కథా భారతి
సహ(న)జీవనం
- పి. కె. జయలక్ష్మి

“ఏంటే ఇంకా విశేషాలు?” సందడి చేసింది కావ్య.

“నువ్వే చెప్పాలి.. యూరోప్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేశావనుకుంటా!” అన్నా నవ్వుతూ భోజనం వడ్డిస్తూ.
“అబ్బ..ఎన్నాళ్లయిందో మన వంటలు తిని. ప్రాణం లేచొచ్చినట్టయిందనుకో.” టమాటో పప్పు కలుపుకుంటూ అప్పడాల కోసం చేయి జాపింది.

“ఏంటి నెల్రోజులకే? మరి నేను మన దేశానికి దూరంగా ఏడాది నించి ఎలా ఉంటున్నానే ఇక్కడ?”అన్నా వంకాయ కూరన్నం తింటూ.

“అమ్మాతల్లీ ! నువ్వు గ్రేట్. నీతో పోల్చకే బాబూ! నేనేదో ఆఫీస్ వాళ్ళని బతిమాలుకొని సెమినార్ వంక తో యూరోప్ అంతా చుట్టేద్దామని వచ్చా. తమరు విజిటింగ్ ప్రొఫసర్ గా వచ్చినవారాయే.” అంది నాటకీయంగా.

ఇద్దరం నవ్వుకున్నాం. కావ్య నా చిన్నప్పటి స్నేహితురాలు. బల్గేరియా విశ్వవిద్యాలయంలో రెండేళ్ల పాటు విజిటింగ్ ప్రొఫెసర్ గా అవకాశం రావడంతో కిందటేడు మా ఆయనతో కలిసి వచ్చాను. తను రెణ్ణెల్లుండి అంతా పర్వాలేదు నేను ఉండగలనన్న నమ్మకం ఏర్పడ్డాక వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకో ఆర్నెల్లల్లో నేను కూడా వెళ్లిపోతానింక. ఈ లోగా.. ఇదిగో.. కావ్య యూరోప్ ట్రిప్ పెట్టుకొని చివర్లో నా దగ్గర ఒక వారం ఉండి వెళ్దామని వచ్చింది. భోజనాలయ్యాక “చెప్పవే సింధూ! మీ బల్గేరియా విశేషాలు? ఇక్కడంతా ఆడవాళ్ళ రాజ్యం అన్పిస్తోంది నాకెందుకో? ఎక్కడ చూసినా వాళ్ళ సంఖ్యే ఎక్కువగా కన్పిస్తోంది. షాపుల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో బ్యాంకుల్లో, టాక్సీ, ట్రామ్ డ్రైవర్లు దగ్గర్ణించి రోడ్లు ఊడ్చే వాళ్ళ దాకా అంతా ఆడ మళయాళమే. జీవనం కోసం ఆరాటం, హక్కుల కోసం పోరాటం ఇక్కడ ఎలా ఉంటుంది? కుటుంబం కంటే వ్యక్తిగత సుఖ సంతోషాలు ప్రధానమని విన్నాను నిజమేనా?” ఆసక్తిగా అడిగింది కావ్య.

“ఇక్కడ పిల్లలకి ఇరవయ్యేళ్లొచ్చేవరకే తల్లిదండ్రుల బాధ్యత, తర్వాత తమ కాళ్ళ మీద తాము బతకాల్సిందే, వేరుగా ఉండాల్సిందే! మన దేశంలోలా కాదు. ఆడపిల్లైనా, మగపిల్లాడైనా ఇరవై దాటగానే ఏదో ఉద్యోగం చూసుకొని వేరే ఇంట్లో ఉండాల్సిందే! ఇందుకు విరుద్ధంగా ఎవరైనా ఇరవయ్యేళ్లు దాటాక కూడా తల్లిదండ్రులతో కలసి ఉంటే అనుమానంగా చూస్తారు.. తేడాయేమో అన్నట్టు.. ఇక్కడ కుటుంబ వ్యవస్థపట్ల అంత ఆదరణ ఉండదు. రెక్కలొచ్చిన పక్షుల్లా పెళ్లి ప్రశ్న లేకుండా భాగస్వామిని వెతుక్కుని లివ్-ఇన్ రిలేషన్ షిప్ లోకి వెళ్లిపోతారు. తల్లిదండ్రుల అక్కర ఉండదింక. వాళ్ళు వృద్ధులైనా, ఏ కారణంగా ఒంటరి అయినా వాళ్ళ మానాన వాళ్లు ఉండాల్సిందే... అంతా ఏ బాధ్యతా బాదరబందీ లేకుండా స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. ”మంచి నీళ్ళు తాగడానికి ఫ్రిజ్ దగ్గరకి వెళ్ళాను.

“చాలా ఇంటరెస్టింగ్ గా ఉందే సింధూ!”

“అదే మరి! రేపు ఒకళ్ళింటికి లంచ్ కి వెళ్తున్నాం మనం. ఇంకా బాగా తెలుసుకుందువు గాని పడుకో, చాలా లేట్ అయింది ఇప్పటికే!” అంటూ లైట్ ఆఫ్ చేశాను.

మర్నాడు నా స్టూడెంట్ గాలా పుట్టినరోజు పార్టీ కి వెళ్ళాం. తను నాకు ఇక్కడ చాలా సహాయకారిగా ఉంటుందని చెప్పా దార్లో కావ్య తో. వాళ్ళఆదాయం చాలా తక్కువ. చిన్న ఫ్లాట్ లో ఉంటున్నారు. గాలా చాలా సంతోషించింది మమ్మల్ని చూసి. తనకి ఇండియన్ ఫుడ్ అన్నా, కల్చర్ అన్నా చాలా ఇష్టం. తరచుగా నా ఇంటికి వస్తూ ఉంటుంది వంటలు నేర్చుకోడానికి. అప్పుడప్పుడు నన్ను కూడా పిలుస్తూ తన పాక కళ ని ప్రదర్శిస్తూ ఉంటుంది.

మెటోడీ మాకు ప్లేట్స్ లో అన్నీ వడ్డించి అందిస్తూ, “సింధూజీ! పులిహోర నేను చేశాను. ఎలా ఉందో చెప్పాలి” అన్నాడు.

“మీ హజ్బెండ్ వంట కూడా చేస్తారా?” అంది కావ్య.

“హజ్బెండ్ కాదు బోయ్ ఫ్రెండ్” సవరించింది గాలా.

“అదేంటి? పెళ్లి చేస్కోకుండా పరాయి మగాడితో ఒకే ఇంట్లో ఉండడమేన్టీ?” ఆశ్చర్య పోయింది .. మన ఇండియాలోలా పెద్దవాళ్ళు కుదిర్చి, కట్నాలు మాట్లాడి, లగ్నాలు పెట్టి పెళ్లిళ్లు చేయడాలేమీ ఉండవు. పిల్లలే తమకి నచ్చిన వాళ్ళని చేసుకుంటారు. కాదు కాదు, సహజీవనం సాగిస్తారు”

“మై గాడ్! సహజీవనమా? అయితే పెళ్ళి చేసుకోరా?” విస్తుపోయింది కావ్య.. “చేసుకోరు. పెళ్ళనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెళ్ళి తంతు వాళ్ళ సంస్కృతిలో అంత ప్రధానమైన అంశం కాదు ! దీన్నే రిలేషన్ షిప్ అంటారు వాళ్ళు. అది చాలా సీరియస్ మ్యాటర్. ఏదో ఇవాళ చూసి, రేపు నచ్చి, ఎల్లుండి కాపరం పెట్టి, వారంలో వదిలేసి వేరే వాళ్ళ వెంటబడ్డం కాదు. చాలా రోజులు పరిశీలించి , ఒకళ్లకొకళ్ళు నప్పుతారు అనుకుంటేనే నిర్ణయానికి వస్తారు. ఒక్కసారి రిలేషన్ షిప్ లోకొచ్చాక చాలా కమిటెడ్ గా ఉంటారు, మన వివాహబంధం లాగే! కొంతమంది పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. ఈ కల్సిఉండడం అన్న కాన్సెప్ట్ మనకి విడ్డూరంగా అన్పిస్తుంది. అని తెలుగులో చెప్తోంటే గాలా, మెటోడీ ఏదో అర్ధమైనట్టు నవ్వుకున్నారు.

“మీ పేరెంట్స్ వెనకాల కాలనీలోనే ఉన్నారంటున్నారు కదా? మీరు వాళ్ళతో కలిసి ఎందుకు ఉండరు?” జవాబు తెలిసినా ప్రశ్న సంధించింది కావ్య.

దానికి గాలా చెప్పిన జవాబు..” పదహారేళ్లు దాటాక మేము చాలా స్వతంత్రులం. మాకు నచ్చినట్టు మేముంటాము. సెల్ఫ్ రెస్పెక్ట్, ప్రైవసీ, ఇండివిడ్యువాలిటీకి మేం చాలా విలువిస్తాం. అలాగే పేరెంట్స్ కూడా తాము స్వేచ్చగా, స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. పిల్లల పెళ్లిళ్ళ విషయాల్లో కల్పించుకోరు. కనీసం ఫలానా వాళ్ళని చేసుకుంటే బాగుంటుందని సలహా కూడా ఇవ్వరు. ఎవరి జీవితం వాళ్ళది. సహజీవనంలోకి వెళ్ళేటప్పుడు మేం వాళ్ళకి తెలియ పరుస్తాం తప్ప అనుమతి అడగం. ఇది మా యూరోపియన్ కల్చర్!” అంది.

“కానీ మా దేశంలో ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉండడం చాలా తప్పు. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాం. పెళ్లయ్యాక కూడా మేము పెద్దవాళ్ళ దగ్గర ఉండటమో లేక వాళ్ళనే మా దగ్గర అట్టేపెట్టుకోవడమో చేస్తాం.” అని గర్వంగా చెప్తూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేసింది కావ్య. కలిసి ఉంటే కలదు సుఖమని, అవసరానికి ఆదుకుంటారని, పెద్ద దిక్కు ఉండి తీరాలని ఇంకా ఏవేవో విపులీకరించింది. .

గాలా వాళ్ళింటి నుంచి వితుషా కొండ మీద సరదాగా విహరించి, షాపింగ్ చేస్కోని రాత్రి షెరటాన్ హోటల్లో డిన్నర్ కానిచ్చి పది గంటలకి ఇల్లు చేరాం. బట్టలు మార్చుకొని హీటింగ్ ఆన్ చేసి మంచమ్మీద వాలాం. పడుకొని పాత జ్ఞాపకాలు తీరిగ్గా నెమరు వేసుకోవడం మొదలెట్టాం. చిన్నప్పటి అల్లర్లని, మిత్రుల్ని, చుట్టాల్ని అందర్ని తలచుకున్నాం. “ఇంతకీ మన స్వాతి ఎలా ఉందే? అడగడం మర్చిపోయాను. పెళ్ళయిన కొన్నాళ్లకే ఏవో గొడవలయ్యాయని విన్నాను. ఏమైనా తెల్సిందా?” అడిగాను కుతూహలంగా.

“ఎంత చదువుకొని, సంపాదిస్తున్నా ఈ కట్నాల గోల తీరేది కాదే మన దేశంలో. అత్తింటివాళ్లు దాన్ని చాలా హింసలు పెట్టడంతో కోర్ట్ కెక్కి విడాకులు తీస్కొని దాని బతుకేదో బతుకుతోంది” అంది నిట్టూరుస్తూ. “అయ్యో” అన్నా. మధ్యాహ్నం గాలా చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

“కలిసి ఉంటూ నిత్యం ఏదోదానికి ఘర్షణపడుతూ, సూటిపోటీ మాటలు విసురుకుంటూ ఇంటిని నరకం చేసుకునేకంటే ఏ గొడవా గోలా లేకుండా ఎవరి మానాన వాళ్ళు విడిగా ఉంటూ అప్పుడప్పుడూ కలుసుకోవడం మేలని మా అభిప్రాయం. ఎవరికీ ఎవరి నుంచి ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు , కాబట్టి టెన్ షన్స్ ఉండవు. మాకు కులాల పట్టింపులు, కట్నాల వేధింపులు, లాంఛనాల సాధింపులు, కిరోసిన్ హత్యలు అస్సలు తెలియవు. “ఏంటో మనది గొప్ప కల్చర్ అని చెప్పుకోడానికే గాని యాభై శాతం ఇక్కడి వైవాహిక జీవితాల్లో మనశ్శాంతి లేదు. కొన్నిసార్లు మనసుకి నచ్చకపోయినా నచ్చచెప్పుకుంటూ, జీవితంతో రాజీ పడుతూ సహన జీవనం చేస్తున్నారు పరువుకి భయపడి. ఏ మాట కామాటే ఒప్పుకోవాలి సింధూ! యూరోపియన్స్ ది మంచి సంస్కృతి. తమకి నచ్చినట్టు తమ కోసమే జీవిస్తారు. సహజీవనం కంఫర్టబుల్ గా లేదనిపిస్తే మొహమాటం లేకుండా బైబై చెప్పుకొని విడిపోతారుతప్ప గొడవలు పడ్డం, అఘాయిత్యాలు, విడాకులు ఉండవు. వాళ్ళ పనే హాయి “ కితాబిచ్చింది కావ్య. “.

“నేనొప్పుకోనే కావ్యా! వాళ్ళది మరీ విశృంఖల సంస్కృతి. ప్రతి కల్చర్ లో మంచి, చెడు రెండూ ఉంటాయి. ఇక్కడ ఉండే ప్రతికూల ధోరణులు ఇక్కడా ఉన్నాయి. ఏ దేశంలో లేని వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మన సంస్కృతికి మూల స్తంభాలు. విదేశాలతో పోలిస్తే మన దేశంలో విడాకుల శాతం చాలా తక్కువ. వాళ్ళు మనల్ని చూసి పెళ్లి వైపు, కుటుంబ వ్యవస్థ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందాక చూసావే గాలా, మెటోడి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు తెలుసా? ఇదంతా మన దేశ సంస్కృతి ప్రభావం, మన కట్టుబొట్టు, అతిథి మర్యాద, మానవ విలువలు ఇక్కడి వాళ్ళనెంతో ప్రభావితం చేస్తున్నాయి.

ఇందాక ఆ పిల్ల అదే గాలా అన్నట్టు వాళ్ళల్లా “విడిగా ఉంటూ కలిసి ఉంటే” ఏ బాధా ఉండదు. మన వాళ్ళు చాదస్తాలతో కలిసి ఉంటూ కొడుకు కోడలికి ప్రైవసీ లేకుండా చేయడంవల్లే చాలా పెళ్లిళ్లు విఫలమవుతున్నాయని నా నమ్మకం. మనలాగా పెళ్లిళ్లు చేసుకొని, యూరోపియన్స్ లా స్వతంత్రం గా ఉంటే ఏ బాధా ఉండదు. వాళ్ళ “సహ జీవనంకంటే మన సహనజీవనమే” అందరికీ ఆదర్శం, ఆమోద యోగ్యం. ఏమంటావ్?” నవ్వుతూ నా అభిప్రాయం వెల్లడించాను. “వావ్, ఎంతయినా నువ్వు కేక! కెవ్వు కేక “ అంది శృతి కలుపుతూ కావ్య.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)