సారస్వతం - కావ్య లహరి
కథా క్రమము
- ‘విద్వాన్’ తిరుమల పెద్దింటి. నరసింహాచార్యులు

శ్రీ రంగపురవర్ణనతో కథా ప్రారంభము జరిగినది 21. శ్రీరంగపుర వైభవము పొగడశక్యముకానిది. ఆపురి కుభయ పార్శ్వమల కావేరి నది ప్రవహించును. ఆ నదికడ మండగుడియను భూసురపురము కలదు.

అందు లక్ష్మీనారాయణ22లను బ్రాహ్మణ దంపతులుందురు. ఒకనాడు వారింటికి మాధుకరవృత్తి తను
యాత్రగావించు నొకయతివరుడేతెంచెను. ఆ గృహిణి భిక్షనీయగా ననపత్య భిక్షగైకొనని చెప్పి పోబోయెను. అంతనామె అతిధి విభాగమైన విష్ణు ప్రసాదమును గైకొనక ఉల్లంఘింపదగునాయని ప్రశ్నించెను. యతి23 సమ్మతించి మాధుకరమును గైకొనెను. యతి వాక్యము దలచి ఆమె చింతింపదొడంగెను. పతి ఏతెంచి చింతకు కారణమడుగ నామె యతి వాక్యము చెప్పి గొడ్రాలైన తన జన్మము, నిష్పలమని బాధపడెను. దానధర్మములెన్ని చందముల గావించినను పుత్రుడులేని జన్మ వ్యర్థమని దుఃఖించెను. ఎంత సంపదనో ఇచ్చి దేవుడు సంగతి నీయలేదని ఆమె భర్త కెఱిగించెను, అంత నాతడు కారణములేక ఏమియు జరగదు. దానికి సర్వేశ్వరుని దూఱుట వలదని చెప్పెను24.

నాటి రాత్రివేకువజామున నల్లనిమేనుతో, తిరునామముతో గరుత్మంతుని పైనెక్కి, నారాయణుడామెకు స్వప్న సాక్షాత్కారమొసగి నలుపు తెలుపు గల పువ్వులదండ నిచ్చెను25. ఆ వైజయంత్యంశ విస్ఫురణతో నామె గర్భము దాల్చి ఆమె ఒక కుమారుని గనియెను. క్రమమున నా బాలునికి వేదవేదాంగములు గురుముఖమున చదివెను. విష్ణుభక్తులగని మీ పాద రేణువును నేనటంచు నాతడు మ్రొక్కును. విప్రుడు సకల కళ్యాణ గుణనిధియై భగవదష్టాక్షరీ మంత్రజప పరాయణుడైనాడు. వనమారికాంశమున జనించుటచే పూర్వజన్మవాసనా కారణముగ నాతడు విష్ణువునకు వనమాలిక లర్పించుచుండును. నిత్యము నవపుష్పదామకములను నాతడు శ్రీరంగశాయికి సమర్పించును.

పరులతోటలలోని విరుల సరులను సమర్పించిన పూర్ణఫలము దక్కదని భావించి, కావేరితీర ద్వీపమున దేవార్చనా నిమిత్తము నొక సుక్షేత్రభూమిని విలువకు కొనెను26. ఆ తోటనుదున్ని, కావేరి నీరు ఏతామున కెత్తుచు జాజులు, చామంతులు, విరవాదులు, కురువేరుకుంద వాసంతికాది పుష్పముల పూయించెను. తోట ముందు భాగమున నొక తులసీ వనమును పెంచెను. స్వాధ్యాయము పరించుచు, విద్యుక్తక్రియ అనుష్ఠానము గావించుచు శ్రీరంగనికి మాలికలర్పించి మధ్యాహ్న సమయమున మాధుకరభిక్ష శరీర యాత్ర గడపును, ఆరామమును శిశువుగతి పోషించుట నిట్లు జీవితము గడుపుచుండగ వసంత ఋతువు వచ్చినది.

సౌందర్యవతియగు దేవదేవి అపర రతీదేవియని పుడమిజనులు ప్రస్తుతింపగా నొకతె కలదు. ఆమె అక్క శృంగార రసవేణి మధురవాణి27. అప్పచెల్లెండ్రు గీతవాద్య నిరూఢి మేళమొనరించుకొని మధుర చోళవిభుని గాంచిరి. ఆ మధురానగరము జొచ్చి వేశ్యవాటిని విడిసిరి. సూర్యుడస్తమించెను మరునాడుదయమున సమయోచిత కృత్యములు దీర్చి ఆ స్థానమునకేగిరి. చోళవిభుని గాంచి, తత్సభాగారము ననుచిత ప్రదేశమున నాసీనులై పిమ్మట వీణవాయించిరి. రాజు సంతసిల్లి ఉడుగర లిచ్చెను. మధురవాణి దేవదేవిని జూపి బాలిక రంగశాయి గుడిపాత్ర28. ఆమె మాపటినాడు సభాస్థలిలో నాట్యమాడుటకు సమ్మతింపవలసినదిగ రాజును కోరెను. రాజానుమతితో మరునాడు సభకేతెంచి సభాసదులు బాపురేయనగ నాట్యమొనరించినది. చోళపతి మెచ్చి వేయు సూటపదార్లు దీనారము లొసంగగా గైకొని, వీడుకొని నిజపురమునకు పోవుచు, ఎండవటికి తట్టుకొనగలేక ఒక వటవిటసి నీడ ముచ్చటలాడుకొనుచుండిరి.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)