాతృభూమికి వచ్చినంత ఆనందంగా ఉంది" అన్నారు. బాల్యంలో సాహిత్యాభిరుచి పెద్దగా లేదన్నారు. ఉమ్మడి కుటుంబం, నలుగురిలో ఒక అమ్మాయిగా పెరిగానన్నారు. చిన్నతనంలో నాన్న అమ్మ మీద చేసే పెత్తనం, తమ్ముడి పై చూపే ప్రత్యేక శ్రద్ధ ఒక వివక్షత భావన రేకెత్తించేది. చిన్నపిల్లవి, వినకూడదు, వెళ్లిపో వంటి పెద్ద వాళ్ళ మాటలు ఎందుకు? అనే ప్రశ్నని రేకెత్తించి బాగా ఆలోచనని కలిగించేవి.
పెద్దవారికి వార్తాపత్రిక చదివి వినిపించినపుడు రేడియో వార్తలు చదివినట్లు ఉందని పెద్దలు ప్రశంసించేవారనీ, తరువాత ఆకాశవాణిలో అదే స్ఫూర్తితో యువవాణి కార్యక్రమాలు చేసానన్నారు. 18 సంవత్సరాల వయసులో చదువు కంటే కవిత్వమే ఎక్కువ ఆసక్తిదాయకంగా ఉండేదన్నారు. చదువుతో బాటూ జర్నలిజంలో ప్రవేశించేననీ, ఆంధ్రజ్యోతిలో చేరడం ఒక మలుపన్నారు. ఆంధ్రజ్యోతిలో నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గార్లతో పరిచయ భాగ్యం కలిగిందనీ, పురాణం వారి ప్రోత్సాహంతో బాపు బొమ్మలకు కథ వ్రాయడం మంచి అనుభవమనీ అన్నారు. వివాహం తర్వాత కరీంనగర్ లో డొమెస్టిక్ వయొలెన్స్ మీద విషయ సేకరణ, రచన చేసానన్నారు. 1992 లో ఉదయంలో చేరిన తర్వాత హాలీవుడ్ తారల జీవితాల్లో చీకటి కోణాల్ని ఆవిష్కరించాననీ, ట్రాన్స్లేషన్సు చేయడం వల్ల ఇంగ్లీషులో పట్టు దొరికిందనీ, తను రాసిన ఒక కవిత తో ఉద్యోగమొచ్చిందనీ, యూనిసెఫ్ లో పనిచేయడం వల్ల వస్తు వైవిధ్యం తో రచనలు చేయగలిగనన్నారు.మొదటి కథ "మువ్వ మూగబోయింది" తో రచన వృత్తిగా మారిందనీ, లేబర్ రూం కవిత స్త్రీవాదంలో కవిత్వంలో ఒక మలుపనీ, అప్పట్లో స్త్రీవాదం మీద జరిగిన తిరుగుబాటుల్ని ఎదుర్కొన్న మొదటి సిపాయినన్నారు. తన తర్వాత అప్పటికి చిన్నపిల్లగా ఉన్న కె.గీత లాంటివాళ్లు లేబర్ రూం కొనసాగింపు కవితలు రాసారని, చివరగా "లేబర్ రూం" కవితను సభకు చదివి వినిపించారు. ఆ తర్వాత సభలో ఈ కవిత మీద చాలా సేపు చర్చ జరిగింది. ప్రముఖ స్త్రీవాద కవయిత్రుల గురించి చెబుతూ విమల, జయప్రభ, రేవతీదేవి, కె.గీతలను పేర్కొన్నారు.
తర్వాత శ్రీ రామానుజరావు కథా నేపథ్యం చెప్తూ, తండ్రిగారి నుంచి చదవటం అలవాటు అయ్యింది. బందరు హిందూ కాలేజీ లో లెక్చరర్ లక్ష్మణ రావు గారి ప్రభావం తో శ్రీ శ్రీ అభిమానిగా మారానన్నారు. అన్నయ్య "విశ్వ భరత్" తో కలిసి వ్రాసిన కథ మొదటి కథ. ఆదివిష్ణు గారితో పరిచయం ఆయన ప్రభావంతో "దోమల బాధ" అని హాస్య కథ రాయడం జరిగిందన్నారు. 1989లో పుస్తకం అచ్చువేసేననీ, అప్పటి నుంచి అడపాదడపా రాస్తూనే ఉన్నాననీ అన్నారు. అనువాదాలు కూడా చేసానని అన్నారు. ప్రస్తుతం విహంగ పత్రికలో సీరియల్ రాస్తున్నానని చెప్పారు.
ఆ తర్వాత డా||కె.గీత తెలుగు రచయిత ప్రారంభించి నెల రోజులు గడిచిన సందర్భంగా 30 వ పేజీ ఆవిష్కరణ అధ్యక్షులు శ్రీ గంగిశెట్టి గారి చేతుల మీదుగా జరిపించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రచయితలు ఇతోధికంగా సహకరించి తెలుగు రచయిత ను ముందుకు తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి చేసారు. క్రమం తప్పకుండా రోజుకొక రచయిత పేజీ వెబ్ లో ప్రత్యక్షం కావడం చిన్నవిషయం కాదనీ మనందరం అభినందించవలసిన గొప్ప కార్యక్రమం "తెలుగు రచయిత" అని శ్రీ గంగిశెట్టి కొనియాడారు.
చక్కని విందు తో జరిగిన విరామం తర్వాత కిరణ్ ప్రభ గారి సాహితీ క్విజ్ అత్యంత ఆసక్తి దాయకంగా కొనసాగింది.
కవితా పఠనంలో కె.గీత "కనుపాప సవ్వడి" కవితను, సాయిబాబా "బ్లాండు కన్య పూర్ణమ్మ" హాస్య కవితను, శ్రీ చరణ్ "మదర్శ్ డే పద్యం, సోమవార స్తుతులు", నిర్మల "పద్యమైనా, చేపైనా అంటూ" వచన కవితను వినిపించారు. చివరగా వరకూరు గంగా ప్రసాద్ గారు రచించిన పాటను వారి అమ్మాయి ఈశా సభలో రాగయుక్తంగా ఆలపించింది.
ఈ సభలో శ్రీ లెనిన్, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి రాణి, శ్రీ చుక్కా శ్రీనివాస్, శ్రీతాటిపామల మృత్యుంజయుడు, వేమూరి సోదరులు, శ్రీ అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. వీక్షణం 45 సమావేశాలు జరుపుకోవడం అత్యంత ఆనందదాయకమని అంతా కొనియాడారు.