విద్య-3
శ్లోకం:
केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला
न स्रानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः I
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्तेखिल भूषणानि सततं वाग्भूषणं भूषणम् II भर्तृहरि नीतिशतकम् ।
కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥
పై శ్లోకములోని నాలుగవ పాదానికి పాఠాంతరం:
క్షీయన్తే ఖలు భూషణాని, సతతం, వాగ్భూషణం భూషణం
సంధి విగ్రహం :
కేయూరాణి, న భూషయన్తి, పురుషం, హారాః, న, చన్ద్రోజ్జ్వలాః,
న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలఙ్కృతాః, మూర్ధజాః,
వాణీ, ఏకా, సమలఙ్కరోతి, పురుషం, యా సంస్కృతా, ధార్యతే,
క్షీయన్తే, అఖిల భూషణాని, సతతం, వాగ్భూషణం, భూషణమ్.
శబ్దార్థం:
కేయూరాణి = భుజ కీర్తులు లేదా దండ కడియాలు, న భూషయన్తి = అలంకరింపవు, పురుషం = పురుషుని,
హారాః = ముత్యాల హారములు, న = న భూషయంతి = అలంకరింప బడవు, చన్ద్రోజ్జ్వలాః = చంద్రును వలె ప్రకాశించునటువంటి,
న స్నానం = పన్నీటి జలకాలు అలంకరింపవు, న విలేపనం = పచ్చ కర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, మంచి గంధము మొదలగు సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన మైపూత అలంకరింపవు, న కుసుమం = పూవులు ధరించుట అలంకరింపదు, నాలఙ్కృతాః = అలంకరణలని ఈయజాలదు, మూర్ధజాః = వివిధ రకాల కేశాలంకరణలు,
వాణీ = ఏ వాక్కు, (సా = ఆ వాణి) ఏకా = ఒక్కటియే, సమలఙ్కరోతి = సరిగా అలంకరించునది, పురుషం = పురుషుని, యా సంస్కృతా = వ్యాకరణాది శాస్త్రములచే సంస్కరింప బడినటువంటి, ధార్యతే = ధరింపబడుచున్నదో,
క్షీయన్తే = కాలక్రమేణా నశించును, అఖిల భూషణాని = మిగిలిన అఖిలములైన భూషణాలు, సతతం = ఎల్లప్పుడూ, వాగ్భూషణం = వాక్కు అనే ఆభరణము, భూషణమ్ = నిజమైన ఆభరణము.
ఖలు = కదా!
Meaning
The armlets on the upper arms are not the ones that adorn a man. Nor the necklaces and moon white colored pearls adorn a man. The luxurious baths, the expensive fragrantly body lotions, the garlands with beautiful flowers and the fashionable hair styles are not the ones that really adorn a man. The pleasant, crisp and grammatically error free language of speech, the “Vaakku” that comes only with a good educational background is only the real jewelry that adorns a man.
All other conventional jewelry gets spent out, whereas the good speech is only the real jewelry.
భావార్థం:
వాక్కు అనగా విద్య. ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యాన్ని, దాని విలువని ప్రస్ఫుటముగా తెలియజెప్పే భర్తృహరి నీతిశతకములోని చక్కటి సుభాషితము.
భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు.
చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశించునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణల పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు.
వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము.
భర్తృహరి యొక్క సుభాషితములలోని నీతి శతకములో వాక్కు యొక్క ప్రాసస్థ్యాన్ని తెలియపరచే తలమానికమైనట్టి ఈ సుభాషితమునకు, ఏనుగు లక్ష్మణ కవి యొక్క అంతటి ధీటైన తెలుగు సేత ఈ క్రింది పద్యము.
ఉ.భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్,
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్ .
All India Radio ఆకాశవాణి సంస్కృత భాషాధ్యయన కార్యక్రమములో గత 40 సంవత్సరాలకి పైగా ఆ కార్యక్రమము ఈ శ్లోకముతోనే ఆరంభమగుట ఈ శ్లోకము యొక్క విశిష్టతని తెలియజేస్తోంది. ఇది చాలామందికి సుపరిచితమైన సుభాషితము. పురుషునకు విద్యయే ఆభరణము కాని వేరు కాదు అని సుస్పష్ఠము.
-------------- ॐ ॐ ॐ --------------
విద్య-4
శ్లోకం:
विद्या नाम नरस्य रुपमधिकं प्रच्छन्नगुप्
तं धनं ।
विद्या भोगकरी यशःसुखकारी विद्या गुरूणां गुरुः ।
विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता ।
विद्या राजसु पूज्यते न हि धनं विद्याविहीनः पशुः ।। भर्तृहरि नीतिशतकम् ।
విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం ।
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః ।
విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరా దేవతా ।
విద్యా రాజసు పూజ్యతే న హి ధనం విద్యా విహీనః పశుః ।।
సంధి విగ్రహం
విద్యా, నామ, నరస్య, రూపం, అధికం, ప్రచ్ఛన్న, గుప్తం, ధనం, విద్యా, భోగకరీ, యశః, సుఖకరీ, విద్యా, గురూణాం, గురుః, విద్యా, బంధుజనో, విదేశగమనే, విద్యా, పరా, దేవతా, విద్యా, రాజసు, పూజ్యతే, న, హి, ధనం, విద్యా విహీనః, పశుః .
శబ్దార్థం
విద్యా నామ = విద్య అనునది, నరస్య = పురుషునికి, రూపం = అందం, అధికం = అతిశయమైన, ప్రచ్ఛన్న గుప్తం = చాటున దాచి ఉంచిన, ధనం = ద్రవ్యము,
విద్యా = విద్య, భోగకరీ = భోగాలని కలిగించునది, యశః = కీర్తిని, సుఖకరీ = సుఖమునూ కలిగించునది, విద్యా = విద్య, గురూణాం గురుః = గురువులకు గురువు,
విద్యా = విద్య, బంధుజనో = బంధువు వంటిది, విదేశగమనే = విదేశముల యందు, విద్యా = విద్య, పరా = ఉత్కృష్టమైన, దేవతా = దేవత,
విద్యా = విద్య, రాజసు = రాజుల నడుమ, పూజ్యతే = పూజింప బడుచున్నది లేదా ఆదరింపబడుచున్నది, న హి ధనం = ధనము మాత్రము కాదు, విద్యా విహీనః = విద్య లేని వాడు, పశుః = పశువుతో సమానము .
ఉ.విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము విద్యనెఱుంగని వాడు మర్త్యుడే.
- పై శ్లోకానికి, ఏనుగు లక్ష్మణ కవి యొక్క తెలుగు సేత.
Meaning
Knowledge is certainly a man’s greatest beauty. It is a safe and hidden treasure.
It provides prosperity, fame and happiness. Knowledge is the teacher of all teachers.
It acts as one’s friend in a foreign country. Knowledge is the Supreme God.
It is the knowledge, not wealth, which is adored by kings. Without knowledge one remains as animal.
భావార్థం
పురుషునకు విద్య యే ఉత్కృష్టమైన అందం. అతనికి విద్య రహస్యముగా దాచపెట్టబడిన ధనము వంటిది. ఎప్పుడు కావలెనంటే అప్పుడు అక్కరకు వచ్చునది. విద్యయే సకల భోగములను, కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే పరమగురువు వలె అన్నియూ బోధించును. విదేశమునందు ప్రజలతో సంభాషించుటకు, వ్యవహారములు చక్క దిద్దుకొనుటకు మరియూ తన ప్రతిభా పాటవాలని ప్రదర్శించుకొనుటకు బంధువు వలె సహాయకారిగా నుండి ఆదుకొనును. విద్య దేవతలందరిలోనూ ఉన్నతమైన దైవము. రాజులచేత గౌరవింప బడేది విద్య మాత్రమే, ధనము ఏ మాత్రము కాదు. ఇంతటి ఉత్కృష్టమైన విద్యని కలిగియుండని వాడు ఒక జంతువుతో అనగా పశువుతో సమానము.
-------------- ॐ ॐ ॐ --------------